హైదరాబాద్

తొలగని ‘చిల్లర’ గండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: నెల చివరి రోజులు..ఎంత పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటున్న ఉద్యోగి అయినా డబ్బులు కాస్త చూసి ఖర్చు పెట్టుకోవల్సిన రోజులు. ఖాతాల్లోనున్న డబ్బును పొదుపుగా ఖర్చు చేసుకుందామనుకునే ఖాతాదారులకు నిరాశే ఎదురవుతోంది. ఇందుకు ప్రజల అవసరాలకు తగిన విధంగా రూ. వంద, యాభై నోట్లు అందుబాటులో లేపోవటమే ప్రధాన కారణం. కొత్త 500 నోటు అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నా, అది కేవలం కొన్ని ఏటిఎంలకే పరిమితమైంది. ఏటిఎంలలో అందుబాటులో ఉన్న రూ. 2వేల నోటు తీసుకుని బయట మార్కెట్‌లో 500 నోటుతో చిల్లర తీసుకుంటే అది ఒరిజినల్ నోటేనా? అన్న అనుమానం ప్రజలను వెంటాడుతోంది. సరే అదే రూ.2వేల కొత్త నోటు తీసుకుని బ్యాంకుకెళ్దామా? అంటే 500నోటు మాట దేవుడెరుగు బ్యాంకుల్లో కనీసం వంద నోట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. పెద్దనోట్ల రద్దు..ఆ తర్వాత నగదు మార్పిడికి ఇచ్చిన గడువు ముగిసినా నగరవాసులకు చిల్లర గండం తొలగలేదు. ముఖ్యంగా ఏటిఎంలు, బ్యాంకుల్లో ఎక్కువగా రూ. 2వేల కొత్త కరెన్సీ నోటే అందుబాటులో ఉండటంతో ఖాతాదారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 8వ తేదీన వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించటంతో చిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ రోజువారీ అవసరాల కోసం ఏటిఎంలను ఆశ్రయిస్తే ఎక్కడా కూడా వంద నోట్లు లభ్యం కాకపోవటంతో రూ. 2వేల నోటును తీసుకుంటున్నారు. కానీ ఆనోటుకు ఎక్కడ కూడా చిల్లర లభ్యం కావటం లేదు. ఈ క్రమంలో బ్యాంకుల్లో కూడా చిల్లర ఇచ్చేందుకు వంద నోట్లు అందుబాటులో లేవు. పైగా శని, ఆదివారాల్లో బ్యాంకులకు సెలవులు రావటం, ఆ మరుసటి రోజు కూడా ఆందోళనలు చేపట్టనున్నట్లు విపక్షాలు ప్రకటించటంతో బ్యాంకుసేవలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్ వంటి జాతీయ బ్యాంకులు మొదలుకుని, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల బ్యాంకులన్నీ కలిపి నగరంలో దాదాపు 3వేల పై చిలుకు బ్రాంచిలున్నాయి. వీటిలో ఒక్క ఎస్‌బిఐకు చెందిన శాఖలే 200 పై చిలుకు ఉన్నా, ఏ బ్రాంచిలోనూ ఆశించిన స్థాయిలో డబ్బుల్లేవు. అలాగే నగరంలో దాదాపు అయిదున్నర వేల నుంచి ఆరు వేల వరకు ఏటిఎంలున్నాయి. వీటిని సగానికి పైగా ఏటిఎంలు మూసివేసి, మరికొన్ని అవుట్ ఆఫ్ సర్వీసు బోర్డులతో దర్శనమిస్తున్నాయి. అంతంతమాత్రం అందుబాటులో ఉన్న ఏటిఎంలలో ఏ పదో ఇరవయ్యో తప్ప, మిగిలిన వాటన్నింటిలోనూ కేవలం రూ. 2వేల నోటు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నెల 8వ తేదీ నుంచి నగదు మార్పిడి, డిపాజిట్ల ద్వారా వినియోగదారుల నుంచి స్వీకరించిన వెయ్యి, 500 నోట్లు మాత్రమే ఉన్నాయి. రూ. 500 నోట్లు కొన్ని ఏటిఎంలలో అందుబాటులో ఉన్నా, అవి అందరికీ అందుబాటులో లేకుండాపోయాయి. ఈ నోటు పూర్తి స్థాయిలో సామాన్యుడి చేతిలోకి రాకముందే ఈ రూ. 500 నకిలీ నోట్లను ముద్రించిన ముఠా పోలీసులకు పట్టుబడటంతో సామాన్యుల్లో రూ. 500 నోటు పట్ల ఆందోళన మరింత రెట్టింపయ్యింది.

నోట్ల కష్టాలపై.. 28న ఆటో బంద్

హైదరాబాద్, నవంబర్ 26: ఇప్పటికే చిల్లర కష్టాలను ఎదుర్కొంటున్న నగరవాసులకు ఈ నెల 28న ఆటోల తిప్పలు తప్పేలా లేవు. నగరంలో సుమారు లక్షా 30 వేల ఆటోలు ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ క్రమంలో పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని నిరసిస్తూ 28న సోమవారం జంటనగరాల్లో ఆటోల బంద్‌కు ఆటోడ్రైవర్స్ యూనియన్ల ఐకాస పిలుపునిచ్చింది. నల్లధనంతో ఎలాంటి సంబంధం లేని సామాన్య ఫ్రజల జీవితాలతో ప్రదాని నరేంద్రమోది చెలగాటమాడుతున్నారని ఐకాస నాయకులు విమర్శించారు. ఈ నిర్ణం వల్ల సామాన్య ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంకా తప్పని నగదు తిప్పలు
* ఏటిఎంల వద్ద పడిగాపులు
ఖైరతాబాద్, నవంబర్ 26: కరెన్సీ కష్టాలు నగరవాసులను ఇప్పట్లో వీడేట్టు లేవు. నల్లధన నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం నగరంపై విపరీతంగానే పడిందని చెప్పాలి. తగినంత నగదు అందుబాటులో లేక అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంరోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ప్రభుత్వం భావించినా సుమారు 20 రోజులు అవుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. బ్యాంకులు, ఏటిఎంలలో తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో విత్‌డ్రాల్స్ బ్యాంకర్లు పలు నిబందనలను విధిస్తున్నారు. దీంతో తమవద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసి బిచ్చగాళ్లలో బ్యాంకులు, ఎటిఎంల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని కొందరు వాపోతున్నారు. ఏటిఎంలలో నగదు నింపిన గంటలో క్యాష్ అయిపోతుండగా, బ్యాంకుల్లో సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏటిఎం క్యూలైన్లలో నిలుచొన్న వారు తమ వంతు వచ్చేదాక డబ్బులు అయిపోవద్దంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రాత్రనక, పగలనక నగదు కోసం రోడ్ల మీద పరుగులు పెడుతున్నారు. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో నగరవాసులకు పొదుపు మంత్రం జపిస్తున్నా, అవసరమైన వాటిని కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో చిరువ్యాపారాలు దెబ్బతినగా బడామాల్స్‌లో సేల్స్ పెరిగాయి. ముఖ్యంగా రైతు బజార్లు, చిన్నపాటి దుకాణాల్లో చిల్లర సమస్య పట్టిపీడిస్తుంది.
పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదును త్వరగా అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తీసుకువచ్చిన రూ. 2000నోటుతో ఉపశమనం కంటే చిక్కులు అధికమయ్యాయి. ఈ నోటు కూరగాయాలు, చిన్నపాటి వస్తువులు, చివరకు పెట్రోల్ బంకుల్లో సైతం మార్చుకోవడం కష్టంగా మారింది. చిల్లర ఉన్నవారు సైతం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో నగదును డ్రా చేసినందుకు సంతోషపడాలో, అవసరాలకు వినియోగించుకోలేక పోతున్నందుకు బాధపడాలో అర్ధం కాని స్థితిలో పడిపోతున్నారు. వీటికి తోడు అన్నట్టు శనివారం బ్యాంకులు బంద్ కావడంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ఏటిఎంలలో సైతం నగదును నింపలేదు. అసలే ఒత్తిడితో ఉన్న బ్యాంకు సిబ్బంది శనివారం ఏటిఎంలలో నగదును నింపేందుకు సైతం పెద్దగా ఆసక్తిచూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.