ఖమ్మం

అవసరమైతే సైనిక హెలీకాప్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, సెప్టెంబర్ 25: గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు సైనికహెలీకాప్టర్లను రంగంలోకి దించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించినట్లుగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఐటిడిఏ పిఓ చాంబర్‌లో ఆదివారం సాయంత్రం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాదులో హెలీకాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆర్మీని కూడా పంపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. భద్రాచలానికి ఎగువన మహారాష్టల్రోని విష్ణుపురి, మన రాష్ట్రంలోని శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నుంచి, ప్రాణహిత, ఇంద్రావతి, పెన్‌గంగా ఉపనదుల నుంచి వరద మొత్తంగా 10లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని వివరించారు. ఇదే సమయంలో జిల్లాలోని తాలిపేరు, కినె్నరసాని ఉప్పొంగితే, దిగువన శబరి పోటేస్తే వరద విలయతాండవం చేస్తుందని నీటిపారుదలశాఖ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని మంత్రి వివరించారు. ఈ ఏడాది జూలై నెలలో కూడా 10లక్షల క్యూసెక్కుల వరదకు 52.4 అడుగుల మేర గోదావరి పొంగిందని గుర్తు చేశారు. మరో వైపు ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం కారణంగా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకలెక్టర్, ఎస్పీల సాయంతో సహాయక చర్యలకు సర్వం సిద్ధం చేసినట్లుగా వెల్లడించారు. దిగువన ఆంధ్రాలోని విలీన మండలాలకు కూడా సమాచారాన్ని పంపుతామని తెలిపారు. కష్ట సమయంలోనే అంతా కలిసికట్టుగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. భద్రాచలం పట్టణంలో కరకట్ట స్లూయిజ్ గేట్లు సిద్ధం చేసి ఉంచామని ట్రయల్ రన్ కూడా చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారన్నారు. అయినా మరోసారి పర్యవేక్షించాలని ఆదేశించినట్లు చెప్పారు. విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ లోకేశ్‌కుమార్, ఎస్పీ షాన్‌వాజ్ ఖాసీం, ఐటిడిఏ పిఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గ్రామాల్లో వీఆర్వోలే కలెక్టర్లు
* పహాణీలు మార్చితే రాజ్యాంగాన్ని మార్చినట్లే
* సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
* రాష్టమ్రంత్రి తుమ్మల
ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 25: గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)లే కలెక్టర్‌తో సమాన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర గ్రామరెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం(టివిఆర్‌ఓడబ్ల్యుఏ) రాష్ట్ర 4వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా వీఆర్వోనే ముఖ్యమని, వీఆర్వోలు ఇచ్చే నివేదికలతో ప్రభుత్వమే నడుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు కీలకభూమిక పోషిస్తే అంతా సవ్యంగానే జరుగుతాయన్నారు. కొంతమంది వీఆర్వోలు చేస్తున్న తప్పులకు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని, అలాంటి పేరుకు స్వస్తి పలికి ప్రజలకు సేవ చేసేందుకు కృషిచేయాలని కోరారు. ప్రజల జీవితాలు వీఆర్వో చేతుల్లో ఉంటాయని, వారు ఏమైనా తప్పు చేస్తే ఆ కుటుంబాలు కోలుకునే పరిస్థితి ఉండదన్నారు. పటారి పట్వారి వ్యవస్థను రద్దు చేసి అధికారుల వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తీసుకొచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీఆర్వోలు కొంతమంది స్వలాభం కోసం ప్రయత్నించటం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, వ్యవస్థను మెరుగుపర్చేందుకు విఆర్వోలు కీలకభూమిక పోషించాలన్నారు. ప్రస్తుత టెక్నాలజీ పెరిగిన దృష్ట్యా విఆర్వోలకు ప్రభుత్వం ద్వారా ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని, అందరికి శిక్షణ ఇప్పించి లాప్‌టాప్‌లు అందించటం జరుగుతుందన్నారు. అనేక మంది విఆర్వోలు ఇళ్ళ స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి స్థలాలతో అందించేందుకు, విఆర్వోల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అనంతరం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేయర్ పాపాలాల్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు,డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ విఆర్వోల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ మాట్లాడుతూ విఆర్వోలు 24గంటలు పనిచేస్తున్నారని, ప్రతి విఆర్వోకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని, కంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. విఆర్వోలకు గ్రామాల్లో కార్యాలయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, అన్ని గ్రామాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయటంతో పాటు లాప్‌టాప్ సౌకర్యం కల్పించాలని కోరారు. అదే విధంగా టిఎన్జీవోస్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అఫ్జల్ హసన్, తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, సభ అనంతరం పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో విఆర్వో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సున్నం రామారావు, షేక్ నాగుల్‌మీరా, రాష్ట్ర కోశాధికారి తిప్పర్తి అశోక్, జిల్లా కోశాధికారి భాస్కర్, నాయకులు జానిమియా, భాస్కర్, టిఆర్‌ఎస్ నాయకులు ఆర్జెసి కృష్ణ, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

విభజనకు సిద్ధమవుతున్న ఆర్టీఏ
* భవిష్యత్తులో ఉద్యోగుల కొరత తీవ్రం
* ఖమ్మం పరిధిలో అదనంగా 3చెక్‌పోస్టులు... ?
* కొత్తగూడెం పరిధిలో మరొకటి...?
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 25: జిల్లాలో అన్ని శాఖల మాదిరిగానే నూతన జిల్లాల ఏర్పాటుతో ఖమ్మం జిల్లా ఆర్టీఏ కార్యాలయం కూడా కొంత భాగాన్ని కొల్పోనున్నది. ఉమ్మడి జిల్లాగా ఖమ్మం ఉన్న క్రమంలో జిల్లాలోని నాలుగు సబ్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మం నుంచి కొత్తగూడెం విడిపోయి నూతన జిల్లాగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిధిలోకి వైరా, సత్తుపల్లి సబ్ కార్యాలయాలు రానుండగా, కొత్తగూడెం జిల్లా పరిధిలోకి కొత్తగూడెం, భద్రాచలం కార్యాలయాలు రానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఒక ఆర్టీఓ, ఇద్దరు ఏవోలు, సీనియర్ అసిస్టెంట్లు నలుగురు, జూనియర్ అసిస్టెంట్లు 5, టైపిస్టు ఒకరు, ఆఫీస్ సబార్డీనేటర్లు 7, ఎంవిఐలు 4, ఏఎంవిఐలు 9, కానిస్టేబుళ్ళు 2, హెడ్ కానిస్టేబుల్ 1 విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎంవిఐలు సైతం ఖమ్మంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కొత్తగూడెంకు చెందిన ఎంవిఐ బజాజ్‌ను జిల్లా కేంద్రమైన ఖమ్మంకు తాత్కాలికంగా నియమించారు.
ఇప్పటికే ఉద్యోగుల కొరత
జిల్లా కేంద్రమైన ఖమ్మంలో పూర్తిస్థాయిలో అధికారులు ఉండాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల ఇన్‌చార్జిల పోస్టులతోనే కాలం గడపాల్సి వస్తుంది. నూతన జిల్లాగా ఏర్పడుతున్న క్రమంలో జిల్లా కేంద్రమైన ఖమ్మంకు ఓ అధికారి కొత్తగూడెం జిల్లా ఆర్టీఏగా వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఖమ్మంలో ఉద్యోగుల కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న అధికారులనే కొత్తగూడెం జిల్లాగా ఏర్పడుతున్నప్పటికీ ప్రస్తుతం పనిచేస్తున్న వారినే రెండు జిల్లాల్లో విధులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నూతన చెక్‌పోస్టులకు అవకాశం..!
ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 3చెక్‌పోస్టులుండగా, కొత్తగూడెం పరిధిలోకి అశ్వారావుపేట, పాల్వంచ చెక్‌పోస్టులు వెళ్ళనుండగా, ఖమ్మం పరిధిలోకి కల్లూరు చెక్‌పోస్టు మాత్రమే ఉండనున్నది. ఈ క్రమంలో ఖమ్మం ఆర్టీఏ పరిధిలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఖమ్మం జిల్లా సరిహద్దు బోనకల్ మండలంలో, ఎర్రుపాలెం మండలంలో, సత్తుపల్లి ప్రాంతాల్లో నూతన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసే అంశాలపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. కాగా కొత్తగూడెం జిల్లా పరిధిలో భద్రాచలం సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.