హైదరాబాద్

రాజుకుంటున్న రాంకీ ‘చిచ్చు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: మహానగర ప్రజలకు జిహెచ్‌ఎంసి అందిస్తోన్న పారిశుద్ధ్య సేవలు మున్ముందు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు సమకూర్చిన ఆటో టిప్పర్ల డ్రైవర్లు, సహాయకులు ప్రతి ఇంటి నుంచి రూ. 50 చెత్త ఛార్జీలుగా వసూలు చేసుకోవాలని వౌఖిక ఆదేశాలు జారీ చేసిన జిహెచ్‌ఎంసి అధికారులు దశల వారీగా రాంకీ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఓ ప్లాన్ ప్రకారం రవాణా విభాగాన్ని వికేంద్రీకరణ చేసి, ఆ తర్వాత ఆశించిన సమయంలో చెత్తను చెత్త కుండీల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించలేకపోతున్నామని, అందుకే ప్రజారోగ్య పరిరక్షణ ఈ రకమైన విధులను శాస్ర్తియంగా నిర్వహంచే రాంకీ ఎన్విరో సంస్థకు బాధ్యతలను అప్పగిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటన చేసేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చెత్త రవాణా వికేంద్రీకరణ విఫలం కావటంతో ఎక్కడికక్కడే కూడళ్లు, జంక్షన్లతోపాటు ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో కూడా చెత్త కుప్పలుగా పేరుకుపోవటంతో, దాన్ని తొలగించేందుకు రెండు రోజుల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో రాంకీ వాహనాలను వినియోగించటంతో అధికారులు, కార్మికుల మధ్య మరో సారి రాంకీ చిచ్చు రగలుతోంది. 2009లో రాంకీతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించటంతో అమలు చేయకుండా మూలనపడేసిన అధికారులు ఇపుడు ఎంతో వ్యూహాత్మకంగా మళ్లీ రాంకీ సంస్థకు పారిశుద్ధ్య బాధ్యతలను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేయటం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగానే మంగళవారం యూసుఫ్‌గూడ, ఇమ్లిబన్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో చెత్తను తరలించేందుకు రాంకీ యంత్రాలను వినియోగించటాన్ని కార్మికులు వ్యతిరేకించారు. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులకు సర్ది చెప్పారు. అధికారులు ఇంత ధైర్యంగా, బహిరంగంగా ప్రయత్నాలు చేయటం వెనక సర్కారు ఉత్తర్వులేమైనా ఉన్నాయా? అంటూ అధికార, విపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా పార్టీలకతీతంగా కార్మిక సంఘాలన్నీ ఒక్కటే రాంకీ ఒప్పందాన్ని వ్యతిరేకించి, జిహెచ్‌ఎంసిని కాపాడుకునే దిశగా కార్యచరణను సిద్ధం చేస్తున్నాయి.
ఒప్పందంతో అంతా ‘్ధరాదత్తమే’నా?
పారిశుద్ధ్య పనులకు సంబంధించి 2009లో అప్పటి సమైక్య ప్రభుత్వం జిహెచ్‌ఎంసితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిహెచ్‌ఎంసి పారిశుద్ద్య విభాగానికి చెందిన మొత్తం యంత్రాలు, సిబ్బందిని 25 ఏళ్ల పాటు రాంకీ సంస్థకు అప్పగించాల్సి ఉంది. కానీ కొద్ది రోజుల క్రితం వరకు బల్దియా ఏటా రూ. 98 కోట్ల వ్యయంతో చెత్త తరలింపు విధులను సక్రమంగా నిర్వర్తించేది. టన్ను చెత్తను బల్దియా రూ. 550కు ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు తరలించేది. కానీ ఈ ఒప్పందం ప్రకారం సిబ్బంది, యంత్రాలను అప్పగించిన తర్వాత కూడా ఒక్క టన్ను చెత్తకు కార్పొరేషన్ రాంకీ సంస్థకి రూ. 1541 ఛార్జీలు చెల్లించటంతో పాటు, చెత్తను శాస్ర్తియంగా ల్యాండ్‌ఫీల్ చేసేందుకు ఏటా రూ. 5 కోట్లను ప్రత్యేక ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి మంచి నగర శివార్లలో సుమారు 330 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా ఈ సంస్థకు ధారదత్తం చేయాల్సి ఉంటుందని, దీంతో కార్పొరేషనే గాక, రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నందున, ఎట్టి పరిస్థితుల్లోనూ రాంకీ ఒప్పందాన్ని అమలు కాకుండా అడ్డుకుంటామని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి.
ఒప్పందం అమలైతే ‘చెత్తపన్ను’ తప్పదు
గ్రేటర్‌లో రాంకీ ఒప్పందం అమలైతే ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వేతో గురించిన సుమారు 22లక్షల గృహాలు ఆస్తిపన్నుకు తోడు చెత్త పన్నును చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఇంటింటి నుంచి రూ. 50 వసూలు చేసుకోవాలని ఆటో టిప్పర్ల డ్రైవర్లు, సహాయకులకు అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే! రేపు ఈ రాంకీ ఒప్పందం అమలైతే కంపెనీ యాజమాన్యం తమ ఇష్టానుసారంగా నగర ప్రజల ముక్కు పిండి మరీ చెత్త పన్ను వసూలు చేసే అవకాశముందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా కత్తితో మా గొంతు కోస్తారా?
అన్ని రకాలుగా రాంకీ ఒప్పందం జిహెచ్‌ఎంసికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగానే ఉందన్న విషయాన్ని గత సమైక్య పాలకులు కూడా గుర్తించి, అమలు చేయకుండా పక్కనబెడితే స్వరాష్ట్రం, స్వపరిపాలనలో రాంకీ ఒప్పందం తెరపైకి రావటం తమకెంతో ఆందోళన కల్గిస్తుందని తెరాస గుర్తింపు పొందిన, విపక్షాలకు చెందిన కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సమైక్య పాలనలో అమలు కాని రాంకీని ఇపుడు అమలు చేయాలని భావిస్తే, మా కత్తితో మా గొంతులు కోయటమే తప్పా, మరొకటి కాదని అధికారపార్టీ అనుబంధ కార్మిక సంఘం నేతలు ఒకరు వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాంకీ ఒప్పందాన్ని అమలు కాకుండా అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు.