తూర్పుగోదావరి

త్వరలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 2: కాకినాడ నగర పాలక సంస్థకు అతి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు జిల్లా కలెక్టర్, కాకినాడ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. ఎన్నికలకు ముందుగా ‘కోడ్’ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) జారీ అయ్యే అవకాశం ఉందని, ఈలోగా ప్రగతి సాధించేందుకు అధికారులు రేయింబవళ్ళు శ్రమించాలని సూచించారు. కాకినాడ నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన అన్ని కార్యక్రమాల్లో కోడ్ విడుదల లోగా కనీస స్థాయిలో ప్రగతి చూపించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కార్పొరేషన్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఒకటి, రెండు మాసాలు అభివృద్ధి పనులకు విఘాతం కలిగే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈనెలాఖరుకు కాకినాడ నగరాన్ని బహిరంగ మల విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. నగరాన్ని ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ (బహిరంగ మల విసర్జన లేని) నగరంగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇందుకు వీలుగా నగరంలో గుర్తించిన 15 ఓపెన్ సైట్లలో బహిరంగ మల విసర్జనను పూర్తిగా నియంత్రించేందుకు గాను వ్యక్తిగత మరుగుదొడ్లను పెద్ద ఎత్తున నిర్మించాలని ఆదేశించారు. ప్రజల్లో దీనిపై తగిన అవగాహన కలుగజేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డ్రైన్లలో ఈనెలాఖరులోగా పూడికను పూర్తి స్థాయిలో తీసి, వచ్చే వర్షాకాలానికి పల్లపు ప్రాంతాలు మునిగిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో అవసరమైన అందరికీ తక్షణం మంచినీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ అలీం బాషా మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం సుమారు 66వేల గృహాలు ఉండగా వీటిలో 33వేల గృహాలకు కుళాయిలున్నట్టు చెప్పారు. నెలకు కనీసం 2వేల కుళాయి కనెక్షన్ల మంజూరు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. డివిజన్ల వారీ అవగాహన సదస్సులు నిర్వహించి, మంచినీటి కనెక్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మంజూరు చేస్తామని బాషా పేర్కొన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెల్వరాజ్, కాకినాడ ఆర్‌డిఒ డేవిడ్‌రాజు, నగర పాలక సంస్థ ఎస్‌ఇ నవరోహిణి తదితరులు పాల్గొన్నారు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
*రోడ్డున పడ్డ 37 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు
* అపవాదులు మూటగట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
*చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న బాధితులు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మే 2:వారంతా చిరుద్యోగులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ తొమ్మిదేళ్లుగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరుపై నిఘా పెట్టి 75శాతం పనిదినాలు పూర్తిచేసిన వారిని మాత్రమే విధుల్లో ఉంచాలని, మిగిలిన వారిని తొలగించాలని జీవో జారీ చేసారు. ఆ మేరకు జిల్లాలో సుమారు 394 ఫీల్ఢ్ అసిస్టెంట్లకు 75 శాతం పనిదినాలు లేవన్న కారణంతో వారిని విధుల నుండి తొలగించారు. అనంతరం వారంతా కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశాలమేరకు ఆర్డీవో, ఎంపిడిఒ, ఇడి ఎస్సీ కార్పొరేషన్‌తో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్లను స్వయంగా విచారించి ఏకారణం చేత 75 శాతం పని దినాలు కల్పించలేకపోయారో తెలుసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీంతో అయా ఎమ్మెల్యేల సిపార్సుల మేరకు జిల్లాలోని 18 నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే ఒక్క ముమ్మిడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన 37 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారంతా స్థానికంగా ఉన్న నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, తమ ఉద్యోగాలు తమకు ఇప్పిస్తే బుద్ధిగా ఉంటామని వేడుకుంటున్నా వారి మనస్సు కరగడంలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు వౌఖిక ఆదేశాలు లేనిదే తామేమీ చేయలేమని అధికారులు చెపుతున్నట్లు సమాచారం. ఇంతకీ ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన ఫీల్డ్ అసిసెంట్లు చేసిన పాపం ఏమిటంటే కొంత మంది ఫీల్డ్ అసిసెంట్లు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పనిచేసారన్నది తెలుగుతమ్ముళ్ల అంతర్గత ఆరోపణ. ఇదే విషయాన్ని గతంలో జరిగిన నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశాల్లో మండల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఫీల్ఢ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుని తమను ఎందుకు తీసుకోవడంలేదని ముమ్మిడివరంకు నియోజకవర్గంకు చెందిన పలువురు ఫీల్డ్ అసిసెంట్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాలను చేజార్చుకున్నామని, అర్థాంతరంగా తమను విధుల నుండి తొలగిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమికావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకపోతే కుటుంబాలతో ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఫీల్ఢ్ అసిస్టెంట్లు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అమలాపురం క్లష్టర్ ఎపిడి సోమేశ్వరరావును వివరణ కోరగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలాల్లోని 26 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 75 శాతం పనిదినాలను పూర్తి చేయని కారణంగా వారిని విధుల నుండి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. తాళ్లరేవు మండలంలో 11 మంది కాకినాడ డివిజన్ పరిధిలోకి వస్తారని, ఆమండలానికి సంబందించిన సమాచారం తన వద్ధలేదన్నారు.
నిప్పుల కొలిమి
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మే 2: భానుడి ప్రతాపంతో కోనసీమలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల దాటితే అత్యవసర పనులపై మినహా మిగిలిన వారెవ్వరూ రోడ్లపై కనిపించడంలేదు. దీంతో కోనసీమలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కోనసీమంటేనే చల్లదనానికి మారుపేరు. ఈ ప్రాంతంలో పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, పచ్చని పంట పొలాలతో ఎల్లప్పుడూ పచ్చగా ఉండటమే కాకుండా చల్లని వాతావరణంతో ఆహ్లాదంగా ఉండేది. ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం వేసవి వచ్చిందంటే పిల్లా పాపలతో స్వగ్రామాలు చేరుకుని ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించేవారు. ఇక్కడ కొబ్బరి తోటలు, మామిడి తోటల్లో ఆటపాటలతో గడిపేవారు. అది ఒకప్పుటి మాట. ప్రస్తుతం కోనసీమ పరిస్థితి దానికి పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. కొంతమంది స్వార్ధపరుల ధనదాహానికి సిరులు పండే వరిచేలు అక్వా చరువులుగాను, కోనసీమ కల్పవృక్షాలుగా పిలువబడే కొబ్బరి తోటలు రియల్ ఎస్టేట్లుగా మారిపోతున్నాయి. వేల ఎకరాల్లో కొబ్బరి తోటలను విచక్షణా రహితంగా నరికేసి చెరువులు, ఇళ్ల స్థలాలుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వృక్షాల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని పర్యావరణవేత్తలు చెపుతున్నారు. పదేళ్ల క్రితం 35 డిగ్రీల సెంటిగ్రేడుకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, ప్రస్తుతం 40-42 డిగ్రీలకు చేరుకోవడం భవిష్యత్‌లో ఏపరిణామాలకు దారితీస్తుందోనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. రానున్న కాలంలో ఈ ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెపుతున్నారు. రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మానవతప్పిదాలే కారణమంటున్నారు.
మండపేట: భానుడు ఉగ్రరూపానికి ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నిప్పుల కొలిమిలో ఉన్నట్లు ఉంటోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకోలేని జనం తల్లడిల్లిపోతున్నారు. దాహార్తి తీర్చుకోవడానికి జనం పరుగులు తీస్తున్నారు. ఇంటి నుండి ఎవరూ బయటకు రావడం లేదు. ఉదయం 10గంటల నుండే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఆర్టీసీ బస్టాండు తదితర ప్రధాన జంక్షన్లన్నీ నిర్మానుష్యంగా అగుపిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రయాణికులు, బాటసారులు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకుని సేదతీరుతున్నారు.
ప్రజలకు దూరమైన టిడిపి
వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ రూరల్, మే 2: తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లోని విఫలమై ప్రజలకు దూరమవ్వడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని వైఎస్‌ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. నీటికరవు తదితర అంశాలపై రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసిపి నాయకులు, మహిళా కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని,ప్రజలకు గుక్కెడు నీరిచ్చే దుస్థితి లేదని ప్రజలు వలసపోతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమ కార్యకర్తలను సొమ్ము చేసుకునే విధంగా నీరు-చెట్టు పధకంలో చెరువులను ఎండగట్టి మట్టి అమ్ముకునే చర్యలను ప్రోత్సహించడం ద్వారా కరువుపై ముసలి కన్నీరు కార్చుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంకుడు గుంటలు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మొదటి నుండి చంద్రబాబుకు గుంటలు తీయడం అలవాటేనని వ్యంగ్యంగా అన్నారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్ శాస్ర్తీకి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అత్తిలి సీతారామస్వామి, రావూరి వెంకటేశ్వరరావు, ఎన్ రామకృష్ణ, సూరిబాబు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తేడావస్తే తోకలు కత్తిరిస్తా!
కార్యకర్తల సమావేశంలో నిప్పులు చెరిగిన గోరంట్ల
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మే 2: ఒకరిద్దరు కార్పోరేటర్లు తేడాలు చేస్తున్నారని, అటువంటి వారి తోకలు కోస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి హెచ్చరించారు. పార్టీకి ఎవరు నష్టం కల్గించినా ఉపేక్షించబోనన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రియాంక గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిటీల నియామకాల్లో ఇద్దరు కార్పోరేటర్లు తేడాగా వ్యవహరించారని, అటువంటివారు పద్ధతి మార్చుకోబోతే పార్టీలో దిక్కులేకుండా చేస్తానన్నారు. తాను కళ్లు తెరిస్తే వారు నిలబడలేరంటూ నిప్పులు చెరిగారు. తనముందు కుప్పిగంతులు వేయవద్దని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకుంటే వార్డు నుండి పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించేందుకు మేయర్, డిప్యూటీ మేయర్లు దృష్టిసారించాలన్నారు. వార్డుల సమావేశాలు నిర్వహించాలని దిశనిర్దేశం చేశారు. పార్టీకి కష్టపడిన కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వారి రుణం తీర్చుకుంటానన్నారు. కార్యకర్తలకు కష్టం వస్తే తాను సొంతంగా సహాయం చేస్తున్నానన్నారు. తాను వందలమందికి చేస్తే నాయకులు పదుల సంఖ్యలోనైనా చేయాలన్నారు. రాజమహేంద్రవరం నగరానికి 4,500 గృహాలు మంజూరయ్యాయని, నగరంలో భూమి లేనందున గ్రామీణ ప్రాంతంలో ఇవ్వవలసి ఉంటుందన్నారు. బిజెపి నేతలు ఆకాశమే హద్దుగా చూపించడంతో 30వేల దరఖాస్తులు వచ్చాయని, భూమి సేకరించిన ప్రాంతం వారికి, పునరావాసం కింద ఇవ్వవలసిన వారికి పోను 2,200 ఇళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఇలా చూస్తే వార్డుకు 40కు మించి రావన్నారు. అయినప్పటికీ తాను రూరల్‌లో నగరంవారికి 60 ఎకరాలు సేకరించే పనిలో ఉన్నానన్నారు. వార్డుకు 20 చొప్పున అర్హత కల్గిన పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఇస్తానన్నారు. లాలాచెరువు వాంబే గృహాల్లో ఇళ్ల కేటాయింపు అధికారుల ప్రమేయం లేకుండా ఇష్టారాజ్యంగా చేయడం వల్ల రోడ్డుపై యుద్ధాలు జరిగే పరిస్థితి వచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతి సోమవారం నగరంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తన నివాస గృహంలో కలిసి కష్టం సుఖం తెలపవచ్చునన్నారు. కార్యకర్తల పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా సహాయం చేస్తానన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రాని వ్యాధులెవరికైనా సోకితే సిఎం సహాయ నిధి నుండి సహాయం అందేటట్లు చేస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలను రక్షించుకోవాలన్నారు. వారికి రుణపడి ఉంటానన్నారు. సమావేశంలో ఎంపి మాగంటి మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, కురగంటి సతీష్, కార్పోరేటర్లు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఇటీవల మృతిచెందిన పార్టీ సీనియర్ కార్యకర్తకు సంతాపం తెలిపారు.
మద్దతుధరకే ధాన్యం కొనుగోలు చేయాలి: జెసి
కాకినాడ సిటీ, మే 2: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి బొండాలు రకం ధాన్యాన్ని కనీస మద్దత్తు ధరకే కొనుగోలు చేయాలని ఎన్‌ఫోర్స్ అధికారులను జెసి ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా బొండాలు రకం ధాన్యం ఎంపియు-3626 రకాన్ని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు వస్తుందన్న సమాచారం మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రైసుమిల్లర్లను కోరారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కోర్టుహాలులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ, వ్యవసాయశాఖ, ఎఫ్‌సిఐ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ గోనె సంచుల వల్ల వచ్చే సాంకేతిక సమస్యలను తొలగించడానికి ఎఫ్‌సిఐ అధికారులు బియ్యాన్ని త్వరగా తీసుకువెళ్లడానికి తగిన ఆదేశాలను జారీచేసినట్లు తెలిపారు. టిప్‌డ్యామేజ్ మూలంగా కొంత శాతం బియ్యానికి నష్టం జరిగే అవకాశం ఉన్నందున వ్యవసాయ, పౌరసరఫరాలు, భారత ఆహారసంస్థ ల్యాబ్‌ల ద్వారా పరిశీలించాలని సూచించారు. కస్టోడియన్ అధికారులు క్షేత్రస్థాయిలో పిపిసి సెంటర్ల వద్ద ఉండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు పంపాలని ఆయన ఆదేశించారు. రైసు మిల్లర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన ధాన్యాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని మిల్లింగ్ చేసేసమయంలో వచ్చే సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మిల్లర్లు సహకరించాలని జెసి సత్యనారాయణ కోరారు. ఈసమావేశంలో డిఎస్‌ఒ ఉమామహేశ్వరరావు, డిఎం కృష్ణారావు, ఎఫ్‌సిఐ ఏరియా మేనేజర్ వి బాషా, వ్యవసాయశాఖ డిడి లక్షణరావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పళ్ల దుకాణాలపై పోలీసుల దాడులు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం,మే 2: పళ్లను మాగపెట్టేందుకు కార్బైడ్‌ను ఉపయోగిస్తున్నారన్న అనుమానాలతో అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య అధ్వర్యంలో సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ సోమవారం పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను ఉపయోగించి పళ్లను మాగ పెట్టినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ వ్యాపారులను హెచ్చరించారు.
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
పిఠాపురం, మే 2: పిఠాపురం మండలం లక్ష్మినరసాపురంకి చెందిన సోనాపూడి దుర్గారావు(63) సంవత్సరాల ఉపాధి కూలీ వడదెబ్బకు కుప్పకూలి మృతి చెందాడు. పిఠాపురం రూరల్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం దుర్గారావు ఉపాధి పనికి వెళ్ళి వస్తుండగా మార్గమధ్యంలో కుప్పకూలి సంఘటన స్థలంలో మృతి చెందాడని ఎస్సై సింహాచలం తెలిపారు.
అల్లవరం: తీవ్రంగా వీస్తున్న వడగాల్పుల వల్ల అల్లవరం మండలం బోడసకుర్రులో కుడుపూడి సత్యనారాయణ (68) అనే వ్యక్తి మృతి చెందాడు. పి గన్నవరంకు మోటారు సైకిల్‌పై వెళ్లి వచ్చి సత్యనారాయణ అపస్మారక స్థితికి లోనయ్యాడు. స్థానిక వైద్యులు సత్యనారాయణ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు స్థానిక తహీసీల్దార్ పాము సుబ్బారావుకు సమాచారం తెలపగా సోమవారం ఉదయం తహసీల్దార్ బోడసకుర్రు వచ్చి సత్యనారాయణ మృతి సంఘటనపై విచారణ నిర్వహించారు.
అడ్డతీగల: మండలంలో కిమ్మూరు గ్రామానికి చెందిన వీరంరెడ్డి నాగేశ్వరావు (65) సోమవారం వడగాడ్పులకు మృతిచెందాడు. నాగేశ్వరావు వ్యవసాయకూలీగా పని చేస్తున్నాడు. సోమవారం పనికి వెళ్లిన నాగేశ్వరరావుఇంటికి వచ్చి పడిపోయి అపస్మారకస్థితికి చేరుకొని మరణించాడని కుటుంబీకులు తెలిపారు.
రాజవొమ్మంగి: మండలం జడ్డంగికి చెందిన బారంగి భీమరాజు (65) వ్యవసాయ కూలి వడదెబ్బకు గురై సోమవారం మృతిచెందాడు. భీమరాజు సోమవారం వీచిన వడగాడ్పులకు తీవ్ర అస్వస్థతకు గురై శ్వాస పీల్చుకోలేక ఇబ్బందులు పడుతూ ఇంటి వద్దే మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు.
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామానికి చెందిన చుట్టుగుళ్ల నాగేశ్వరరావు (70) అనే వ్యక్తి వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు ఆ గ్రామ సర్పంచ్ బొరుసు సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈ మేరకు సమాచారాన్ని తహసీల్దార్, వైద్యాధికారి, ఎస్‌ఐలకు అందించడం జరిగిందన్నారు. అదే విధంగా లక్కవరంకు చెందిన యండ్ర శ్రీను (45) అనే వ్యక్తి వడగాల్పులకు కారణంగా మృతి చెందాడు. ఆర్‌ఐ, విఆర్‌ఓ, ఎఎస్‌ఐలు మృతిని వివరాలు నమోదు చేసారు.
సరుకులు సకాలంలో ఇవ్వని చౌకధరల డీలర్లపై చర్యలు:జెసి
కాకినాడ సిటీ, మే 2: చౌకధర దుకాణాల డీలర్లు సరుకులను కార్డుదారులకు సకాలంలో ఇవ్వకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని జెసి ఎస్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాలులో సోమవారం చౌకధర ధుకాణాల పంపిణీ విధానంపై ఏఎస్‌ఒలు, ఎంఎస్‌ఒలతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి సత్యనారాయణ మాట్లాడుతూ ఇ-పోస్ రిపోర్టు పరిశీలించిన మీదట అమలాపురంలో 119షాపులు, కాకినాడలో 75షాలులు, పెద్దాపురంలో 88షాపులు, రామచంద్రపురంలో 58షాపులు, రాజమహేంద్రవరంలో 56షాపుల్లో మూడు నుండి 10కి తక్కువ కార్డులకు పంపిణీ జరిగిందన్నారు. వినియోగదారులకు అందవలసిన నిత్యావసర సరుకులు సకాలంలో అందించని డీలర్లు, సూపర్ వైజరీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రతీ చౌకదర దుకాణం ప్రతీరోజు ఉదయం 7గంటల నుండి 11గంటలు వరకు, తిరిగి సాయంత్రం 4గంటలు నుండి రాత్రి 8గంటల వరకు తప్పనిసరిగా తెరచి ఉంచాలన్నారు. మీ ఇంటికి మీరేషన్ పధకం ద్వారా నడవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇంటి వద్దరేషన్ పంపిణీ చేయాలని ఆయన సూచించారు.
జిల్లాలో సుమారు 70వేల మందికి ఈవిధంగా రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్ షాపుల వద్ద మంచినీటిని పంపిణీ చేయాలన్నారు. ఈసమావేశంలో డిఆర్‌ఒ బి యాదిగిరి, ఏఎస్‌ఒ పి సురేష్, ఎంఎస్‌ఒలు తదితరులు పాల్గొన్నారు.
150 కేజీల కార్బైడ్, 110 స్ప్రే బాటిళ్లు స్వాధీనం
-- నలుగురిపై కేసులు నమోదు--
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మే 2: అమలాపురం పోలీసులు సోమవారం రాత్రి పట్టణంలోని పలు దుకాణాలపై ఆకస్మిక దాడు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్బైడ్, రసాయనాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసారు. దీనికి సంబంధించి సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా 150 కేజీల కార్బైడ్, 110 స్ప్రై బాటిళ్లను స్వాధీనం చేసుకుని వాటిని విక్రయిస్తున్న షాపు యజమానులు అడపా వెంకటేశ్వరరావు, కుడుపూడి నాగేంద్రలపై కేసు నమోదు చేసారు. అలాగే కృత్రిమ పద్ధతిలో పండ్లను మాగపెడుతున్న నల్లా సుబ్బారావు, పప్పు సూర్యనారాయణలపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.
తాగునీటి సరఫరాకు రూ. 3కోట్లు విడుదల
మామిడికుదురు,మే 2: జిల్లాలోని మంచినీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు అన్నారు. సోమవారం మండలంలోని ఈదరాడ గ్రామంలో వేంచేసియున్న శ్రీ పాలమ్మ అమ్మవారిని రాంబాబు దర్శించుకున్నారు . సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తకుండా రూ. 3కోట్లు సిఆర్‌పి నిధులను విడుదల చేసినట్లు రాంబాబు తెలిపారు.
జిల్లాలో గల 733 ఆవాస ప్రాంతాలకు మంచినీరు సరఫరా చేస్తున్న 65 మంచినీటి ప్రాజెక్టుల్లో నీటిని సమృద్ధిగా నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఇవి కాకుండా 1246 బోర్లను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తవ్వించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌లోని 14శాతం నిధులు మంచినీటి సరఫరా నిర్వహణ కోసం వెచ్చిస్తున్నట్లు రాంబాబు అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి కేవలం రాజకీయ లబ్ధి కోసమే మంచినీటి సరఫరాపై అందోళన చేస్తున్నట్లు విమర్శించారు.
తునికాకు కోతలు ప్రారంభం
విఆర్ పురం, మే 2: ఏజెన్సీ ఏరియాలోని గిరిజన, గిరిజనేతర ప్రజలకు వేసవికాలంలో తునికాకు సేకరణ ప్రతి ఏటా వందలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోంది. అటువంటి తునికాకు సేకరణ మండలంలోని మొద్దులగూడెం, శ్రీరామగిరి, కల్తునూరు, ఉమ్మడారం, పెదమట్టపల్లి, చింతరేవుపల్లి, కుందులూరు కళ్లాల పరిధిలో సోమవారం ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 24 కళ్లాలు ఉండగా, మొదటిరోజు కొన్ని కళ్లాల పరిధిలోనే తునికాకు సేకరణ ప్రారంభమయ్యాయి. తునికాకు సేకరణ హడావుడి అంతా గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తునికాకు సేకరణ కోసం కార్మికులు వేకువఝామునే లేచి తునికాకు సేరణకోసం తోటి కార్మికులందరూ కలసి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తునికాకు సేకరిస్తున్నారు. ఈ తునికాకు సేకరణకోసం చిన్నా, పెద్దా, ఆడ, మగ, ముసలీ ముతకా అందరూ బయలుదేరి వెళుతున్నారు. ఆకులు సేకరించుకుని వచ్చిన తరువాత ఇంటి వద్ద ఆకులను కట్టలు కట్టి కళ్లాలకు తరలించి విక్రయిస్తున్న హడావుడి గ్రామాల్లో కనిపిస్తుంది. ప్రతి ఏటా తునికాకు సేకరణ ద్వారా ఏజెన్సీ ఏరియాలోని ఒక్కో కుటుంబం దాదాపు రూ.15 వేల నుండి రూ.30 వేల వరకూ సంపాదిస్తుంటారు. ఎండను, విషపురుగులను లెక్కచేయకుండా తునికాకు సేకరణ ద్వారా సంపాదించిన సొమ్మును గిరిజనులు చిన్న చిన్న శుభకార్యలకు, జీవనోపాధికి వినియోగిస్తుంటారు.

కూలీల హాజరుపై తనిఖీలు :కలెక్టర్ ఆదేశం
కాకినాడ సిటీ, మే 2: ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరుపై వివిధ స్థాయిలోని ఉపాధి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీల హాజరుపై పిర్యాదులు వచ్చాయని, కూలీల హాజరులో బినామీ పేర్లు వంటి అక్రమాలు జరిగినట్లు పిర్యాదు చేశారన్నారు. ఇటువంటి అక్రమాలు అరికట్టడం కోసం, పనులు తనిఖీతో పాటు, కూలీల హాజరు పట్టీలు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉఫాధి హామీ పధకం ద్వారా ఈ వారంలో 1.72 లక్షల మంది కూలీలు నమోదు అయ్యారని కలెక్టర్ తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పనులు చేపట్టే చోట మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మజ్జిగ దొరకకపోతే చోడిజావ, అంబలి పంపిణీ చేయాలని సూచించారు. పనుల ప్రాంతంలో వినియోగించే ఫస్ట్ ఎయిడ్ బాక్సులలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచాలన్నారు. జిల్లాలో జల సంరక్షణలో భాగంగా వచ్చే వారం రోజులలో 25వేల వరకూ ఫారమ్‌పాండ్స్‌ను చేపట్టాల తెలియజేశారు. అదేవిధంగా జిల్లాలో 10వేల ఇంకుడు గుంతలు ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో విస్త్రృత పరచాలన్నారు. చెరువు పూడిక తీత పనులలో భాగంగా ఆక్రమణలు తొలగింపు కూడా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలలో మధ్య ఉన్న చెరువులపై గట్టుపట్టిష్ట పరిచి వాకింగ్ ట్రాక్‌లుగా మార్చాలని చెప్పారు.
వీటిపై మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్త పరిచారు. ఈ విషయమై సంబంధింత సబ్ కలక్టర్, ఆర్‌డిఓలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి సత్యనారాయణ, ఆర్డీఒలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.