తూర్పుగోదావరి

6 నుండి కోనసీమ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మార్చి 29: కోనసీమ ఉత్సవాలను ఏప్రిల్ 6వ తేదీ నుండి ఐ పోలవరం మండలం మురమళ్లలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ప్రకటించారు. కోనసీమ అందాలు ఉట్టిపడేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ కోరు టహాలులో టూరిజం, ఇతర శాఖల అధికారులతో కోనసీమ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ ఉత్సవాల్లో కోనసీమలో ఉండే జలవనరులు ఆధారంగా ప్రత్యేక పడవల పోటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా జిల్లాలో ఉన్న వివిధ దేవాలయాల నమూనాలు ఏర్పాటుచేయాలన్నారు. ఉత్సవాలు నిర్వహించే ప్రాంతంలో 100 మీటర్లలోపే పార్కింగ్ సదుపాయం కల్పించాలని తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆక్వా బీచ్ ఎగ్జిబిషన్స్, ఎల్‌ఇడి స్కీన్స్, వివిధ రాష్ట్రాలు, దేశాల దృశ్యాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యేవారికి కోనసీమ వంటకాలు రుచిచూపించేందుకు ప్రత్యేక ఫుడ్‌కోర్టులను ఏర్పాటుచేసి తాగునీరు, మజ్జిగను ఉచితంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలు సందర్భంగా నిర్వహించే క్రీడాపోటీలలో యువత ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జెసి ఎస్ సత్యనారాయణ, డిఆర్వో యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు మట్టి తవ్వకాలు
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పెద్దాపురం, మార్చి 29: నీరు- చెట్టు పథకంలో నిబంధనల మేరకు మట్టి తవ్వకాలు జరగాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రాయ భూపాలపట్నం గ్రామంలోని రాఘవమ్మ చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ నీరు-చెట్టు పథకంలో భాగంగా డివిజన్‌లో చేపట్టిన చెరువుల అభివృద్ధి పనుల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు చేపట్టాలన్నారు. మట్టి తవ్వకాలు జరిగే ప్రదేశాల్లో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మ్యాపింగ్‌లో ఉన్నట్టుగా చెరువులు లెవిలింగ్ చేయాలన్నారు. మట్టి తవ్వకాల్లో 30 శాతం ప్రభుత్వ అవసరాలకు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. రాఘవమ్మ చెరువలో 2 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు చెరువు పూడిక తీయాల్సి ఉండగా గతేడాది 70 వేలు క్యూబిక్ మీటర్లు పూర్తయిందన్నారు. మిగిలిన లక్షా 30వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి నూరుశాతం పూడిక పనులు పూర్తి చేయాలన్నారు. మట్టి అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్ఛరించారు. అనంతరం చెరువులో జరుగుతున్న పనులు పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ ముత్యాల రాజబ్బాయి. ఇరిగేషన్ ఇఇ ఎస్ జగదీశ్వరరావు, డిఇ ఎన్ కృష్ణారావు, ఆర్డీవో వల్లూరి విశే్వశ్వరరావు, తహసీల్దార్ వరహాలయ్య, ఎంపిడిఒ పల్లాబత్తుల వసంత మాధవి ,చెరువుకు సంబంధించిన ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
పరిశ్రమల స్థాపనకు అవకాశాలెన్నో
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 29: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నట్టు జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం పరిశ్రమల స్థాపనపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాంబాబు ప్రసంగిస్తూ జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు జిల్లాలో మంచి అవకాశాలున్నాయని, కుటీర పరిశ్రమలకు కూడా ఈ జిల్లా అనుకూలంగా ఉన్నదని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా ప్రగతి పథంలో పయనించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ శాఖల చుట్టూ తిరిగే పనిలేకుండా ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను 15రోజుల్లోగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో గల స్థితిగతులపై తగిన అవగాహన కలిగించేందుకు ఈ అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని రాంబాబు పేర్కొన్నారు. కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు సమావేశంలో మాట్లాడుతూ ఏ పరిశ్రమ అయినా స్థాపించి, దానిని విజయవంతంగా నడిపించేందుకు కావల్సిన అర్హతలను వివరించారు. ఈ సందర్భంగా ‘ పరిశ్రమల స్థాపనకు మార్గదర్శి’ పేరుతో నాబార్డ్, మెపడా రూపొందించిన పుస్తకాన్ని జడ్పీ ఛైర్మన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కెపి సుధాకర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన విధి విధానాలు, చట్టపరమైన అంశాలు, ఇతర వివరాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఆంధ్రా బ్యాంక్ డిజిఎం శేషగిరిరావు, వివిధ శాఖల అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
హైదరుబాద్ బయల్దేరిన టిడిపి శ్రేణులు
ప్రత్తిపాడు, మార్చి 29: ప్రత్తిపాడు వైసిపి ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ముహూర్తం ఖరారు కావడంతో నియోజకర్గంలోని టిడిపి పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను హైదరాబాద్‌కు పిలిచారు. దీంతో జిల్లా టిడిపి అధ్యక్షుడు, దివగంత పర్వత చిట్టిబాబు సోదరుడు రాజబాబు, పార్టీ సమన్వయకర్త పర్వత సురేష్, పలువురు మండలాధ్యక్షులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరితో సమావేశం కానున్నారు. చిట్టిబాబు మృతితో ప్రత్తిపాడు నియోజకవర్గానికి పార్టీ తరఫున సరైన నాయకుడు లేకపోవడంతో వరుపులను పార్టీలో చేరాలని అధిష్ఠానం ఆహ్వానించింది. ఈక్రమంలో నియోజకవర్గంలోని దేశం కార్యకర్తలు రెండుసార్లు సమావేశమై చిట్టిబాబు స్థానంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన సోదరుడు రాజబాబును నియమిస్తారని మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడు యనమల కృష్ణుడుతో పలుమార్లు ప్రకటనలు చేయించారు. చిట్టిబాబు అంతిమ సంస్కారాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్వత కుటుంబం ఆది నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉందని, పర్వత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇది జరిగి నెల రోజులు గడవ కుండానే వైసిపి ఎమ్మెల్యే వరుపులను పార్టీలోకి ఆహ్వానించడం పర్వత కుటుంబంతోపాటు దేశం శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. 2014 శాసన సభ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధిక సర్పంచులతోపాటు ఎంపిటిసి స్థానాలు, నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని, ఇదంతా దివంగత నేత చిట్టిబాబు వల్లే సాధించ గలిగామని పర్వత వర్గీయులు చంద్రబాబుకు బుధవారం వివరించనున్నారు. పార్టీ విధానాలకు నాయకులు కట్టుబడి ఉన్నా కార్యకర్తలను మాత్రం నిర్బంధించలేమని చెప్పడానికి వారు నిర్ణయించుకున్నారు. ఏదిఏమైనా పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే నడచుకుంటామని చెప్పడంతోబాటు నియోజకవర్గంలోని జన్మభూమి కమిటీలను మాత్రం మార్పు చేయవద్దని వారు కోరనున్నారు. వీలైతే వరుపులను ఆహ్వానించడాన్ని కూడా పునరాలోచించాలని కూడా చంద్రబాబును కోరనున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు భాస్కరబాబు, కొమ్ముల కన్నబాబు, వెన్నా శివ, ఏలేశ్వరం నగర పంచాయతీ వైస్-్ఛర్మన్ పైలా సత్యనారాయణ, మండల స్థాయి టిడిపి నాయకులు పలువురు మంగళవారం ఉదయం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు.
శిక్షణా వ్యయంపై ఉన్నతాధికారుల విచారణ
శంఖవరం, మార్చి 29: విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కెజిబివిలో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు (సిఆర్‌టిలు)గా పనిచేస్తున్న వారికి ఇంగ్లీషు మాధ్యమంపై గత జనవరి నెలలో శంఖవరం, అన్నవరం గ్రామాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణను శంఖవరంలోని రెండు కేంద్రాల్లో మూడురోజులు, అన్నవరం కేంద్రంలో మూడు రోజులపాటు రోజుకు 60 మంది సిఆర్‌టిలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణా కాలంలో చేసిన వ్యయంపై జిసిడిఒ రామలక్ష్మి పెట్టిన బిల్లులపై ఎస్‌ఎస్‌ఎ పిఒ విజయ్‌మోహన్‌కుమార్ ఆదేశాల మేరకు ఎస్‌ఎస్‌ఎ ఫైనాన్షియల్ అక్కౌంట్స్ అధికారి వై రామకృష్ణశాస్ర్తీ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణశాస్ర్తీ మాట్లాడుతూ శంఖవరంలో సిఆర్‌టిల శిక్షణలో ఉండగా వారికి కెజిబివిలో వంటలు చేసి భోజనమందించారన్నారు. అయితే వీటికి హోటల్ బిల్లులు పెట్టడంపైన, శిక్షణ పొందేవారికి ఇచ్చిన స్టేషనరీలో ఖర్చు ఎక్కువగా చూపినట్టు తెలిపారు. వీటిపై ప్రతీ కెజిబివి నుండి ఒకరు లేదా ఇద్దరు సిఆర్‌టిల నుండి వివరాలు సేకరిస్తున్నామన్నారు. నివేదికను రూపొందించి పిఒకు అందజేస్తామన్నారు. దీనిపై జిసిడిఒ టి రామలక్ష్మిని వివరణ కోరగా సిఆర్‌టిల శిక్షణా కాలంలోని బిల్లులకు ఎటువంటి చెల్లింపులు జరగలేదని, శంఖవరంలో జరిగిన మూడు రోజుల శిక్షణా కాలంలో శంఖవరంలో సరైన హోటళ్లు లేకపోవడంతో మండల మహిళా సమాఖ్య పర్యవేక్షణలో ప్రత్యేకించి వంట సామాగ్రి, సరుకులు కొనుగోలు చేసి భోజనాలు తయారు చేయించామన్నారు. కెజిబివికి, సిఆర్‌టి భోజనాలకు ఎటువంటి సంబంధం లేదని, ఎక్కడా అవినీతికి తావులేదని జిసిడిఒ రామలక్ష్మి తెలిపారు. దీనిపై కెజిబివి ఎస్‌ఒ లలితకుమారిని వివరణ కోరగా సిఆర్‌టిల శిక్షణ కాలంలో భోజనాల్లో కెజిబివి సరుకులు వినియోగించుకోలేదని, వంట సామాగ్రి, సరుకులు బయట నుండే రప్పించి వారికి భోజనాలు అందించినట్టు తెలిపారు.
ప్రతి పది గ్రామాలకు ప్రత్యేకాధికారి
కాకినాడ, మార్చి 29: 2016- 17 సంవత్సరానికి జిల్లాలో 264 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేనివిగా తీర్దిదిద్దేందుకు ప్రణాళికను రూపొందించనున్నట్లు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో 2019 అక్టోబర్ 2వ తేదీ నాటికి అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా రూపొందించటానికి ప్రధాని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా జిల్లాలో ఉన్న 1018 గ్రామ పంచాయతీలను దశల వారీగా బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా రూపొందించే పనులు చేపడతామన్నారు. 2016-17 సంవత్సరంలో అమలు చేసే ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన 264 గ్రామాలకు ఒక్కొక్క జిల్లా స్ధాయి అధికారికి 10 గ్రామాలు చొప్పున కేటాయించినట్లు కలెక్టర్ చెప్పారు. మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యం నిర్ణయించి పనులు కొనసాగుతున్నాయన్నారు. 2016-17 సంవత్సరం చేపట్టే పనులకు గానూ ఈ ప్రత్యేకాధికారులకు ఐదులక్షల రూపాయలను అడ్వాన్స్‌గా కూడా అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ కె పద్మ, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ కె రాజేశ్వరరావు, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆక్టోపస్ మాక్ డ్రిల్
రాజమహేంద్రవరం, మార్చి 29: ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. వారి కోసం ఆక్టోపస్ దళాలు వేట సాగించి ఎట్టకేలకు వారిని సజీవంగా బంధీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులను నిరోధించేందుకు ఉద్దేశించిన ఆక్టోపస్ ఆధ్వర్యంలో మంగళవారం అర్థరాత్రి దాటే వరకు కొనసాగిన మాక్‌డ్రిల్‌లో ఇలాంటి సన్నివేశాలు కనిపించాయి. ప్రముఖ నగరాల్లో ఉగ్రవాదులు ప్రవేశిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ముందస్తు కార్యాచరణలో భాగంగా స్థానిక లాహాస్పిన్ హోటల్‌లో మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. సినీ ఫక్కీలో సాగిన ఈకార్యక్రమంలో తొలుత నలుగురు ఉగ్రవాదులు హోటల్‌లోకి జొరబడ్డారు. వారిలో ఒకరు బెల్టుబాంబు ధరించి ఉన్నాడు. ఆక్టోపస్ ఎస్‌ఐ రమణ ఆధ్వర్యంలో స్థానిక త్రీటౌన్ పోలీసులు హోటల్‌ను చుట్టుముట్టారు. ముందుజాగ్రత్తగా అగ్నిమాపక శకటాన్ని, స్కైలిఫ్ట్‌ను కూడా సిద్ధం చేశారు. అనంతరంలో ఆక్టోపస్ పోలీసులు హోటల్‌లోకి జొరబడి ఉగ్రవాదులను పట్టుకున్నారు. పోలీసుల హడావుడి చూసి నిజంగా ఉగ్రవాదులు ఉన్నారని స్థానికులు ఆందోళన చెందారు. అయితే ఆతరువాత మాక్‌డ్రిల్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.80 లక్షలు
శంఖవరం, మార్చి 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారికి హుండీల ద్వారా రూ.80,05,705లు ఆదాయం సమకూరినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు. రత్నగిరిపైగల స్వామివారి నిత్య కల్యాణ మండపంలో దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు పర్యవేక్షణలో 25 రోజులపాటు ఉంచిన హుండీలను లెక్కించగా, 66 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి లభించాయి. యుఎస్‌ఎకు చెందిన 469 డాలర్లు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఒమెన్‌కు చెందిన 3 రియాళ్లు, సింగపూర్‌కు చెందిన 125 డాలర్లు, మలేషియాకు చెందిన 12రీమ్స్ లభించాయి.
ఎంపి తోటకు కోనసీమ జెఎసి అభినందన
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, మార్చి 29: అమలాపురం విచ్చేసిన కాకినాడ ఎంపి తోట సరసింహంతో కోనసీమ జెఎసి కార్యవర్గం మంగళవారం భేటీ అయింది. కోటిపల్లి - నరసాపురం రైల్వే లైనుకు 200 కోట్లు కేటాయించడంలో తోట చేసిన కృషిని జెఎసి కొనియాడింది. టిడిపి పార్లమెంటరీ పక్షనేతగా తొమ్మిది మంది ఎంపిలను సమైఖ్యపరిచి కోనసీమ రైల్వే లైనుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకురావడంలో తోట పాత్ర ఎంతైన ఉందని జెఎసి సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపి తోట మాట్లాడుతూ ఎపిలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఎస్‌పివి ఒప్పందం ఉపయోగించుకుని దివంగత నేత చిరకాల స్వప్నమైన కోటిపల్లి - నరసాపురం లైను పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారన్నారు. కోనసీమ జెఎసికి కార్యవర్గానికి ఢిల్లీలో తోట అందించిన సేవలకుగాను జెఎసి కార్యవర్గం ఎంపి తోటను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు బండారు రామమోహనరావు, ఇళ్ల భక్తవత్సలం, మంత్రిప్రగడ వేణుగోపాల్, ఇళ్ల సత్యనారాయణ, ఎంఎకె భీమారావు, రాయుడు శ్రీరామచంద్రమూర్తి, మధుర నరసింహమూర్తి, ఉండ్రు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే నా పార్టీ
శంఖవరం, మార్చి 29: తనను నమ్మి తన వెంట నడుస్తూ, అధికార పార్టీ వేధింపులను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సైనికులుగా పనిచేస్తున్న కార్యకర్తలే తన పార్టీ అని ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. శంఖవరంలోని తన స్వగృహంలో నియోజకవర్గపార్టీ కార్యకర్తలతో మంగళవారం ప్రసాద్ సమావేశం నిర్వహించారు. తొలుత తన పిన తండ్రి కుమారుడు జిల్లా టిడిపి అధ్యక్షుడు దివంగత పర్వత చిట్టిబాబు మృతికి రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా పర్వత ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉగాది తర్వాత పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పర్యటన ఉంటుందని, నియోజకరవర్గంలో జరుగుతున్న జన్మభూమి కమిటీల ఆగడాలు, అక్రమ మైనింగ్, పార్టీ బలోపేతానికై బహిరంగ సభ నిర్వహిస్తారని, కార్యకర్తలంతా హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత పది రోజులుగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తల్లో పలు అనుమానాలకు తావిచ్చిందని, ఎవరెన్ని పార్టీలు మారినప్పటికీ తాను నమ్ముకున్న కాంగ్రెస్‌పార్టీలోనే ఉంటున్నానని, పార్టీ బలోపేతానికే తనతో పాటు కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పార్టీ బేధం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని, రుణమాఫీ పూర్తిగా చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనన్నారు. చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నప్పుడు రుణమాఫీ అంటూ రైతులకు మాయమాటలు చెప్పారని, నేడు ఫేజ్ 1, 2, 3 అంటూ ప్రజలను, రైతులను మోసగించారన్నారు. కార్యకర్తల సూచనలే తనకు మార్గదర్శకాలని, తాను కుటుంబ పరంగా రాజీపడినా, రాజకీయంగా రాజీ పడలేదన్నారు. కార్యక్రమంలో శంఖవరం, రౌతులపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల పార్టీ అధ్యక్షులు కూనిశెట్టి మాణిక్యం, జిగిరెడ్డి శ్రీను, ఉమ్మిడి వెంకట్రావు, ప్రసాద్, బిసి సెల్ కన్వీనర్ కొల్లు అప్పలరాజు, మాజీ జడ్పీటీసీ ఈగల అప్పారావు, మానివెల్తి రమణ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆందోళన
రాజమహేంద్రవరం, మార్చి 28: వ్యవసాయశాఖను, విద్యను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు 2వ రోజు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. దూర విద్యను రద్దు చేయాలని, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలను రద్దు చేయాలని, ప్రైవేటు కళాశాలలకు అనుమతి ఇవ్వరాదని, ఐకార్ గుర్తింపు పొందిన వ్యవసాయ కళాశాలలో పట్టా పొందిన విద్యార్థులతోనే వ్యవసాయశాఖలో ఎఓ, ఎఇఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హత లేని ఎఓ, ఎఇఓలను తొలగించాలన్నారు. ఈమేరకు ప్లకార్డులతో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు ఎబివిపి నాయకులు చల్లా నవీన్‌లాల్, సుంకర బాలు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మద్దతు ప్రకటించారు. అనంతరం సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు
కాకినాడ సిటీ, మార్చి 29: జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాలో అధిక చార్జీలు వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన రేట్లకే ఉచిత ఇసుక పొందవచ్చని చెప్పారు. జిల్లాలోని 20 ఇసుక రీచ్‌లలో వినియోగదారులకు ఇసుక సరఫరా కోసం లోడింగ్, రవాణా కోసం కాకినాడలో రాజమండ్రి, ఆలమూరు, సీతానగరం మండలాల నుండి సరఫరాచేసే ఇసుకకు ఒక యూనిట్ ట్రాక్టర్‌కు 2వేలు, రెండు యూనిట్ల లారీకి 4వేల 500లు, 5 యూనిట్ల లారీకి 7వేల 100 గరిష్టంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా అమలాపురం పట్టణంలో ఊబలంక రీచ్ నుండి ఒక యూనిట్ ట్రాక్టర్‌కు 1,560 రూపాయలు, రెండు యూనిట్ల లారీకి రూ.3,450, 5 యూనిట్ల లారీకి రూ.5,675, మందపల్లి రీచ్ నుండి యూనిట్ ట్రాక్టర్‌కు రూ.1,380, రెండు యూనిట్ల లారీకి రూ.2,900లు, ఐదు యూనిట్ల లారీకి రూ.4,875లు, వీరవల్లిపాలెం రీచ్ నుండి ఒక యూనిట్ ట్రాక్టర్‌కు రూ.835, రెండు యూనిట్ల లారీకి రూ.1800, ఐదు యూనిట్ల లారీకి రూ. 3,400లు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా రాజమండ్రి నగరంలో యూనిట్ ట్రాక్టర్‌కు రూ.1200, రెండు యూనిట్ల లారీకి 2,400, రూరల్ ప్రాంతంలో యూనిట్ ట్రాక్టర్‌కు రూ.1,150లు, రెండు యూనిట్ల లారీకి రూ.2,300లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా రాజమండ్రిలోని ర్యాంపుల్లో నేరుగా వాహనంతో వెళితే పట్టణ ప్రాంతాలవారు రూ.1600, గ్రామీణ ప్రాంతాలవారు రూ.1500 లోడింగ్ చార్జీలను చెల్లించి ఇసుకను పొందవచ్చునని తెలిపారు. ఎవరైనా ఎక్కువ ఛార్జీలు వసూలుచేస్తే తహసీల్దార్లకు, ఎంపిడిఒలకు, పోలీసులకు, టోల్ ఫ్రీ నెంబరు 1800-425-30077కు ఫిర్యాదుచేయవచ్చని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు.
9.5 లక్షల టన్నులు లక్ష్యం
రబీ ధాన్యం కొనుగోళ్లుపై జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ

రామచంద్రపురం, మార్చి 29: ప్రస్తుతం రబీ పంట అత్యంత ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 9.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రైతులతో ఈ అంశంపై గ్రామస్థాయిలో అవగాహనా శిబిరాలు నిర్వహించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మీ ఇంటికి రేషన్ పథకంలో వికలాంగులు, కుష్ఠువ్యాధిగ్రస్తులు, కదలలేనివారికి రేషన్ షాపు డీలర్లే రేషన్ సరుకులను ఇంటి వద్ద అందిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎటువంటి పొరపాట్లు దొర్లినా, లేదా దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
అక్రమ ఇసుక నిల్వదారులపై కఠిన చర్యలు
కట్టడాలు నిర్మించుకునేవారికి ఉచితంగా ఇసుకను అందించాలన్న ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్న నేపథ్యంలో అక్రమ నిల్వలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఇసుక ఉచిత సరఫరాకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కె సుబ్బారావు, డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ, గనుల శాఖ సహాయ సంచాలకులు ఆర్ గొల్ల, పిఆర్ డిఇ గుణ్ణం రాంబాబు, కపిలేశ్వరపురం తహసీల్దార్, ఎంపిడిఒ, కె గంగవరం తహసీల్దార్లతోపాటు గనుల శాఖ ఉద్యోగులు, మండపేట రూరల్ సిఐ విప్పర్తి పుల్లారావు, అంగర ఎస్సై కర్రా దుర్గాప్రసాద్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం జెసి సత్యనారాయణ విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ఇసుక రీచ్‌ల వద్ద సంబంధిత విఆర్వో, పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. అవసరాన్ని మించి ఇసుకను నిల్వ చేయడం గాని, ఇతరులకు అమ్మడం గాని చేపట్టినట్లయితే రెండు సంవత్సరాల జైలుశిక్ష, రూ.2 లక్షలు వరకు జరిమానా విధిస్తామన్నారు. ఇసుక నిల్వలు గుర్తించిన అధికారులు ఆ స్థల యజమాని, నిల్వచేసిన గుత్తేదారు, రవాణా చేసిన వాహనాల యజమానులపై కేసులు నమోదు చేయడమే కాకుండా రవాణాచేసిన వాహనాలను జప్తుచేస్తారని హెచ్చరించారు. జిల్లాలో అధికారికంగా 23 ర్యాంపులు ఉన్నాయన్నారు. జిల్లా పరిధిలో 25,53,947 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. కె గంగవరం పరిధిలోని కోటిపల్లి వద్ద ఇసుక ర్యాంపును ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.