తూర్పుగోదావరి

వాడపల్లి వెంకన్నకు వెండి కిరీటం బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, మార్చి 28: కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రావులపాలెం గ్రామానికి చెందిన యలమర్తి సత్యానందం దంపతులు వెండి కిరీటాన్ని బహూకరించారు. ఈ కిరీటం రెండు కేజీల బరువు ఉండవచ్చునని ఆలయ వర్గాలు తెలిపారు. ఈ కిరీటాన్ని దేవస్థాన ఇవో భాగవతుల వెంకటరమణమూర్తికి దాత అందజేశారు. అర్చకులు ఆదిత్య అనంత శ్రీనివాస్ స్వామివారికి సమర్పించిన కిరీటానికి పూజలు చేసి, శ్రీవారికి అలంకరించారు. దాత సత్యానందానికి దేవస్థాన రశీదును అందజేసి, ఇవో భాగవతుల అభినందించారు. అంతకు ముందు దాత యలమర్తి కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం దాతకు ఆలయ అర్చకులు వేదాశీస్సులు అందజేయగా, ఇవో భాగవతుల స్వామివారి చిత్ర పటం, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది మీసాల రాధాకృష్ణ, సాయిరాం, శివ, జి గాంధీ తదితరులు పాల్గొన్నారు.
తెరపైకి జక్కంపూడి
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 28: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరికకు రంగం సిద్ధం కావడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జిల్లా సారధిగా దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి పేరు తెర పైకి వచ్చింది. జ్యోతుల ఫిరాయింపు అనంతరం ఆమెనే అధ్యక్షురాలిగా నియమించడం తథ్యమన్న సమాచారం ఆ పార్టీ వర్గాల ద్వారా అందింది. అధినేత జగన్ కూడా విజయలక్ష్మికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ కూడా జిల్లా అధ్యక్షుడిగా నియమితులు కావచ్చన్న ప్రచారం జరిగినా, సామాజిక కోణంలో చూస్తే జక్కంపూడికే జిల్లా పగ్గాలు అప్పగించడం మంచిదన్న అభిప్రాయానికి అధినేత వచ్చినట్టు తెలుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన విజయలక్ష్మి ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్నారు. గతంలో పలు సందర్భాలలో ప్రతి ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని ఢీకొట్టాలంటే విజయలక్ష్మికే అధ్యక్ష పదవి ఇవ్వడం సముచితమన్న అభిప్రాయాన్ని పార్టీ జిల్లా వర్గాల నుండి కూడా వినిపిస్తోంది. పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడైనప్పటికీ ప్రస్తుతం ఉన్న సామాజిక కోణంలో పరిశీలిస్తే జక్కంపూడికే ఈ పదవి లభించే అవకాశాలున్నట్టు వైసిపికి చెందిన ఓ సీనియర్ నేత ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుతో పాటు ఈమె రాజకీయాల్లోకి వచ్చారు. సారా వ్యతిరేక ఉద్యమం నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు.
కాగా ఓవైపు వైసిపి పరిస్థితి ఇలా వుంటే మరోవైపు తెలుగుదేశం జిల్లా అధ్యక్ష స్థానానికి కూడా ఎంపిక జరగాల్సి ఉంది. టిడిపి జిల్లా అధ్యక్ష పదవికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డిసిసిబి అధ్యక్షుడు వరుపుల జోగిరాజు (రాజా) పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. అయితే కోనసీమకు చెందిన మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు కుమారుడు మెట్ల వెంకటరమణకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించాల్సిందిగా కాకినాడ ఎంపి తోట నరసింహం కోరుతున్నట్టు సమాచారం.
గిరిజనం దాహార్తి తీరింది
-సోలార్ పంపునకు మోటారు ఏర్పాటు-
-‘ఆంధ్రభూమి’ కథనానికి స్పందన-
విఆర్ పురం, మార్చి 28: విలీన మండలం విఆర్‌పురంలోని గిరిజన గ్రామం కుందులూరు గ్రామస్థుల దాహార్తి తీరింది. ఈ నెల 24వ తేదీన ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ప్రచురితమైన ‘గిరిజనం గొంతెండుతోంది’ అన్న కథనానికి స్పందన లభించింది. కుందులూరు గ్రామం వద్ద ఉన్న సోలార్ నీటిపంపు గత రెండు నెలలుగా పనిచేయక, తాగునీటి కోసం గిరిజనులు అవస్థలు పడుతున్నారని కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ఆ సోలార్ తాగునీటి మోటారును వెంటనే బిగించి కుందులూరు గ్రామ గిరిజనులకు తాగునీరు సరఫరాచేశారు. దీంతో కుందులూరు గ్రామస్థులు తమ గ్రామానికి ఏర్పడిన తాగునీటి కష్టాలను తీర్చినందుకు ఆంధ్రభూమి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
గట్టెక్కుతున్న రబీ
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మార్చి 28: గోదావరి డెల్టాలో రబీ పంటను కాపాడటానికి ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించటంతో గోదావరి డెల్టాలో రబీ పంట గట్టెక్కుతోంది. రబీ పంటను కాపాడటంలో సీలేరు జలాలు కీలకపాత్రను పోషించాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని సుమారు 8లక్షల 50వేల ఎకరాలకుగాను ఇప్పటి వరకు సుమారు 73టిఎంసిలను వినియోగిస్తే, ఇందులో 49టిఎంసిలు సీలేరు జలాలే ఉన్నాయి. గోదావరిలో రబీ పంటకు ఇంత భారీ పరిమాణంలో సీలేరు జలాలను వినియోగించటం ఇదే తొలిసారి. ప్రతి ఏటా సీలేరు జలాలపైనే రబీ పంట ఆధారపడుతున్నప్పటికీ, ఈసారి మాత్రం సీలేరు జలాలే ప్రధాన ఆధారమయ్యాయి. ప్రతిసారీ సుమారు 35టిఎంసిల నుండి 40టిఎంసిల సీలేరు నీటిని మాత్రమే రబీ పంట కాలంలో గోదావరి డెల్టాకు సరఫరాచేసే వారు. కానీ ఈసారి 49టిఎంసిల నీటిని సరఫరాచేసి రబీని కాపాడటానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీలేరు నుండి సరఫరాచేసిన 49టిఎంసిల నీటిలో 8టిఎంసిలు బైపాస్ కాలువ ద్వారానే సరఫరాచేశారు. మోతుగూడెంలోని జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తిచేయటం ద్వారా గోదావరి డెల్టాకు నీటిని సరఫరాచేస్తారు. గోదావరి డెల్టాను కాపాడేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో బైపాస్ కాలువ ద్వారా నీటిని సరఫరాచేసే సంప్రదాయం ఉన్నప్పటికీ, సాధ్యమైనంత తక్కువ పరిమాణంలోనే బైపాస్ కాలువ ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు మిగులు విద్యుత్ ఉండటంతో, రాష్ట్రప్రభుత్వం ధైర్యంచేసి ఏకంగా 8టిఎంసిల సీలేరు జలాలను జల విద్యుత్ ఉత్పత్తి చేయకుండానే సరఫరాచేసింది.
దాంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాన వాటా కలిగిన బలిమెల రిజర్వాయర్‌లో ఆంధ్రవాటా నీరు దాదాపు తరిగిపోయినట్టయింది. రబీ సాగు ముగిసే నాటికి ఇక బలిమెలలో ఆంధ్రవాటా 4టిఎంసిలే మిగిలవచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. వేసవిలో అత్యవసర పరిస్థితుల్లో జల విద్యుత్‌ను ఉత్పత్తిచేసేందుకు బలిమెల రిజర్వాయర్‌లోని నీటిని వినియోగించి మోతుగూడెం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో జల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వారు. కానీ ఈసారి రాష్ట్రప్రభుత్వం గోదావరి డెల్టాలో రబీని కాపాడేందుకు అధిక ప్రాధాన్యతనివ్వటంతో రబీ పంట విజయవంతంగా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం జలవనరులశాఖ అధికారులు గోదావరి డెల్టాలోని రబీ పంటకు చివరి దశ సాగునీటిని సరఫరాచేస్తున్నారు.

మధురపూడి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు
కోరుకొండ, మార్చి 28: పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి సోమవారం మధ్యాహ్నం మూడున్నరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం దిగిన ఆయన ఇక్కడ నుండి నేరుగా హెలికాప్టరులో పోలవరం వెళ్లారు. ఆయన వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులున్నారు. పట్టిసం, పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్డుమార్గం మీదుగా రాత్రి 8.30 గంటల సమయంలో తిరిగి మధురపూడి వచ్చారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రికి కలెక్టర్ హెచ్ అరుణకుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు, అర్బన్ ఎస్పీ ఎస్ హరికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నార్త్‌జోన్ డిఎస్పీ ఎవిఎల్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
కాకినాడ, మార్చి 28: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని డ్వామా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది హాజరై తమ సమస్యలపై వినతులను కలెక్టర్‌కు అందజేశారు. కె గంగవరం మండలం మసకపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను తొలగించారని, వాటిని తిరిగి యధా స్థానంలో ఉంచాలంటూ పలువురు దళిత నాయకులు కలెక్టర్‌ను కోరారు. రెండో ఎఎన్‌ఎంలకు జీతాలు పెంచాలని, 10వ వేతన సంఘం సిఫార్స్‌లు అమలు చేయాలని కలెక్టర్‌కు ఎఎన్‌ఎం యూనియన్‌ను విన్నవించింది. అలాగే రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు తదితర కోరికలతో కూడిన వినతులను ఈ ప్రజావాణిలో పలువురు కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో డిఎస్వో జి ఉమామహేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఆర్ అనురాధ, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ర్యాంపులు పరిశీలించిన కలెక్టర్
సీతానగరం, మార్చి 28: మండలంలోని కాటవరం, మునికొడవలి గ్రామాల్లో ఇసుక ర్యాంపులను సోమవారం కలెక్టర్ హెచ్ అరుణకుమార్ పరిశీలించారు. కాటవరం పంపింగ్ స్కీం వద్ద ఇసుక మేటలు ఏర్పడి 1200 ఎకరాల సాగుభూమికి నీరందించే పంపింగ్ స్కీం నిరుపయోగంగా మారడంతో ఇటీవల రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ దీనిని పరిశీలించి ఇసుక మేటల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్ అరుణ్‌కుమార్, సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ కాటవరం, మునికొడవలి గ్రామాల్లో ర్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణకుమార్ మాట్లాడుతూ కాటవరం పంపింగ్ స్కీం వినియోగంలోకి తేవడానికి కాటవరం ర్యాంపును ఉచిత ఇసుక ర్యాంపుగా మార్చేందుకు అనుమతులు మంజూరయ్యాయని, ఇక్కడ జెసిబి ద్వారా ఇసుకను లోడింగ్ చేసుకునేందుకు అనుమతించామన్నారు. అలాగే మండలంలో మరిన్ని ర్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం మునికొడవలి ర్యాంపును పరిశీలించారు. కార్యక్రమంలో మైనింగ్ ఎడి అర్ గొళ్ల, జియాలజిస్టు శ్రీనివాస్, తహసీల్దారు కనకం చంద్రశేఖర్, ఎంపిడిఒ డి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఎఇ సత్యనారాయణ, జెఇ రామ్‌నారాయణ, ఎస్సై ఎం పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కపిలేశ్వరపురం మండలంలో ఆర్డీవో పరిశీలన
కపిలేశ్వరపురం: మండలంలోని కోరుమిల్లి, కపిలేశ్వరపురంలో ఇసుక ర్యాంపులను త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రీచ్‌లు ప్రారంభానికి పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో సోమవారం రామచంద్రపురం ఆర్డీవో కె సుబ్బారావు మండలంలోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాంపు బాటల విషయమై ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం కోరుమిల్లిలో అధికారులతో సమావేశం నిర్వహించి, త్వరతిగతిన రీచ్‌లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఆదేశించారు. ఈయన వెంట తహసీల్దార్ జి చిన్నిబాబు, ఎంపిడిఒ అబ్రహం లింకన్, హెడ్ వర్క్స్ ఎఇ రాధాకృష్ణ, విఆర్వోలు పాల్గొన్నారు.
మంచినీటిలో జలగలు!
రామచంద్రపురం, మార్చి 28: కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో తాగునీటి అవసరాలకు వినియోగించే మంచినీటి కుళాయిల ద్వారా జలగలు రావడంతో గ్రామ ప్రజానీకం బెంబేలెత్తుతున్నారు. పొరపాటున చూసుకోకుండా మంచినీటిని తాగితే తమ గతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మంచినీటి సరఫరా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్థులు పంచాయితీ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు.
ఇసుక లారీ ఢీకొని బాలుడు మృతి
రామచంద్రపురం, మార్చి 28: కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామం వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. జొన్నాడ నుండి ఇసుకను తరలిస్తున్న ఓ లారీ కోటిపల్లి మత్స్యకార పేట వద్ద ఇరుకుగా ఉండే ప్రధాన రహదారిపై పెమ్మాడి సంజీవి (5)ని ఢీకొనడంతో సంఘటనా స్థలిలోనే బాలుడు మరణించాడు. ఈ ప్రమాదం గ్రామ సర్పంచ్ కర్రి నాగవేణి చిట్టిబాబు ఇంటికి కూతవేటు దూరంలో జరగడంతో సమీపంలోని మత్స్యకారులు, గ్రామస్థులు వెంటనే లారీని నిలిపివేశారు. ఈ పరిణామంతో లారీ డ్రైవరు, క్లీనరు లారీని వదిలి పరారయ్యారు. సంఘటనా స్థలికి రామచంద్రపురం సిఐ పచ్చా కాశీవిశ్వనాథ్, పామర్రు ఎఎస్సై ప్రసాద్ తదితర సిబ్బందితో చేరుకున్నారు. సిమెంటు రహదారి ఏర్పరచడంతో మితిమీరిన వేగంతో లారీలు ఇరుకుగా ఉండే తమ ప్రాంతంలో కూడా వెళుతున్నాయని, ఈ లారీల వేగనియంత్రణ చేపట్టాలని బిజెపి నాయకులు కర్రి చిట్టిబాబు, గ్రామ కమిటీ నాయకులు చిల్లే నాగేశ్వరరావు తదితరులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారిని కోల్పోయిన తల్లి ఆ బాలుని మృతదేహం వద్ద రోదిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. లారీ యజమాని సంజాయిషీ ఇచ్చేవరకు లారీని వదిలిపెట్టే పరిస్థితే లేదని మత్స్యకార యువత, ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
పి.గన్నవరం ఎస్సైకి తీవ్ర గాయాలు
-బైక్‌ను ఢీకొన్న మరో బైక్
రావులపాలెం, మార్చి 28: మండలంలోని ఈతకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పి గన్నవరం ఎస్సై పూడి వీరబాబు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఒక కేసు నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టులో హాజరయ్యేందుకు సోమవారం ఎస్సై వీరబాబు కానిస్టేబుల్ నవీన్‌కుమార్‌తో తలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లారు. పని పూర్తయిన తర్వాత సాయంత్రం తిరిగి గన్నవరంనకు బయలుదేరారు. ఈతకోట పాత సెంటర్ దాటాక ఎదురుగా వస్తున్న మరో మోటార్‌సైకిల్ వీరి వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కిందపడిన ఎస్సై వీరబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ నవీన్‌కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు వీరబాబును తొలుత రావులపాలెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆక్కడి నుండి మెరుగైన వైద్యంకోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రావులపాలెం సిఐ పివి రమణ, ఎస్సై పివి త్రినాధ్‌లు సంఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. రాజమహేంద్రవరం ఆసుపత్రికి వెళ్లి ఎస్సై వీరబాబు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
విగ్రహాలను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కాకినాడ, మార్చి 28: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలను అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కె గంగవరం మండలం భట్లపాలికకు చెందిన గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఈ నిరసనకు అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్, కాకినాడ మాజీ మేయర్ కె సరోజలు మద్దతు ప్రకటించారు. కొత్త బిల్డింగ్ కట్టించి అందులో ఈ విగ్రహాలను పెడతామని మాట ఇచ్చి మోసం చేసిన పంచాయతీ సిబ్బంది, కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని హర్షకుమార్ డిమాండు చేశారు. లేనిపక్షంలో తామంతా ఏకమై మిగిలిన విగ్రహాలను పడగొడతామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లోనికి హర్షకుమార్ గ్రామస్థులతో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పది మంది కంటే ఎక్కువగా వెళ్లవద్దని హర్షకుమార్‌కు చెప్పారు. కలెక్టరేట్‌లో ఏమైనా జరిగితే తనదే బాధ్యతని పోలీసులకు ఆయన బదులు చెప్పడంతో వారు లోనికి వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్న రెండో ఎఎన్‌ఎంలకు మద్దతు ప్రకటించారు. క్రీస్తు తమిళ హిందువంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను నిరసిస్తూ కాకినాడ నగరానికి చెందిన పలు క్రైస్తవ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు.

వాడపల్లి వెంకన్న సన్నిధిలో
దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్
ఆత్రేయపురం, మార్చి 28: కోనసీమ తిరుపతిగా పేర్గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారిని సోమవారం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ చండ్ర హనుమంతరావు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకట రమణమూర్తి, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ఉచిత ఇసుక ర్యాంపు ప్రారంభం
ముమ్మిడివరం, మార్చి 28: మండలంలోని గురజాపులంకలో సోమవారం ఉచిత ఇసుక ర్యాంపును ఎఎంసి ఛైర్మన్ గొలకోటి దొరబాబు ప్రారంభించారు. ఇకపై ఇక్కడ నుండి నిబంధనల మేరకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దొరబాబు సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి పితాని సత్యనారాయణ, జడ్పీటిసి శీలం సత్యనారాయణ, అర్థాని శ్రీను, చిక్కాల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా గేదెల్లంకలో అనుమతించిన ఇసుక ర్యాంపు నుండి ఇసుకను తరలించరాదని ఆ గ్రామ సర్పంచ్ కాశి దాదామణి, ఎంపిటిసి రాయుడు లక్ష్మి, మాజీ సర్పంచ్ గుద్దటి జమి, వైసిపి నాయకుడు కోలా బాబ్జిలతో పాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అమెరికా వర్శిటీతో ఆదిత్య ఎంఒయు

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 28: ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ (కాలిఫోర్నియా) ప్రతినిధి డాక్టర్ గ్రెగరీ ఒ బ్రెయన్ స్థానిక ఆదిత్యా విద్యా సంస్థలతో విద్యా సంబంధమైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని ఆదిత్య విద్యా సంస్థలో సోమవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ గ్రెగరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 దేశాలకు చెందిన విద్యార్థులు ఆదిత్య విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఆదిత్యలో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు తమ విశ్వ విద్యాలయంలో చేరే అవకాశాన్ని కల్పిస్తామని, ఆ విధంగా ప్రపంచస్థాయి విద్యను ఇక్కడి విద్యార్థులకు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు అమెరికాలో అనేక అవకాశాలున్నట్టు చెప్పారు. తమ విద్యా సంస్థలలో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఐటి యూనివర్సిటీ మెంబర్ ఆఫ్ ట్రస్టీస్ బోర్డు డాక్టర్ భాస్కర్ కురా, ఆదికవి నన్నయ్య విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య ముత్యాలనాయుడు, వీర్ సురేంద్రసాయి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇ సాయిబాబారెడ్డి, ఆదిత్యా విద్యా సంస్థల కార్యదర్శి ఎన్ కృష్ణదీపక్‌రెడ్డి, సమన్వయకర్త బిఇవిఎల్ నాయుడు, శ్రీనివాసరావు, కరుణ తదితరులు పాల్గొన్నారు.
నన్నయ వర్శిటీతో ఎంఒయు
రాజానగరం: అమెరికాలోని కాలిఫోర్నియాకుజ చెందిన ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీతో ఎంఒయు కుదుర్చుకున్నామని ఆదికవి నన్నయ వర్శిటీ రిజిస్ట్రార్ ఇఎన్ ధనుంజయరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నన్నయ వర్శిటీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎం ముత్యాల నాయుడు, అమెరికా వర్శిటీ అధ్యక్షుడు డాక్టర్ గ్రెగ్ ఒ బ్రెయన్ ఎంఒయుపై సంతకాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భాస్కర్ కురా, ప్రొఫెసర్ ఎస్ టేకి, ప్రొఫెసర్ సాయిబాబా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.