జనాంతికం - బుద్దా మురళి

జై.. జై.. మేధావులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సినిమా టికెట్లు కావాలా? నాకు తెలిసి నువ్వు బాహుబలికి కూడా దూరంగానే ఉన్నావు?’’
‘‘ఔను మూడేళ్ల క్రితం థియోటర్‌కు వెళ్లి చూసిన సినిమా బిక్షగాడు.’’
‘‘మరిప్పుడేంటి టికెట్ల గురించి అడుగుతున్నావ్?’’
‘‘అదేదో అలవైకుంఠపురంలో.. సినిమాలో ఒక పాట గురించి మేధావులు తీవ్రంగా చర్చిస్తున్నారు. కథ గురించి మేధావులు తీవ్రంగా విమర్శిస్తున్నారు’’
‘‘వాళ్ల అభిప్రాయం, వాళ్ల ఇష్టం నీకెందుకు?’’
‘‘మేధావులు ఓ సినిమాను మెచ్చుకున్నారు అంటే ఆ సినిమా నిర్మాత రోడ్డున పడ్డాడు అనే.. అలానే విమర్శకులు, మేధావులు మండిపడుతున్నారు అంటే ఆ సినిమా సూపర్ హిట్ మాత్రమే కాదు. చూడదగింది ఏదో ఆ సినిమాలో ఉన్నట్టే.. అందుకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల కోసం ప్రయత్నిస్తే లేవు. నువ్వేమైనా సహాయం చేస్తావేమో అని..’’
‘‘అదేంటోయ్ బుద్ధి జీవివై ఉండి, సాటి మేధావులను అవమానిస్తావా? వారి నిర్ణయాలను గౌరవించి సినిమాను, ఆ సినిమాలో పాటలను విమర్శించాలి. కానీ నువ్వేంటి?’’
‘‘దీనికి సంబంధించి నాకో థియరీ ఉందిలే! మల్లేషం, జార్జిరెడ్డి, చపాక్ వంటి ఎన్నో సినిమాల గురించి మేధావులు మహాద్భుతం అని అనేక ప్రశంసలు కురిపించారు కదా? అలాంటి సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అలానే ఇదేం సినిమా అని మేధావులు అన్నారంటే సూపర్ హిట్ అన్నమాటే! ’’
‘‘ఇదేం థియరీ?’’
‘‘80-20 థియరీ నీకు తెలుసు కదా? ’’
‘‘ఎందుకు తెలియదు? ఆ సిద్ధాంతంపై వచ్చిన పుస్తకాలు కూడా చదివాను. 80 శాతం పనులు 20 శాతం మంది సిబ్బంది చేస్తారని, 80 శాతం ఆదాయం 20 శాతం మంది ఖాతాదారుల నుంచి వస్తుందని ఇలా ప్రపంచంలో అన్నింటిలోనూ 80 శాతం ఫలితాలు 20 శాతం నుంచే వస్తాయనే సిద్ధాంతం నాకెందుకు తెలియదు’’
‘‘ఈ సిద్ధాంతంలానే మేధావులు ఏం చెబితే.. వాస్తవం దానికి పూర్తి భిన్నం గా ఉంటుంది అనేది నా సిద్ధాంతం. ఇది ఆచరణాత్మక సిద్ధాంతం. రెండు మూడు నెలల క్రితం ఈ సిద్ధాంతాన్ని నేను స్టాక్ మార్కెట్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఫలితాలు సాధించిన తరువాతనే మాట్లాడుతున్నాను’’
‘‘ఎలా రుజువైంది?’’
‘‘ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతులు సాధించిన భారతీయ మేధావులు, సాధించడానికి దగ్గరలో ఉన్న మేధావులు చేసిన ఉపన్యాసాలు వింటే ఒక్కసారి భయం వేసింది. దేశం ఆర్థికంగా అధోపాతాళంలో ఉందని, రేపు గడవడం ఎలా అనిపించింది!? అయిపోయింది.. అంతా అయిపోయింది అని మేధావులు విశే్లషించారు. సునామీ వస్తుంటే ఎలా మునిగిపోతారో ఆర్థిక సంక్షోభంలో అలా మునిగిపోతున్నామని భయం వేసింది. తిండి గింజల కోసం ఏ దేశానికి పారిపోతే బాగుంటుందా? అని కూడా ఆలోచించాను’’
‘‘తరువాత?’’
‘‘సెకండ్ ఒపీనియన్ అంటారు కదా? ఆపరేషన్ అనివార్యం అని ఒక డాక్టర్ చెబితే, సెకండ్ ఒపీనియన్ కోసం మరో డాక్టర్ వద్దకు వెళితే తలకింత అమృతాంజనం రాసుకుంటే సరిపోతుంది అని చెబుతారు’’
‘‘నువ్వేం చేశావో చెప్పు?’’
‘‘మేధావుల ఉపన్యాసాలు విన్న తరువాత బతుకు జట్కా బండి అయిపోతుందని భయం వేసింది. సెకండ్ ఒపీనియన్ చూద్దామని’’
‘‘ఆ...’’
‘‘స్టాక్ మార్కెట్‌లో సచిన్‌టెండూల్కర్ వంటి డిమాట్ దమానీ, జున్‌జున్‌వాలా వంటి వారి ఉపన్యాసాలు విన్నాను. అప్పటి వరకు మోసిన భారం దూదిపింజలా తేలిక అయిపోయింది. ఎవరికీ చెప్పకు.. అప్పటి వరకు దేశ ప్రజలకు రేపటి నుంచి తిండిగింజలు కూడా దొరకవేమో అన్నంత ఆర్థిక సంక్షోభంలో అంతా కొట్టుకుపోతారేమో అని భయపడ్డ నేను సంతోషంతో ఎగిరి గంతేశాను’’
‘‘గంతేసి ఏం చేశావు?’’
‘‘కుళ్లుకోను అంటే చెబుతాను. వారి ఉపన్యాసాలు విన్న తరువాత స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేశాను. కేవలం మూడు నెలల వ్యవధిలో 20 శాతం లాభాలు కళ్ల చూశాను. అప్పటి నుంచి మేధావుల ఆలోచనకు పూర్తి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటే గ్రాండ్ సక్సెస్ అనే సిద్ధాంతం కనిపెట్టాను. 80-20 సిద్ధాంతంలా ఈ సిద్ధాంతం కూడా ఏదో ఒకనాడు పాపులర్ అవుతుందని నా నమ్మకం’’
‘‘అన్నింటికీ ఈ రివర్స్ పనిచేస్తుందంటావా?’’
‘‘సినిమా విడుదలైన రెండు వారాల తరువాత కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఇటీవల కాలంలో విన్నావా?’’
‘‘వినలేదు’’
‘‘అదేదో పురం సినిమాకు టికెట్లు దొరకడం లేదు... దీనిలోనూ మేధావుల పాత్ర ఉంది’’
‘‘కథను, పాటలను మేధావులు తీవ్రంగా విమర్శించడం నేనూ చూశాను’’
‘‘అందుకే రెండవ వారం తరువాత కూడా టికెట్లు దొరకడం లేదు అనేది నా సిద్ధాంతం’’
‘‘ఔను సామజవరగమణ.. పాటమీద తీవ్రంగా విమర్శలు వచ్చినట్టున్నాయ్ నువ్వేమంటావు..!’’
‘‘దేవత సినిమా సమయంలో రాఘవేంద్రరావును ఒక క్రిటిక్ తీవ్రంగా విమర్శించారు. ఖాళీ బిందెలతో శోభన్‌బాబు, శ్రీదేవిల పాట గురించి.. ఖాళీ బిందెలతో మరీ సిల్లీగా ఉంది. ఎక్కడైనా అలా జరుగుతుందా? అని మండిపడ్డాడా క్రిటిక్.. దానికి రాఘవేంద్రరావు కూల్‌గా నువ్వు ఎవరినైనా ప్రేమించావా? పోనీ మీ ఇంట్లో వాళ్లు, మీ స్నేహితులు ఎవరినైనా ప్రేమించారా? అని అడిగారు. అతనేం సమాధానం చెప్పాడో కానీ.. రాఘవేంద్రరావే నవ్వుతూ ఎవ్వరూ ప్రేమించుకుంటూ పాట పాడుకోరు. ప్రేమించుకుంటూ పాట పాడుకోవడమే ఇల్లాజికల్ అయినప్పుడు ఖాళీ బిందెలు ఒక్కటే ఇల్లాజికల్ ఏంటి? అని ప్రశ్నించాడు. నిజమే కదా? ఎవరైనా ప్రేమించుకుంటూ పాట పాడుకుంటారా? ఇక పాట పాడుకోవడమే ఇల్లాజికల్ అయినప్పుడు పాటలో ఏ పదాలుంటే ఏం?’’
‘‘అంటే మేధావులు ఏం చెప్పినా దానిని రివర్స్‌లో ఆచరించడం మంచిదంటావా?’’
‘‘చాలా విషయాల్లో మంచిదే అని రుజవవుతుంటే ఏం ఆచరించక ఏం చేద్దాం?’’
‘‘మేధావులు అంటే నీకు కోపం’’
‘‘కాదు.. ప్రేమ.. ఈ మధ్య సంపన్నుల జాబితా ఒకటి ప్రకటిస్తే, అందులో మా వాటా ఏది? అని ఒక కవి నిలదీశారు కవిత్వం రాశారు’’
‘‘నిజమే కదా?’’
‘‘కవుల జాబితాలో మన పేర్లు ఉన్నాయి కదా? మరి సంపన్నుల జాబితాలో పేర్లు ఉన్న ఒక్కరి పేరు కూడా కవుల జాబితాలో లేవు. దానికి వాళ్లు ఇలానే బాధపడ్డారా? లేదు కదా? పైగా వాళ్ల పేర్లు చూసి మనం బాధపడి, కవితలు రాసి, అప్పు చేసిన డబ్బుతో ఆ కవితలను సంకలనంగా వేసి ఉచితంగా పంచి, మరింత అప్పుల్లో కూరుకుపోతున్నాం. కానీ సంపన్నులు మాత్రం తమ వ్యాపారాల్లో బిజీగా ఉండి మరింత సంపన్నులు అవుతున్నారు. ఏటేటా వారి సంపద పెరుగుతోంది. మన ఇంట్లో పంచగా మిగిలిన కవితా సంకలనాల గుట్టలు మిగులుతున్నాయి’’
‘‘అందుకేనేమో పెద్దలు ఎప్పుడో చెప్పారు.. యద్భావం తద్భవతి అని.. మనం కవితల గురించి ఆలోచిస్తే కవిత్వం దక్కుతుంది. సంపద గురించి ఆలోచిస్తే సంపద, పేదరికం గురించి ఆలోచిస్తే పేదరికం దక్కుతుంది. అందుకే మనకేం కావాలో మనకు స్పష్టత ఉండాలి’’

buddhamurali2464@gmail.com