జనాంతికం - బుద్దా మురళి

చరిత్ర సృష్టిస్తాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏదో రుబ్బుతున్న సౌండ్ వస్తోంది. ఏం రుబ్బుతున్నావ్..?’’
‘‘చరిత్ర సృష్టిస్తున్నాను.. తెలుగు సినిమాలో చరిత్ర సృష్టించే ‘చరిత్ర కథ’ రాస్తున్నాను.’’
‘‘కథ చెప్పు.. ఒక ప్రేక్షకుడిగా నాకు నచ్చితే ఆ కథ సూపర్ హిట్ అయినట్టే!’’
‘‘మాకు కావలసింది మీలాంటి అభిమానులే. కథ చెబుతా.. కానీ మధ్యలో డౌట్లు అడగవద్దు ’’
‘‘పిచ్చోడా.. నేతి బీరలో నెయ్యి, వెలయాలిలో ప్రేమ, చారిత్రక కథలో కథ వెతకడం వృథా అని తెలిశాక డౌట్లు ఎందుకు? చెప్పు.. వింటాను’’
‘‘శ్రీకృష్ణదేవరాయలు రాజమందిరంలో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడూ రాణులతో సరస సల్లాపాలతో గడిపే రాయలు వారం రోజుల నుంచి అన్యమనస్కంగా ఉన్నాడు. రాజును కవ్విస్తూ శృంగారతార సన్నీ లియోన్ డ్యాన్స్ చేసినా అటు వైపు కనె్నత్తి కూడా చూడలేదు. కంటి చూపుతో మహామహులను చిత్తు చేసిన సన్నీ లియోన్ మహారాణి వద్దకు వెళ్లి-‘నా మనసు ఏదో శంకిస్తోంది. రాజుగారిని ఇలా ఎప్పుడూ చూడలేదు. ఏం జరిగిందో తెలుసుకోండి’ అని సలహా ఇచ్చి వెనుతిరిగి వెళ్లింది. నిన్ను అపార్థం చేసుకున్నాను లియోన్.. నీలిచిత్రాల నటిగానే నిన్ను చూశాను.. కానీ నీలో ఒక సావిత్రి, భానుమతి, భారతి, కాంచన ఉందని కలలో కూడా అనుకోలేదు- అని మహారాణి కన్నీరు పెట్టుకుంది. ‘మహారాణీ.. ముందు మనం రాజుగారిని రక్షించుకోవాలి’ అంది సన్నీ లియోన్.
కామెడీకింగ్ సునీల్ తప్ప ఈ పరిస్థితిలో రాజుగారి వద్దకు వెళ్లే సాహసం ఎవరూ చేయలేరని అంతా అనుకున్నారు. అంతఃపురంలోకి కూడా వెళ్లగల ఏకైక వ్యక్తి సునీల్ ఒక్కడే
‘‘సారీ.. నీ కథ మధ్యలో జోక్యం చేసుకుంటున్నాను. చిన్న సందేహం- శ్రీకృష్ణదేవరాయలు మహాశక్తివంతమైన రాజు కదా? కమెడియన్లు క్లోజ్ ప్రెండ్ కావడం ఏమిటి? ఈ ఒక్క సందేహం తీర్చి కథ కొనసాగించు’’
‘‘నీకు తెలుగు సినిమాలు చూసే అలవాటు లేదా? ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు, సూపర్‌స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేశ్‌బాబు వరకు మెగాస్టార్ నుంచి పవర్ స్టార్ వరకు తెలుగులో ఏ హీరోకైనా కమెడియనే క్లోజ్ ప్రెండ్‌గా ఉంటాడు. పాతాళభైరవిలో ఎన్టీఆర్‌కు అంజిగాడు మొదలుకొని, ఈ రోజు విడుదలైన సినిమా వరకు అంతా ఈ ఫార్ములాను పాటిస్తారు. నీ మిత్రులు ఎవరో చెప్పు నీవు ఎలాంటి వాడివో చెబుతాను అనే సూక్తి ఇక్కడ పని చేయదు. హీరో ఎంత శక్తివంతుడైనా కమెడియనే అతని స్నేహితుడు అయి తీరాలి.. నేను ఈ తరం ప్రేక్షకుల కోసం సినిమా తీస్తున్నాను కాబట్టి కథ ఏదైనా ఫార్ములా పాటించాల్సిందే’’
‘‘ఇక కథ చెప్పు’’
‘‘రాజుగారు ఇలా ఎందుకున్నారో నాకు తెలుసు.. మహారాణి గారూ నాకు తెలుసు.. అని సునీల్ భారమైన మనసుతో ఆవేదనగా పలికాడు.
‘కామెడీ డైలాగులే తప్ప నీ నుంచి ఇంత భారమైన డైలాగులు వింటానని కలలో కూడా అనుకోలేదు సునీల్. ఏం జరిగిందో నాకు తెలియాలి’ అని మహారాణి అడిగింది.
‘అలెగ్జాండర్ మన దేశంపైకి దండయాత్రకు వస్తున్నాడు- అని సునీల్ ఒక్క క్షణం ఆగాడు. ఇంతోటి దానికే మన మహారాజు భయపడతారని నువ్వెలా అనుకున్నావ్ సునీల్- ఒక్కడు కాదు వంద మంది అలెగ్జాండర్లు.. నెపోలియన్, హిట్లర్‌ను వెంట పెట్టుకుని వచ్చినా మన రాయల వారి ముందు నిలువ లేరు. నీ ప్రాణ స్నేహితుని శక్తి సామర్ధ్యాల గురించి నీవింత తక్కువగా అంచనా వేస్తావని అనుకోలేదు సునీల్... అనుకోలేదు’ అని మహారాణి భారమైన హృదయంతో ఆవేదనగా పలికింది.
‘నన్ను తప్పుగా అర్ధం చేసుకుని మీ వంతు డైలాగులు మీరు ముందే చెప్పేశారు మహారాణి గారు. నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మహారాజు ఆవేదన చెందుతున్నది ప్రపంచ విలన్లంతా ఏకమైన వస్తున్నందుకు కాదు, వారిని ఎదిరించడం మహారాజుకు చిటికెలో పని. కానీ తాను కలలో కూడా ఊహించని విధంగా ట్రంప్ కూడా వీరికి మద్దతుగా ఉన్నాడని తెలిసి ఆవేదన చెందుతున్నారు అంతే. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి రష్యాతో తన స్నేహాన్ని ఉపయోగించి మన రాయల వారే సహకరించారు మహారాణీ. ట్రంప్ మిత్రద్రోహిగా మారాడని రాయలవారి ఆవేదన. రాయలవారు కొలంబస్‌కు- అమెరికాను కనుగొనమని చెప్పింది ఇందుకోసమేనా? వాస్కోడిగామాకు దారి చూపించింది ఇందుకోసమేనా? అనే ఆవేదన అంతే.. ’’
‘‘ఇక్కడ కథలో చిన్న ట్విస్ట్ ఉంటే బాగుంటుంది. మహారాణి కత్తి పట్టుకుని అలెగ్జాండర్ పని పట్టేందుకు వెళితే ఎలా ఉంటుంది? ’’
‘‘ నా కథలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. నువ్వు చెప్పినట్టు చేస్తే ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవుతుంది. అంత పొడవున్న అనుష్క రాణిరుద్రమగా నటిస్తేనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా వర్కవుట్ కాలేదు. హీరో ఓరియంటెడ్ కథకే ఫిక్స్ అయ్యాను. ఇక మళ్లీ కథలోకి వస్తే రాజు యుద్ధానికి సన్నద్ధం అవుతుండగా-
‘మహారాజా డ్యాన్స్‌లో ముందు నన్ను ఓడించండి’ అని మైకేల్ జాక్సన్ సవాల్ విసిరాడు. రాజ్యాంలోని మహామహా డ్యాన్సర్లు తమ వల్ల కాదని చేతులు ఎత్తేశారు. రాయల వారు ఏ మాత్రం భయపడకుండా స్వయంగా రంగంలోకి దిగి అద్భుతంగా నాట్యం చేస్తే, మైకేల్ జాక్సన్ సిగ్గుతో తల దించుకున్నాడు. సన్నీ లియోన్, పక్కనున్న ఐశ్వర్యా రాయ్ మహారాజును ఓరకంట అదోలా చూశారు. ’’
‘‘ఇదేం చరిత్ర.. తిక్కతిక్కగా ఉంది. ఎక్కడి రాయలు, ఎక్కడి జాక్సన్ తలాతోకా లేకుండా ఏంటా కథ.’’
‘‘మరదే.. సాటి తెలుగువాడు ఎదిగితే సహించలేరు. చాణక్య- చంద్రగుప్తగా ఎన్టీఆర్ ఏయన్‌ఆర్‌తో పాటు శివాజీ గణేషన్‌కు కూడా అంతటి పాత్ర అవసరం అని అలెగ్జాండర్‌గా కనిపిస్తే చూస్తారు. తన కన్నా రెండు శతాబ్దాల ముందున్న విదేశీ రాజు డెమిట్రయస్‌ను శాతకర్ణి ఓడించినట్టు చూపితే చప్పట్లు కొట్టాం. రాయలు ఐదు వందల ఏళ్ల ముందుకు వచ్చి జాక్సన్‌ను డ్యాన్స్‌లో ఓడిస్తే తప్పా? ’’
‘‘ఇంతేనా? కథ.. ’’
‘‘ఇంకా చాలా ఉంది? విజయం సాధించిన వాడు చెప్పిందే కథ అనేది పాత మాట. సినిమా తీసే శక్తి ఎవరి చేతిలో ఉంటే వాళ్లు చెప్పిందే కథ.. ఇది నేటి చరిత్ర. చరిత్రను గుర్తు చేసినందుకు సంతోషించాలి కానీ రంధ్రానే్వషణ చేయవద్దు. అసలైన ముగింపు.. నిర్మాత, హీరో తేలాక చెబుతాను.’’
‘‘అంటే హీరో ఎవరైతే, రాయల వారిదీ అదే సామాజిక వర్గం అని తేలుస్తావు.. అంతే కదా? ’’
‘‘అరె చూశావా? నాతో ఆరగంట మాట్లాడగానే నీకెన్ని తెలివి తేటలు వచ్చాయి. అంతే..’’
‘‘చరిత్ర సృష్టించడం అంటే నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. రండి చరిత్ర సృష్టిద్దాం’’ *

- బుద్దా మురళి