తూర్పుగోదావరి

కృష్ణా పుష్కరాలకు రూ 150 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఏప్రిల్ 29: కృష్ణా పుష్కరాలకు దేవాదాయ శాఖ తరపున రూ.150 కోట్లు కేటాయించామని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం రావులపాలెంలోని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పైడికొండల మాట్లాడారు. ఈ నిధులతో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని అయిదొందల పైచిలుకు దేవాలయాల పునరుద్ధరణ, అభివృద్ధి చేపడతామన్నారు. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ ఆలయం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాతో అందుకు తగ్గట్టు మాస్టర్ ప్లాన్ రూపొందించి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కనకదుర్గ ఆలయానికి రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే కొండపైన భక్తుల రద్దీకి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రోజుకు లక్ష మందికి తగ్గకుండా యాత్రీకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మహా మండపానికి వెళ్లే అర్జున వీధి వెడల్పుచేసే పనులు చేపడుతున్నామన్నారు. నిపుణులతో చర్చించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. అలాగే ప్రస్తుత వేసవిలో రాష్ట్ర ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వివిధ నీటి పథకాలన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. నీరందని ప్రాంతాలకు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని సిఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. మధ్యాహ్నం 12నుండి 4గంటల వరకూ ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని ఆయన సూచించారు. డెల్టా ఆధునికీకరణ పనులు, కాలువల తవ్వకాలు, నిర్మాణం ఆలస్యమవుతున్నందున పాత టెండర్లు రద్దుచేసి ఈ ఏడాదిలో పనులు పూర్తిచేయాలని దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తమలంపూడి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ చిన్నం సత్యనారాయణరెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కర్రి సుబ్బారెడ్డి, జె తాతారావు, ఎంవి కృష్ణారెడ్డి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

ఏటిగట్లపై కానరాని లస్కర్లు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29: గోదావరి జిల్లాల్లో సాగునీటి రంగానికి కీలకమైన లస్కర్ల వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో కీలకమైన లస్కర్లు ప్రస్తుతం కానరావడంలేదు. సాగునీటి సరఫరాలో ఇబ్బందులు, లోటును అధిగమించడానికి లస్కర్లు కీలకంగా నిలిచేవారు. డెల్టాలో సాగునీటి సరఫరా వ్యవస్థ గుండె వంటిది. గుండెకు ధమనులు, సిరలు ఎలాంటివో..డెల్టా సాగునీటి వ్యవస్థలో డ్రెయిన్లు, కాలువలు అంత కీలకం. వీటి నిర్వహణా బాధ్యతలను నిర్వహించే లస్కర్ల వ్యవస్థ కూడా అంతే కీలకం. సాగునీటి రంగంలో ఈ లస్కర్లే క్షేత్రస్థాయి ఉద్యోగులు. సాగునీటి కాలువల లాకులు, ఏటిగట్లు, డ్రెయిన్లపై పహారా కాస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా నిర్వహించడం, సాగునీరు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించడం వంటి బాధ్యతలను వీరు నిర్వర్తిస్తారు. కాటన్ మహాశయుడు రూపొందించిన ఇరిగేషన్ వ్యవస్థలో ఇదో కీలకమైన సెటప్. గోదావరి నదిలో నీటి లభ్యత తగ్గిపోయి సాగునీటికి ఇబ్బంది పడుతున్నప్పుడు వీరి పాత్ర చాలా కీలకం. ఒక విధంగా చెప్పాలంటే ఇరిగేషన్ పోలీసింగ్. ప్రస్తుతం డెల్టా ఏటిగట్లపై లస్కర్లు కనిపించడం లేదు. ఫలితంగా సాగునీటి సరఫరాలో పర్యవేక్షణాలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏ లాకు కింద ఎంత నీరు వదిలితే ఎంత ఆయకట్టుకు ఉపయుక్తంగా ఉంటుంది తదితర అంశాలన్నీ ఈ లస్కర్లకు కొట్టినపిండి. వీరే డెల్టా రైతుకు నేస్తాలని చెప్పవచ్చు. గోదావరిలో నీటి లభ్యత తగ్గిపోతున్న తరుణంలో నీటి యాజమాన్యం మరింత కీలకంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితులు దాపురించాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సాగునీటి వ్యవస్థలో మొత్తం 1600మంది లస్కర్లు ఉండే విధంగా కాటన్ రూపకల్పన చేశారు. ఈ విధానానికి కాల దోషం పట్టింది. ఒక లాకు వద్ద ముగ్గురు చొప్పున లస్కర్లు ఉండాలి. కానీ..ఇప్పుడు అక్కడక్కడా లాకు వద్ద ఒక్కొక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. వాస్తవానికి 8 కిలోమీటర్లకు ఒక లస్కర్ ఉండాలనేది నిబంధన. అటువంటిది సుమారు 50 కిలోమీటర్ల వరకూ కూడా ఒక లస్కర్ కూడా కనిపించని పరిస్థితి దాపురించింది. నైట్ వాచ్‌మెన్లను, ఆఖరికి మహిళలను కూడా లస్కర్లుగా కొన్ని కీలకమైన లాకుల వద్ద పహారా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇంత కీలకమైన వ్యవస్థ పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లస్కర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించాలని ఇరిగేషన్ ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నీటి ఎద్దడిని నివారించాలంటే లస్కర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని, అవసరమైన లస్కర్లను తక్షణం భర్తీచేయవలసి ఉందని ఉద్యోగుల సంఘ సీనియర్ నేత టిఎస్ ప్రకాష్ డిమాండు చేస్తున్నారు. అవసరమైన లస్కర్లను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. కనీసం తాత్కాలిక పద్ధతిలోనైనా భర్తీచేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. నిర్ధేశిత స్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలోనైనా అత్యవసరంగా లస్కర్లను నియమించుకోవలసి ఉందని ఇరిగేషన్ ఉన్నతాధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం
-కలెక్టర్ అరుణ్‌కుమార్
అడ్డతీగల, ఏప్రిల్ 29: గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రతి మహిళ ఆర్థికంగా పురోభివృద్ధి సాధించి ప్రగతిపథం వైపు నడిచేలా పథకం రూపొందిస్తున్నట్టు కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. అడ్డతీగలలో శుక్రవారం స్థానిక మండల మహిళా సమాఖ్య భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన డ్వాక్రా బజారును కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఇందులో డ్వాక్రా మహిళలు స్వయం సంమృద్ధితో తయారుచేసిన పలు రకాల అలంకరణ సామాగ్రితో పాటు వస్తువులను తక్కువ ధరలకు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలలో ప్రతి మహిళా డ్వాక్రా సంఘాలలో భాగస్వామ్యంగా ఉండి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఈసందర్భంగా మండలంలో పలు సమస్యలను జడ్పీటీసీ ఆడారి కృష్ణవేణి, ఎంపిపి అన్నం సత్తిబాబు, పలువురు ఎంపిటిసిలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని పిఒ చక్రధర్‌బాబు, సబ్‌కలెక్టర్ పి రవిని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటరులో శిక్షణ పొందుతున్న గిరిజన యువతతో కలెక్టర్ భేటీ అయ్యారు. కార్యక్రమంలో ఎపిడి మణికుమార్, దొర, ఎంపిడిఒ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి ఎమ్మార్వో సిహెచ్ పద్మావతి, ఎపిఒ రాజబాబు, ఎపిఎం నీలి సూరిబాబు పాల్గొన్నారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి
అడ్డతీగల, ఏప్రిల్ 29: మండలంలోని రాయపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం వడదెబ్బతో నర్సి సన్యాసిరావు(55) మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. జీడిమామిడి తోటలో పని ముగించుకుని ఇంటికి చేరుకున్న సన్యాసిరావు తీవ్ర అస్వస్థతతకు గురై మరణించినట్లు పేర్కొన్నారు.
పప్పు ధాన్యాల అక్రమ నిల్వలు స్వాధీనం
మండపేట, ఏప్రిల్ 29: పప్పు ధాన్యాలు ఆశాన్నంటుతున్న నేపథ్యంలో రెవెన్యూశాఖ, పౌరసరఫరాల శాఖలు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. గొల్లపుంతలోని గంగుమళ్ల రామచంద్రమూర్తి వద్ద ఉన్న నిల్వలు రూ.89వేలు పప్పు్ధన్యాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాళంవారి వీధిలోని కొండవీర నాగప్రసాద్‌కు చెందిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర కిరాణా దుకాణంపై దాడి చేసి అక్రమంగా నిల్వవుంచిన కందిపప్పు, మినపప్పు, వేరుసెనగపప్పు 24.3 క్వింటాళ్లు సీజ్ చేశారు. వీటి విలువ రూ.2.4 లక్షలు ఉంటుందని తహసీల్దారు ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. వీరిపై 6ఎ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో ఎమ్‌ఎస్‌వోలు గాంధీ, బాలకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భారీ అగ్ని ప్రమాదం
కాకినాడ, ఏప్రిల్ 29: జిల్లా కేంద్రం కాకినాడ సమీపంలోని పర్లోవపేట గ్రామ శివారు జ్యోతీరావుపూలే కాలనీలో శుక్రవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో వందకు పైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు కోటిన్నర రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాలనీలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ పూరి గుడిసె నుండి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో అన్ని గుడిసెలకు మంటలు వ్యాపించాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎండలు మండుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడం, ఈదురుగాలులు తోడు కావడంతో మంటలు క్షణాల్లో దావానలంలా వ్యాపించాయి. కాలనీవాసులంతా కూలి పనులపై ఆధారపడిన వారే. వారంతా కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం వాటిల్లింది. దీంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. పూరి గుడిసెల్లోని వంట పాత్రలు, ఆహార పదార్ధాలు, వస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా అగ్నిమాపక శాఖాధికారి ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం పట్టణాలకు చెందిన అగ్ని మాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. అప్పటికే గుడిసెలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారులు విచారిస్తున్నారు. కాలనీ వాసులు కూలి పని కోసం ఇళ్ల నుండి వెళ్ళడంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు.
పరిశీలించిన డిప్యూటీ సిఎం
అగ్ని ప్రమాద స్థలిని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన అందరికీ అర్బన్ హౌసింగ్ స్కీంలో పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5 లీటర్ల వంతున కిరోసిన్ పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ ఆర్డీవో డేవిడ్‌రాజు, కాకినాడ అర్బన్ తహశీల్దారు బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

పశుసంవర్ధక శాఖ డివిజన్ ఏర్పాటు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29: రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పశు సంవర్థక శాఖ కొత్త డివిజన్ ఏర్పాటైంది. పరిపాలనా పరంగా మొట్టమొదటి సారిగా ఈ శాఖలోనే డివిజన్ ఏర్పాటైంది. జిల్లాలో పశు సంవర్థక శాఖలో ఇప్పటి వరకూ కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం డివిజన్లు మాత్రమే ఉన్నాయి. విభజన అనంతరం ముంపు మండలాలైన కూనవరం, నెల్లిపాక, విఆర్ పురం, చింతూరు మండలాలు రాజమహేంద్రవరం డివిజన్లో కలిశాయి. పని భారం, దూరం కావడంతో పరిపాలనాపరంగా తీవ్ర ఇబ్బంది ఎదురైన పరిస్థితి. విలీన మండలాలతో కలిసి మొత్తం రాజమహేంద్రవరం డివిజన్లో 26 మండలాల పరిధి కావడంతో పని భారం పెరిగింది. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం రంపచోడవరం డివిజన్‌ను రూపొందించారు. దీంతో ముంపు మండలాలు నాలుగింటితోపాటు రంపచోడవరం డివిజన్లోని ఏడు మండలాలను కలిపి మొత్తం 11 మండలాలతో రంపచోడవరం పశు సంవర్థక శాఖ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. ఈ డివిజన్‌కు ఒక ఎడి, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు అటెండర్లు, ఒక సూపర్‌వైజర్ కేటాయింపుతో ఆవిర్భివించింది. మే 1నుండి ఈ డివిజన్ నుండి సేవలందజేస్తారు. నేడు (శనివారం) పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ గాబ్రియేల్ రంపచోడవరంలో లాంఛనంగా డివిజన్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోనే పశు సంవర్థక శాఖకు కొత్త డివిజన్ ఏర్పాటయినట్లయింది.
నేడు ప్రపంచ పశువైద్య దినోత్సవం
ప్రపంచ పశు వైద్య దినోత్సవ రాష్టస్థ్రాయి వేడుకకు రాజమహేంద్రవరం వేదికైంది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో చివరి శనివారం నిర్వహించే ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ఈసారి రాజమహేంద్రవరంలో నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లాలోని పశు సంవర్థక శాఖ వైద్యులు ఈ కార్యక్రమాన్ని శనివారం వివి గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్ర పశు సంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.93 లక్షలు
శంఖవరం, ఏప్రిల్ 29: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.93,01,588లు ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణమండపంలో ఇఒ కాకర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కించారు. హుండీల్లో స్వామి వారికి 103 గ్రాముల బంగారం, 445 గ్రాముల వెండితోపాటు, యుఎస్‌ఎ 298 డాలర్లు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 20 దినార్లు, ఖత్తర్ సెంట్రల్ బ్యాంకు 36 రియాళ్ళు, సింగపూర్ 2 డాలర్లు, మలేషియా 1 రీమ్, సెంట్రల్ బ్యాంకు ఒమెన్ 500 బైరాలు, కెనడా 30 డాలర్లు లభించాయి. నోట్ల రూపంలో స్వామి వారికి రూ.88,61,208లు, నాణేల రూపంలో రూ.4,40,380లు ఆదాయం లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. హుండీల లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.