తూర్పుగోదావరి

ఎసిబి వలలో పౌరసరఫరాల అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 23: జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా పౌరసరఫరాల సంస్ధ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడి చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవరణలో ఉన్న పౌరసరఫరాల సంస్ధ కార్యాలయంపై ఎసిబి దాడి చేయడంతో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఎసిబి చేసిన దాడిలో సంస్ధ సహాయ మేనేజర్ (జనరల్) మండూరి జాన్‌కెనడీ రాజ్‌కుమార్‌ను వలపన్ని పట్టుకున్నారు. ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన వైట్ల వెంకట్రావు, అతని కుమారుడు తిరుమలరావులు గత 15 ఏళ్ళ నుండి పౌరసరఫరాల సంస్ధ నుండి ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని మండపేటతో పాటు ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలకు ట్రాక్టర్లపై సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను నిర్వహిస్తున్నారు. గతం లాగే ఈ ఏడాది జూలైలో సరఫరా చేసే అనుమతిని వారు పొందారు. ఈ అనుమతులను సహాయ మేనేజర్ రాజ్‌కుమార్ ఇవ్వాల్సి ఉండగా అప్పటి నుండి లంచం కోసం డిమాండ్ చేయడంతో ఎసిబి అధికారులను ఆశ్రయించానని వెంకట్రావు తెలిపారు. ముందుగా రాజ్‌కుమార్ తనను 30 వేలు డిమాండ్ చేశారని 20 వేలు మాత్రమే ఇవ్వగలనని చెప్పడంతో ఆయన అంగీకరించారన్నారు. అయినా ఆయన తన మండపేట పాయింట్‌ను వేరే వారికి సరఫరా చేసేందుకు ఇచ్చేస్తున్నారనే సమాచారం తెలిసిందన్నారు. ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల సరఫరాకు ఖర్చులు సరిపోతాయని మండపేట పరిధిలోనే తమకు కుటుంబ పోషణకు నగదు మిగులుతాయన్నారు. డిమాండ్ చేసిన 20 వేలును ఇద్దామనుకున్నాని ఈ లోపాయికారి ఒప్పదం తనకు తెలియడంతో తప్పని పరిస్ధితుల్లో ఎసిబి అధికారులను ఆశ్రయించానని వెంకట్రావు తెలిపారు. ఈ సంఘటనపై వివరాలను చెప్పేందుకు రాజ్‌కుమార్ నిరాకరించారు. ఎసిబి డిఎస్పీ పి రామచంద్రరావు మాట్లాడుతూ రాజ్‌కుమార్ నుంచి వివరాలను సేకరించామని అతన్ని శనివారం విజయవాడలోని ఎసిబి కోర్టుకు తరలిస్తామని చెప్పారు. లంచం కోసం వేధిస్తున్న ప్రభుత్వాధికారుల వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని డిఎస్పీ సూచించారు. ఈ దాడిలో సిఐ పిబిఎస్ మోహన్‌రావు, ఎస్సై నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.