తూర్పుగోదావరి

ముహూర్తం ముంచుకొస్తున్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 21: గోదావరి నది అంత్య పుష్కరాల ముహూర్తం తరుముకొస్తోంది. జూలై 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు గోదావరి నదికి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. అధికారులు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్తున్నారే తప్ప ఇంకా ఏర్పాట్లు కానరావడం లేదు. ఇటీవల వచ్చిన గోదావరి వరద వల్ల రేవుల పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోయ దుర్గంధభరితంగా మారాయి. దేశంలోనే అతి పెద్ద ఘాట్లు నిర్మించామని చెబుతోన్న స్నాన ఘట్టాలు సమన్వయ లోపం కారణంగా మురికి కూపాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంత్య పుష్కరాలు పట్టుమని పది రోజులు కూడా లేవు. ఈలోగా కనీసం స్నాన ఘట్టాలైనా పరిరక్షించుకోవాల్సిన యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కేవలం పుష్కరాలకే కాకుండా నిత్యం గోదావరి నదిలో స్నానాలు ఆచరించేందుకు ఎంతో మంది వస్తూనే వుంటారు. పితృకర్మలు చేసేందుకు వచ్చే వారితోనూ, సాధారణ యాత్రికులతోనూ ఉదయం పూట ఎప్పుడూ స్నాన ఘట్టాలు రద్దీగానే వుంటాయి. సాయంత్రం పూట సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన స్నాన ఘట్టాలను అధికారులు రాజమహేంద్రవరం ప్రాశస్థ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా పట్టించుకోవాల్సి వుంది. ఇరిగేషన్ శాఖ రేవులను నిర్మించింది కాబట్టి నిర్వహణ కూడా ఆ శాఖే చూసుకోవాలని, ఆకతాయిలు చేరకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు శాఖదని, ఇందులో నగరపాలక సంస్థ ఏమి చేస్తుందనే రీతిలో కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతున్నారు. ఈ విధంగా సమన్వయ లోపంతో స్నాన ఘట్టాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన కోటిలింగాల స్నాన ఘట్టాన్ని దేశంలోనే అతి పెద్ద స్నాన ఘట్టంగా నిర్మించారు. అటువంటి ఈ ఘాట్ ప్రస్తుతం దుర్గంధభరితంగా తయారైంది. విశాలమైన ఈ ఘాట్ దిగువ భాగమంతా బురదతో నిండిపోయింది. వరద నీటికి కొట్టుకొచ్చిన చెత్తా చెదారంతో నిండిపోయింది. ఈ రేవులో బట్టలు మార్చుకునే గదులకు తలుపులు కూడా లేని దుస్థితి నెలకొంది. పుష్కరాలకు స్నాన ఘట్టాల విస్తరణ, నిర్మించేటపుడు రేవుల్లో పెద్ద ఎత్తున మట్టి దిమ్మలు వేశారు. పనులు పూర్తయిన తర్వాత ఈ మట్టి దిమ్మలు తొలగించకుండా ఇటు కాంట్రాక్టర్లు, అటు ఇరిగేషన్ అధికారులు ఎవరి దారిన వారుపోయారు. అప్పట్లోనే ఈ మట్టి దిమ్మల వల్ల రేవులు ఊబిగా మారాయని ఆందోళన వ్యక్తమైతే వరద నీటికి కొట్టుకుపోతుందని సమాధానం చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అయితే భారీ స్థాయిలో పేరుకుపోయిన మట్టి దిబ్బల వల్ల స్నాన ఘట్టాల్లో ఊబిగా తయారై ప్రమాదకరంగా మారాయి. ఈ పరిస్థితి వల్ల స్వచ్ఛంగా వుండాల్సిన గోదావరి జలాలు రేవుల వద్ద బురద మయంగా మారాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రేవుల్లో పెద్ద ఎత్తున ఇసుక వేయిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటికీ ఆ పనులు చేపట్టకపోవడం వల్ల స్నానాలు చేసేందుకు వీలు లేకుండా తయారయ్యాయి. కోటిలింగాల రేవు, పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ రేవుల్లో యాత్రికులకు సదుపాయాలు కూడా లేవు. అంత్య పుష్కరాల సమయంలో రేవులను శుభ్రంగా నిర్వహించేందుకు శానిటేషన్ సిబ్బందిని అదనంగా నియమించడమే కాకుండా స్నానంచేసేందుకు వౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి వుంది.