జనాంతికం - బుద్దా మురళి

నీళ్లలో నిప్పులు సృష్టిస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏంట్రోయ్.. ఈ వయసులో ప్రేమలేఖ రాస్తున్నావా? నేను రాగానే రాయడం ఆపేశావు. కాలేజీలో ఎవడికో డబ్బిచ్చి ప్రేమలేఖ రాయించుకునే వాడివి.. నువ్వేమో అంత కష్టపడి ప్రేమలేఖలు రాయిస్తే- రాసింది సుభాష్ అని తెలుసుకుని అతని ప్రేమలో పడిన కల్పన సంగతి గుర్తుందా? ఏదైతేనేం ఇంత కాలానికైనా సొంతంగా రాస్తున్నావు.. చాలా సంతోషం’’
‘‘ఎందుకు గుర్తులేదు. ఆ సుభాష్ గాడికి బట్టతలొచ్చింది. కల్పనకు తగిన శాస్తి జరిగిందిలే..’’
‘‘తెలివైన వాళ్లకే తొందరగా బట్టతల వస్తుందని వాళ్లయన్ని మురిపెంగ చూస్తూ చెబుతుంది కల్పన.. ఆ మధ్య ఓ పెళ్లిలో కలిశాం లే. ’’
‘‘ఆ కల్పన ఎవరో అదృష్టవంతురాలు అన్నగారూ.. ఈయన ప్రేమను ఒప్పుకున్నా బాగుండేది’’
‘‘ఇంతకూ అంత రహస్యంగా ఏం రాస్తున్నావు. చిన్నప్పటి నుంచి కవిత్వం రాసేవాడివి కదా? పత్రికల్లో ఎక్కడా నీ కవిత్వం కనిపించనే లేదు’’
‘‘నాకీ పత్రికల మీద నమ్మకం లేదు. నేను ఎంతో ఆలోచించి పత్రికలకు పంపితే వాళ్లు తమ సొంత పేరుతో వేసుకుంటారనే భయంతో పత్రికలకు ఎప్పుడూ పంపలేదు. పంపితే శ్రీశ్రీ, నారాయణరెడ్డిలను మించి ఓ వెలుగు వెలిగే వాణ్ణి. మనలోమాట.. నేను కవిత్వం రాస్తే శ్రీశ్రీ, నారాయణరెడ్డి, దాశరథిలను మించి పోనూ.. నాలాంటి వాళ్లు రాయకపోవడం వల్లే వాళ్లు మహాకవులుగా వెలిగిపోయారు. ’’
‘‘ఔనవును.. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కొందరు మేధావుల చర్చలు నేనూ చూశాను.. తాను శ్రీశ్రీని గుర్తించడం లేదని ఒకరు, సినారెను కవిగా గుర్తించడం లేదని ఇంకొకాయన.. గుంపులో గోవిందయ్యనో, దారిన పోయే దానయ్య లాంటి పేరు ఏదో ఉంది గుర్తు రావడం లేదు.. ఆయన తెగ రాసేశాడు.’’
‘‘నిజమే కదా? సినారె తాను పుట్టిన ఊరు గురించి కవిత రాశారు. కానీ మా పుట్టిన ఊరు గురించి రాయలేదు.. మా ఊరి గురించి రాయని ఎవరినీ నేను ఖాతరు చేయను. కనీసం మా బాబాయ్ గురించైనా రాశాడా? ఇక వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్.. ఇదేం కవిత్వమోయ్. రథాలు అంటే బూర్జువా మనస్తత్వం కదా? ఐనా ఆ రోజుల్లో ఎడ్లబండ్లు ఉండేవి కాబట్టి రథాల గురించి రాశాడు. వంద రాకెట్లను ఒకేసారి పంపిన కాలంలో ఇంకా శ్రీశ్రీ రథాలు అవసరమా? అదే నేనైతే వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్‌లు వస్తున్నాయ్.. అంటూ రాసేవాడ్ని’’
‘‘ నువ్వు రాసేవాడివేమో కానీ ఆ నాయకుడెవరో జిల్లాకో బుల్లెట్ ట్రైన్ అని ఎప్పుడో హామీ ఇచ్చేశారు. కవిత్వానికి, నాయకుల హామీలకు పెద్ద తేడా లేకుండా పోతుందోయ్. ఎంతైనా కవులకు కష్టకాలమే. కవిగారి కవిత్వం బాగుందా? నాయకుని హామీల జాబితా బాగుందా? అంటే తేల్చుకోవడం సామాన్యుడికి కష్టమే. ఆ మహాకవులు చనిపోయి బతికి పోయారు. ఉన్నా నీతో పోటీ పడలేకపోయేవారనుకో! వాళ్లకొచ్చిన నాలుగు ముక్కలేవో రాసి వదిలేసి పోయారు. వాళ్ల సంగతి వదిలేయ్! నువ్వు రాకెట్‌లొస్తున్నాయ్ అని రాయి.. వద్దన్నదెవరు? అడ్డుకునేదెవరు? నువ్వు ఇంత కాలం రాయకపోడవం వల్ల తెలుగు సాహిత్యం ఓ వజ్రాన్ని కోల్పోయిందని అం టావు. ఇంతకూ అంత రహస్యంగా ఏం రాస్తున్నావు’’
‘‘పత్రికల మీద నమ్మకం లేక ఇంత కాలం నా కవిత నా మనసులోనే ఉంచుకున్నా’’
‘‘ఏ వస్తువైనా ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మురిగిపోతుంది. ఇంత కాలం దాచుకున్న కవితలు ఇప్పుడు మార్కెట్‌లోకి వదులుతావా? ఫుడ్ ఫాయిజన్ అవుతుందేమో’’
‘‘ఏడ్చావ్ లే! ఇప్పుడు కవిత్వం రాయాలంటే’’
‘‘బుర్రతో పనిలేదంటావా?’’
‘‘అప్పుడంటే పత్రికల వారి కరుణ ఉంటేనే కవిత్వం బయటికొచ్చేది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల పుణ్యమాని క్షణాల్లో జనం లోకి వెళ్లిపోతున్నాయి’’
‘‘మరి అంత భయం భయంగా రాయడం ఎందుకు? జనం దాడి చేస్తారని భయమా? ‘చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ’ అని రాసినందుకు అదేదో సినిమాలో ఎడిటర్‌పై రౌడీ షీటర్ కక్ష తీర్చుకున్నట్టు నీమీద ఎవడైనా దాడి చేస్తాడని భయమా?’’
‘‘అడ్రస్ ఉండదు కాబట్టి దాడి చేసే ప్రసక్తే లేదు’’
‘‘మరి ఇంకెందుకు భయం?’’
‘‘ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మనం రాసే అన్నింటిపైనా నిఘా ఉంటోంది. ఎవరికీ చెప్పవద్దు.. నీకో రహస్యం చెబుతాను. నాపై ఎఫ్‌బిఐ నిఘా ఉంది!’’
‘‘దాన్ని ఏఫ్‌బిఐ అనరు సిబిఐ అంటారు.’’
‘‘అసలే భూముల రిజిస్ట్రేషన్ శాఖలో రైటర్‌గా పని చేశావు. బోలెడు వెనకేసి ఉంటావు.. కేసు సిబిఐ వద్దకు వచ్చినప్పుడు నీపై నిఘా ఉండకుండా ఎలా ఉంటుంది’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. నేను చెప్పింది ఎఫ్‌బిఐ గురించే... ఈ మధ్య ట్రంప్‌ను ఏకి పారేస్తూ బోలెడు కవిత్వం రాసి పారేశాను. అప్పటి నుంచి నాపై ఎఫ్‌బిఐ నిఘా ఉందని కచ్చితమైన సమాచారం. నేనేం రాస్తున్నానో ఎఫ్‌బిఐ ఎప్పటికప్పుడు ట్రంప్‌కు సమాచారం ఇస్తూనే ఉంది. ఆయన అమెరికా అధ్యక్షునిగా పోటీ చేస్తారని చినబాబు చేసిన ప్రకటనకు మద్దతు తెలిపినప్పటి నుంచి నన్ను ఎఫ్‌బిఐ టార్గెట్ చేస్తోంది. సరే.. లోకల్‌గా సిబిఐ నిఘా నాపై ఎలాగూ ఉంటుందనుకో, సిఐడి పోలీసుల గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. కవిత్వంతో- నీళ్లలో నిప్పులు సృష్టించే సత్తా నాకుందని వీరి భయం. ఇప్పుడు అలాంటి కవిత్వం ఒకటి రాస్తున్నాను. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నారనే కేసు పెట్టే స్థాయి కవిత్వం రాస్తున్నా’’
‘‘విన్నవాళ్లకు విరేచనాలు అయితే.. కేసులు పెడితే ప్రభుత్వానిదా బాధ్యత?’’
‘‘విన్నవాళ్లు కాదు... ప్రభుత్వమే కేసులు పెడుతుంది చూడు’’
‘‘వచ్చావా దసరా మళ్లీ వచ్చావా. చీకటి నిండిన మా జీవితాల్లో ... ఇదేనా నీ కుట్ర కవిత. ఈ కవిత ఇంతకు ముందు విన్నట్టుగా ఉంది’’
‘‘మనిషన్నాక కాసింత కవితా జ్ఞానం ఉండాలి. ఇది కొత్త కవిత.. నువ్వు విన్నది వచ్చావా ఉగాది మళ్లీ వచ్చావా? అనే కవిత.. ఉగాదికి, దసరాకు తేడా తెలియదు నువ్వేం మనిషివోయ్ కవిత్వం గురించి కొంతైనా అవగాహన లేకపోతే ఎలా? ’’
‘‘ఎలా ఉంది నా కవిత?’’
‘‘తెలుగువాళ్లకు జ్ఞానపీఠ్‌లు మూడు వచ్చాయి కానీ నీ వాదన విన్నాక, నీ కవిత చదివాక మనకు అజ్ఞానపీఠ్‌లు చాలా రావలసి ఉంది అనిపిస్తోంది’’
*

-బుద్దా మురళి