తూర్పుగోదావరి

అరటి రైతులకు సిరుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఆగస్టు 30: గత ఏడాది రైతన్నకు కన్నీళ్లు మిగిల్చిన అరటి ఈ ఏడాది మాత్రం కాసులు కురిపిస్తోంది. సుమారు మూడు నెలలుగా రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో వివిధ రకాల అరటి గెలల ధరలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. దీంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. దీనికి తోడు శ్రావణ మాసం కూడా కావడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రావులపాలెం మార్కెట్ యార్డుకు నిత్యం ఆరు రకాల అరటి గెలలు వస్తుంటాయి. వీటిలో కర్పూర, చక్కెర కేళి రకాలు అధికశాతం ఉంటాయి. బుషావళి, బొంత (కూర అరటి), అమృతపాణి, ఎర్ర చక్కెర కేళి రకాలు కూడా అమ్మకాల నిమిత్తం వస్తుంటాయి. గత ఏడాది వీటి ధరలు అనూహ్యంగా రూ.50కి పడిపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి గెలలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ ఈ ఏడాది అన్నిరకాల అరటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. కర్పూర రకం గెల ఒకటి రూ.150 నుండి రూ.550, రూ.200 నుండి రూ.600 పలుకుతూ ఆ రకాలు సాగుచేసే రైతులకు లాభాలు కురిపిస్తున్నాయి. అలాగే తెల్ల చక్కెర కేళి రూ.150 నుండి రూ.400, బుషావళి రూ.100 నుండి రూ.350, బొంత రూ.150 నుండి రూ.300, ఎర్ర చక్కెర కేళి రూ.150 నుండి రూ.350 పలుకుతోంది. దాదాపు అన్నిరకాల ధరలు గత వారం రోజుల వరకు బాగా పెరిగాయి. అయితే ఎర్ర చక్కెర కేళి గత నాలుగు రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ఈ రకం తమిళనాడుకు ఎక్కువ ఎగుమతి అవుతుండగా అక్కడ పంట అందిరావడంతో ఎర్ర చక్కెర కేళి రకానికి డిమాండ్ తగ్గడంతో ధర తగ్గింది. వారం క్రితం వరకు ఈ రకం గరిష్ఠం రూ.600 వరకు పలికింది. తెల్ల చక్కెర కేళి మినహాయిస్తే మిగిలిన అన్ని రకాలు ప్రస్తుత శ్రావణ మాసంలో రైతులకు మంచి లాభాలు తెచ్చాయనే చెప్పాలి. ప్రస్తుతం రావులపాలెం యార్డు నుండి కేరళ, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తోపాటు తెలంగాణా రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. తమిళనాడు, పార్వతీపురం, సాలూరు తదితర అరటి మార్కెట్ యార్డులకు గెలలు అంతగా రాకపోవడంతో అక్కడి నుండి వ్యాపారులు రావులపాలెం మార్కెట్ యార్డుకు తరలివచ్చి కొనుగోలుచేస్తున్నారు. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్ యార్డు పరిధితోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోను అరటి సుమారు 80 శాతం వరకు కోతలు పూర్తవడంతో గెలలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు ఊపందుకున్నాయి. రావులపాలెం మార్కెట్ యార్డుకు రోజుకు ప్రస్తుతం 20 వేల వరకు గెలలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్ యార్డు ఎగుమతులు, అమ్మకాలతో కళకళలాడుతోంది. రోజుకు రూ.25 నుండి రూ.30 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. దసరా వరకు ఇదే ఒరవడి కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతోంది.