ఉత్తరాయణం

అర్చకుల వెతలు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలోని అన్ని ఆలయాల అర్చకులకు, సిబ్బందికి ట్రజరీల ద్వారా వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. అర్చకులు, ఆలయ ఉద్యోగుల సమస్యలపై గతంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కెసిఆర్ రాబోయే కొత్త సంవత్సరం కానుకగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే అర్చకులు పలు ప్రాంతాల్లో భిక్షాటనలు చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో పనె్నండు వేల మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన సవరణ చట్టం ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇదివరకే ప్రకటించారు. వేతనాల చెల్లింపుపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని సిఎం ఏర్పాటు చేశారని ఆయన ప్రకటించి ఏడాదిన్నర కాలం గడిచింది. అయినా ఇంతవరకూ ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఏమిటన్నది బహిర్గతం కాకపోవడంతో అర్చకులు, ఆలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యం చేసుకుని అర్చకులకు న్యాయం చేయాలి.
-సివిఆర్ కృష్ణ, హైదరాబాద్
సంప్రదాయాన్ని కాదంటారా?
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను విధిగా జరపాల్సిన అవసరం లేదని, అలా జరపాలని ఎక్కడా రాజ్యాంగంలో లేదని ఎపి ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇదే జరిగితే కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టవుతుంది. జిఎస్‌టి బిల్లును ఆమోదించేందుకు ఎపి అసెంబ్లీ సమావేశాలు గత సెప్టెంబర్‌లో జరిగాయి. ఆ తర్వాత మళ్లీ శాసనసభ సమావేశాలు జరగలేదు. 2017 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సెప్టెంబర్‌లో కొద్దిరోజులు జరిగిన సమావేశాలనే శీతాకాల సమావేశాలుగా భావించాలా? పార్లమెంటు సహా అనేక రాష్ట్రాల అసెంబ్లీలు శీతాకాల సమావేశాలు నిర్వహించాయి. అత్యవసర బిల్లుల ఆమోదానికే హడావుడిగా ఎపి అసెంబ్లీ సమావేశాలు జరుపడం సరికాదు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు శీతాకాల సమావేశాలను తప్పక నిర్వహించాలి. హైదరాబాద్‌లో ఈ సమావేశాలను జరపడానికి ఇష్టం లేనపుడు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరపవచ్చు. గతంలో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అన్నీ రాజ్యాంగంలో, చట్టంలో ఉండవు. కొన్ని సంప్రదాయాలను కొనసాగించడం ఉత్తమం.
- కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్
సన్మార్గంలో పెట్టండి
టెక్నాలజీ, ఫ్యాషన్లు అంటూ నేటి యువతలో చాలామంది చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫేస్‌బుక్, స్మార్ట్ఫోన్లు, చాటింగ్‌లు, ధూమపానం, గుట్కాలు, డ్రగ్స్, ఈవ్ టీజింగ్, మత్తులో వాహనాలు నడపడం... ఇలా ఎనె్నన్నో వ్యసనాలకు కొందరు యువకులు బానిసలవుతున్నారు. మంచీచెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేక వీరు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. కాలేజీల్లో అధ్యాపకులు గానీ, ఇళ్లల్లో తల్లిదండ్రులు గానీ పిల్లల ప్రవర్తన పట్ల అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో కొందరు యువకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కళాశాలల్లో నైతిక విలువలను బోధించినట్టయితే వీరు సన్మార్గంలో నడిచేందుకు వీలుంటుంది. క్రమశిక్షణ, సేవాభావం, ఉన్నత విలువలను అలవాటు చేస్తే యువత మంచి మార్గంలో నడిచేందుకు వీలుంటుంది.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం