సాహితి

గురజాడ అపూర్వ సృష్టి.. ‘కన్యాశుల్కం’ బైరాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్యాశుల్కం తరువాత వెలువడిన సాంఘిక నాటకాలు ఏవీ కన్యాశుల్కం వలె పాఠకుల హృదయంలో చెరగని ముద్రవేయలేకపోయాయి. ఆ నాటకం ఒక అపూర్వ సృష్టి. నాటి సాంఘిక జీవనానికి ప్రతిబింబం. కొందరు విమర్శకులు ఈ నాటకం అంతా పానకమేనని కాని అందలి ఘట్టాలు కొన్ని పుడకలవలె ఉన్నాయని అన్నారు. వారి దృష్టిలో మధురవాణి ఇంటిలో పేకాట సారా దుకాణ ఘట్టాలు శిష్యుని తత్వాలు మొదలయినవి కావచ్చు. అవి పుడకలు కావు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలకండ ముక్కల వంటివి. పంటికి తగలగానే కాఠిన్యం అనిపించినా మధురానుభూతి మరువలేనిది. పేకాట (చేస్తాలు)ను గురించిచాలామంది ఎరుగరు. తెలిసిన వారికి ఆ విషయం అవగాహన అవుతుంది. నేటి క్రికెట్ ఆటవలె తెలిసిన వారికే అర్థం అవుతుంది. ఈ పేకాట కూడా అలాటిదే. కన్యాశుల్కం నాటకంలో చిన్న పాత్రలు చాలా ఉన్నాయి. వాటిలో బైరాగి పాత్ర ఒకటి. అప్పారావుగారు సంఘంలో అన్ని కోణాలు పరిశీలించి ఈ పాత్రని వాస్తవానికి అతి దగ్గరగా చిత్రీకరించారు. ఇలాటి బైరాగులను విశ్వసించే వారు నాటి వలె నేడు కూడా ఉన్నారు. బైరాగి బ్రతుకుతెరవు విషయంలో గిరీశంకంటె రెండాకులు ఎక్కువ చదివినవాడే. శృత పాండితయంతో అనేక మందికి ఆరాధ్యుడైనాడు. నాటకంలో మొదటగా బైరాగి రామచంద్రపురం అగ్రహారంలో తోట వెనుక కాళీమాత మందిరంలో శిష్యులతో కనిపిస్తాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉంటాడు. శిష్యులు వేదాంత చర్చ చేస్తూంటారు. సమీపంలోనే సారా సీసాలు గ్లాసులు ఉంటాయి.
దుకాణదారు అంటే సారా కొట్టు యజమాని ఇక్కడ దుకాణదారు అంటే అతడే. ఆరోజులలో సారా అంగడి నిర్వహించే వారిని దుకాణదారు అనేవారు.
గాజుకుప్పెలోనుగడగుచు దీపంబు / యెట్టులుండు గ్యానమట్టులుండ / తెలిసినట్టివారి ద్రేహంబులందును / యిశ్వదాభిరామ యినరవేమ - అన్న పద్యం దుకాణదారు పైవిధంగా తప్పులతో చదువుతాడు. బైరాగి కళ్లు తెరచి సత్యం సత్యం అంటాడు. దుకాణదారుడు వెంటనే ‘‘గురోజీ తమకి అంతా యివదవే. ఏం శలవు? అంటాడు. దుకాణదారుని బైరాగి ప్రశంసించి అమృతం అంటే సారాయే అని దానికొరకు దేవదానవులు కలహించారని దేవతలకు కూడా సారాయిష్టమేనని చెప్పగా త్రాగుబోతులంతా సంతోషిస్తారు. మీరు బంగారం చేస్తారుగాదా దానిని ఖర్చుచేసి హరిధ్వారంలో మఠం నిర్మించవచ్చు గదా మావంటి వారిని అందుకు డబ్బు ఎందుకు అడగడం అని మునసబు బైరాగిని ప్రశ్నించినప్పుడు మేం చేసే స్వర్ణం మేంవాడుకుంటే తలపగిలిపోతుంది అంటాడు. అక్కడ ఉన్న హెడ్‌కానిస్టేబుల్ వెంటనే అవి అన్నీ జ్ఞాన రహస్యాలు. అలాటి ప్రశ్నలు వేయకూడదు అని బైరాగిపై తనకు గల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. బైరాగి యెడల హెడ్‌కు అపరిమితమైన భక్తి. అతడు గొప్ప సిద్ధుడని అతను ఏం చేసినా తప్పులేదని అతని ద్వారా సాధించలేని కార్యం ఏదీ లేదని నమ్మకం గలవాడు. హరిద్వారంలో విపరీతమైన చలికదా అని హెడ్ అన్నప్పుడు బైరాగి నరులకు అట్టి చలి వేడి దుఃఖం ఉంటాయని మావంటి సిద్ధులకు అవి ఏవీ ఉండవని చెబుతాడు. అదృష్టం అంటే సిద్ధులదేనని స్నానాలు చేసి ముక్కులు బిగించే బ్రాహ్మలకు కూడా అలాటి శక్తులు లేవని ఆశ్చర్యపోతాడు హెడ్. బైరాగి తన వయస్సుకి ఆది అంతు లేదని పరమాత్మ వయసు ఎంతో తన వయస్సు అంతే అంటాడు. కాశీలో ఒక పర్యాయం ఒక శేట్ బైరాగితో సహా కొందరిని కూటానికి ఆహ్వానించినప్పుడు గంగనంతా సారా చేశానని బైరాగి ప్రగల్భాలు పలుకుతాడు. అక్కడ వారంతా అతని మాటలు విశ్వసిస్తారు. ఆ సమయంలో రామప్పంతులు హెడ్‌ను వెదుకుతూ అక్కడకు వచ్చి తన కేసు విషయంలో సాక్ష్యానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో బైరాగిని సాక్ష్యానికి పంపమంటాడు. అప్పుడు హెడ్ అతడు సామాన్యుడనుకున్నావా? నిలువెత్తు ధనం పోసినా అబద్ధం చెప్పడు అంటాడు.
అక్కడకు కొద్ది దగ్గరలో ఉన్న బైరాగి ఆ మాటలు విని సాక్ష్యం అంటే మావంటి వాళ్లే చెప్పాలి. యోగదృష్టి వల్ల చూశాం అంటే యెక్కడ జరిగినది యెప్పుడు జరిగినది కళ్లకి కట్టినట్టు కనపడుతుంది. కనుక మేంకూడా వస్తాం. యేమైనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికి వస్తుంది’’ అంటాడు. అప్పుడు రామప్పంతులు కొంచెం కల్పన ఉంటే గాని కథ నడవదు’ అనగా ‘‘వెర్రివెర్రి నిజవేమిటి అబద్ధాలేమిటి? మేం సిద్ధులం అబద్ధం నిజం చేస్తాం. నిజం అబద్ధం చేస్తాం. లోకమే పెద్ద అబద్ధం’’ అంటాడు. లోకం అబద్ధమని శంకర భాష్యాన్ని ఒక్క ముక్కలో చెప్పాడు. రామన్న బుచ్చన్న అను పామరులు ఈ బైరాగి సింహాచలంలోను ఉప్మాక్‌లోను ఒకేసారి కనిపించాడని విశ్వసించారు. కేసు విషయం అంతా అంజనం వేసి చూసి చెబుతానని బైరాగి హెడ్‌కి చెబుతాడు. తన పని పూర్తి అయితే బైరాగి హరిద్వారంలో కట్టబోయే మఠానికి నూట పదహార్లు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. పూజారి గవరయ్య బైరాగికి తిరస్కరణి విద్య వచ్చునని (అనగా అదృశ్య రూపంలో ఉండడం) తనతో దగ్గరగా మాట్లాడుతున్నాడని ఆ సమయంలో పసి పిల్లలకు అమాయకులకు మాత్రమే కనిపిస్తాడని చెబుతాడు.
కేసు విడిపోవడానికి కీలకమైన వ్యక్తి గుంటూరు శాస్తుల్లు. అతడు కనిపించడం లేదు. బైరాగి అంజనం వేసి ఎక్కడున్నదీ చూపిస్తానని చెప్పాడు. అతడు పక్కన ఉంటే తనకు కొండంత ధైర్యం ఉంటుందని జగన్నధస్వామిని సేవించుకుని సాయంత్రానికి వస్తే నేను అదృష్టవంతుణ్ణి అంటాడు హెడ్. అప్పుడు గిరీశం పదిరోజులు ప్రయాణం గదా ఒక్కరోజులో రావడం ఎలా అని ప్రశ్నించగా ఆయనకి వాయువేగం ఉంది అంటాడు హెడ్. పామరులలోనే కాదు చదువుకున్న వారిలోను ఒక రకమైన అజ్ఞానం ఉంటుంది. దానిని ఆసరాగా తీసుకుని బైరాగి వంటివారు సుఖ జీవనం చేస్తారు. కన్యాశుల్కం నాటకంలో బైరాగి పాత్ర అపూర్వం. ఆ నాటకంలోని వివిధ పాత్రలపై విశే్లషణ జరిపిన సెట్టి ఈశ్వరరావుగారు బైరాగి పాత్రను గురించి ఇలా అన్నారు. కాశీలో ప్రొద్దుటిపూట బయల్దేరి వాయువేగమనోవేగాలతో కొద్ది గంటలలో ఆకాశ మార్గాన విశాఖపట్టణం వచ్చానని చెబుతాడు. రాగితో బంగారం చేసి ఇస్తానంటాడు. అంజనం వేసి పారిపోయిన (మొగ) పెళ్లికూతురు ఎక్కడ ఉన్నదీ కనిపెట్టేస్తానంటాడు. ఈ పచ్చి అబద్ధాలన్నీ అందరు నమ్మేవాళ్లే. ఆరు నెలలలో ఇంగ్లీషు బావుటా పోతుందన్న పరమ రహస్యం చెబుతాడు. భక్తకోటి నమ్మేస్తుంది. ఎవరికి తెలియని భాషలో బంగారం రేకు మీద రాసి ఉన్న దైవ భాషను తాను చదివానంటాడు.’’
కన్యాశుల్కం నాటకం పండిత పామర రంజకమైందనడంలో సందేహం లేదు. గురజాడ రచనలు చదివిన వారికి కొంతయినా చిత్త సంస్కారం కలగక తప్పదు. చెడుపై అసహ్యం పుట్టక తప్పదు. సత్కార్యాల వైపు మొగ్గు రాక తప్పదు. కన్యాశుల్కం శక్తి అటువంటిది.

- వేదుల సత్యనారాయణ, 9618396071