జాతీయ వార్తలు

అగస్టాకు కొమ్ముకాశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 6: వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలు ప్రక్రియలో అగస్టా వెస్ట్‌లాండ్ కంపనీకి ప్రయోజనం కలిగే రీతిలో గత యుపిఏ ప్రభుత్వం వ్యవహరించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆరోపించారు. రూ.3600 కోట్ల విలువ గల ఒప్పందంలో ఒకే విక్రేత ఉండే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, తద్వారా అగస్టా వెస్ట్‌లాండ్ కంపనీకే కాంట్రాక్టు దక్కేలా చూసిందని ధ్వజమెత్తారు. వివిఐపి హెలికాప్టర్ల కుంభకోణంపై సిబిఐ 2013 మార్చిలో కేసు నమోదు చేసినప్పటికీ, ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఆ ఏడాది డిసెంబర్ వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు పంపించలేదని పేర్కొంటూ పారికర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన లోక్‌సభలో హెలికాప్టర్ల కుంభకోణంపై వచ్చిన సావధాన తీర్మానంపై మాట్లాడుతూ ‘యుపిఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌లాండ్ కంపనీపై ఎలాంటి చర్య తీసుకోలేద’న్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మొక్కుబడిగా కేసు నమోదు చేసిందని బిజెపి నాయకుడు కూడా అయిన పారికర్ ధ్వజమెత్తారు.
కుంభకోణంలో నిందితులయిన భారత వాయుసేన మాజీ అధిపతి ఎస్‌పి త్యాగి, గౌతమ్ ఖేతాన్ ఇద్దరు కూడా చాలా చిన్న వ్యక్తులని అభివర్ణించారు. గంగానది వంటి అవినీతి ప్రవాహంలో వీరిద్దరు కేవలం చేతులు కడుక్కున్నారని పేర్కొంటూ ఈ నది ఎక్కడికి పోయిందో ప్రభుత్వం కనుక్కోవాల్సి ఉందని పారికర్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కుంభకోణంలో ముడుపులు స్వీకరించిన ప్రధాన లబ్ధిదారులను గుర్తిస్తామని పేర్కొంటూ బోఫోర్స్ కుంభకోణంలో తాము చేయలేని పనిని ఈ కుంభకోణంలో చేసి తీరగలమని పారికర్ స్పష్టం చేశారు. అరుణ్ జైట్లీ 2014 జూలైలో రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మాత్రమే అగస్టా వెస్ట్‌లాండ్ కేసు ఇడి దృష్టికి వెళ్లిందని పారికర్ వెల్లడించారు. అప్పటి యుపిఎ ప్రభుత్వానికి ఈ హెలికాప్టర్ల కుంభకోణం గురించి 2012 ఫిబ్రవరిలోనే తెలిసినప్పటికీ ఆ సంవత్సరం డిసెంబర్‌లో మూడు హెలికాప్టర్లను అగస్టా వెస్ట్‌లాండ్ నుంచి స్వీకరించిందని ఆయన విమర్శించారు. ‘మీరు (కాంగ్రెస్) ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నేను ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. గంగానది ఎక్కడికి వెళ్లిందో మీరు చూస్తారు’ అంటూ పారికర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.