హైదరాబాద్

పూజల పేరుతో మత్తు మందు ఇచ్చి భారీ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 15: పూజల పేరుతో మత్తు మందు ఇచ్చి భారీ దోపిడీకి పాల్పడ్డ సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 12లో నివాసం ఉంటున్న ఓ బడావ్యాపారవేత్త ఇంటికి కొందరు బాబాల పేరుతో బుధవారం సుమారు 4 గంటల ప్రాంతంలో ప్రవేశించారు. వ్యాపారవేత్త కుటుంబ సభ్యులను మాయమాటల్లోకి దింపి ప్రత్యేక పూజలు చేసినట్టు నటించి వారి వద్ద ఉన్న మత్తుమందు కలిపిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరికీ అందించారు. ప్రసాదం తిన్నవారంతా మత్తులోకి జారుకోగానే ఇంట్లో ఉన్న సుమారు కోటిన్నర నగదును దోచుకొని వెళ్లినట్టు సమాచారం. సమీప బంధువులు వచ్చి చూసేసరికి అంతా మత్తులో ఉన్నారు. ఇంట్లో చిందరవందరగా ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మత్తులో ఉన్న వారిని అపోలో ఆసుపత్రికి తరలించి, క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించి విచారణ ప్రారంభించారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపులను
వైఎస్ హయాంలోనూ వ్యతిరేకించా
* సిఎల్‌పి నేత జానారెడ్డి

హైదరాబాద్, జూన్ 15: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె. జానారెడ్డి కూడా పాల్గొన్నారు. జానారెడ్డి రాజీనామా గురించి ఏమైనా చర్చించారా? అని విలేఖరులు ప్రశ్నించగా, దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ అటువంటి ఆలోచన ఏదీ జానారెడ్డికి లేదని చెప్పారు. ఆ వెంటనే జానారెడ్డి మైకు తీసుకుని విలేఖరులకు క్లాస్ తీసుకున్నంత పని చేశారు. తనకు పార్టీలో ఏ పదవి లేకున్నా ఫర్వాలేదు కానీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టంగా చెప్పానని, అయినా మీరు అర్థం చేసుకోకుండా ‘జానారెడ్డి రాజీనామా’ అనడం భావ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 10 మంది టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ‘నీతి’ గురించి జానారెడ్డి ఎందుకు మాట్లాడలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించడాన్ని ఓ విలేఖరి ప్రస్తావించగా, ఇప్పుడే కాదు తాను వైఎస్ హయాంలోనూ అభ్యంతరం చెప్పానని అన్నారు. అయితే ఈ విషయాన్ని మీడియా ముందు కాకుండా పార్టీ సమావేశంలో అన్నానని ఆయన చెప్పారు.

ఎవరిదారి వారిదే!

హైదరాబాద్, జూన్ 15: మహానగర పాలక సంస్థ పాలక మండలి, అధికార యంత్రాంగం రెండు సమన్వయంతో ముందుకెళ్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది. కానీ కొత్త పాలక మండలి అందుబాటులోకి వచ్చిన తర్వాత వీరిద్దరు ఎవరి దారి వారే చూసుకుంటున్నారు. ఇప్పటికే మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి ఎవరికివారే పోటాపోటీగా సందర్శనలు, తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తున్నారన్న వాదన ఉండగా, తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల వ్యాఖ్యల ప్రకారం పాలక మండలి, అధికారులు ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టు వ్యవహారిస్తున్నట్లు కన్పిస్తోంది.
చివరకు పలు అంశాలకు సంబంధించి కార్పొరేటర్లు అధికారులిచ్చే ఫిర్యాదులు సైతం పరిష్కారానికి నోచుకోకపోవటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేగాక, రెండురోజుల క్రిత జరిగిన పాలక మండలి సాధారణ సమావేశంలో అధికార పక్షం, విపక్షమంటూ తేడా లేకుండా కార్పొరేటర్లు అధికారులు అలసత్వాన్ని ఎండగట్టిన సంగతి తెలిసిందే! కొంతకాలం క్రితం మూడు సార్లు బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసినపుడు అత్యవసర సహాయం కోసం ఆర్జించినా అధికారులు స్పందించలేదని కార్పొరేటర్లు కౌన్సిల్‌లో వ్యాఖ్యానించటం వీరిద్దరి మధ్య దూరానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చివరకు జిహెచ్‌ఎంసికి చెందిన స్థలాలు కబ్జాల పాలవుతున్నాయంటూ కార్పొరేటర్లు లబోదిబోమంటున్నా, పట్టించుకోకపోవటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. అమీర్‌పేట మైత్రి వనం పక్కనున్న ఖాళీ స్థలం, అలాగే వెంకటరమణ కాలనీలోని పార్కు స్థలం కబ్జాల వ్యవహారంపై అధికారులు వ్యవహారించిన తీరును కార్పొరేటర్లు శేషుకుమారి, విజయారెడ్డి కౌన్సిల్‌లో వ్యవహారించటం ఇందుకు నిదర్శనం. తన డివిజన్‌లో సుమారు 50 చెట్లు బలమైన గాలులతో విరిగిపడినా, ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా, అధికారులు స్పందించలేదంటూ కార్పొరేటర్ డిపి రెడ్డి కౌన్సిల్‌లో ప్రస్తావించటం అధికారుల క్షేత్ర స్థాయి విధి నిర్వహణకు నిదర్శనంగా చెప్పవచ్చు.

సర్వాయి పాపన్న పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలి

ఖైరతాబాద్, జూన్ 15: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల్లో ఒకదానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, శేషగిరి మాట్లాడుతూ సుమారు 365 సంవత్సరాల క్రితమే సాధారణ గీత కార్మిక కుటుంబలో జన్మించిన పాపన్న గౌడ్ అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాడారని అన్నారు. తన విరోచిత పోరాటంతో ముస్లిం రాజులకు వణుకు పుట్టించి ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత కలిగిన వ్యక్తి అని అన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా పేరొందిన క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం.. పాపన్న చరిత్రను వివరిస్తూ పుస్తకాన్ని ప్రచురించిందని చెప్పారు. ఉద్యమ సమయంలో పాపన్న పేరును పలుమార్లు ఉచ్చరించిన నేతలు ప్రస్తుతం ఆయనను మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పాపన్న పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంతో ధైర్యసాహసాలు కలిగిన ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరచాలని కోరారు. ఈ సమావేశంలో నర్సాగౌడ్, రామారావు, వెంకటేశం గౌడ్ పాల్గొన్నారు.