తూర్పుగోదావరి

ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, సెప్టెంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాల్టీల్లో భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు పొందేలా చర్యలు తీసుకుందని టౌన్ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పిఎన్‌ఎస్ సాయిబాబు వెల్లడించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశమయ్యారు. మీ సేవా కేంద్రాల్లో నిర్ణీత రుసుం చెల్లించి అనుమతి పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తు చేసుకుని భవన నిర్మాణానికి ప్లాన్లు మంజూరు నేరుగా పొందేలా చర్యలు తీసుకుందన్నారు. అయితే దరఖాస్తుల్లో ఎటువంటి తేడాలు వచ్చినా టౌన్‌ప్లానింగ్ అధికారులకు, మున్సిపల్ కమిషనర్ల ప్రమేయం ఉండదని, లైసెన్స్‌డ్ సర్వేయర్‌పై చర్యలు తీసుకుంటారని ఆర్డీడి సాయిబాబు వివరించారు. అన్ని అనుమతులు పొందిన లే అవుట్‌లలోనే ప్రజలు స్థలాలు కొనుగోలు చేసుకోవాలని, అనుమతులు లేని లే అవుట్‌లలో స్థలాలు కొనుగోలు చేస్తే మున్సిపాల్టీ భవన అనుమతులు, ఇతర అనుమతులు, బ్యాంకు రుణాలు వచ్చే అవకాశం ఉండదన్నారు. కాగా రీజియన్ పరిధిలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇప్పటివరకు అక్రమ కట్టడాల కమబద్ధీకరణ (బిపిఎస్) పథకం కింద 24,400 దరఖాస్తులు రాగా 2800 దరఖాస్తులను పరిష్కరించినట్లు ఆర్డీడి చెప్పారు. మిగిలిన దరఖాస్తులు నెలాఖరులోగా పరిష్కరించాలని అన్ని మున్సిపాల్టీలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు లే అవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను ఆర్డీడి పరిశీలించి ఆయా లే అవుట్‌లను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌చార్జి టిపిఎస్ మంజుల, టిపిబిఒ రమ్యశ్రీ, లైసెన్స్‌డ్ సర్వేయర్ ఉండవల్లి శ్రీనువాసు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో సోమవారం టౌన్ ప్లానింగ్ ఆర్డీడి సాయిబాబును కలిసిన ఫ్లోర్ లీడర్ ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ కాళ్ళ లక్ష్మీనారాయణ, జుత్తుక అప్పారావు స్థానిక టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల పనితీరు అధ్వాన్నంగా ఉందని పిర్యాదు చేశారు. పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ స్థలాల్లో సైతం అక్రమంగా ఇళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కడుతున్నా, తాము కౌన్సిల్ సమావేశాల్లో, నేరుగా పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.