తూర్పుగోదావరి

రాజమహేంద్రి ఖ్యాతిని ఇనుమడింపజేసిన జిత్‌మోహన్‌మిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: విభిన్న రంగాల్లో తన ప్రజ్ఞాపాటవాలను చూపిన శ్రీపాద జిత్‌మోహన్ మిత్ర రాజమహేంద్రవరం ఖ్యాతిని ఇనుమడింపజేశారని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నవరస నట సమాఖ్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పౌరులు, గాయకుడు, నటుడు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆదివారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆంధ్రా కిశోర్‌కుమార్‌గా పేరుతెచ్చుకున్న జిత్ మోహన్ మిత్రా ఎంతోమంది కళాకారులను తయారు చేశారన్నారు. రాజమహేంద్రవరానికి కళాపరంగా పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి దక్కిన వరం జిత్ మోహన్‌మిత్రా అని పేర్కొంటూ ఆయన నటించిన ఎన్నో చిత్రాలను గుర్తు చేశారు. మాజీ ఎంపి జివి హర్షకుమార్ మాట్లాడుతూ జిత్ మోహన్ మిత్రా పద్మశ్రీ అవార్డు రావాల్సిన వ్యక్తన్నారు. 63 సంవత్సరాలుగా గాయకుడి ఎంతో సేవ చేస్తూ విభిన్న రంగాల్లో సేవలు అందిస్తోన్న జిత్‌కు జీవిత సాఫల్య పురస్కారం రాజమహేంద్రవరానికి గౌరవం అన్నారు. ప్రభుత్వాలు ఆయన ప్రతిభకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఎపిఐఐసి మాజీ ఛైర్మన్ శ్రీఘాకొళపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మూడు సార్లు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న అరుదైన ప్రజ్ఞాశాలి జిత్ మోహన్ అని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ సేవకుడు పట్టపగలు వెంకటరావు మాట్లాడుతూ 242 చిత్రాల్లో నటించి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జిత్ మోహన్ మిత్రాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. వివిధ రంగాలకు చెందిన రుంకాని వెంకటేశ్వరరావు, అశోక్‌కుమార్ జైన్, మధుఫోమ్రా, మీసాల సత్యనారాయణ, రెడ్డి బుల్లబ్బాయి, శ్రీపాద కుమారస్వామి, ఎస్‌వి చౌదరి, గుమ్మడి సమర్పణరావు, కోలమూరు ప్రభాకరరావు, గుబ్బల రాంబాబు తదితరులు మాట్లాడారు. అనంతరం జిత్ మోహన్‌మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. బంగారు కంకణం తొడిగారు.

భీమేశ్వరాలయం అభివృద్ధికి పెద్ద పీట
నూతన పాలక మండలి అభినందన సభలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
సామర్లకోట, సెప్టెంబర్ 25: పంచారామక్షేత్రం సామర్లకోట చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం భీమేశ్వరాలయం గార్డెన్‌లో దేవాలయ నూతన పాలకమండలి అభినంద సభ అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి రాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు హాజరయ్యారు. సభలో మంత్రి రాజప్ప మాట్లాడుతూ ఆగస్టు 4న నూతన పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారని, ఆగస్టు 8న కంటే జగదీష్‌మోహనరావు (బాబు) కమిటీ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. పాలకమండలి నిస్వార్ధంతో దేవస్థానం అభివృద్ధికి సేవలందించాలన్నారు. మహా శివరాత్రి ఉత్సవాల నాటికి భీమేశ్వరాలయం వద్ద గోదావరి కాల్వపై మూడో వంతెన పనులు పూర్తిచేస్తామని మంత్రి రాజప్ప హమీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ వందల ఏళ్ళ నాటి ఈ ఆలయానికి చెందిన భూములు సుమారు 27 వేల ఎకరాలకు కేవలం రూ.15వేలు శిస్తుగా ఉండేదని, తానే రైతులు, పెద్దలతో చర్చించి శిస్తు ఆదాయం రూ.లక్షకు పైగా పెరిగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సభలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతిచంద్రరావు, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు సుంకవల్లి బాపిరాజు, కార్మిక నాయకుడు దవులూరి సుబ్బారావు తదితరులు మాట్లాడారు. తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్‌మోహనరావు(బాబు) దంపతులను, సభ్యులు మహంకాళి వెంకట గణేష్, చుండ్రు సూర్యభాను, బలుసు శ్రీనివాసు, బాడితిమాని త్రిమూర్తులు, గొల్లపల్లి కామరాజు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, పుత్రయ్య, ఎక్స్ ఆఫీషియా సభ్యునిగా ఆలయ అర్చకులు చెరకూరి సర్వేశ్వర శర్మను మంత్రి రాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు, ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి తదితరులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్లు మన్యం పద్మావతి, రాజా సూరిబాబురాజు, టిడిపి రాష్ట్ర ప్రచారా కార్యదర్శి మన్యం చంద్రరావు, జడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ, వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, ఎఎంసి చైర్మన్లు పాలకుర్తి శ్రీనుబాబు, ముత్యాల రాజబ్బాయి, మున్సిపల్ వైస్ చైర్మన్లు యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), త్సలికి సత్య భాస్కరరావు, హెచ్‌డిసి చైర్మన్ అడబాల కుమారస్వామి, భారత మాతా సేవా ఫరిషత్ వ్యవస్ధాపక చైర్మన్ డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు పాల్గొన్నారు. తొలుత భీమేశ్వరాలయంలో మంత్రి రాజప్ప స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదికపై దసర శరన్నవరాత్రులకు చెందిన ఆలయం రూపొందించిన ఆహ్వాన పత్రం బ్రోచర్‌ను మంత్రి, ఎమ్మెల్సీ ఆవిష్కరించారు.
రూ.21 కోట్లతో పెద్దాపురంలో ప్రత్యేక గురుకుల పాఠశాల
సామర్లకోట, సెప్టెంబర్ 25: పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో గల ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు రూ.21 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ప్రామాణీకతతో ప్రత్యేక గురుకుల పాఠశాలను నిర్మిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సామర్లకోట మున్సిపాల్టీ పరిధిలో 2,5 వార్డుల్లో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రౌన్‌పేట అంబేద్కర్ పార్కులో మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్ ఆద్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ గురుకుల పాఠశాల ఏర్పాటుకు పదెకరాల స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అలాగే విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు పభుత్వం రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ బాగా పెరిగిన దృష్ట్యా, పిఠాపురం రోడ్డులోని ఇరుకు వంతెననుండి హరిహర క్షేత్రం వద్ద అయిదు తూములు దాటి కాకినాడ రోడ్డులో కలిసే విధంగా బైసాసు రోడ్డును, హరిహార క్షేత్రం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. తొలుత రూ.10లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హాలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం రూ1.5 లక్షల వ్యయంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిర్మించిన షెల్టర్‌ను, ఇదే పార్కులో రూ.5లక్షలు నిధులుతో నిర్మించిన బోరును మంత్రి రాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్పను స్ధానిక ఎస్సీ ఎస్టీ బిసి, మైనార్టీ ఐక్యవేదిక ఆద్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతిచంద్రరావు, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, భీమేశ్వరాలయం దర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్‌మోహనరావు, ఎఎంసి వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, బ్రౌన్‌పేట వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు బొడ్డు చిన్ని, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పిట్టా సత్యనారాయణ, కార్యదర్శి లింగం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణకే దోమలపై దండయాత్ర
సామర్లకోట, సెప్టెంబర్ 25: ప్రజలు దోమల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆదివారం బ్రౌన్‌పేట సెంటర్‌లో మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దోమలపై దండయాత్ర అవగాహన ర్యాలీని ప్రారంభించి మంత్రి రాజప్ప పాల్గొని మాట్లాడారు. దోమల వల్ల వైరల్ జ్వరాలు ప్రబలుతున్నందున ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ రెండు నాటికి సామర్లకోట, పెద్దాపురం పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలుగా ప్రకటించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప స్వయంగా దోమల మందును పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతిచంద్రరావు, కౌన్సిలర్లు జుత్తుక సుబ్బలక్ష్మి, పితాని సూర్యనారాయణ, బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

చింతూరులో అందని మెరుగైన వైద్య సేవలు

చింతూరు, సెప్టెంబర్ 25: చింతూరు క్లస్టర్ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షలు సైతం పైపైన చేస్తూ మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన కరణం దూలమ్మ జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు శనివారం చింతూరు వైద్యశాలకు తరలించారు. కాగా కుటుంబ సభ్యులు సక్రమంగా వైద్యం చేయడం లేదని దూలమ్మను భద్రాచలం ప్రైవేటు వైద్యశాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. జ్వరంతో బాధపడుతున్న దూలమ్మను వైద్యాధికారులెవరూ సరైన వైద్యం అందించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యులు దూలమ్మను భద్రాచలం తరలించేందుకు ఆమెను మోసుకుంటూ ఆటో ఎక్కించేందుకు రహదారిపైకి వచ్చారు. ఈ సమయంలో దూలమ్మ నీరసంగా ఉండడంతో రోడ్డుపైనే పడుకుని బాధపడుతోంది. ఈ దృశ్యం చూసిన ప్రజలు అయ్యోపాపం అని చలించిపోయారు. వైద్యశాలలో వైద్యం పొందాల్సిన దూలమ్మకు క్లస్టర్‌లోనే మెరుగైన వైద్య సేవలు వైద్యాధికారులు అందించకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వై రామవరం మండలంలో అత్యధిక వర్షపాతం
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 25: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వై రామవరం మండలంలో 71.2మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా తుని మండలంలో 0.4మిల్లీమీటర్ల వర్షపాతం గడచిన 24గంటల్లో నమోదైనట్టు అధికారులు తెలిపారు. మారేడుమిల్లిలో 39.6మి.మీ, రంపచోడవరంలో 66.2, దేవీపట్నంలో 32.6, అడ్డతీగలలో 18, రాజవొమ్మంగిలో 14.6, గంగవరంలో 19.6, కూనవరంలో 13.2, సీతానగరంలో 11, అయినవిల్లిలో 13.4, గండేపల్లిలో 12.8, కడియంలో 10.2, తాళ్ళరేవులో 12.2, ఏలేశ్వరంలో 8.6మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.

అక్టోబర్ 1న కడియం నర్సరీ మెన్ అసోసియేషన్ పాలకవర్గం ఎన్నిక
కడియం, సెప్టెంబర్ 25: కడియం నర్సరీ మెన్ అసోసియేషన్ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నర్సరీ రైతులు చేసిన దౌత్యం ఫలించకపోవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆదివారం అభ్యర్థుల నామినేషన్ ఉప సంహరణ గడువు కూడా ముగియడంతో అక్టోబర్ 1న ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా అభ్యర్థులకు ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. ఉద్యానవన శాఖ అనుబంధమైన యంత్రాలు, మొక్కలను గుర్తుల్లో ఉన్నాయి. అధ్యక్షుని పదవికి సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా చంటి, శివాంజనేయ నర్సరీ యజమాని మల్లు పోలరాజుల మధ్య గట్టిపోటీ నెలకొంది. పాలకవర్గానికి సంబంధించి 11 డైరెక్టర్ పదవులకు గాను 3, 7, 9 బ్లాకుల డైరెక్టర్లుగా ఆకుల చంటిబాబు, పుల్లా రామకృష్ణ, కొత్తపల్లి శివాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 8 డైరెక్టర్ అభ్యర్థులను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. దీనికితోడు అభ్యర్థుల గుర్తింపులతో ప్రచార బరిలోకి దిగారు.

అమ్మోనియా సారా, థైరాయడ్సే ప్రధాన కారణం
-కాళ్లవాపు వ్యాధిపై డిఎంహెచ్‌ఒ చంద్రయ్య
చింతూరు, సెప్టెంబర్ 25: విలీన మండలాల ప్రజలను పట్టిపీడిస్తున్న కాళ్ల వాపు వ్యాధికి అమ్మోనియా సారా, థెరైడ్స్, పౌష్టికాహార లోపం ప్రధాన కారణమని డిఎంహెచ్‌ఒ చంద్రయ్య తెలిపారు. శనివారం చింతూరులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొనే్నళ్లుగా గిరిజనులు అమ్మోనియా సారా సేవించడం, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్లనే ఈ వ్యాధి సోకి ఉండవచ్చునని డిఎంహెచ్‌ఒ చంద్రయ్య అభిప్రాయపడ్డారు. అలాగే నాటు వైద్యం, ఆర్‌ఎంపిలిచ్చిన స్టిరైడ్స్ వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలి ఉండవచ్చునన్నారు. రంగారాయ మెడికల్ కళాశాల (కాకినాడ) హెచ్‌ఒడి కృష్ణబాబు కాళ్ల వాపు వ్యాధికి గల కారణాలను అధ్యయనం చేశారన్నారు. గిరిజనుల ఆహారపు అలవాట్లు, అమ్మోనియా సారా, పౌష్టికాహార లోపం కారణమై ఉండవచ్చునని కృష్ణబాబు పేర్కొన్నారు. అలాగే నూతనంగా ఏర్పాటుచేసిన చింతూరు క్లస్టర్ వైద్యశాలకు ఒక నెలలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించనున్నట్టు తెలిపారు. ప్రతి నెలా ఒక రోజు ఒకో గ్రామంలో వైద్యం అందించనున్నట్టు పేర్కొన్నారు. కాళ్ల వాపు రోగులను పరీక్షించేందుకు కాకినాడలో నలుగురు హెల్త్ అసిస్టెంట్లు, నలుగురు స్ట్ఫా నర్సులను నియమించనున్నట్టు తెలిపారు. సమావేశంలో వైద్యాధికారులు శివరామకృష్ణ, లక్ష్మణ్, మూర్తి పాల్గొన్నారు.