ఖమ్మం

ఆపరేషన్ గ్రీన్‌హంట్‌పై ప్రజాయుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 1: 16వ పిఎల్‌జీఏ వార్షికోత్సవ వారోత్సవాలను గ్రామగ్రామాన జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ శబరి, చర్ల ఏరియా కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆ పార్టీ బ్యానర్లు, కరపత్రాలు భద్రాచలం మన్యంలో బుధవారం రాత్రి నుంచే వెలిశాయి. దీనికి తోడు భద్రాచలం డివిజన్‌కు సరిహద్దునే ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీ వద్ద మావోయిస్టులు బ్యానర్లు వదిలి, వాటి కింద ప్రెషర్ బాంబును అమర్చారు. వెంకటాపురం ఆటో డ్రైవర్ కార్తీక్ వాటిని తొలగిస్తుండగా అది పేలి అతనికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. గతంలోనూ అదే ప్రదేశంలో మావోయిస్టులు ప్రెషర్ బాంబును అమర్చడంతో ఛత్తీస్‌గఢ్ వాసికి తీవ్రగాయాలయ్యాయి. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రజాయుద్దం ద్వారా ఓడిద్దామని మావోయిస్టులు పిలుపునిచ్చారు. అంతేకాకుండా మావోయిస్టు పార్టీలో యువతీ, యువకులు భారీగా చేరాలని కోరారు. ఏటా డిసెంబర్ 2వ తేదీన పిఎల్‌జీఏ వారోత్సవాలను చార్‌మజుందార్, కన్హయ్‌ఛటర్జీల పథ నిర్ధేశంలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000, డిసెంబర్ 2వ తేదీన కొయ్యూరు ఎన్‌కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలను కోల్పోయింది. అప్పటి నుంచి పిఎల్‌జీఏను మావోయిస్టు పార్టీ ఏర్పాటు చేసి వారోత్సవాలను నిర్వహిస్తోంది.
ప్రతిఘటనలు అధికం...
2016వ సంవత్సరం మావోయిస్టులకు చేదు అనుభవాలను మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రంలోని కెకెడబ్ల్యు కమిటీని ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో గ్రేహౌండ్స్ హతమార్చింది. 8 మంది మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్లో మరణించారు. గొట్టిముక్కల రమేశ్ అలియాస్ లచ్చన్న అలియాస్ చంద్రన్న, యూసఫ్‌బీ అలియాస్ సోనీ అలియాస్ భాగ్య, రాజు, కొత్తకొండ సృజన, ధనసరి సారక్క, మడకం బండిలను కెకెడబ్ల్యు కోల్పోయింది. ఇది మరవక ముందే ఇటీవల ఏఓబీలో భారీగా నష్టపోయింది. ఆర్కే నిర్వహిస్తున్న సమావేశంపై బలిమెల అటవీప్రాంతంలో గ్రేహౌండ్స్ దాడి చేయడంతో 31 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలరో ఏఓబి కార్యదర్శి కూడా ఉన్నారు. చాలా రోజుల వరకు ఆర్కే ఆచూకీ దొరకలేదు. అతని కుమారుడు చనిపోయాడు. నవంబర్ నెలలోనే కేరళలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత స్వామి కన్నుమూశాడు. ఇక ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనైతే బస్తర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 120 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లో హతమయ్యారు. అడుగడుగునా ప్రతిఘటనలతో 2016వ సంవత్సరం మావోయిస్టులకు భారీ నష్టాలను మిగిల్చింది. దీనికి తోడు పుండు మీదు పుట్రలా కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు విపరీతమైన నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆర్ధిక ఇబ్బందులతో మావోయిస్టులు ఏఓబి, దండకారణ్యంలో లొంగుబాట పడుతున్నారు. ఇప్పటి వరకు 1000 మందికి పైగా మావోయిస్టులు జనజీవనస్రవంతిలో కలిశారు. పెద్దనోట్లను మార్చుకునే క్రమంలో జార్ఖండ్‌లోని రాంచీలో, తెలంగాణలోని భద్రాచలం డివిజన్ చర్లలో, దండకారణ్యంలో పలువురు మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డారు. సుమారు రూ.7వేల కోట్ల మావోయిస్టుల ఖజానా పెద్దనోట్ల రద్దుతో పనికిరాకుండా పోయింది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిఘటనలు చుట్టిముట్టి సతమతవౌతున్న మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాల ద్వారా పార్టీ పటిష్టతకు నడుంబిగించినట్లు తెలుస్తోంది.
భద్రాద్రి జిల్లాలో హైఅలర్ట్
పిఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిఘాను పెంచారు. తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టు ఇన్‌ఫార్మర్లు, లొంగిన నక్సల్స్ ద్వారా దళాల కదలికలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా అధికారులు, అధికార పార్టీ నేతలను మారుమూల గ్రామాలకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికపుడు పోలీస్‌స్టేషన్ల వారీగా భద్రతపై సమీక్షలు జరుపుతున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, ఓఎస్డీ శోభన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.

నగదు రహిత లావాదేవీల నిర్వహణకు చర్యలు

ఖమ్మం, డిసెంబర్ 1: నగదురహిత లావాదేవీల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ముఖ్య కార్య నిర్వహణాధికారి అమితాబ్ కాంత్ జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. గురువారం ఢిల్లీ నుండి కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు అయిన నేపధ్యంలో నగదు వినియోగాన్ని తగ్గించి నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిత్యం ప్రజలతో సంబందం ఉండే మార్కెట్, నిత్యావసర దుకాణాలలో నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మైక్రో ఏటిఎంల వినియోగానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. అన్ని పంచాయితీలలో నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని, క్యాష్‌లెస్ కార్యాచరణను విస్తరించేందుకు ముమ్మర చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహయక బృందాలకు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయాలని సూచించారు. నగదు రహిత లావాదేవీలపై సామాన్య ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా నగదు రహిత లావాదేవీలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ నీతిఅయోగ్ అధికారులకు తెలిపారు.

అబద్ధాల పునాదులపై పాలన చేస్తున్న కెసిఆర్
* వైసిపి రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి ఆరోపణ
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 1: మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలను నిలబెట్టుకోకుండా అబద్ధాల పునాదులపై కెసిఆర్ ప్రభుత్వ ం పాలన చేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండ రాఘవరెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక ఐఎంఎ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ నియంత పాలన కొనసాగుతోందని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హమీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 37విభాగాల్లో 117వాగ్దానాలు చేసి అబద్ధాలతోప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అబద్ధాలతో అధికారం దక్కించుకున్న ఆయన తన కుటుంబానికి ఇచ్చిన ప్రధాన్యతలో వందోవంతు కూడాప్రజలకు ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. 3ఎకరాల భూమి, ఉచిత విద్యా, రైతు రుణమాఫి, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఎక్కడ అమలవుతుందో చెప్పాలన్నారు. కెసిఆర్ పాలనలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆయన కింద సలహాదారులను నియమించుకొని వారికి కొత్త హంగులను ఏర్పాటు చేస్తున్నారు గాని ఫిజురియంబర్స్‌మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు మాత్రం ఫీజురియంబర్స్‌మెంట్ చెల్లించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తు పనికిరాని పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో 46లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకు అందించారని కెసిఆర్ మాత్రం పేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పినప్పటికి ఇంతవరకు ఒక్క ఇల్లు కూడ నిర్మించి ఇవ్వలేదన్నారు. ప్రజలను పట్టించుకోకుండా తాను ఉండేందుకు 50కోట్ల ఖర్చు చేసి 9ఎకరాలలో ఇళ్ళు నిర్మించుకోవటం పట్ల కెసిఆర్ పాలన ఏ స్థాయిలో ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తన పార్టీలో చేరిన వారికి లబ్ధి చేకుర్చేందుకు జిల్లాల విభజన చేశారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అనాథశ్రీగా మార్చిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి పాలనలో 22గంటలు సిఎం హోదాలో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించారని, కెసిఆర్ మాత్రం ఎక్కువ శాతం ఫాంహౌస్‌లో ఉండి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పె రోజులు దగ్గరలోనే ఉందని, ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తద్యమని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్, రాష్ట్ర కార్యదర్శులు మందడపు వెంకటరామిరెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అలస్యం సుధకర్, నాగేశ్వరరావు, సత్యనారాయణ, నాగిరెడ్డి, బండారు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపురంలో మావోల హల్‌చల్
* ప్రెషర్‌బాంబుతో పేలుడు
* డ్రైవర్‌కు గాయాలు

వెంకటాపురం, డిసెంబర్ 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో బుధవారం రాత్రి మావోయిస్టులు ప్రధాన రహదారిపై హల్‌చల్ చేశారు. ఈనెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న పీఎల్‌జీఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఎదిర పంచాయితీ విజయపురికాలనీ వద్ద బ్యానర్లు, కరపత్రాలను జార విడిచారు. బ్యానర్లను కర్రలు పాతి కట్టి బ్యానర్లు తొలగిస్తున్న సమయంలో బాంబులు పేలే విధంగా పిన్, ప్రెషర్‌బాంబులను అమర్చారు. చర్ల వైపు నుంచి వెంకటాపురం వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం బ్యానర్లు కట్టిన ప్రదేశంలో నిలిపి డ్రైవర్ గుజ్జిళ్ల కార్తీక్ అనే యువకుడు మూత్ర విసర్జన కోసం వెళ్లగా బ్యానర్లకు కట్టిన కర్ర కాలికి తాకడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి కార్తీక్ ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. మ్యాజిక్‌లో ఉన్న ప్రయాణికులు సైతం భయకంపితులయ్యారు. డోర్లు తీసి పరుగులు తీశారు. బాంబు విస్ఫోటనంతో ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. క్షతగాత్రుడిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు. గత ఆగస్టు నెలలో కూడా వారోత్సవాల సందర్భంగా బుధవారం అమర్చిన ప్రాంతంలో పిన్, ప్రెషర్‌బాంబులు అమర్చి మావోలు పోలీసులకు సవాల్ విసిరారు. ఈ సంఘటనతో వెంకటాపురం పోలీసు సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లలో రెడ్‌అలర్ట్ ప్రకటించారు.

నోట్ల రద్దుతో నల్లకుబేరులకు నిద్ర కరవు
* బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ప్రతాప్
మధిర, డిసెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం 500,1000,రూపాయలు నోట్లు రద్దు చేయడంతో నల్ల కుబేరులకు నిద్ర కరువైందని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌ప్రతాప్ పేర్కొన్నారు. గురువారం ఆ పార్టీ నాయకుడు భవనం మధుసూదన్‌రెడ్డి గృహంలో బిజెపి మధిర మండల పట్టణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతిని అంతమొందించడంతో పాటు నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రధాని నరేంద్ర మోడి 500,1000,రూపాయల నోట్లు రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. నోట్లు రద్దును హర్షించాల్సిన ప్రతిపక్షాలు బంద్ పేరుతో ప్రజలను రెచ్చ గొడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందన్నారు.
భారీ మోటర్ సైకిల్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్లు రద్దుకు మద్దతుగా బిజెపి ఆధ్వర్యంలో భారీ మోటర్ సైకిల్ ర్యాలీని గురువారం నిర్వహించారు. మండల పరిధిలోని ఆత్కూరు క్రాస్ రోడ్డ్ వద్ద గల అంజనేయ స్వామి ఆలయం వద్ద ఆ పార్టీ జిల్లా అద్యక్షులు ననె్నఉదయ్‌ప్రతాప్ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించి అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పెరుమాళ్ళపల్లి విజయరాజు, సత్త వెంకటేశ్వర్లు ఉపేందర్, భవనం మధుసూధన్‌రెడ్డి, మినుగు శంకర్, నాగభూషణం, మినుగు రామక్రష్ణ, చిలువేరు సాంబశివరావు పాల్గొన్నారు.
టిడిపి సభ్యత్వ నమోదుకు బాధ్యుల నియామకం
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 1: తెలుగుదేశం పార్టీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదుకు బాధ్యులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య నియమించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ సమీక్ష సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఖమ్మం నగరంలోని 50డివిజన్‌లకు గాను 18మంది కన్వీనర్‌లను నియమించారు. 4,5,6డివిజన్‌లకు ఏలూరి శ్రీనివాస్‌రావు, 1,49,50లకు టిగ్గుల రమణ, 2,3కు మందడపుభాస్కర్‌రావు, 7,8లకు గొల్లపూడి హరికృష్ణ, 9,10,11లకు చిరుమామిళ్ళ నాగేశ్వరరావు, 12,13,14లకు తిప్పల్ల గోపాల్, 15,16,17లకు నాగార్జునపు శ్రీను, 18,19,20లకు చిత్తారు సింహద్రి, 21,22లకు మందపాటి వెంకటేశ్వరరావు, 23,24,25లకు తాళ్ళూరి జీవన్‌కుమార్, 26,27,28లకు గోడ్డేటి మాధవరావు, 29,30,36లకు కూరపాటి వెంకటేశ్వరరావు, 31,32లకు బిక్షపతి రాధోడ్, 33,34,35లకు మనే్నటి నాగేశ్వరావులను నియమించారు. వీరు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనన్నుట్లు ఆయన వెల్లండించారు.
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఖమ్మం రూరల్, డిసెంబర్ 1: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ రైతు ఉరి వేసుకున్న సంఘటన గురువారం తెల్లవారుజామున గొల్లగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. ముత్తగూడెం శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన జిక్కుల వీరయ్య (35) అనే రైతు తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో రెండెకరాల భూమిని కౌలుకి తీసుకొని పత్తి సాగు చేశాడు. కల్తీ విత్తనాల కారణంగా పంట సక్రమంగా పండకపోవడంతో మనస్తాపానికి లోనయ్యాడు. వ్యవసాయం కోసం సుమారు 5లక్షల రూపాయలు అప్పు కాగా, అప్పు తీర్చాలని రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు. బ్యాంక్ ద్వారా వచ్చే అప్పుతో బయట తీసుకొచ్చిన అప్పు కొంతవరకు తీర్చవచ్చని భావించినప్పటికీ, నోట్ల రద్దు కారణంగా బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం ఆలస్యమైంది. ఒకవైపున పంటలు పండకపోవడం, చేసిన అప్పులు పెరగడం, మరోవైపున రుణదాతల ఒత్తిడితో తీవ్ర మనస్తాపం చెందిన వీరయ్య తన అక్క ఇంటివద్ద సన్‌షేడ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతుని సోదరి బయటకు వచ్చి చూడగా వీరయ్య ఉరివేసుకున్న సంఘటన చూసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతునికి భార్య రమాదేవి దివ్యాంగురాలు. కుమారుడు వెంకటేష్ 7వ, కుమార్తె శరణ్య 4వ తరగతి తమ అమ్మమ్మగారి ఊరైన ముదిగొండ మండలం సువర్ణాపురంలో చదువుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకనే వారిని అక్కడ చదివిస్తున్నారని బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.

ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
* జెడ్పీ చైర్‌పర్సన్ కవిత
ఖమ్మం(జమ్మిబండ), డిసెంబర్ 1: ఖమ్మం జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని జడ్పిచైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన, క్రీడలు, వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెవిలియన్ గౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీలో యువత, కళాకారులు ఎన్జీవోస్ సంస్థలు, విద్యార్ధిని విద్యార్ధులు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సిసి విద్యార్ధులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైరపర్సన్ కవిత మాట్లాడుతూ ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎయిడ్స్ మహమ్మరిని అరికట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, డిఎంఅండ్‌హెచ్‌వో కొండలరావు డివైఎస్‌వో ఎండి గౌస్ పాల్గొన్నారు.
కల్లూరులో...
కల్లూరు: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. రక్తదానం చేయండి ప్రాణాలు కాపాడండి, చేతులు కలుపుదాం ఎయిడ్స్‌ను నివారిద్దాం, ఎయిడ్స్ అంటు వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి, ఆరోగ్యమే మహాభాగ్యమంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు దాసరి మాధవి, ఎచ్‌ఇఒ వెంకటనారాయణ, హెల్త్ సూపర్‌వైజర్ పెద్ద పుల్లయ్య, హెల్త్ విజిటర్ రోజా, రజని, ఎఎన్‌ఎమ్‌లు నాగమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడులో...
జూలూరుపాడు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎయిడ్స్ వ్యాధి ప్రబలటానికి కారణాలు, నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలపై ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై పోలీసు స్టేషన్, పాపకొల్లు క్రాస్ రోడ్డు, చండ్రుగొండ క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్‌లు అనంతరాములు, పద్మ, సుభద్ర, ఎఎన్‌ఎంలు, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఉన్నత పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.

పేలుళ్లతో దద్దరిల్లిన విజయపురికాలనీ

వెంకటాపురం, డిసెంబర్ 1: పీఎల్‌జీఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ మావోయిస్టులు విజయపురి కాలనీ వద్ద అమర్చిన బాంబులు పేలడంతో చుట్టుపక్కల గ్రామాలు దద్ధరిల్లిపోయాయి. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన బాంబు విస్ఫోటనంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ గుజ్జిళ్ల కార్తీక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం అమరవీరుల వారోత్సవాలను జయప్రదం చేయాలని ప్రజా విముక్తి కోసం యువత గెరిల్లా సైన్యంలో చేరాలని మావోలు వదిలిన కరపత్రాలు, బ్యానర్లలో పేర్కొన్నారు. వారోత్సవాల సందర్భంగా పోలీసులు ఒకవైపు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ చేస్తుండగా మరోవైపు మావోయిస్టులు ప్రధాన రహదారిపై పిన్, ప్రెషర్‌బాంబులు అమర్చి పేల్చడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చర్ల, శబరి ఏరియా కమిటీల పేరుతో కరపత్రాల్లో పేర్కొన్నారు.

ఎస్‌బిహెచ్ ముందు ఖాతాదారుల ఆందోళన
జూలూరుపాడు, డిసెంబర్ 1: స్థానిక ఎస్‌బిహెచ్ ముందు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, ఖాతాదారులు డబ్బుల కోసం గురువారం ఆందోళనకు దిగారు. బ్యాంకులో ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను తమ ఖాతాల్లో జమ చేసుకుని రోజులు గడుస్తున్నాయని కొందరు, తమ ఖాతాల్లో దాచుకున్న డబ్బు కూడా తమ అవసరాలకు ఇవ్వటంలేదని మరి కొందరు ఆందోళన చేశారు. రోజుల తరబడి బ్యాంకు చుట్టూ పడిగాపులు కాయాల్సి వస్తుందని, ఎటిఎం వద్ద కూడా రోజంతా క్యూ కట్టినా డబ్బులు రావటం లేదని తమ బాధను తీర్చాలంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తే సాయంత్రానికి రు.2వేల మాత్రమే ఇస్తుండటంతో నిత్యావసర ఖర్చులకు కూడా సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు బ్యాంకులో దాచుకున్న డబ్బుల కోసమే రోజూ తిరగాల్సి వస్తుందని వాపోయారు. బ్యాంకులో సరిపడా డబ్బులు లేనికారణంగా ఖాతాదారులకు తక్కువగా ఇవ్వాల్సి వస్తుందని సిబ్బంది వివరించినా ఆందోళన తగ్గలేదు. బ్యాంకు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొందరు వ్యాపారులకు మాత్రం రోజుకు రు.లక్షల్లో లావాదేవీలు నడిపిస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. ఆందోళన ఉధృతం కావటంతో విషయం తెలుసుకున్న ఎస్సై ఇళ్ల రాజేష్ బ్యాంకు వద్దకు వచ్చి నచ్చచెప్పటంతో గొడవ సద్దుమణిగింది.