హైదరాబాద్

మారండి..బాగుపడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: పేద, బడుగు వర్గాల ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసే గుడుంబా తయారీని మానుకుని, మీ అంత మీరే మీలో మార్పు తెచ్చుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ధూల్‌పేట వాసులకు హితవు పలికింది ధూల్‌పేట పునరావాస కమిటీ. కలెక్టర్ రాహుల్ బొజ్జ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులతో పాటు జియాగూడ, కార్వాన్, మంగల్‌హాట్, గోషామహల్ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా పాల్గొని ధూల్‌పేట అభివృద్ధిపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ మాట్లాడుతూ ధూల్‌పేటలో అక్రమ గుడుంబా తయారీని రూపుమాపేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే నేటికీ ఇంకా గుడుంబా తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారు స్వచ్ఛందంగా మారితే వారికి పునారావాస కార్యక్రమాల్ని రూపొందించిన తక్షణమే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యంగా ధూల్‌పేట ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్, కాలేజీని ఏర్పాటు చేసి ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి యువతకు వివిధ అంశాల్లో శిక్షణనిచ్చి ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. చదువుకున్న యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో అవగాశాలు లభించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మహిళలకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ, బ్యూటీ ఫార్లర్ వంటి చిన్న చిన్న వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు వీలుగా బ్యాంకు రుణాలను కూడా అందించనున్నట్లు కలెక్టర్ వివరించారు. గణేష్ విగ్రహాలు తయారు చేసే మూర్తి కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోందన్నారు. మంగల్‌హాట్‌లోని చేపల మార్కెట్ అభివృద్ధి చేసి, అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గుడుంబా వల్ల సమాజానికి జరిగే నష్టాలు, అనర్ధాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ధూల్‌పేట ప్రాంతం వాసుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెల్సుకునేందుకు వీలుగా ఆ ప్రాంతంలో బస్తీ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ధూల్‌పేట ప్రాంతంలో గుడుంబా తయారీ మానుకోవటం వల్ల ఆదాయం కొల్పోతామన్న భయాన్ని విడనాడి ప్రభుత్వ కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ సమావేశంలో వెస్ట్‌జోన్ డిసిపి వెంకటేశ్వరరావు, ఎక్సైజ్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, ధూల్‌పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, అసిస్టెంటు కమిషనర్ అంజిరెడ్డి, ఏసిపి రాంగోపాలరావు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్ శాంతిశ్రీ పాల్గొన్నారు.
చాలా వెనకబడి ఉన్నందుకే!
ధూల్‌పేట పునరావాస కమిటీ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ అక్కడి ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ మాట్లాడుతూ ధూల్‌పేట అత్యంత వెనబడిన ప్రాంతమని, ఇక్కడ ఎక్కువగా పేద ప్రజలు గుడుంబా తయారీతో జీవనం సాగిస్తున్నారని, ముఖ్యంగా మహిళలు కూడా ఇదే వృత్తిలో కొనసాగటం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ప్రాతిపదికన వీరికి పునారావస కార్యక్రమాలు అమలు చేసి ఆదుకోవాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ధూల్‌పేటలో ప్రాంతంలో నెలకొన్న ఆర్థిక స్థితిగతుల్ని పరిగణలోకి తీసుకుని వెంటనే ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని కార్వాన్ కార్పొరేటర్ రాజేందర్ యాదవ్, గోషామహల్ కార్పొరేటర్ ముఖేష్‌సింగ్, జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణల కమిటీని కోరారు.
ఇప్పటికీ రూ. 5.59 కోట్లు వెచ్చించాం
దూల్‌పేట వాసులను గుడుంబా తయారీ మాన్పించి, వారికి ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించేందుకు గాను ఇప్పటి వరకు రూ. 5.59 కోట్లను వివిధ కార్యక్రమాల కింద వెచ్చించటం జరిగిందని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ టి. ప్రసాద్ సమావేశంలో వెల్లడించారు.