అక్షర

అబ్బుర పరచే జంపన నవలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంపన నవలలు
వెల: రు.220/-
ప్రతులకు:
నవచేతన
బుక్‌హౌస్,
విశాలాంధ్ర బుక్‌హౌస్
వారి పుస్తకశాలలు

‘‘కొవ్వలి, జంపన’’అనే పేర్లు దాదాపు మూడు దశాబ్దాలు తెలుగునాట మార్మోగాయి. వీరి నవలల్ని ఎగబడి చదివేవారు. తెలుగువాళ్ళని సాహిత్య పాఠకులుగా మార్చింది ఈ జంట కవులలాంటి కొవ్వలి, జంపన. కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలల్ని మొదట అచ్చువేసి (చాలాకాలం తర్వాత) వెలుగులోకి తెచ్చింది విశాలాంధ్ర ప్రచురణాలయం. అదే సంస్థ నవచేతన బుక్‌హౌస్ ప్రచురణగా జంపన నవలలు (మొదటి సంపుటం) తీసుకువచ్చింది. మరుగునపడిన ప్రతిభావంతులైన నవలా రచయితల నవలల్ని ఈ తరానికి అందిస్తున్న సాహిత్యసేవ ప్రశంసనీయం. అసలైన పరిశోధకుడైన డా.ఏటుకూరి ప్రసాద్‌వల్లనే ఇది సాధ్యమైంది.
జంపన పూర్తిపేరు జంపన చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లాలో జన్మించి ఎం.ఏ. చదివి ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో (నేను చదివిన కళాశాల) తెలుగు ఉపన్యాసకులుగా, వైస్ ప్రిన్సిపాల్‌గా అన్నామలై విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా పనిచేశారు. కొవ్వలి కంటె విద్యావంతులు జంపన. ఇద్దరూ నవలికల వంటి చిన్న నవలలే రాశారు. ఈ మొదటి సంపుటంలో ఆరు నవలలున్నాయి. ‘‘మా నాన్నగారు’’అంటూ జంపన కూతురు జ్యోత్స్న రాసిన మాటలు ఈ పుస్తకానికి విలువ పెంచాయి. 1935-45 ప్రాంతంలో ప్రేమలూ-పెళ్ళిళ్ళూ- వైఫల్యాలూ- దొంగబుద్ధులూ బాగా వ్యాపించి వుంటాయి. అందుకే కొవ్వలి, జంపన నవలల్లో వీటికి సంబంధించిన ఇతివృత్తాలు గమనిస్తాం. స్ర్తి జీవితాలు కేంద్ర బిందువుగానే నవలలు రాశారు. ఎందుకోగానీ చలాన్ని పైకెత్తుకొన్నంతగా వీళ్ళ వంక చూడలేకపోయారు. ‘‘కొవ్వలి-జంపన-చలం’’ ముగ్గురూ ఒక కోవకి చెందుతారు. ‘‘శృంగారం’’ఉన్నమాట నిజమే కాని అప్పటి మధ్యతరగతి స్ర్తిల సంసారాలను, మగవారి దాష్టీకాన్ని వీళ్ళు ఎండగట్టారు. చలం నవలలో గల అసభ్యత అని పిలచే సంభాషణలు సన్నివేశాలు కొవ్వలి, జంపన నవలల్లో కనిపించవు.
మొదటి నవల ‘‘నిర్దోషి’’లో వరకట్న సమస్య ప్రధానం. ‘‘కట్నం కట్నం అని విరుచుకు పడటం న్యాయంకాదు. కట్నం ఈయలేదని పెండ్లి కూతురుని విడిచి వేయటం, కల్యాణానంతరం ఆమె సౌశీల్యాన్ని శంకించటం, కఠిన హృదయులై ఆమెను విడిచివేయటం కన్నీరు కార్పించటం- ఇది న్యాయమా? సంఘశ్రేయమా? ఈ విషయాలను చర్చిస్తూ ఈ నవల వ్రాశారు’’అంటారు జంపన (చంద్రం పేరుతో) ఈ నవలలో వాంఛ, ఆశలపై రచయిత హితవు పలుకుతారు. ఎక్కువగా జంపన కష్టజీవుల పక్షానే నిలబడతారు. ‘‘్భరత స్ర్తి జన్మమాతృత్వమునందే సాఫల్యమగును’’అనే వాక్యం ఆధారంగా రాయబడిన నవల ‘‘కన్నతల్లి’’. ‘‘కన్నతల్లి ప్రేమ గట్టులు తెగిన సముద్రం. కన్నతల్లి ఆనందం ఆనకట్టలేని గంగాప్రవాహం. పాపాయిని హృదయానికి హత్తుకున్న కన్నతండ్రి నందన మందార ప్రవాళశయ్యా తలమీద పరున్నట్లుంది. పాపాయిని మధ్యపెట్టుకొని ఆ తల్లీదండ్రులు ఈ పాప భూయిష్ఠమైన ప్రపంచాన్ని మరచిపోయి ఆనంద ప్రపంచంలో స్వర్గీయ సుఖాన్ని అనుభవిస్తున్నారు. ‘‘ఆహుతి’’ నవలలో స్ర్తిల దృఢచిత్తం, ఆత్మబలం వంటి వాటిని వెల్లడిస్తూనే అక్రమ సంబంధాలపై కనె్నర్ర జేశారు. నిర్మల ప్రేమ గురించి, స్ర్తిల విద్యావశ్యకత గురించి ‘‘హారతి’’ నవల విశదీకరిస్తుంది. ‘‘ఆంగ్ల విద్యావ్యామోహ పిశాచానికి బలి’’ కాకూడదని ప్రబోధిస్తారు జంపన.
ఈ నవలల్లో సామాజిక స్పృహ ఎక్కువ. వర్ణనలూ తక్కువేమీ కాదు. ఒకప్పటి తెలుగు పలుకుబడులు కనిపిస్తాయి. భావ కవిత్వ ప్రభావంతో కావచ్చు జంపనలో కాల్పనిక వర్ణనలు, సమాస భూయిష్ఠమైన వర్ణనలూ ఉన్నాయి. సంభాషణా శిల్పం బాగా వుంది. ‘పతిత’అనే నవల ద్వారా జంపన ఇచ్చిన సందేశం గమనిస్తే ఎంతటి నిక్కచ్చిమనిషో, ప్రగతిశీలురో తెలుస్తుంది- ‘‘్ధనవంతురాలు మల్లిక ‘‘పతిత’’అయినా ‘‘పతివ్రతే’’! పేదరాలు జానకి ‘‘పతివ్రత’’అయినా పతితే’’! అయితే దీనికి కారణం భాగ్యదేవతే కదా అనటం సంప్రదాయ నేపథ్యాన్ని వీడకపోవటమే! అభ్యుదయ ఉద్యమం ప్రారంభ దశలో జంపన ఈ నవలలు రాయడం అబ్బురపరుస్తుంది. ఒకనాటి సామాజిక స్థితిగతులకి అద్దంపట్టే నవలలివి.

- ద్వా.నా.శాస్ర్తీ