జనాంతికం - బుద్దా మురళి
విశ్వ మానవ కరోనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘‘కరోనాలో నాకో విశ్వమానవుడు కనిపిస్తున్నాడు’’
‘‘సిగ్గు లేకపోతే సరి. కరోనాతో ప్రపంచం విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో స్టాక్ మార్కెట్‌లో అన్నీ కుప్పకూలిపోయాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా సైతం వణికిపోతోంది. అమెరికా మార్కెట్లు కూడా నేల చూపు చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్ వెలిగిపోతోంది. నేను మళ్లీ గెలిస్తే మార్కెట్లు ఇలానే పైకి ఎగురుతాయి. లేదంటే నేల చూపులు చూస్తాయని ట్రింప్ చెప్పిన కొన్ని గంటల్లోనే అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి.’’
‘‘ఔను ఆ వార్త నేనూ చూశాను. ట్రంప్ భరోసా ఇస్తేనే ఇలా పడిపోయాయి, ఇక ఆయన మాట్లాడి ఉండకపోతే మార్కెట్లు ఇంకెంత కూలిపోయేవో అనుకున్నాను.’’
‘‘ప్రపంచాన్ని భయపెట్టే అమెరికాను కూడా అదేదో చిన్న వైరస్ భయపెట్టడం ఆశ్చర్యమే కదా?’’
‘‘ఔను బ్రహ్మంగారు ఈ విషయం ఎప్పుడో చెప్పారు’’
‘‘ఆయనేం చెప్పారో? నువ్వేం విన్నావో తెలియదు కానీ ప్రపంచానికి పాడు రోజులు దాపురించాయి’’
‘‘చెప్పినా వినకుండా అమరావతిని నుంచి రాజధానిని తరలిస్తే ఇలా కాకుంటే ఇంకెలా ఉంటుంది’’
‘‘అబ్బా నువ్వు మరీ అదేదో టీవి చానల్‌లా మాట్లాడకు. రెండు గ్రామాల్లో జరుగుతున్న మహాద్యమం అంటూ టీవి ఆన్ చేయగానే గట్టిగా అరుస్తున్నారు. ఆ దెబ్బతో టీవీ ఆన్ చేయాలంటేనే భయమేస్తుంది. రోజూ మహోద్యమం అంటున్నాడు కదా? ఈ రోజు ఏం చెబుతాడో అని ఓ సారి చూశా... విస్తరిస్తున్న మహోద్యమం అని చెప్పాడు. ఏంటా అన విచారిస్తే, ఆ గ్రామంలో మరో రెండు ఇళ్ల వాళ్లు కూడా ఉద్యమంలో పాల్గొన్నారట! నిజమే అది విస్తరణే కదా? అని ప్రత్యర్థి పార్టీల వాళ్లు చెబుతున్నారు. ఒక పార్టీ వారేమో అంతర్జాతీయ ఉద్యమం అంటారు. ఇంకో పార్టీ వాళ్లేమో 20 గ్రామాల ఉద్యమం అంటారు. పోనీ వీరి మాటలు పట్టించుకోకుండా టీవిలు ఏం చెబుతున్నాయో విందామంటే అచ్చం వీరి నోటిలో నుండి ఊడిపడ్డట్టుగానే ఉంటున్నాయి వారి మాటలు.’’
‘‘కరోనా నుంచి విశ్వమానవుడి నుంచి అమరావతికి చేరుకున్నావా? ఎక్కడ మొదలు పెట్టావు ఏం చెప్పాలనుకున్నావు? ఏం చెబుతున్నావు? ఇంతకూ కరోనా విశ్వమానవుడు అంటావా? కరోనా అనేది మనిషి పేరు కాదు. అదో వైరస్...’’
‘‘తెలుసులే! గత కాలం మహానాయకులంతా మనుషుల మధ్య గోడలు ఉండవద్దు మనిషి అనే వాడు విశ్వమానవుడిగా ఉండాలని అన్నారు. అమెరికాలో నెహ్రూను అప్పటి విపక్ష నేత ఒకరు విమర్శిస్తే, విదేశాల్లో మన దేశ పరువు నిలబెట్టాలి కానీ నెహ్రూను విమర్శిస్తావా? అని నిలదీశారట! దాని కాయన నేను విశ్వమానవుడిని నెహ్రూ గురించి ఇండియాలో ఒక మాట అమెరికాలో ఇంకో మాట మాట్లాడను అన్నాడట..’’
‘‘నిజమే ఆ రోజుల్లో అధికార పక్షంలో, విపక్షంలో అంతటి వివేక వంతులైన నాయకులకు కొదవ లేదు. కానీ ఈ రోజుల్లో....’’
‘‘అసలు విషయం చెప్పడం లేదు..’’
‘‘అక్కడికే వస్తున్నా... ప్రపంచానికి పెద్దన్నను అని చెప్పుకునే అమెరికా సైతం ఫస్ట్ అమెరికా అంటూ మాకు మా దేశమే ముఖ్యం అంటున్నారు కదా? అప్పుడు ప్రపంచానికి పెద్దన్న అని ఎలా చెప్పుకుంటారు’’
‘‘అదేమన్నా భారత్ అనుకున్నావా? ఇక్కడ మేధావులు కొందరు తమ దేశ ప్రయోజనాల కన్నా పొరుగు దేశాల ప్రయోజనాలే ఫస్ట్ అంటారు. కొందరు పాక్ అభిమానులైతే... కొందరు చైనా అభిమానులు, మరి కొందరు శ్రీలంక అభిమానులు. వీళ్లకు మాతృ దేశం కన్నా ఎన్నో విషయాల్లో భారత్‌ను వ్యతిరేకించే దేశాలే ముఖ్యం. అమెరికా ఏమన్నా మన దేశంలా అనుకున్నావా? ఏ పార్టీ అధికారంలో ఉన్న అమెరికా పాలకులకు అమెరికానే తొలి ప్రాధాన్యత. పైగా ఏ దేశంతోనైనా సంబంధాలు కూడా తమ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చూస్తారు. తమ దేశమే తమకు ముఖ్యం కాబట్టి అమెరికా అలా ముందు వరుసలో ఉంది. మనమిలా ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం.’’
‘‘ముందు విషయం చెప్పనివ్వు.. అమెరికాతో కూడా సాధ్యం కానిది కరోనాతో సాధ్యం అయింది అని చెప్పదలుచుకున్నాను’’
‘‘ఎలా?’’
‘‘చైనాలో తొలుత కరోనా వస్తే మనకెందుకులే అనుకున్న దేశాలే ఎక్కువ. కానీ కరోనా తాను అల్లా టప్పా జలుబు వైరస్‌ను అనుకుంటున్నారేమో అని హూంకరించింది’’
‘‘ఔను ఇప్పుడు ప్రపంచం వణికిపోతోంది. కరోనా ప్రపంచాన్ని ఏకం చేసింది. ఆసియా, యూరప్, మధ్య ఆసియా అనే తేడా లేదు గ్లోబ్‌ను కరోనా చుట్టు ముట్టేసింది.40 దేశాల్లో కరోనా తన పంజావిసిరింది.’’
‘‘నిజమే రెండు దేశాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. ఏదో ఓ రోజు యుద్ధం తప్పదు అనుకున్నారు’’
‘‘ఇండియా పాక్‌ల మధ్యనా?’’
‘‘ఇండియా చైనాల మధ్య’’
‘‘ఐతే?’’
‘‘ఇండియా ప్రత్యేక విమానాన్ని చైనా పంపింది. మందులు, డాక్టర్లతో పాటు..’’
‘‘ ఆ మధ్య పాకిస్తాన్ మంత్రి ఒకరు యుద్ధం తేదీలను కూడా ప్రకటించాడు కదా?’’
‘‘పాక్ మంత్రే కాదు మన మీడియా కూడా యుద్ధ ముహూర్తాన్ని ప్రకటించేశాయి. అలాంటి పాక్ దేశానికి చెందిన విద్యార్థులను చైనాలో వారి మానాన వారిని వదిలేస్తే, ఇండియా చేయూత నిచ్చింది. మన విద్యార్థులతో పాటు వారి విద్యార్థులను రక్షించింది.. ఇరాన్‌లో మంత్రికి సైతం కరోనా సోకిందట! యూరప్‌లో కూడా ఓ మంత్రికి కరోనా అని నిర్థారణ కాని వార్తలు వచ్చాయి.’’
‘‘ప్రపంచంపై అమెరికా పెత్తనం చెలాయిస్తే, అమెరికాను సైతం కోరియా కిమ్ భయపెట్టాడు. అలాంటి కిమ్ కూడా కరోనా పేరు వింటే వణికిపోతున్నాడని అంటున్నారు. నిజానిజాలు కిమ్‌కు, కరోనాకు తెలియాలి.’’
‘‘ఔను కరోనా బ్రాండ్ బీర్లకు గిరాకీ ఏమైనా తగ్గిందా?’’
‘‘సందట్లో సడే మియా అన్నట్టు ప్రపంచం వణికిపోతుంటే నువ్వేంటి బీర్ల గురించి మాట్లాడుతున్నావు’’
‘‘ఖండాలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు వంటి తేడాలు లేకుండా ప్రపంచంలోని మనుషులందరినీ సమానంగా చూస్తోంది కరోనా అందుకే కరోనా విశ్వమానవుడు అన్నాను.’’
‘‘నిజమేనోయ్ ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తోంది. ఎప్పుడు ముగుస్తుందో, ఎంత మందిని పొట్టన పెట్టుకుంటుందో కానీ కరోనా ప్రపంచంలోని మనుషులను ఏకం చేసింది. కనీసం కరోనా విషయంలోనైనా...’’