ఖమ్మం

కొత్త జిల్లాకు నదీసోయగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, సెప్టెంబర్ 25: నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెం జిల్లా నదీ సోయగాలతో పర్యాటక శోభను సంతరించుకుంటుంది. దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది జిల్లాలో దాదాపు 140 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కినె్నరసాని, తాలిపేరు, పెద్దవాగు, పాలెంవాగు తదితర గోదావరి ఉపనదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఇవికాక 100కు పైగా సంఖ్యలో వాగులు, వంకలు ఏడాదిలో సగం రోజులు ప్రవహిస్తాయి. ప్రధానంగా గోదావరి వేలాది క్యూసెక్కుల నీటితో మూడు కాలాల్లోనూ ప్రవాహం సాగుతుంది. ప్రధాన ఉపనదులపై సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఉన్నాయి. సుమారు 1.50లక్షల ఎకరాలకు ఉపనదులపై నిర్మించిన ప్రాజెక్టులు వాగులతోపాటు చెరువుల ఆధారంగా ఎత్తిపోతలు సాగునీటిని అందిస్తున్నాయి. విస్తారమైన అటవీ ప్రాంతం కనువిందు చేసే జలపాతాల ప్రవాహాలతో పర్యాటకానికి అపార అవకాశాలు గల జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా పర్యాటకంగా కొత్తశోభను సంతరించుకుంది. దుమ్ముగూడెం వద్ద క్రాస్‌వాల్ పెంచి సీతారామప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా కొత్తగూడెం జిల్లాకు పూర్తిగా, ఖమ్మం జిల్లాకు కూడా సాగునీరు అందిస్తారు. పాలేరుకు నాగార్జునసాగర్ జలాలు లేకుండా సీతారామప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితోనే నింపవచ్చు.
కొత్తగూడెం జిల్లాలో ఉపనదులు సీతారామప్రాజెక్టు ద్వారా మెట్ట ప్రాంతాలకు సాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుంది. కొత్తగూడెం జిల్లాలో నదులు, ఉపనదులతో పాటు సీతారామప్రాజెక్టు, మరికొన్ని మధ్యతరహా ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని తరలిస్తారు. తాలిపేరు ప్రాజెక్టు ద్వారా 16వేల ఎకరాలకు, పాలెం ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలు, కినె్నరసాని ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటితో పాటు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు తాగునీటి సౌకర్యం లభిస్తుంది. పెద్దవాగు ప్రాజెక్టు ద్వారా 15వేల ఎకరాలు, ములకలపల్లిలోని మూకమామిడి ప్రాజెక్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇవి కాక జిల్లాలో కొత్తగా చెరువులు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఉన్న అడవులు సంరక్షణతో పాటు అవకాశం ఉన్న మేర ఆయకట్టుకు సాగునీరు అందిస్తే కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో హరిత జిల్లాగా ప్రసిద్ధి చెందడం ఖాయం.
పర్యాటకానికి అనుకూలం
కొత్తగూడెం జిల్లాలో విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా ఉంది. కార్మికులు, కర్షకులు, ఆదివాసీలు, బంజారాలు ఇంకా అనేక జాతులు ప్రజలు జిల్లాలో నివసిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా చెప్పవచ్చు. భద్రాచలం టూరిజం జిల్లాకు మూలస్తంభంగా నిలవనుంది. భద్రాచలం సమీపంలో రాముడు నడయాడిన పుణ్యభూమి పర్ణశాల ఇక్కడే ఉంది. ప్రస్తుతం పర్ణశాలకు పరిమిత సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు మెరుగు పరచడం ద్వారా అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే బాధ్యత కొత్త జిల్లా యంత్రాంగంపై ఉంది. భద్రాచలానికి కొద్ది దూరంలో శ్రీరామగిరి, పేరంటాలపల్లి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భద్రాచలం నుంచి గోదావరి నదిపై రాజమండ్రి వరకు లాంచీలో ప్రయాణం మధురానుభూతి కలిగిస్తుంది. ఇప్పటికే కూనవరం కేంద్రంగా అనేక లాంచీలు తిరుగుతున్నాయి. ఇవేకాక కినె్నరసాని, తాలిపేరు సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేసి పర్యాటకానికి మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కినె్నరసాని మినహా మిగిలిన ప్రాజెక్టుల వద్ద వసతులు లేవు. ప్రాజెక్టుల వద్ద బోటు షికారు, వన్యప్రాణుల సందర్శన ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ నయాగరాగా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వేలసంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
బొగత జలపాతం సమీపంలోనే ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయాభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం రోడ్డు సౌకర్యం లేకపోవడం జలపాతం సమీపంలో సైట్ సీయింగ్ వ్యవస్థ అభివృద్ధికి నోచుకోలేదు. గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ సౌకర్యాల లేమి అద్దం పడుతోంది. కొత్తగూడెంలో ఇటీవల రూ.40కోట్లతో పర్యాటక హరిత హోటల్‌తో పాటు కినె్నరసాని అభివృద్ధికి జరిగిన శంకుస్థాపన పర్యాటకానికి ఊతమిచ్చేలా ఉంది. గేట్‌వే ఆఫ్ ఆంధ్రాగా ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో ఉన్న వందలాది నర్సరీలు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉద్యానవన పంటలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలన్నింట్లోనూ దట్టమైన అడవులు ఉన్నాయి. ఏడాదికి సగటున 1200 నుంచి 1400 మి.మీలు వర్షపాతంగా ఉంది. అటు అటవీ ప్రాంతం, ఇటు నదుల్లో పర్యాటకంతో కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగం చేయాల్సిన బాధ్యత పాలక, అధికార యంత్రాంగంపై ఆధారపడి ఉంది.