తూర్పుగోదావరి

బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, సెప్టెంబరు 1: ఆర్థిక ఇబ్బందులో ఉన్న తమకు అప్పు ఇచ్చి ఆదుకున్న వృద్ధ మహిళను బంగారు ఆభరణాల కోసం పాశవికంగా హత్యచేసిన ఉదంతమిది. ఈ హత్యలో ఇద్దరు మహిళలు ప్రధాన పాత్ర పోషించగా, వారికి భర్తలు సహకరించారు. హత్య అనంతరం వృద్ధ మహిళ వద్ద ఉన్న 18 కాసుల బంగారు ఆభరణాలను చోరీచేసి ఆధారాలు దొరకకుండా ఎంతగా జాగ్రత్తపడినా చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యారు. రావులపాలెంలో సంచలనం రేకెత్తించిన గొలుగూరి శేషాయమ్మ (70) హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. గురువారం సాయంత్రం రావులపాలెం పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య ఈ వివరాలు వెల్లడించారు. నలుగురు నిందితులను, వారు చోరీ చేసిన బంగారు ఆభరణాలతోపాటు విలేకర్ల ఎదుట హాజరుపరిచారు. రావులపాలెంలోని కాలువ అవతల రామాలయం వీధిలో ఆరు పోర్షన్ల పెంకుటింట్లో వృద్ధురాలు గొలుగూరి శేషాయమ్మ సుమారు ఆరేళ్లుగా ఒక పోర్షన్లో అద్దెకుంటున్నారు. పక్క పోర్షన్లో సత్తి భాగ్యలక్ష్మి, వీరరాఘవరెడ్డి దంపతులు అద్దెకు నివాసం ఉంటూ కిరాణా వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో ఎక్కువ మొత్తంలో అప్పులు చేశారు. అలాగే శేషాయమ్మ వద్దకూడా రూ.40వేలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పు తీర్చమని పలుమార్లు శేషాయమ్మ కోరడంతో రూ.10వేలు తిరిగి ఇచ్చారు. కాగా ఇటీవల వారు ఉంటున్న పోర్షన్‌ను ఇంటి యజమాని అమ్మివేసి వారిని ఖాళీ చేయాలని వత్తిడి చేయడం ప్రారంభించాడు. దీంతో శేషాయమ్మ సైతం తన రూ.30వేలు అప్పు తీర్చాలని వారిపై వత్తిడి పెంచింది. ఇదిలా ఉంటే..అక్కడకు సమీపంలో భాగ్యలక్ష్మి అన్నయ్య కొవ్వూరి వెంకట్రెడ్డి, వదిన రోజా ప్రియదర్శిని వేరే ఇంట్లో నివాసం ఉంటూ అప్పుడప్పుడు భాగ్యలక్ష్మి ఇంటికి వస్తుంటారు. వెంకట్రెడ్డి కూడా అరటి వ్యాపారం చేసి నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో వీరంతా శేషాయమ్మను హత్యచేసి ఆమె వద్దనున్న డబ్బు, నగలు దోచుకుంటే తమ ఆర్థిక ఇబ్బందులు తీరతాయని భావించారు. శేషాయమ్మ హత్యకు పథకం సిద్ధం చేశారు. వంటరిగా నివాసం ఉంటున్న శేషాయమ్మను హత్యచేసేందుకు గతంలో ఒకసారి పగటి పూట ప్రయత్నించారు. అయితే స్థానికుల సంచారం ఎక్కువగా ఉండడంతో వీలు కాలేదు. అలాగే మరోసారి రాత్రి పూట హత్య చేయాలనుకున్నా ఆమె వంటిపై నగలు లేకపోవడంతో తమ పథకాన్ని వాయిదా వేసుకున్నారు. చివరికి గత నెల 28వ తేదీ రాత్రి 11గంటల సమయంలో తమ పథకంలో భాగంగా వీరరాఘవరెడ్డి, వెంకటరెడ్డిలు రోడ్డుపై కాపలా ఉండగా భాగ్యలక్ష్మి, రోజాలు వడ్డీ డబ్బులు ఇస్తామని శేషాయమ్మను బయటకు పిలిచారు. దీంతో శేషాయమ్మ తలుపులు తెరిచింది. అనంతరం పడక గదిలోకి వెళ్లాక వడ్డీ డబ్బంటూ రూ.900లు శేషాయమ్మకు ఇచ్చారు. ఆమె డబ్బు లెక్కపెట్టుకుంటుండగా అదే అదనుగా భావించి భాగ్యలక్ష్మి వృద్ధురాలు శేషాయమ్మ పైటకొంగును ఆమె మెడకు చుట్టి కింద పడవేసింది. ఆమె అరవకుండా రోజా నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసింది. ఇరువురూ కలిసి శేషాయమ్మను హత్యచేసి, ఆమె చేతికున్న 8 బంగారు గాజులు, మెడలోని రెండు పేటల బంగారు గొలుసు, చెవులుకున్న జత దుద్దులు వెరశి 18 కాసుల బంగారు ఆభరణాలను కాజేశారు. ఆధారాలు దొరక్కుండా ముందు గదిలో కారం జల్లి అక్కడ నుండి జారుకున్నారు. హత్య సమయంలో తాము వేసుకున్న దుస్తులను స్థానిక గౌతమీ గోదావరిలో పడవేశారు. మరుసటి రోజు తమకేమీ తెలియనట్లు హత్య జరిగిన ఇంటి వద్ద తిరిగారు. అయితే మృతురాలి కుమారుడు సూర్యనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, సిఐ పివి రమణ దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. తమ విచారణలో స్థానికులే ఈ హత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. శేషాయమ్మకు అప్పులు ఇచ్చే అలవాటుందని తెలియడంతో స్థానికులు, పోలీసులు ఆరా తీశారు. భాగ్యలక్ష్మి తొలుత తాను అప్పు తీసుకోలేదని చెప్పగా అనంతరం మాట మార్చి రూ.40వేలు అప్పు తీసుకున్నానని చెప్పడం పోలీసుల్లో అనుమానం రేకెత్తించింది. అంతే కాకుండా భాగ్యలక్ష్మి, రోజాల చేతులపై గోళ్లతో రెక్కిన గాయాలు ఉండడంతో వారిని, వారి భర్తలను అదుపులోనికి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య చేసినట్లు అంగీకరించారు. వారి వద్దనుండి చోరీ చేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కొత్తపేట కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ ఎల్ అంకయ్య తెలిపారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన సిఐ పివి రమణ, ఎస్సై పివి త్రినాధ్, అదనపు ఎస్సై పి శోభన్‌కుమార్, ఎఎస్సై ఆర్‌వి రెడ్డి, పిఎస్సైలు సురేంద్ర, మూర్తి, కానిస్టేబుల్ స్వామి తదితరులను డిఎస్పీ అభినందించారు.