ఖమ్మం

అధికార పార్టీకి అసంతృప్తుల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 29: కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించవచ్చని ప్రభుత్వ పెద్దలు చెప్తుండగా క్షేత్ర స్థాయిలో మాత్రం అధికార పార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాల విభజనతో తాము నమ్ముకున్న నేతలు తమను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు కూడా వెనుకాడేది లేదని బాహాటంగానే స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ గడిచిన ఎన్నికలకు ముందు అత్యంత బలహీనంగా ఉండగా, ఎన్నికల తర్వాత తుమ్మల నాగేశ్వరరావు చేరికతో మరింత బలం పుంజుకున్నది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు అనేక పార్టీల్లోని ప్రధాన నేతలు కూడా అధికార టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు అజయ్‌కుమార్, మదన్‌లాల్, కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు. తమ రాజకీయ భవిష్యత్ టిఆర్‌ఎస్‌లో బాగుంటుందని భావించి టిఆర్‌ఎస్ పెద్దల ఆశీస్సులు తీసుకొని తమ అనుచరులకు నచ్చచెప్పి భారీ సభలు, సమావేశాలతో పార్టీలో చేరారు. అంతవరకు బాగానే ఉన్నా తాము పార్టీలో చేరి ఏళ్ళు గడుస్తున్నా తమకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకోవడం, దసరా నుంచి ఖమ్మం రెండు జిల్లాలుగా విడిపోతున్న నేపథ్యంలో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల్లో కొత్తజిల్లాల్లో కొత్త నేతల హవా కొనసాగనున్నది. జిల్లాలు ఏర్పడక ముందే ఆ విషయం బాహాటంగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఆధిపత్యం స్పష్టంగా తెలుస్తుండగా, కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా పరిధిలో అక్కడి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వచ్చే నేతల్లో తుమ్మల, పొంగులేటి అనుచరులు జలగంతో ఇమడలేమని బహిరంగంగానే చెప్తూ అవసరమైతే పార్టీ మారేందుకు కూడా వెనుకాడమని అంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో జలగం అనుచరులకు, వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నప్పటికీ అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడిన కొద్ది రోజుల తర్వాత వారంతా తిరిగి గతంలో తాము పని చేసిన పార్టీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే సదరు పార్టీ నేతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అనేక మంది నేతలు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం జిల్లా పరిధిలోని కొందరు నేతలు కూడా ఇదే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తమ రాజకీయ భవిష్యత్ కోసమే తాము నిర్ణయం తీసుకుంటున్నామని కొందరు నేతలు ఇప్పటికే అధికార పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అదే జరిగితే కొంత బలహీనపడిన ప్రతిపక్ష పార్టీలు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత బలం పుంజుకునే అవకాశం ఉంది.