జనాంతికం - బుద్దా మురళి

సామ్యవాద స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హీ..హీ.. ఏంటన్నా దీర్ఘాలోచనలో ఉన్నావు. స్టాక్ మార్కెట్‌లో మొత్తం తుడిచిపెట్టుకుపోయిందా?’’
‘‘అలాంటిదేమీ లేదు’’
‘‘లాభాల్లో బయటపడ్డావా?’’
‘‘నా సంగతికేం కానీ నీ హీహీ..కి అర్థం ఏమిటి? మార్కెట్‌లో నిండా మునిగిపోయానని సంతోషమా? లేక సానుభూతి తెలపాలని ఉబలాటమా?’’
‘‘హీ..హీ.. అలాంటిదేమీ లేదు. ఏదో ఆసక్తి కొద్ది తెలుసుకుందామని అంతే.. ఎంత తుడిచిపెట్టుకు పోయిందేంటి?’’
‘‘చాలా తక్కువ? నేను చావు దెబ్బతిననందుకు నిరాశగా ఉన్నట్టుంది.’’
‘‘అప్పుడే అనుకున్నాను. వారెన్‌బఫెట్ సూక్తులు చదువుతూ, జున్‌జున్‌వాలా ఉపన్యాసాలు, దమానీ వీడియోలు వింటున్నప్పుడే అనుకున్నాను. స్టాక్ మార్కెట్‌ను ఔపోసన పట్టావని. అవే నిన్ను రక్షించాయన్నమాట! ఆ బుక్స్ ఓసారి నాకూ ఇస్తావా? చదువుకుని స్టాక్ మార్కెట్‌లో నేనూ చక్రం తిప్పుతాను’’
‘‘ఓదార్చుదామని వచ్చిన నీకు నా సమాధానం తీవ్రంగా నిరాశ కలిగించిందని నీ ముఖం చూస్తే అర్థం అవుతోంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుందోయ్’’
‘‘కథలు చెప్పకు.. ఆ పుస్తకాలు ఓసారి చదవిస్తే నీ ముల్లేమన్నా పోయిందా?’’
‘‘కవిత్వంపై పిచ్చి అభిమానం ఉంది. అచ్చం మీలానే కవిత రాయాలంటే ఏం చేయాలి? అని శ్రీశ్రీని అడిగితే ఎలా ఉంటుంది? అడిగితే ఫరవాలేదు కానీ 30 రోజుల్లో శ్రీశ్రీ కావడమెలా? అనే పుస్తకం చదివితే 30 రోజుల్లో శ్రీశ్రీ అయపోతారా?’’
‘‘అంటే స్టాక్ మార్కెట్‌లో నువ్వు శ్రీశ్రీని అంటావు’’
‘‘ఆ మాట నేను అనలేదు. ఏదో చదివి, ఏదో చేస్తే శ్రీశ్రీ అయ్యేట్టుంటే ఇంటికో శ్రీశ్రీ ఉండేవాడు. వీధికో గురజాడ అప్పారావు కనిపించేవారు.’’
‘‘సరే మరి స్టాక్ మార్కెట్ నుంచి చావుదెబ్బతినకుండా ఎలా బయటపడ్డావు ఆ సంగతి చెప్పు’’
‘‘నీలో స్టాక్ మార్కెట్ మెళుకువలు తెలుసుకోవాలనే ఆసక్తి కన్నా... నేను చావుదెబ్బతినలేదు అనే ఆవేదన ఎక్కువగా కనిపిస్తోంది’’
‘‘ఇంతకూ ఆ పుస్తకాలు ఇస్తావా? ఇవ్వవా? ఆ సంగతి చెప్పు’’
‘‘ఎప్పుడో చిన్నప్పుడు చందమామలో ఒక కథ చదివాను. ఒక డాక్టర్ హస్తవాసి మంచిదని పేరు. ఆ రోజుల్లో డాక్టర్లు బ్యాగు పట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ వైద్యం చేసేవారు. వైద్యుడికి గ్రామాల్లో మంచి ఆదరణ ఉండేది, ఆదాయం ఉండేది. ఓ దొంగ ఆ బ్యాగులోనే మహాత్య్మం ఉందనుకుని... ఎలాగైనా ఆ సంచిని ఎత్తుకెళ్లి, సంచితో డాక్టర్‌లా తానూ సంపాదించాలని అనుకుని, డాక్టర్‌ను అనుసరించి, డాక్టర్ ఆదమరిచి ఉన్నప్పుడు సంచి ఎత్తుకెళతాడు. దూరంగా వెళ్లి చూస్తే సంచిలో ఏవో పుస్తకాలు, మందులు ఉన్నాయి. అవి తనకెందుకూ ఉపయోగపడవు అని గ్రహించి పారేసి వేళతాడు’’
‘‘అంటే స్టాక్ మార్కెట్ గురించిన పుస్తకాలు నీలాంటి మేధావులకే తప్ప మాలాంటి వారికి అర్థం కావు అంటావు?’’
‘‘ఆ మాట నేను అనలేదు.’’
‘‘ముసుగులో గుద్దులాట ఎందుకు కానీ.. స్టాక్ మార్కెట్‌లో ఎంత సంపాదించావు? పోనీ అంతా నష్టపోయినా నువ్వు మాత్రం నష్టపోకుండా ఎలా ఉన్నావు?’’
‘‘కరోనాకు తన పర అనే బేధం ఉండదు. పేదలు, సంపన్నులు అనే వివక్ష ఉండదు. కులం, మతం, ప్రాంతం అనే బేధం ఉండదు’’
‘‘ఆ సంగతి మాకు తెలుసు కానీ.. స్టాక్ మార్కెట్ గురించి అడుగుతుంటే కరోనా గురించి చెబుతావేం?’’
‘‘అక్కడికే వస్తున్నాను. కరోనాలానే స్టాక్ మార్కెట్‌కు కూడా ఎలాంటి వివక్ష ఉండదు. జాలి, దయ ఉండదు. కరోనా అందరినీ ఆవహిస్తుంది. స్టాక్ మార్కెట్ అందరికీ పాఠాలు చెబుతుంది.’’
‘‘మరి నువ్వేలా భయటపడ్డావు’’
‘‘నేను బయటపడ్డానని చెప్పలేదు. స్టాక్ మార్కెట్ ముఖేష్ అంబానీ, అదానీ, రాకేశ్ జున్‌జున్ వాలా? డీ మార్ట్ రాధాకృష్ణ అందరికీ పాఠాలు చెబుతుంది. నెల జీతంలో పన్ను రాయితీలకు ఆశపడి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే కుటుంబరావులకు పాఠాలు చెబుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి దారుల స్వర్గ్ధామం అంటారు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్ సామ్యవాదానికి చక్కని ఉదాహరణ. ఇక్కడ అందరికీ సమానంగా మార్కెట్ పాఠాలు చెబుతుంది. మార్కెట్‌ను తప్పించుకునేవారెవరూ ఉండరు. కేసు ఓడిపోయిన వాడు కోర్టులో ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వచ్చాక ఏడుస్తాడు. ఏడుపు కామన్. స్టాక్ మార్కెట్ అంతే.. ఎవడిని కదిపినా ఏ స్టాక్ కొంటే ఎంత లాభమో, తానెలా లాభం పొందాడో కథలు కథలుగా చెబుతాడు. వాడి మనసుకు తెలుసు ఏ స్టాక్‌లో ఎంత దెబ్బతిన్నాడో’’
‘‘అదే అడుగుతున్నాను.. నువ్వెంత దెబ్బతిన్నావని?’’
‘‘నువ్వు సిగరెట్లకు, మందుకు, సినిమాలకు ఎంత ఖర్చు పెడతావో అంతే మొత్తం నేను నెల నెలా స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను’’
‘‘అంటే నీ కన్నా నేనే బెటర్ కదా? నేను సంపాదించిన డబ్బును నేననుభవించాను. నీకా సుఖం కూడా లేదు. మార్కెట్‌లో పొగొట్టుకున్నావ్?’’
‘‘నిజమే నా పాకెట్ మనీని మార్కెట్‌లో పోగొట్టుకున్నా.. నువ్వు డబ్బిచ్చి అనారోగ్యం కొనుకున్నావ్’’
‘‘అంటే నష్టపోయానని మాత్రం ఒప్పుకోవు?’’
‘‘పాకెట్ మనీని ఇనె్వస్ట్ చేసినవాడు పాకెట్ మనీ అంత, కోట్ల రూపాయలు ఇనె్వస్ట్ చేసినవారు దానికి తగ్గట్టు నష్టపోయారు. మార్కెట్ అందరికీ పాఠాలు నేర్పుతుంది. వీరు పొగుట్టుకున్న ఫీజును నష్టం రూపంలో చెల్లించుకున్నట్టు. ఈ రోజు పొగుట్టుకున్న డబ్బు మార్కెట్ బాగుపడిన తరువాత తిరిగి సంపాదిస్తాను. నువ్వు పోగొట్టుకున్న అనారోగ్యాన్ని మళ్లీ సంపాదించుకోగలవా?’’
‘‘ఎటు తిప్పి ననే్న అంటావు.. ఇంతకూ మార్కెట్ ఎప్పుడు బాగుపడుతుంది అంటావు’’
‘‘కరోనా వైరస్‌కు మందు దొరికిన తరువాత’’
‘‘దొరుకుతుందా?’’
‘‘మనిషి సమస్యలను తానే కొని తెచ్చుకుంటాడు. ఆ సమస్యలకు తానే పరిష్కారం కనుగొంటాడు. భస్మాసుర హస్తంలా మనిషి జాతినే హరించే వైరస్‌ను సృష్టించింది మనిషే.. ఆ వైరస్‌ను నిర్మూలించేందుకు తన శరీరానే్న ప్రయోగశాలగా మార్చుకుని మందు కనిపెట్టేందుకు తపిస్తున్నది మనిషే’’
‘‘ఐనా మనమేదో తప్పు చేసినట్టు ఇంట్లోనే ఉండాలనే ఈ ఆంక్షలేమిటో’’
‘‘విదేశాల నుంచి వచ్చిన కొందరికి కరోనా వైరస్ లక్షణాలు ఉండవచ్చుననే అనుమానంతో 14 రోజులు ఇంట్లోనే ఉండాలని ఆంక్షలు విధిస్తే... వారు హాయిగా షాపింగ్ మాల్స్ తిరుగుతూ పర్యటనలు చేస్తున్నారట! మహమ్మారి విజృంభించినా ఈ మనుషుల్లో మార్పు రాదేమో’’
‘‘ఔను ఇంటి నుంచి బయటకు రావద్దని వారి మో చేతిపై ముద్ర వేస్తున్నారు. ఓటు వేసినప్పుడు ఉపయోగించే ఇంకుతో ముద్ర వేస్తున్నారు. ఆ ముద్రను గుర్తించి విచ్చల విడిగా తిరిగే వారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు.’’
‘‘చేతికి ముద్ర వేసినా బయట తిరిగే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మహారాష్ట్ర నిర్ణయించింది.’’
‘‘మోచేతి మీద ముద్ర వేస్తే కనిపించకుండా ఫుల్ షర్ట్ వేసుకుని తిరుగుతారు. నుదుటి మీద ఆ ముద్ర వేస్తే బాగుండు. ఎందుకంటే మనలో మనిషి చనిపోయి చాలా కాలం అవుతుంది. పశువులుకు ముద్రలు వేసినట్టు వేస్తే కానీ మనలో చలనం రాదు’’-

buddhamurali2464@gmail.com