ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చేది ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాశ్మీర్‌ను కాపాడుకునేందుకు ఇప్పుడైనా గట్టి చర్యలు తీసుకొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. చైనా పాకిస్తాన్‌తో కుమ్మక్కై ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గ్వాడర్ ఓడరేవుకు అతిపెద్ద రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోడ్డు నిర్మాణాన్ని కొనసాగనివ్వటమే భారత్ చేస్తున్న పెద్దతప్పు. చైనా ఈ రోడ్డు నిర్మాణానికి భారత్ నుండి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చేసేందుకే పాకిస్తాన్ ద్వారా కాశ్మీర్‌లో తీవ్రవాదానికి మరింత ఊతం ఇస్తోంది. కాశ్మీర్ యువకులు అన్నింటికీ తెగించి భద్రతాదళాలపై రాళ్లు రువ్వటం వెనక చైనా కుట్ర ఉంది. కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని పెంచటం ద్వారా భారత్ దృష్టిని మళ్లిస్తోంది. ఆక్రమిత కాశ్మీర్‌లోని గిలిగిత్ తదితర ప్రాంతాలను తమ దేశం అంతర్భాగంగా ప్రకటించుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాల వెనక చైనా వ్యూహం ఉంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక ఏ మాత్రం అలస్యం చేయకుండా కాశ్మీర్ సమస్యను అతి త్వరగా పరిష్కరించి పాక్-చైనాల నుండి ముంచుకు వస్తున్న ప్రమాదంపై దృష్టి కేంద్రీకరించాలి.
కాశ్మీర్ సమస్యను అదుపులోకి తెచ్చేందుకు తన సైన్యానికి భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. మొత్తం దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కాశ్మీర్ వేర్పాటువాదులను అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప కుహనా లౌకికవాదుల వత్తిడికి ప్రభుత్వం లొంగకూడదు. ప్రధానమంత్రి పదవిని మోదీ చేపట్టిన తరువాత కాశ్మీర్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశించినా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. జమ్మూ కాశ్మీర్‌లో పి.డి.పితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బి.జె.పి తన రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతూ, ఆశించిన స్థాయిలో దృఢచిత్తంతో వ్యవహరించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది.
కాశ్మీర్‌లో శాంతిభద్రతలతోపాటు ఎన్నికల విధులు కూడా నిర్వహిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్, ఇతర భద్రతా దళాలకు ఎదురవుతున్న అవమానాలు చూస్తుంటే సగటు పౌరుడి రక్తం మరిగిపోతుంది. కాశ్మీర్ వేర్పాటువాదులు సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను దూషించటం, వారి టోపీలు లాగివేయటం, ముఖంపై పిడి గుద్దులు గుద్దటం చూస్తుంటే వారు ఎంతటి దుర్భర పరిస్థితిలో పని చేస్తున్నారనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం అవుతున్న ఒక వీడియోలో కాశ్మీర్ వేర్పాటువాదులు సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లను దుర్భాషలాడుతూ అవమానించటం మనం చూడవచ్చు. ప్రసార మాధ్యమాలకు లభించని ఇలాంటి సంఘటనలు కాశ్మీర్‌లో కోకొల్లలు. సీమాంతరం నుండి వచ్చిన పాక్ ప్రేరిత ఇస్లామిక్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మన జవాన్లు ప్రాణాలొడ్డి పోరాడుతుంటే ఆ ప్రాంతంలో ఉండే ముస్లింలు, ముఖ్యంగా మహిళలు, యువకులు భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేయటం నిత్యకృత్యంగా మారింది. ఒకవైపు ఇస్లామిక్ తీవ్రవాదులు, మరోవైపు వారిని సమర్థించే కాశ్మీర్ ముస్లింలు, కేంద్ర ప్రభుత్వ అస్పష్ట విధానాల మధ్య భద్రతా దళాలు నలిగిపోతున్నాయి. కాశ్మీర్‌లో పరిస్థితి బాగు పడాలంటే భద్రతాదళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటంతో పాటు పెల్లెట్ తుపాకులను ఉపయోగించేందుకు వీలు కల్పించాలి. కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపాలనుకుంటున్న నేతలకు ఇస్తున్న భద్రతను ఉపసంహరించుకోవాలి. ఈ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలి. వేర్పాటువాదులు ప్రజల నుండి సేకరిస్తున్న నిధులను తమ స్వంత ప్రయోజనాల కోసం వాడుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. కాగా, రాళ్లు రువ్వే యువకుల పట్ల కఠిన చర్యలు తప్పవని తెలియజేసేందుకు- ‘ఒక యువకుడిని సైనిక వాహనానికి కట్టి ఊరేగించడం’ సమర్థనీయం కాదు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే, సైనికులకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా కుహనా లౌకికవాదులు ఆలోచించాలి. రాళ్లదెబ్బలను, అవమానాలను భరిస్తున్న సైనికులు అదుపుతప్పకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
‘రాళ్లు రువ్వటా’న్ని ఒక వృత్తిగా చేసుకున్న యువతను దారిలోకి తీసుకురావలసిన అవసరం ఉన్నది. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు రాళ్లు రువ్వే యువకులకు నెలకు ఏడు వేల రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తున్నాయి. ఇలాంటి వారిని వెనకేసుకు వస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లాంటి నాయకులు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి తెర దించవలసిన అవసరం కూడా ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తదితర నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం రాళ్లు రువ్వే యువతను వెనకేసుకువస్తున్నారు. ‘స్వాతంత్రం’ కోసమే వీరు రాళ్లు రువ్వుతున్నారు తప్ప పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు ఇస్తున్న డబ్బు కోసం కాదంటూ ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా వాదించటం సిగ్గు చేటు. శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఫరూక్ అబ్దుల్లా- పోలైన ఏడు శాతం ఓట్లతో ఎన్నికయ్యారంటే కాశ్మీర్ లోయలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టమవుతోంది.
జమ్మూ కాశ్మీర్‌లో కాశ్మీర్ లోయ, జమ్ము, లద్దాక్ అనే మూడు ప్రాంతాలున్నాయి. జమ్ము, లద్దాక్‌లో పరిస్థతి అదుపులో ఉన్నా ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్న కాశ్మీర్ లోయలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. లోయలోని నాలుగైదు జిల్లాల్లో నెలకొన్న అశాంతి మూలంగా మొత్తం రాష్ట్రం పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. కాశ్మీర్ స్వాతంత్రం పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాయకులు పాకిస్తాన్‌తో కుమ్మక్కు అయ్యారు. పాకిస్తాన్ వీరికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తోంది. పాకిస్తాన్ చెప్పుచేతుల్లో ఉన్న ఈ నాయకులకు కేంద్ర ప్రభుత్వం భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ‘టెర్రరిజం కావాలా? టూరిజం కావాలా?’ అని ప్రశ్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు మొదటగా- వేర్పాటువాదులకు తెరవెనక నుండి వస్తున్న సహాయాన్ని పూర్తిగా అడ్డుకోవాలి. సైన్యంపై దాడలు చేస్తున్న వారిని, రాళ్లు రువ్వుతున్న యువతను దేశద్రోహులుగా పరిగణించాలి. ఉగ్రవాదానికి పెద్దపీట వేస్తున్న కాశ్మీర్ లోయలోని ఐదారు జిల్లాలకు కేటాయించిన నిధులను నిలపివేయాలి. ఈ జిల్లాలకు కేటాయిస్తున్న నిధులు పూర్తి స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయి. స్థానిక అధికారులతోపాటు ఉగ్రవాదులు కూడా ఈ నిధులను తమ కార్యకలాపాలకు వాడుకుంటున్న దాఖలాలు ఉన్నాయి.
పి.డి.పి, బి.జె.పి సంకీర్ణ ప్రభుత్వం కాశ్మీర్‌లో పరిస్థితిని చక్కదిద్దగలుగుతుందా? అనే అనుమానం కలుగుతోంది. ఈ రెండు పార్టీలూ అధికారం చెలాయించటాన్ని జీర్ణించుకోలేకపోతున్న నేషనల్ కాన్ఫరెన్స్, ఇతర రాజకీయ, ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ యువతను రెచ్చగొడుతున్నాయి. కాశ్మీర్‌లో పరిస్థితి అదుపులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగవలసి ఉంటుంది. ఇంతవరకూ అమలు చేసిన వ్యూహాన్ని సమీక్షించుకోవటం మంచిది. తమ వ్యూహంలోని లోపాలను తెలుసుకుని అవి తిరిగి జరగకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన 370వ ఆర్టికల్‌ను రద్దు చేయాలి. కాశ్మీర్ ప్రజలు జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా సమగ్ర విధానాన్ని అమలు చేయాలి.
*