హైదరాబాద్

తెలంగాణ బంద్‌కు మిశ్రమ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జంటనగరాల్లో తెలంగాణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, సికిందరాబాద్, పాతబస్తీల్లో బంద్‌కు అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. హైదరాబాద్, పాతబస్తీలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు షాపులు యదావిధిగా తెరిచే ఉండగా, వాటిని బంద్ చేయించేందుకు వివిధ పార్టీల నేతలు యత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నగరంలోని పలు డిపోల నుంచి ప్రతిరోజు మాదిరిగానే శనివారం కూడా రాకపోకలు సాగించేందుకు తాత్కాలిక సిబ్బంది బస్సులను బయటకు తీయగా, సమ్మె పాటిస్తున్న కార్మికులు అడ్డుకున్నారు. రాణిగంజ్ డిపో వద్ధ తాత్కాలిక సిబ్బంది, సమ్మెలో ఉన్న కార్మికుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. ఉదయానే్న ఆర్టీసి క్రాస్‌రోడ్డులో టీజేఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో రంగంలో దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసి నేతలను డీసీఎం వ్యానులో ఎక్కిస్తున్న సమయంలో లెఫ్ట్‌పార్టీ నేత రంగారావు చేతికి గాయమైంది. ఆయన చేతి వేలు కట్ కావటంతో ఆయన్ను చికిత్స నిమిత్తిం ఆసుపత్రికి తరలించారు. ఆబిడ్స్‌లో ఆందోళన చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కే.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావును పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఒక్క మెహిదీపట్నం డిపోలో సుమారు 164 బస్సులుండగా, వీటిలో కేవలం ఏడు బస్సులు మాత్రమే రాకపోకలు సాగించాయి. మిగిలిన మరికొన్ని బస్సులకు విధుల్లో చేరాల్సిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. సికిందరాబాద్ జేబీఎస్ వద్ధ కార్మికులకు మద్ధతు పలికేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాంను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎంసీ ఆఫీసులో భారతీయ మజ్ధూర్ మోర్చా యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టగా, పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు మధ్యాహ్నాం భోజన సమయంలో పలు కార్యాలయాల్లోని టీఎన్జీఓలు నల్లబ్యాడ్జిలను ధరించి, ఆర్టీసి కార్మికులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. పాతబస్తీలోని చార్మినార్ వద్ధ కూడా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆందోళనలను చేపట్టారు.
బోసిబోయిన ఆఫీసులు
ఆర్టీసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ప్రతిరోజు వేలాది మంది విధులు నిర్వర్తించే ఉద్యోగులు, రాకపోకలు సాగించే సందర్శకులతో కిటకిటలాడే జీహెచ్‌ఎంసీ ఆఫీసు జనం లేక వెలవెలబోయింది. ఇదే తరహాలో సంక్షేమ భవన్, ఇతర విద్యా, ఉపాధి, రెవెన్యూ కార్యాలయాలు బోయిబోయి దర్శనమిచ్చాయి.
షాద్‌నగర్: ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతమైంది. శనివారం తెల్లవారుఝాము నుంచి అఖిలపక్షాల నేతలు షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకొని బస్సులను బయటకు రానివ్వకుండా గేటు ముందు బైఠాయించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ, బీఎస్‌పీ, జనసేన పార్టీ, ఎన్‌ఎస్‌యుఐ, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు బస్టాండ్ గేటు వద్దకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా ధర్నా నిర్వహించారు. అఖిలపక్షాల నాయకులు, పోలీసుల మద్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆందోళనను విరమించడమే కాకుండా బస్టాండ్ గేటు నుంచి పక్కకు తప్పుకోవాలని సీఐ శ్రీ్ధర్‌కుమార్ హెచ్చరించినా అఖిలపక్షం నాయకులు వినిపించుకోలేదు. దాంతో పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసి బస్సులు రోడ్డు ఎక్కకుండా బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నేతృత్వంలో ఆరుమంది సీఐలు, 16మంది ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు సుమారు వందమంది బస్టాండ్ అవరణలోకి చేరుకొని మోహరించారు. ధర్నాను విరమించి బస్సులు నడిచే విధంగా కృషి చేయాలని పోలీసులు కోరగా అందుకు వారు నిరాకరించి ధర్నాను కొనసాగించడంతో పోలీసులు, మహిళ పోలీసులు అఖిలపక్షాల నేతలతోపాటు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సుమారు 110మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక్కసారిగా బస్టాండ్‌లోకి పోలీసులు వచ్చి అరెస్టు చేసేందుకు ముందుకు రావడంతో నేతల నినాదాలతో హోరెత్తింది. విద్యార్థి సంఘాల నేతలు, అఖిలపక్షాల నేతలు బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలో ఉన్న దుకాణాలను బంద్ చేయించారు.
ఆర్టీసి బస్టాండ్‌లోకి ఇతర వాహనాలు రాకుండా ముందుగానే కార్మికులు, ఉద్యోగులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దాంతో బస్టాండ్ ఆవరణ మొత్తం పోలీసులతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఆర్టీసీ గేటు వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా షాద్‌నగర్‌లో ఆర్టీసి బంద్ విజయవంతమైందని చెప్పవచ్చు. ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న బంద్‌కు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్, టీఎన్‌జీవోలు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ నేతలు సంపూర్ణ మద్దతు తెలపడంతోపాటు బంద్‌లో పాల్గొన్నారు. అన్ని వర్గాల సంఘాలు బంద్‌ను విజయవంతం చేశారు.