తూర్పుగోదావరి

ద్వారపూడిని ముంచెత్తిన పంగిడి చెరువు వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, సెప్టెంబర్ 23: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో పంగిడి చెరువు పొంగి ప్రవహించడంతో ద్వారపూడి, వేములపల్లి గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాజానగరం మండలం వైపు నుండి వర్షపు నీరు ఈ చెరువులోకి ప్రవేశించడంతో చెరువు గట్టు దక్షిణం వైపు నుండి గ్రామాల్లోకి నీరు వరదలా ముంచుకొచ్చింది. రోడ్లన్నీ పెద్దపెద్ద కాల్వల్లా తయారయ్యాయి. ఆరడుగుల మేర నీరు గ్రామాలలో ప్రవహిస్తోంది. ఆ రెండు గ్రామాలలోని ఇళ్లల్లోకి మూడడుగుల మేర నీరు చేరింది. ప్రజలు ఇంట్లోకి వచ్చిన వరద నీటిని బయటకు తోడుతున్నారు. ముఖ్యంగా పంగిడి చెరువు, పంగిడి పుంతకు అటూ ఇటూ ఉన్న ప్రాంతాలు నీట మునిగాయి. సాయిబాబా ఆలయం వీధి, కోళ్ల సంత మార్కెట్టు వీధి, సంగీత వెంకటరెడ్డి కాలనీతోపాటు వేములపల్లి ప్రాంతాలలో ప్రజలు వరద నీటితో భయానక స్థితికి చేరారు. గతంలో పంగిడి చెరువుకు గండి పడి, 8 అడుగుల నీరు వరదలా పారిన సంఘటనను, పడవలపై బాధితులను ప్రభుత్వ యంత్రాంగం ఆదుకున్న నాటి పరిస్థితులు ప్రజలకు జ్ఞాపకాలు తెస్తున్నాయి. చెరువు నిండి కట్టపై నుండి వరద నీరు వస్తోంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హుటాహుటిన ద్వారపూడి చేరుకుని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆహార పొట్లాలు, మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు వెంట ఎంపిపి దొండపాటి ఝాన్సీలక్ష్మి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు వంక సాయికుమార్‌బాబు, వైస్ ఎంపిపి అడబాల బాబ్జి, మండల టిడిపి అధ్యక్షుడు యరగతపు బాబ్జి, మండపేట, ద్వారపూడి టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, అడబాల బుల్లిఅబ్బు, గ్రామ సర్పంచ్ తుర్లపాటి ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
జెసి పర్యటన
పంగిడి చెరువు పూర్తిస్థాయిలో నిండి, మండపేట మండలం ద్వారపూడి, వేములపల్లి గ్రామాల్లోకి వరద నీరు ప్రవహించినట్లు సమాచారం అందుకున్న తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ యుద్ధప్రాతిపదికన ఆ ప్రాంతానికి శుక్రవారం చేరుకున్నారు. రామచంద్రపురం ఆర్డీవో కె సుబ్బారావు, మండపేట తహసీల్దార్ మేకా వెంకటేశ్వర్లు, మండపేట ఎంపిడిఒ శాంతి తదితరులతో కలసి, వరదతో నిండిన ప్రాంతాలను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరిపి యుద్ధప్రాతిపదికన కాల్వలో నీరు తగ్గించడమే కాకుండా, ద్వారపూడి, వేములపల్లి గ్రామాల్లో నిల్వ ఉన్న వరద నీటిని తొలగించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అదే విధంగా వరద ముంపు బాధితులకు సత్వరమే భోజన వసతి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముంపుభారిన పడిన ప్రజలకు సంబంధించి ప్రభుత్వపరంగా అందించాల్సిన అంశాలపై గణాంక కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా అధికారులను ఆదేశించారు.