తూర్పుగోదావరి

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పిచ్చుకలంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: ప్రకృతి అందాలతో అలరారే తూర్పు గోదావరి జిల్లాలను టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గోదావరి నది మహా పుష్కరాల సమయంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టును రూ.100 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. దరిమిలా ఏడాదికి ఈ ప్రాజెక్టుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం విస్తరణ పనుల భూమి పూజకు వచ్చినపుడు ప్రకటించారు. ఈ నేపధ్యంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ప్రధానమైనది పిచ్చుకలంక. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అత్యధికంగా మట్టి అవసరం వచ్చింది. ముందుగా ఈ ప్రాంతాన్ని చెట్లూ, చేమలు నరికి చదును చేసేందుకు అందులో వున్న వృక్షాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆధారం చేసుకుని కాంట్రాక్టుతో చదును చేయించారు. మెట్ట, పల్లాలను సరిచేయించి భూ భాగాన్ని సిద్ధం చేసేందుకు రూ. 16 లక్షల ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. అయితే ఈ ఖర్చుకు తావులేకుండా డ్రెడ్జింగ్ ద్వారా వచ్చే ఇసుకతోనే పూడ్చి వేసి లంకను సిద్ధం చేసేందుకు సకాలంలో ఈ డ్రెడ్జింగ్ దోహదపడినట్టుగా అనుకూలించింది. తొలగించిన ఇసుకను ఎక్కడ నిల్వ చేయాలా అని ఆలోచన చేస్తున్న అధికారులకు ఈ డ్రెడ్జింగ్ ఇసుక పిచ్చుక లంకను చదును చేసేందుకు దోహదపడింది. తద్వారా నిధులు కూడా అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు కలసి వచ్చాయి. అందుకే ముందుగా అఖండ గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులు పిచ్చుకలంక వద్ద ప్రారంభిస్తున్నారు. ఇటు డ్రెడ్జింగ్ పనుల ప్రారంభంతోపాటు అటు అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు పనులను కూడా అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించేందుకు లాంఛనంగా అధికార యంత్రాంగం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి సూచనల మేరకు రెండు విధాలా కలిసి వచ్చేలా పనులను సిద్ధం చేస్తున్నారు.
వాస్తవానికి పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు పోలవరం ప్రాజెక్టు మాదిరిగా ఎప్పటినుంచో ప్రతిపాదనలు వున్నాయి. 1988 పిచ్చుకలంక అభివృద్ధికి శిలాఫలకం కూడా వేశారు. క్రమేణా ఈ ప్రాజెక్టు కాలగర్భంలో కలిసిపోయింది. పిచ్చుకలంకను అభివృద్ధి చేయాలని 1985లోనే నిర్ణయించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు.ప్రస్తుత ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేయడంతో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో పిచ్చుకలంకకు మహర్దశ వచ్చింది. దీనిని బట్టి దాదాపు 28 సంవత్సరాల అనంతరం ఎట్టకేలకు పనులు ప్రారంభించనుండటంతో పిచ్చుకలంకకు పర్యాటక ప్రాధాన్యత దక్కుతుందని చెప్పొచ్చు. పిచ్చుకలంక గోదావరి నది మధ్యలో సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి సమీపంలో ఉండే ఒక ద్వీపం. నది మధ్య ప్రకృతి సోయగాలతో అలరారుతూ పచ్చగా సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టు మొదలైంది. ఈ ప్రాంతానికి పర్యాటకంగా రానున్న కాలంలో విశేష ప్రాచుర్యం లభించనుందని సందర్శించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు. పిచ్చుకలంక పర్యాటక ప్రాజెక్టుతో పాటు సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి కూడా పర్యాటక ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఏదేమైనప్పటికీ నిధులు విడుదలతో అఖండ గోదావరి నది టూరిజం ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి.
వెనుకబడిన కులాల అభివృద్ధికి కృషి
జౌళి, ఎక్సైజ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి కొల్లు
మామిడికుదురు, సెప్టెంబర్ 24: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జౌళి, ఎక్సైజ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం అప్పనపల్లిలోని శ్రీబాలబాలాజీ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పాలకమండలి ఆధ్వర్యంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా వెనుకబడిన తరగతులకు చెందిన వెయ్యి మందిని ఎంపిక చేసి వంద కోట్ల రూపాయలతో విదేశీ విద్యను అందించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. బెల్టుషాపుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు నిజాయితీ వైఎస్ హాయాంలోనే రుజువయ్యిందని, ఇప్పటికైనా జగన్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలన్నారు. మంత్రి వెంట పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, ఆలయ కమిటీ ఛైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, సర్పంచ్ బొంతు సూర్యభాస్కరరావు, జడ్పీటీసీ విత్తనాల మాణిక్యాలరావు, ఎఎంసి ఛైర్మన్ కొమ్ముల నాగబాబు, టిడిపి నాయకులు సూదా బాబ్జి, అల్లూరి గోపీరాజు, మద్దాల పెదకాపు తదితరులు పాల్గొన్నారు
ఎక్స్‌గ్రేషియా త్వరలో అందిస్తాం
విఆర్ పురం, సెప్టెంబర్ 24: మండలంలో ఇటీవల కాళ్లవాపు వ్యాధితో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా త్వరలో అందేలా చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఆర్‌పి సిసోడియా అన్నారు. మండలంలో కాళ్లవాపు వ్యాధితో మరణాలు సంభవిస్తున్న నేపధ్యంలో సిసోడియా శనివారం మండలంలో పర్యటించారు. ముందుగా ఆయన చినమట్టపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి గిరిజనులతో కాళ్లవాపువ్యాధి గురించి మాట్లాడారు. గ్రామానికి రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆయనను గ్రామస్థులు కోరారు. అలాగే అన్నవరం గ్రామాన్ని సందర్శించి గ్రామంలో కలియతిరిగారు. కాకినాడలో కాళ్లవాపునకు చికిత్స పొంది తిరిగి వచ్చిన రోగులను పరామర్శించారు, వైద్యులు ఏమన్నారు, ఎలా ఉంది అని ఆయన అడిగారు. గ్రామానికి చెందిన గడ్డెల బుల్లెమ్మ అనే గిరిజన మహిళ తాను కాళ్లవాపు వ్యాధితో బాధపడుతున్నానని, తనని కాకినాడ జిల్లా వైద్యశాలకు పంపించాలని సిసోడియాకు వినతిపత్రం అందజేసింది. దీనితో సిసోడియా ఆమెను వెంటనే కాకినాడకు రిఫర్ చేయాలని వైద్యులకు ఆదేశించారు. అనంతరం ఆయన రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి ఆసుపత్రిలోని రోగులను పరామర్శించారు. ప్రస్తుతం వస్తున్న కాళ్లవాపు వ్యాధుల గురించి ఆయన డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాళ్లవాపు వ్యాధులు తగ్గేవరకూ అధికారులు నిరంతరం పని చేస్తారన్నారు. ఈ నాలుగు విలీన మండలాల్లో హెల్త్ సర్వేలను ముమ్మరం చేశామన్నారు. కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ చక్రధరబాబు, ఎంపిడిఒ సరోవర్‌రావు, తహసీల్దార్ జివిఎస్ ప్రసాద్, వైద్యులు దుర్గాప్రసాద్, రామారావు, జడ్పీటీసీ ముత్యాల కుసుమాంబ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు:జెసి
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 24: జిల్లాలో రైతుల పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరను కల్పించడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలియజేశారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించినప్పుడు రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, రవాణా ఖర్చులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈఅవకాశాన్ని జిల్లాలో ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నుండి డయల్ యువర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈకార్యక్రమానికి ప్రజలు నుండి 16్ఫన్ కాల్స్‌రాగా వాటిలో భూసర్వే, రేషన్‌కార్డులు, రోడ్లు, కరెంట్ తదతర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈఫిర్యాదులపై జెసి సత్యనారాయణ స్పందిస్తు డయల్ యువర్ జెసి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను, సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈకార్యక్రమంలో డిఎస్‌ఒ జి ఉమామహేశ్వరరావు, డిఎం ఏ కృష్ణారావు, కలెక్టరేట్ ఎఒ, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
దళితులను అణచివేసేందుకు కుట్ర
మాజీ ఎంపి హర్షకుమార్
అనపర్తి, సెప్టెంబర్ 24: దళిత, బడుగు, బలహీన వర్గాలను అణచివేసే కుట్రలు అనాదికాలంగా సాగుతున్నాయని, ఇకపై అటువంటి కుట్రలు సాగనీయబోమని అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ హెచ్చరించారు. అనపర్తి పంచాయతీ ఎదురుగాగల రామాలయ ఆవరణలోని తేతలి రామిరెడ్డి మంగాయమ్మ కళావేదికపై శనివారం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక బహిరంగ సభ నిర్వహించారు. నియోజకవర్గ బిసి సంఘం అధ్యక్షుడు రేలంగి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అనపర్తి కెనాల్ రోడ్డులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావుఫూలే విగ్రహాల ఏర్పాటు విషయంలో స్థానికంగా అడ్డుతగలడం దురదృష్టకరమన్నారు. జిల్లా అంతా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఏర్పాటుచేసినప్పుడు లేని అడ్డంకులు అంబేద్కర్, పూలే విగ్రహాలు ఏర్పాటుచేస్తే అడ్డువచ్చాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దాడులు పెరిగాయని, ప్రభుత్వం బలవంతంగా ఉద్యమాన్ని అణచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. గుమ్మిలేరులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంలో ఈ తరహా వైఖరినే అవలంభించారని గుర్తుచేసిన ఆయన అదే పరిస్థితి ఇక్కడ కూడా రానీయవద్దని హెచ్చరించారు. తాము ఒక్క అడుగు వెనకకు వేయడాన్ని అలసత్వం, అమాయకత్వంగా భావించవద్దన్నారు. తాము పోరాటం ప్రారంభిస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. ఈ సభలో ఆయా వర్గాల నాయకులు ఎస్ వెంకట్రావు, అప్పాజీ, ఆకుమర్తి చిన్న, పంపన రామకృష్ణ, జి సూర్యారావు, షేక్ సుభాన్, ఎన్ సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్య వేదిక ద్వారా అంబేద్కర్ ఆశయాలకు బీజం పడినట్లయిందన్నారు. రానున్న రోజుల్లో ఈ ఐక్యతను కొనసాగించాలని, తద్వారా రాజ్యాధికారాన్ని దక్కించుకోవచ్చునన్నారు. ముఖ్యంగా యువత మేల్కొని ఈ ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు.
రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువ
బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరి పున్నయ్యచౌదరి ఆవేదన
కొత్తపేట, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకుండాపోయిందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరి (ఈవెంట్స్) కెసిహెచ్ పున్నయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేటలో జరుగుతున్న రాష్టస్థ్రాయి అండర్-19 బ్యాడ్మింటన్ పోటీలను చూసేందుకు శనివారం ఆయన విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఇక్కడ క్రీడలకు తగిన ప్రభుత్వం నుంచి లేకుండా పోయిందన్నారు. తెలంగాణాలో ఆ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని ప్రకటించి అందుకు యాభై కోట్ల రూపాయలను కేటాయించి క్రీడలను ప్రోత్సహిస్తుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి పాలసీలను ప్రకటించకపోగా బడ్జెట్‌లో రెండు వందల కోట్లను కేటాయించినట్టు చెప్పినా దాని ఊసేలేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో మొత్తంగా 164 ఇండోర్ స్టేడియాలు ఉన్నాయని, ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నిర్మించబడ్డవేనన్నారు. క్రీడలకు సంబంధించి కోచ్‌ల కొరత కూడా రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల మంది షటిల్ క్రీడాకారులు తమ పేర్లను సంఘం ద్వారా నమోదు చేసుకొన్నారని, ఇంకా నమోదు కాకుండా అనేక మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో 57 క్రీడాసంఘాలు ప్రైవేటు సంఘాల ఆధ్వర్యంలో మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తే రాష్ట్రంలో క్రీడలు మరింత అభివృద్ధి చెందటం ఖాయమన్నారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రత్యేక పాలసీని ప్రభుత్వం ప్రకటించి నిధులను కేటాయిస్తే క్రీడల్లో రాష్ట్రం ముందంజలో ఉంటుందని పున్నయ్యచౌదరి పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు టి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండపేటలో పురపాలక శాఖ సంచాలకులు తనిఖీ
మండపేట, సెప్టెంబర్ 24: మండపేట పట్టణంలో రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు కన్నబాబు శనివారం మధ్యాహ్నం పలు ప్రదేశాలను తనిఖీ చేసారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ టి సకలా రెడ్డి, మున్సిపల్ కమీషనర్ వివి కన్యా కుమారి తదితర పురపాలక అధికారులు పురపాలక సంచాలకులు కన్నబాబు వెంట ఉన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలన చేసి, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై ఆయన సూచనలు, సలహాలు అందించారు.
శ్రీలంక స్ఫూర్తితో దోమల నిర్మూలన
జలవనరుల శాఖ మంత్రి దేవినేని
కాకినాడ, సెప్టెంబర్ 24: పొరుగు దేశం శ్రీలంక స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో దోమల నిర్మూలనకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. శ్రీలంకలో దోమలను పూర్తిగా నిర్మూలించారని, ఆ దేశ చర్య ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో దోమలపై దండయాత్రకు పిలుపునిచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. కాకినాడలో శనివారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో మంత్రి దేవినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమకాటు కారణంగా డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వంటి ప్రమాదకరమైన వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకై ప్రభుత్వపరంగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమని స్పష్టం చేశారు. దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఉద్యమంగా చేపట్టినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ఏలూరు నుండి శ్రీకారం చుట్టారని, రాష్ట్ర ప్రజల నుండి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ప్రతి చిన్న జ్వరాన్ని ప్రమాదకర వ్యాధిగా భయపెట్టి చికిత్స పేరుతో లక్షలాది రూపాయలను దోచుకుంటున్న ఆసుపత్రులున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ దోమ కారణంగా ఏ జ్వరం సోకుతుందో, ఏ జ్వరానికి ఏ విధమైన లక్షణాలుంటాయో, వాటి బారిన పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో అందరికీ అవగాహన కలిగించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమాచారంతో ముద్రించిన కరపత్రాలను పెద్దఎత్తున ప్రజలకు పంచుతున్నట్టు చెప్పారు. ఆయా జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇంటింటి సందర్శన ద్వారా ప్రజలను స్వయంగా కలసి దోమల నిర్మూలనకు ఇంటా, బయటా చేపట్టాల్సిన చర్యలపై వివరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి శుక్రవారం పొడి దినంగా పాటించాలని, ప్రతి నెలా నాలుగో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు తెలియజేశారు. ఇళ్ళ పరిసరాలు, కుండీలు, నీటి కుంటలు, డ్రైనేజీలు, తదితర ప్రదేశాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, లేని పక్షంలో అవి దోమ లార్వాలకు ఆవాసాలుగా మారే ప్రమాదం ఉందని మంత్రి దేవినేని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే చేపట్టిన దోమలపై దండయాత్ర ర్యాలీని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ అలీంబాషా తదితరులు పాల్గొన్నారు.. కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ అలీంబాషా, అదనపు కమీషనర్ ఎస్ గోవిందస్వామి, ఉప కమీషనర్ సన్యాసిరావు, ఇఇ విజయకుమార్, కాకినాడ ఆర్‌డిఒ అంబేద్కర్, కాకినాడ అర్బన్ తహశీల్దారు బాలసుబ్రహ్మణ్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దోమలపై దండయాత్ర పేరుతో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. దోమలపై దండయాత్ర బ్రోచర్లు ఆవిష్కరించారు.

హోదాపై సాధనకు మాజీ ప్రధాని మద్దతు

అమలాపురం, సెప్టెంబర్ 24: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు సంపూర్ణ మద్దతు ఇస్తామని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చినట్టు ఎపిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. ఢిల్లీ నుండి ఆయన ఫోన్‌లో శనివారం ఆంధ్రభూమితో మాట్లాడారు. శనివారం ఉదయం ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన స్వగృహంలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రి జెడి శీలం, గిడుగు రుద్రరాజులు కలిసి రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంతో ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విరించామన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రత్యేక హోదా కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని, తామంతా మన్మోహన్‌కు వివరించినట్లు గిడుగు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరుకు ఎపి కాంగ్రెస్ చేపడుతున్న ఉద్యమానికి మన్మోహన్‌సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు గిడుగు తెలిపారు.
కాళ్లవాపు బాధితులకు మెరుగైన వైద్యం: మంత్రి దేవినేని

కాకినాడ, సెప్టెంబర్ 24: కాళ్ళవాపు వ్యాధితో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏజన్సీ ప్రాంత బాధితులను మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు శనివారం పరామర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలోని విఆర్ పురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది గిరిజనులు కాళ్ళవాపు వ్యాధితో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రి పరామర్శించి, మెరుగైన వైద్య చికిత్స అందజేయాల్సిందిగా వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కాళ్ళవాపు వ్యాధి వెనుక కారణాలపై ప్రభుత్వం వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తోందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలసి త్వరలో ఏజన్సీ ప్రాంతంలో పర్యటించనున్నట్టు మంత్రి దేవినేని చెప్పారు.
ప్రకృతి వనంతో గోదావరికి శే్వత వర్ణం

రావులపాలెం, సెప్టెంబర్ 24: ప్రకృతి వేసిన పూల వనంతో గోదావరి నది శే్వత వర్ణం పులుముకుంది. గత రెండు నెలలుగా వరద నీటితో గోదావరి నది కళకళలాడుతుండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తోడే లంక భూముల్లో పచ్చదనం తొణికిసలాడుతోంది.
గోదావరి లంకల్లో మాత్రమే కనిపించే దర్బగడ్డి (దుబ్బులు) ఏపుగా పెరిగి వాటికి తెల్లని పూవులు పూయడంతో ప్రస్తుతం గోదావరి తీరమంతా కళకళలాడుతోంది. రావులపాలెం గౌతమీ బ్రిడ్జీల మీదుగా వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రకృతి అందాలు కనువిందుచేస్తున్నాయి.
నేడు జిత్‌మోహన్ మిత్రకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: అతడొక గోదావరి అల..సాంస్కృతిక సవ్వడి.గోదావరి హోరులో వినిపించే ఒక స్వర ప్రవాహం..నా షోలా పూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి.. అంటూ హోరెత్తించిన గాయకుడు.. ఇదేమిటి వయ్యగారూ.. అంటూ నవ్వించిన నటుడు..డెబ్బై రెండేళ్ల వయసులోనూ హుషారెత్తించే గొంతుతో నేటికీ ఉర్రూతలూగిస్తూ గోదావరి కీర్తి కిరీటంలో ఒకరైన శ్రీపాద జిత్‌మోహన్ మిత్ర. నటుడుగా,గాయకుడిగా,క్రీడాకారుడుగా,రాజకీయవాదిగా,న్యాయవాదిగా,సంఘ సేవకుడిగా,మానవతావాదిగా ఇలా ఎన్నో విభిన్న ప్రతిభాపాటవాలు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాజమహేంద్రవరానికి చెందిన శ్రీపాద జిత్‌మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో అంగరంగ వైభవంగా జరగనుంది. 75 సంవత్సరాల వయసు కలిగిన జిత్‌మోహన్ మిత్ర నేటికీ హుషారుగా ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా వుంటారు. ఇప్పటి వరకు 210 చిత్రాల్లో నటించారు. స్థానికులంతా కలసి ఆయనకు జీవిత సాఫల్య పురష్కారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరంలో ఆదివారం జరగనుంది.