జనాంతికం - బుద్దా మురళి

చైనా ప్రొడక్ట్స్ కరోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హీ..
హీ... రేపు హైదరాబాద్ వచ్చేస్తున్నాను’’
‘‘రావోయ్ రా! దీనికి నా అనుమతి ఎందుకు?’’
‘‘నీకు ఆశ్చర్యం అనిపించడం లేదా?’’
‘‘దేనికి హైదరాబాద్ ఏమన్నా నా సొత్తా? నీకో విషయం తెలుసా? హైదరాబాద్ మహానగరానికి రోజుకు కొన్ని వేల మంది బతకడానికి వస్తారు. మహాభారతంలో అక్షయ పాత్ర నిజమో కాదో తెలియదు కానీ కడుపు చేతపట్టుకుని ఎంత మంది వచ్చినా హైదరాబాద్ వారిని తన కడుపులో పెట్టుకుని సాదుతుంది. రోజుకో 20 వేల మంది వస్తారు. నువ్వోక్కడివి హైదరాబాద్‌కు ఎక్కువవుతావా? నువ్వు రావడమే కాదు. నీ మిత్రులను కూడా తీసుకు రా!’’
‘‘హే నేను చెబుతున్నది దాని గురించి కాదు. నేను హైదరాబాద్‌కు వస్తున్నందుకు నిజంగా నీకు ఆశ్చర్యం కలగడం లేదా?’’
‘‘అదే అడుగుతున్నా ఎందుకు ఆశ్చర్యం ?’’
‘‘కరోనా వైరస్ విజృంభించింది కదా? అలాంటి నగరానికి నేను ధైర్యంగా వస్తున్నాను అంటే నీకు ఆశ్చర్యం కలగడం లేదా?’’
‘‘నీకీ సంగతి తెలియదేమో! హైదరాబాద్‌లో కరోనా లేదు. కరోనా సోకిన ఒక వ్యక్తి హైదరాబాద్ వచ్చారు. రెండింటికి తేడా ఉంది. కరోనా సోకిన వారు వచ్చినా, చికిత్స చేసి బాగు చేసే సత్తా హైదరాబాద్‌కు ఉంది. ఒక్కరే కాదు ఇంకెందరు వచ్చినా చికిత్స చేసి పంపిస్తారు. సరే నీకూ చికిత్స కావాలా? సిగ్గుపడకు, భయపడకు రా! పరవా లేదు’’
‘‘నాకేం వైరస్ సోకలేదు. వైరస్ సోకిన హైదరాబాద్‌కు వస్తున్నాను అని చెబుతున్నాను.’’
‘‘హైదరాబాద్‌కు వైరస్ సోకడం, వైరస్ సోకిన వ్యక్తి హైదరాబాద్ రావడం రెండింటి మధ్య చాలా తేడా ఉంది’’
‘‘అంటే అక్కడేం భయం లేదా?’’
‘‘నువ్వు ఉదయం నుంచి న్యూస్ చానల్స్ చూస్తున్నావు కదూ?’’
‘‘ఔను’’
‘‘ఎక్కువగా చూడకు..... వైరస్ సోకే ప్రమాదం ఉంది’’
‘‘నాకు తెలుసు! కరోనా వైరస్ వ్యక్తుల ద్వారా సోకుతుంది కానీ టీవిల ద్వారా కాదు’’
‘‘టీవిల ద్వారా కరోనా వైరస్ సోకక పోవచ్చు. కానీ కరోనా కన్నా భయం అనే వైరస్ సోకుతుంది. చైనాలో కరోనా వైరస్ మహా అయితే లక్ష మందికి సోకి ఉండొచ్చు. కానీ మన తెలుగు చానల్స్ వల్ల మాత్రం లక్షల మందిలో కరోనా వైరస్ భయం సోకింది’’
‘‘అంటే టీవి స్టూడియోల్లోనే కానీ ప్రజల్లో భయం లేదంటావా?’’
‘‘్భయం లేదు అనలేదు. చానల్స్ భయాన్ని వైరస్‌లా వ్యాపింపజేశారు అంటున్నాను.’’
‘‘నువ్వు అలానే మాట్లాడుతావు కానీ గాంధీ కరోనా భయంతో గాంధీ ఆస్పత్రిని అక్కడి నుంచి తరలించాలని కాలనీ వాళ్లు ఆస్పత్రికి ఒక లేఖ ఇచ్చారు’’
‘‘ఔను! నేను ఇప్పుడే టీవిలో చూశాను. గాంధీని తరలించడం కన్నా ఆ కాలనీని అక్కడి నుంచి తరలిస్తే బాగుంటుంది కదా? గాంధీని తరలించాలి అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అదో పెద్ద తతంగం.. కానీ కాలనీ తరలించాలి అంటే ఎవరి అనుమతి అవసరం లేదు. కాలనీ లో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చు. ’’
‘‘వెటకారమా?’’
‘‘గాంధీని తరలించాలి అని కోరిన వారిది వెటకారం అయితే కాలనీని తరలించాలని సూచించిన నాదీ వెటకరమే! వారిది సీరియస్ విన్నపం అయితే నాదీ సీరియస్ విన్నపమే’’
‘‘మనుషులు అన్నాక భయం ఉండదా?’’
‘‘ఉండదని ఎవరన్నారు. గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో భయం ఉంటుంది. చికిత్స చేసే డాక్టర్లలో ఉంటుంది. నర్సులు, సిబ్బంది అందరిలో ఉంటుంది. కానీ వాటిని పక్కన పెట్టి వారు చికిత్స చేయడం లేదా? కాలనీ పెద్దలవే ప్రాణాలా? డాక్టర్లవి ప్రాణాలు కావా? ఆస్పత్రినే తరలించాలని అడుగుతున్న వారు ఒకవైపు ఉంటే చైనాలో కళ్ల ముందే భారీ ఆస్పత్రి నిర్మించి ప్రపంచాన్ని అబ్బురపరిచిన ఉదంతం ఒకవైపు చూస్తున్నాం. ఎవరివైనా ప్రాణాలే అంతగా భయం ఉంటే ఆస్పత్రిని మార్చడం కన్నా ఆ ఏరియా నుంచి ఇల్లు మారడం బెటర్. ఎందుకంటే ఆ పెద్దలకు ఏదైనా అవసరం పడినా చికిత్స చేసేది డాక్టర్లే. వారేం భయపడరు.’’
‘‘నువ్విలానే అంటావు కానీ ఐటి కంపెనీలన్నీ మూతపడ్డాయి కదా?’’
‘‘ఔను ఇక్కడ మూసేసి మీ ఊరికి తరలించారు’’
‘‘వ్యంగ్యం కాదు... నిజం చెప్పు?’’
‘‘మిర్యాల చారు వల్ల కరోనా రాదట! చైనాలో హోటల్స్ ముందు ఇదిప్పుడు హాట్ టాపిక్.... మిర్యాలకు ఉన్న ఔషధ గుణాల వల్ల వైరస్ రాకుండా చేస్తుందట! చైనా హోటల్స్ ముందు ఇప్పుడు కొత్తగా వెలిసిన బోర్డులు. ’’
‘‘ఐతే?’’
‘‘కరోనా వల్ల ఇదో మేలు జరిగింది. ప్రపంచానికి కావలసినవన్నీ చైనానే ఎగుమతి చేస్తుంది తెలుసు కదా? ఆ మధ్య క్రీడా పోటీల్లో అందరి చేతుల్లో అమెరికా జెండా కనిపించింది. చివరకు ఆ జెండాపై కూడా చిన్న అక్షరాల్లో మేడిన్ చైనా అని ఉంది. ఇప్పుడు వైరస్ నుంచి రక్షించుకోవడానికి మాస్క్‌లు ధరిస్తున్నారు కదా? చివరకు అవి కూడా చైనా నుంచే వస్తున్నాయి. ’’
‘‘ఐతే?’’
‘‘ప్రపంచానికి కావలసినవి అన్నీ ఎగుమతి చేస్తున్న చైనాకు మన మిర్యాల చారు ఎగుమతి కావడం మంచిదే కదా?’’
‘‘అంటే కరోనా వల్ల భయపడాల్సిందేమీ లేదంటావు?’’
‘‘ఒకవేళ టీవిల వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఉంటే... రెండు రాష్ట్రాల్లో ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. టీవిలు భయాన్ని మాత్రమే వ్యాపింపజేస్తాయి కానీ వైరస్‌ను కాదు కాబట్టి ఏమీ కాలేదు’’
‘‘నువ్వెంతైనా చెప్పు... కరోనా ప్రమాదం తీవ్రంగానే ఉంది’’
‘‘చూడోయ్ మహా మహా కరోనాలను ఎదుర్కొన్న హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చిన ఓ కరోనా వ్యక్తిని ఎదుర్కోవడం పెద్ద కష్టమా?’’
‘‘భయం లేదంటావా?’’
‘‘హైదరాబాద్‌ది అద్భుతమైన వాతావరణం. ఇక్కడి వాతావరణానికి ఏ వైరస్ బతికి బట్టకట్టదు. ’’
‘‘మరీ స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది కదా?’’
‘‘మార్కెట్ చాలా పై స్థాయికి వెళ్లింది. పడక తప్పదు. పడేందుకు ఓ కారణం కావాలి అదే కరోనా... అంతే కానీ కరోనా వల్ల మార్కెట్ పడిపోలేదు’’
‘‘నువ్వెన్నయినా చెప్పు... ధైర్యం చాలడం లేదు’’
‘‘నువ్వెప్పుడైనా చైనా ఫోన్ కొన్నావా?’’
‘‘కొనలేదు’’
‘‘ఎందుకు?’’
‘‘చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ రోజులు పని చేయవని కొనలేదు’’
‘‘కరెక్ట్‌గా చెప్పావు. చైనా ప్రొడక్ట్ కరోనా ఎక్కువ రోజులు బతకదు. భయపడకు...’’

buddhamurali2464@gmail.com