తూర్పుగోదావరి

వైభవంగా ఆది కుంభేశ్వరుని మహా కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, నవంబర్ 29: కాకినాడ సాగర తీరం శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఈ మంగళాంబికా ఆది కుంభేశ్వరస్వామి 41వ మహాకుంభాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, సముద్ర స్నానాలు ఆచరించుకున్నారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే 108 కన్యలతో పండ్ల రసాల కలశాలతో ఆదికుంభేశ్వరుని అభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా జరిగింది. పుండరీక్షుడు (బాబీ) దంపతులు, నారాయణ మురళీ, ఆలయ కమిటీ మెంబర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.

అమ్మో ఒకటో తారీఖు!
-ఇంటి అద్దె, స్కూలు ఫీజుల భారం
-కరెన్సీ కటకట తీరేదెలా?
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 29: ఒకటో తారీఖు పేరు చెబితే జిల్లాలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సాధారణ రోజుల్లోనే జీవనం భారంగా మారిన నేపథ్యంలో ఒకటో తేదీని తలుచుకుంటనే వణుకు పుడుతోందని వాపోతున్నారు. జిల్లాలోని నగర, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా సాధారణంగా ఒకటో తేదీనే నెలవారీ అద్దెను చెల్లిస్తూ వుంటారు. స్కూల్ ఫీజుల నుండి పాలు, నీళ్ల వాడకం వరకూ ఆయా బాకీలను ఒకటో తేదీ నుండి తీర్చడం సర్వసాధారణం. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న జనం వచ్చే డిసెంబర్ 1వ తేదీని తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు. సొమ్ములుండి కూడా బాకీలు తీర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు పలువురు పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుండి ఒక ఖాతాదారుడు రోజుకు రెండువేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం, అది కూడా గంటల తరబడి నిరీక్షించిన తరువాతే సాధ్యమవుతుండటం శిరోభారంగా మారింది. ఇక ఎటిఎంల విషయానికి వస్తే సుమారు 50 శాతం ఔట్ ఆఫ్ అర్డర్ అంటూ దర్శనం ఇస్తుండటం ప్రజలకు శిరోభారంగా మారింది. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని ముఖ్య కూడళ్లలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటిఎంలు సైతం సక్రమంగా పనిచేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము ఉండి కూడా నెలవారీ ఖర్చుల నిమిత్తం సొమ్ము డ్రా చేసుకునే అవకాశం ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక ఇళ్ళలో పెళ్ళిళ్ళు-వ్రతాలు, నోములు-శుభ కార్యక్రమాలు జరుపుకున్న వారి పాలిటైతే పెద్దనోట్ల రద్దు వ్యవహారం మరింత శిరోభారంగా మారింది. బ్యాంకుల్లో ఎంత మొత్తం డిపాజిట్లు చేసేందుకు వెళ్ళినా నిక్షేపంగా ఆహ్వానిస్తున్నారని, విత్‌డ్రా చేసుకోవాలంటే మాత్రం సవాలక్ష ఆంక్షలు విధించారంటూ ఆయా వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల వారే ఈ విధంగా ఇబ్బందులు పడుతుండగా, ధనికులు మాత్రం దొడ్డిదారులను వెతుక్కుని, హాయిగా తమ పని తాము చక్కబెట్టుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలలో నిల్చున్న వారిలో ఒక్క ధనికుడున్నాడా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాకు భారీగా కరెన్సీ!
-రాజమహేంద్రవరం చేరిన రెండు కంటైనర్లు
-త్వరలో ఆందుబాటులోకి చిల్లర నోట్లు
-రూ.500 నోటు ఇంకా అందని ద్రాక్షే
రాజమహేంద్రవరం, నవంబర్ 29: కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2వేల నోట్లతో పాటు, రూ. 100, 10, 20 కరెన్సీ నోట్లు మంగళవారం నగరానికి చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య రెండు భారీ కంటైనర్లలో రిజర్వు బ్యాంకు ఇండియా నుంచి కొత్త నోట్లను నగరానికి తరలించారు. నగరంలోని కంబాలచెరువు, దానవాయిపేట స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలకు వీటిని చేర్చారు. ప్రస్తుతం నగరంలోని వివిధ బ్యాంకులు, ఎటిఎంలలో సరిపడినంత చిల్లర లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ ఖాతాల్లోని సొమ్మును కూడా తీసుకోలేని దుస్థితిలో పేదలు ఉన్నారు. పేదలు రూ. 100 నోట్ల కోసం బారులుతీరుతున్నారు. మరోవైపు ధనికులు 2వేల నోట్లను మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల పేదలు, ధనికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అయతే రూ.500 నోట్లు మాత్రం ఇంకా జిల్లాలో అందుబాటులోకి రాలేదు. మరో రెండుమూడు రోజుల్లో కొత్త 500 నోట్లు కూడా వచ్చే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు.
ఖరీఫ్‌లో భారీ వృథా.. రబీకి మారని వ్యథ..!
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, నవంబర్ 29: గోదావరి డెల్టాలో మళ్లీ సాగునీటి ఎద్దడి మొదలయ్యింది. ప్రస్తుత రబీలో ప్రభుత్వం పూర్తి ఆయకట్టుకు అనుమతించింది. అయితే నదిలో నీటి లభ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది.. ఈ దశలో రబీ గట్టెక్కేనా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. నీటి నిల్వ సామర్ధ్యం పెంచడానికి అఖండ గోదావరి నదిలో డ్రెడ్జింగ్ పనులు చేపట్టినా రబీ అవసరాల సాగునీటికి ఇబ్బందులు తప్పేట్టు కన్పించడం లేదు. ఖరీఫ్ కాలంలో వేల టిఎంసిల గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతుంటే రబీలో మాత్రం కొన్ని వందల క్యూసెక్కుల కోసం కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
పదేళ్ల వరుస వరదల సమయాన్ని లెక్కకట్టి రబీ కాలంలో నదిలో నీటి లభ్యతను అంచనా వేస్తారు. ఈమేరకు గోదావరి డెల్టాల్లో రబీ సాగు విస్తీర్ణాన్ని నిర్ధారిస్తారు. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి ఆధారంగా సాగు నీటిని గోదావరి డెల్టాలకు అందించడమే కాకుండా గోదావరి జిల్లాల్లోని తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు రబీ కాలంలో నీటిని బొట్టు బొట్టును లెక్కపెట్టుకుని సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి వుంటుంది. ప్రారంభంలో నీరు పుష్కలంగా ఉండటంతో ఈ ఏడాది రబీలో పూర్తిస్థాయి ఆయకట్టుకు అనుమతించారు. పైపెచ్చు ఏటా మాదిరిగా సీలేరు జల విద్యుత్ కేంద్రం విడుదలచేసే జలాలపై ఆధారపడకుండా రబీని గట్టెక్కించవచ్చని భావించారు. అయితే మెల్లమెల్లగా పరిస్థితిలో మార్పువస్తోంది. రాన్రాను నదిలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో ప్రస్తుతం రబీని ఎలా గట్టెక్కించాలా అని జలవనరుల శాఖ అధికార్లు ఆందోళనకు గురవుతున్నారు.
వరదల సమయంలో గోదావరి నది నుంచి ఏటికేడాది సరాసరిగా సుమారు మూడు వేల టిఎంసిల జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఇందులో కేవలం కొన్ని వందల టిఎంసిలను వినియోగించుకుంటే కోట్ల విలువైన పంటను దక్కించుకునే పరిస్థితివుంది. గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కేవలం 50 టిఎంసిలు వినియోగించుకుని పశ్చిమ గోదావరి, కృష్ణా డెల్టాల్లోని సుమారు 10.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా సుమారు రూ.2500 కోట్ల విలువైన పంట చేతికి దక్కింది.
ఈ రబీ సీజన్‌లో ఉభయ గోదావరి డెల్టాల్లో 8.96 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు గోదావరి జలాలను అందించాలని నిర్దేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎత్తిపోతల పథకాలు, ఏలేరు, సుబ్బారెడ్డి, సూరంపాలెం, మద్దిగడ్డ వంటి రిజర్వాయర్ల ద్వారా మొత్తం 10.50 లక్షల ఎకరాలకు రబీలో సాగునీటిని అందించడానికి అనుమతిచ్చారు. ప్రతీ ఏడాది రబీ నీటి అవసరాలకు సీలేరు నుంచి గోదావరి నదిలోకి నీటిని తీసుకుని రబీ నీటి అవసరాలను సర్దుబాటు చేయడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వం ఈ ఏడాది సీలేరు నుంచి 30 టిఎంసిల నీటిని వినియోగించుకోవడానికి అనుమతిచ్చారు. గోదావరి నదిలో ఏళ్ల తరబడి చేయాల్సిన డ్రెడ్జింగ్ పూడిక తీత పనుల వల్ల నదీ లోతు పెరిగి రబీ సమయానికి కాస్తంత నీటి నిల్వలు బ్యారేజి వద్ద పెరుగుతాయని అంచనా వేసి అందుకు అనుగుణంగా రబీకి సీలేరుపై ఆధారపడకుండానే నీటిని పుష్కలంగా సరఫరా చేసేందుకు అవకాశం కలుగుతుందని భావించారు. కానీ రూ.15.50 కోట్ల అంచనా విలువతో గోదావరి నదిలో చేపట్టిన డ్రెడ్జింగ్ పనులు గత మూడు నెలలుగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పిచ్చుకలంకను ఎత్తు చేసేందుకు సరిపోతోంది. నిర్దేశించిన మేరకు అఖండ గోదావరి నదిలో డ్రిడ్జింగ్‌చేసి వుంటే ఈ మూడు నెలల కాలంలో ఇసుక మేటలు, దిబ్బలు తొలగి పూడికపోయి కాస్తంత లోతు పెరిగి నీటి నిల్వలు పెరిగేందుకు ఆస్కారముండేది. కోట్ల విలువైన పనులు మాత్రం రబీ అవసరాలకు దోహపడే విధంగా కాకుండా గత మూడు నెలల నుంచి టూరిజం ప్రాజెక్టుకే పరిమితమయ్యాయి. దీంతో నీటి నిల్వలు పెరగని స్థితిలో యథావిథిగా ఈ ఏడాది కూడా రబీ అవసరాలకు సీలేరు జలాలను అరువు తెచ్చుకుని రబీని గట్టెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం గోదావరి నదిలో రోజు రోజుకూ నీటి లభ్యత క్షీణించిపోతోంది. కేవలం 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వుంది. ఈ రబీ అవసరాలకు కూడా గోదావరి నదిలో సాగునీటికి కటకట తప్పడం లేదు.
దంత వైద్యశాలకు ‘చెత్తశిక్ష’
రాజమహేంద్రవరం, నవంబర్ 29: అనుమతి లేకుండా ప్రకటనలు ఏర్పాటు చేయడంతో పాటు, నగరపాలక సంస్థ విధించిన అపరాధ రుసుంను సకాలంలో చెల్లించని ఒక దంతవైద్యశాలకు నగరపాలక సంస్థ కమిషనర్ వి విజయరామరాజు వినూత్న శిక్ష విధించారు. స్థానిక దానవాయిపేటలోని కమిషనర్ బంగ్లా పక్కనే ఉన్న పార్థ దంత ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద చెత్త వేయించారు. ఈ వినూత్న శిక్ష నగరంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పార్థ దంత వైద్యశాల నిర్వాహకులు తమ ఆసుపత్రి ప్రకటనకు సంబంధించి నగరంలోని పలుచోట్ల అనుమతి లేకుండా సుమారు 35 స్టిక్కర్లను అతికించారు. వీటిని గమనించిన కమిషనర్, అధికారులు స్టిక్కర్లను తొలగింపజేశారు. అనుమతి లేకుండా స్టిక్కర్లు అతికించినందుకు ఆసుపత్రి యాజమాన్యానికి రూ. 35 వేల జరిమానా విధించారు. జరిమానా సకాలంలో చెల్లించకపోవడంతో ఆగ్రహించిన కమిషనర్ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద చెత్త వేయాలని ఆదేశాలు జారీచేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం ఉదయం ఆసుపత్రి ఎదుట పెద్దఎత్తున చెత్తను పారబోశారు. అయితే కమిషనర్ చర్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆదర్శ విద్యాలయాలుగా కెజిబివిలు
శంఖవరం, నవంబర్ 29: బడి బయట బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలకొల్పిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను బాలికల ఉన్నత విద్యాభ్యాసానికి మార్గదర్శకంగా, ఆదర్శవంతంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి ఎం శేషగిరి అన్నారు. మండల కేంద్రం శంఖవరంలోని కెజిబివిని మంగళవారం పిఓ శేషగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిఓ శేషగిరి మాట్లాడుతూ బాలికలకు ‘మగువా తెలుసుకో’ అనే అంశంపై అవగాహన కల్పిస్తున్నామని, దీని ద్వారా 8, 9, 10వ తరగతి విద్యార్థినులకు బాలికల్లో సంభవించే శారీరక, మానసిక మార్పులు, మంచి పౌష్టికాహారం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టం, బాలికల అక్రమ రవాణా, స్నేహం, ప్రేమ, ఆకర్షణ, ఉన్నత విధ్య, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై మూడు రోజుల శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణకు జిల్లాను కాకినాడ, అమలాపురం, రాజమండ్రి డివిజన్లుగా విభజించి, ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ బృందంలోను సభ్యులు డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికో విద్యనభ్యసిస్తూ శిక్షణ పొందిన విద్యార్థినులు ఉంటారన్నారు. మొదటి విడతగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లోని బాలికలకు పై అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. దీనివల్ల బాలికలు వారి అనుమానాలను నివృత్తి చేసుకోవడం, సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదం చేశాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. తొలుత జిల్లాలో 12 వేల మంది విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నామని, రెండో విడతలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ శిక్షణ ఇస్తామన్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో కెజిబివిల్లో వచ్చే జనవరి నెల నుండి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, పరీక్ష భయం పారద్రోలేందుకు మానసిక వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కెజిబిల్లో నిధుల కొరత లేదని, వౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ నిధులతోపాటు, దాతల సహకారంతో మరిన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం తరగతి గదులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూపై వివరాలు అడిగారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ నాగయ్య, కెజిబివి ప్రత్యేకాధికారి లలితకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాకినాడ నుండి వారణాసికి ప్రత్యేక రైలు
కాకినాడ సిటీ, నవంబర్ 29: కాకినాడ నగరం నుండి పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాల్సి ఉందని కాకినాడ ఎంపి, రైల్వేబోర్డు సభ్యుడు తోట నరసింహం అభిప్రాయపడ్డారు. వారణాసికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలనే విషయమై ఢిల్లీలో మంగళవారం రైల్వే బోర్డు చైర్మన్ మిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలో రైల్వే సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. కాశీ విశే్వశ్వరుని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలను సాగిస్తున్నారన్నారు. అయితే జిల్లా నుండి వారణాసికి ప్రత్యేకంగా రైలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని మిట్టల్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. నూతనంగా రైలును ఏర్పాటుచేస్తే భక్తులు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే వారానికి ఒకసారైన ప్రత్యేక రైలును నిర్వహించాలని కోరినట్టు ఎంపి చెప్పారు. సామర్లకోట రైల్వేస్టేషన్ కేంద్రంగా నిత్యం అనేక మంది వ్యాపారులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, స్టేషన్‌లో ఎస్కలేటర్, విఐపి ఎసి గదులు, ఇతర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని ఎంపి చెప్పారు. విశాఖ-ముంబైల మధ్య నడిచే లోకమాన్య ఎక్స్‌ప్రెస్‌కు సామర్లకోటలో హాల్ట్ కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం రైల్వేస్టేషన్‌లో జన్మభూమి, రత్నాచల్ రైళ్ళకు హాల్ట్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమస్యలను కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని ఎంపి నరసింహం తెలియజేశారు.
ఆర్టీసీలో త్వరలో హైటిమ్ మిషన్లు
రాజమహేంద్రవరం, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చిల్లర కొరత నేపథ్యంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్టీసీలో త్వరలో హైటిమ్ మిషన్లు ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సిహెచ్ రవికుమార్ వెల్లడించారు. ఈవిధానంలో ప్రయాణీకులు నగదు లేకుండా కార్డుల ద్వారా టిక్కెట్లు పొందవచ్చన్నారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన స్వైపింగ్ యంత్రాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్‌ఎం రవికుమార్ మాట్లాడుతూ హైటిమ్ మిషన్ల ద్వారా రూ.5 నుంచి ఆపై ఎంతవరకైనా నగదురహితంగా టిక్కెట్లు పొందవచ్చన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, రిజర్వేషన్, ఇతర కౌంటర్లలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.70కి పైబడిన టిక్కెట్లను స్వైపింగ్ యంత్రం ద్వారా జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ స్వైపింగ్ యంత్రాల ఏర్పాటుతో ప్రజలకు చిల్లర కష్టాలు తీరతాయన్నారు. స్వైపింగ్ యంత్రాలు, నగదురహిత లావాదేవీలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, డిప్యుటీ సిటిఎం ఆర్‌విఎస్ నాగేశ్వరరావు, డిప్యుటీ సిఇఎం విజయ్‌కుమార్, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కారు బోల్తా : అయిదుగురికి గాయాలు
శంఖవరం, నవంబర్ 29: కత్తిపూడి శివారులో కారు బోల్తా పడిన ప్రమాదంలో అయిదుగురు యువకులు గాయపడ్డారు. వివరాల ప్రకారం కత్తిపూడి శివారు కాకినాడ రోడ్డులో యానాం నుండి విశాఖపట్నంకు కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. కారు కత్తిపూడి శివారుకు చేరుకునే సరికి గేదెలు అడ్డుగా వచ్చాయి. అకస్మికంగా బ్రేకులు వేయడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పంట పొలాల్లోకి పల్టీకొట్టింది. గాయపడిన యువకులకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు.

సత్యదేవుని హుండీ ఆదాయం రూ. కోటిపైనే
శంఖవరం, నవంబర్ 29: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్ధానంపై కార్తీకమాసంలో 14 రోజులకుగానూ రూ.1,01,74,837లు హుండీల ద్వారా సమకూరినట్లు దేవస్ధానం అధికారులు వెల్లడించారు. రత్నగిరిపై స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో దేవస్ధానం ఇఓ కాకర్ల నాగేశ్వరరావు, ఛైర్మన్ ఐవి రోహిత్‌ల పర్యవేక్షణలో హుండీలను సిబ్బంది, పురోహితులు లెక్కించారు. హుండీల ద్వారా స్వామివారికి నగదు రూపంలో రూ.95,85,137, నాణేల రూపంలో రూ.5,89,700 మొత్తం రూ.1,01,74,837లు లభించినట్లు దేవస్ధానం అధికారులు వెల్లడించారు. అలాగే 750 గ్రాముల వెండి లభించింది. నగదులో యుఎస్‌ఎకు చెందిన 142 డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 10 దినార్లు, ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్ 2 రియాల్స్, సింగపూర్‌కు చెందిన 2 డాలర్లు, మలేషియాకు చెందిన 2రీమ్‌లు, సౌది అరేబియాకు చెందిన 2 రియాల్, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా వెయ్యి లభించినట్లు అధికారులు తెలిపారు.

చిల్లర కష్టాలు...!
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు చిల్లర కష్టాలు తప్పడంలేదు. దీంతో అమ్మకాలు లేక వ్యాపారులు నష్టపోతున్నారు. కొత్తగా విడుదల చేసిన రెండువేల రూపాయల నోటు ప్రజలకు ఉపయోగపడకపోగా కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వంద, యాభై రూపాయల వస్తువులకు రెండువేల నోటు ఇస్తుండటంతో వ్యాపారులు వస్తువులను అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బ్యాంకులను ఆశ్రయిస్తే వారు వందలు, యాభై రూపాయలు ఇవ్వడంలేదని, పదివేల రూపాయల విలువైన పది రూపాయల నాణేల మూటను ఇస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమలాపురంలో ఒక బ్యాంకు నుండి తీసుకున్న పది రూపాయల కాయిన్‌ల మూటను ముగ్గురు వ్యాపారులు పంచుకున్నారు.