హైదరాబాద్

గ్రేటర్‌లో పెరుగుతున్న సిఎస్‌ఆర్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బల్దియాను గట్టెక్కించేందుక జిహెచ్‌ఎంసి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకోవటంతో పాటు స్థానిక సంస్థగా ప్రజలకు అందించాల్సిన పౌరసేవల నిర్వహణలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని పెంచటంలో అధికారులు సఫలీకృతులవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ రకాల విధులు నిర్వర్తించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ముందుకొస్తున్నాయి. తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తో మొదలైన ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగస్వామ్యం నేడు అరడజను సంస్థలకు పైగా పెరిగింది. ఇపుడు తాజాగా ప్రవాసభారతీయులు సైతం నగరంలో మరుగుదొడ్లను నెలకొల్పేందుకు తమవంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు రావటం బల్దియా అధికారులు ప్రయత్నానికి నిదర్శనం. గ్రే పేపర్ సంస్థ నిర్వాహకులైన సునీల్ నగరంలో పబ్లిక్ యూరినల్స్ ఏర్పాటుకు సహకారం అందించేందుకు సిద్దమయ్యారు. రూ. లక్షా 25వేల వ్యయంతో ఏర్పాటయ్యే, పబ్లిక్ యురినల్స్‌లను ఐదింటిని ఏర్పాటు చేసేందుకు కమిషనర్ జనార్దన్ రెడ్డిని కలిసి అంగీకారం తెలిపారు.
స్వచ్ఛ్భారత్ సాధనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ర్యాంకున సాధించుకునేందుకు జిహెచ్‌ఎంసి నిర్వహించిన పలు కార్యక్రమాలకు రాంకీ ఎన్విరో సంస్థ రూ. 2 కోట్లను అందించింది. దీంతో పాటు కామినేని హాస్పిటల్స్ సంస్థ సైతం రూ. కోటి, అలాగే ఆంధ్రాబ్యాంకు రూ. 25లక్షలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మొదటి దశలో మూడు ఈ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు తగిన ఆర్థిక సహకారాన్ని అందించింది. అలాగే కిమ్స్ హాస్పిటల్స్ మరో రెండు ఈ టాయిలెట్లు, హడ్కో సంస్థ రూ. 1.10 కోట్లు, ఎన్‌ఎండిసి ఐదు ఈ టాయిలెట్లను సమకూర్చుకునేందుకు అవసరమైన నిధులను కేటాయించాయి.
అలాగే ఐటిసి సంస్థ వంద కేంద్రాలను ఏర్పాటు చేసి తడి,పొడి చెత్తను వేరు చేసేందుకు జిహెచ్‌ఎంసికి అండగా నిలిచింది. గొద్రెజ్ సంస్థ కూడా ఇలాంటి పది కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఎన్‌టిపిసి సంస్థ మరో అయిదు స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఉచితంగా అందించేందుకు ముందుకు రాగా, ఇపుడు మరో 15 షీ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు బిడిఎల్ కూడా ముందుకొచ్చింది. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో జిహెచ్‌ఎంసి పలు పౌరసేవల నిర్వాహణకు సంబంధించిన వ్యయాన్ని ఈ రకంగా బడా కంపెనీల నుంచి సిఎస్‌ఆర్ ద్వారా సమకూర్చుకుంటుంది. అలాగే పలు పార్కుల నిర్వాహణలో కూడా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని జిహెచ్‌ఎంసి ఆహ్వానిస్తోంది.