ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వామపక్ష సర్కారుకు బంధుప్రీతి పంకిలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లో బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం పరాకాష్ఠకు చేరాయి. పదవుల్లో ఉన్న అధినాయకులు ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబపాలన కొనసాగిస్తూ కీలక పదవులన్నింటినీ తమ వారికి అంటగడుతున్నారు. అయితే, ప్రజలు తలచుకుంటే అవినీతి మంత్రులు మట్టి కరవకతప్పదనేది కేరళలో రుజువైంది. పబ్లిక్ రంగ పరిశ్రమల్లో సిపిఎం సీనియర్ నాయకుల పుత్రరత్నాలకే కాదు, తన బంధువులకు అడ్డదారిన కీలక పదవుల్లో నియమించిన కేరళ పరిశ్రమల మంత్రి ఈపి జయరాజన్ కుర్చీ దిగక తప్పలేదు.
అధికార వ్యామోహం ఫలితంగా నేటి రాజకీయాల్లో బంధుప్రీతి అత్యంత సామాన్యమైపోయింది. చివరకు సిపిఎం లాంటి పార్టీ కూడా ఆశ్రీత పక్షపాతానికి పెద్దపీట వేసి అభాసుపాలైంది. కేరళలో సిపిఎం కూటమి గత మే నెలలో అధికారంలోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అవినీతిని ఎండగట్టటం ద్వారా సిపిఎం అధికారంలోకి రావటం తెలిసిందే. తమ పార్టీలో బంధుప్రీతికి ఎలాంటి స్థానం లేదని ఘంటాపథంగా చెప్పటంతోపాటు, పార్టీ నాయకులు పదవుల్లో ఎలా వ్యవహరించాలనేది నిర్థారిస్తూ ఒక విధానాన్ని రూపొందించుకున్న ఘనత సిపిఎం పార్టీది. కేరళలో అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎం అధినాయకత్వం ఈ నైతిక విధానాన్ని తుంగలోతొక్కి సెంట్రల్ కమిటీ సభ్యుల పిల్లలకు పబ్లిక్ రంగ పరిశ్రల్లోని కీలక పదవులను పంచి పెట్టటం ప్రారంభించింది. పరిశ్రమల శాఖ మంత్రి జయరాజన్ నిబంధనలను పక్కన పెట్టి తన బంధుగణానికి, సిపిఎం సెంట్రల్ కమిటీ సభ్యుల పిల్లలకు పదవుల పెందేరం ప్రారంభించారు. ప్రజలు తిరగబడటంతో సిపిఎం నాయకత్వం జయరాజన్‌ను మంత్రి వర్గం నుండి తొలగించటం ద్వారా పార్టీ పరువుప్రతిష్ఠలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. సిద్ధాంతాలు వల్లించే పార్టీలు కూడా ఇలా అక్రమాలకు పాల్పడితే ఎలా? ఈ ఒక్క పార్టీయే కాదు.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇదే రీతిలో బంధుప్రీతికి పెద్ద పీట వేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్పే పార్టీలు అధికారంలోకి రాగానే రంగు మారుస్తున్నాయి. అనేక అవకతవకలకు పాల్పడి ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపితోపాటు ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, సమాజ్‌వాదీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆర్‌జెడి, అకాలీదళ్, డిఎంకె, అన్నా డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు అధికారంలోకి రాగానే బంధువులకు పదవుల సంతర్పణ జరుపుతున్నారు. వివిధ పార్టీల అధినేతల కొడుకులు, కూతుళ్లు, సమీప బంధువులు ప్రభుత్వంలో రాజ్యమేలుతున్నారు. బంధుప్రీతి,ఆశ్రీత పక్షపాతాన్ని నిరూపించేందుకు కొత్తగా ఉదాహరణాలు ఇవ్వవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లోని మంత్రివర్గాలను, పార్టీ వ్యవస్థను పరిశీలిస్తే ఈ అవలక్షణాలన్నీ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కొందరు రాజకీయ నాయకుల పిల్లలు ఎందుకూ కొరగాక పోయినా సరే పార్టీ వ్యవస్థలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులు నిర్వహిస్తూ వెలిగిపోవటం అందరికి తెలిసిందే. వారు ఎన్ని తప్పులు చేసినా శిక్ష పడదు. కానీ, ఇతరులు ఎంత సమర్థులైనా చిన్న తప్పు చేసినా కష్టాలు ఎదురవుతాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆ పదవి చేపట్టటానికి ప్రధాన కారణం- ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు కావటమే. సిఎంగా అధికార పగ్గాలు చేపట్టాక అఖిలేష్ చేసిన తప్పులు కోకొల్లలు. ఆయన నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ నామమాత్రపు అభివృద్ధిని కూడా సాధించలేదు. అక్కడి శాంతిభధ్రతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యుపిలో మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగాలు, కీలక పదవులు సమాజ్‌వాదీ పార్టీ నేతల బంధుమిత్రులకే దక్కుతాయి. ఈ బంధుప్రీతిని ప్రశ్నించిన వారెవ్వరూ యుపిలో బతికి బట్టకట్టలేరు. బిహార్‌లో కూడా ఇదే పరిస్థితి. బిహార్‌లో అధికారంలో ఉన్న మహాకూటమిలోని పెద్ద పార్టీ ఆర్‌జెడి. ఈ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారులూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మంత్రివర్గంలో ఉన్నారు. లాలూప్రసాద్ చిన్నకొడుకు తేజస్వీ ప్రసాద్ ఉప ముఖ్యమంత్రి పదవిని వెలగబెడుతుంటే, పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ ఆరోగ్యం, చిన్న తరహా నీటిపారుదల, పర్యావరణం, అటవీ శాఖలను నిర్వహిస్తున్నాడు. వీరు పదోతరగతి కూడా చదవలేదు. లాలూ ప్రసాద్ కుమారులు కాబట్టి ముఖ్యమైన పదవులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరితోపాటు నితీష్‌కుమార్ మంత్రివర్గంలోని ఆర్‌జెడి మంత్రులు వివిధ సంస్థల్లోని ఉద్యోగాలను తమ బంధుగణానికి పంచి పెడుతున్నా పట్టించుకునే నాథుడు కనిపించటం లేదు. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ప్రశ్నించేవారు లేరు. ప్రజాస్వామ్యం అంటే- ‘కుటుంబ పాలన’గా మారిన మన దేశంలో ఇపుడు బంధుప్రీతి ఒక మహమ్మారిగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తే, మరికొన్ని రాష్ట్రాల్లో చాపకింద నీరులా పరుచుకుపోతోంది. బంధుప్రీతికి పాల్పడిన పరిశ్రమల శాఖ మంత్రి జయరాజన్‌ను ఇంటికి పంపించేందుకు కేరళ ప్రజలు తిరగబడినట్లే ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అధికారంలో భవిష్యత్‌లో గళం విప్పకతప్పదు.