ఖమ్మం

పెద్దనోట్ల రద్దు దేశాభివృద్ధి కోసమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 3: దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై ప్రజలకు అవగాహన కల్పించాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ కార్యకర్తలకు సూచించారు. శనివారం ఖమ్మంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు, ప్రస్తుత పరిస్థితులపై గ్రామస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకొని వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. అలాగే స్వైప్ మిషన్ గురించి వివరించాలన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో జరిగే ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. దీనిపై సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ సూచించారు. మండల పదాధికారుల సమావేశం పక్షం రోజులకు ఒకసారి నిర్వహించాలన్నారు. మండలంలోని స్థానిక సమస్యలపై కనీసం రెండు ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అదే విధంగా ఈ నెల 15వ తేదీలోపు మండల శిక్షణా తరగతులను, 26,27 తేదీలలో ఖమ్మం నగరంలో శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. నరేంద్రమోడీ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణయాదవ్, బయో ఫెర్టిలైజర్స్ సంస్థ కందుల నరేందర్, ప్రముఖ వ్యాపారస్తుడు గెల్లా మోహన్‌లు బిజెపి పార్టీలు చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, గెంటేలా విద్యాసాగర్, రవీందర్, నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్, నాయకులు కొండి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రప్రభుత్వ పథకాల అమలులో
అధికారుల నిర్లక్ష్యం
* ‘దిశ’పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి సమీక్షలో స్పష్టం
కొత్తగూడెం, డిసెంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగ్రామీణాభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశాన్ని స్థానిక ఐఎంఎ హాలులో శనివారం నిర్వహించారు. సుధీర్ఘంగా సాగిన ఈసమావేశంలో కేంద్రనుండి జిల్లాలకు అమలయ్యే 28 పథకాలపై సమీక్షను నిర్వహించారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్‌లు వివిధ పథకాలపై వివిధ ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో క్షేత్రస్థాయిలో నిర్వహించిన సమీక్షలో పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. జిల్లాల పునర్విభజన తరువాత రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిదిశ సమీక్షను నిర్వహించినట్లు ఎంపిలు తెలిపారు. ప్రధానంగా మధ్యాహ్నభోజనపథకం, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌యోజన, ఐడబ్లుఎంపి, నేషనల్ హెల్త్‌మిషన్, జిల్లా మహిళ, శిశుసంక్షేమశాఖ, జిల్లా పంచాయితీరాజ్ తదితర పథకాలపై సమీక్షను చేశారు.పథకాలు అమలవుతున్న తీరుపట్ల ఎంపిలతోపాటు కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి లు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతి సంవత్సరం నాలుగుసార్లు దిశ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామని ఎంపిలు ప్రకటించారు. ఈసమావేశంలో జిల్లాకలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, జిల్లాగ్రామీణాభివృద్ధి అధికారి జగత్‌కుమార్‌రెడ్డి లతోపాటు వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

కళాకారులను ప్రోత్సహించాలి
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 3: స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో శనివారం జిల్లా యువజన, క్రీడా కార్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులను ఈ విధంగా ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. కళాకారులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, వారికి అనేక పథకాలు అందజేసేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా జానపద గేయాలలో రేలా నాగరాజు, ఎం కల్యాణి, సాయి శ్రీనివాస్‌ల గ్రూప్ ఆధ్వర్యంలో జానపద గేయాల కార్యక్రమం నిర్వహించారు. అలాగే జానపద నృత్యంలో ఏబిసిడి అఖిల్, జవహర్ నవోదయ, సంజీవ్ గ్రూప్‌ల ఆధ్వర్యంలో నృత్యాలు నిర్వహించారు. ఏకాంకిక కార్యక్రమంలో ఏఎస్‌ఆర్‌జె జిజెసి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. హిందుస్థాని కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఏఎస్‌ఆర్‌జె జిజెసి ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగీత వాయిధ్యం కార్యక్రమంలో ఎం నిగమా విఎం బంజర ఆధ్వర్యంలో నిర్వహించారు. క్లాసికల్ డ్యాన్స్‌లో జి నవ్యవౌనిక, జి విక్రందాస్, ఎం శాలినిలు డ్యాన్స్‌లు చేసి అలరించారు. తబలాలో టి పిలిప్స్, సి చక్రవర్తి ఆధ్వర్యంలో తబలా నిర్వహించారు. వకృత్వ పోటీలలో ఎస్‌కె మతిన్, ఎస్‌డి జాస్మీన్‌లు గెలుపొందారు. వివిధ కళాకారులతో నిర్వహించిన యువజనోత్సవాలు ఘనంగా కొనసాగాయి. దీనిలో భాగంగా గెలుపొందిన కళాకారులను హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్టస్థ్రాయి యువజనోత్సవాలకు పంపించడం జరుగుతుందని యువజన సంఘ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకోచ్ గౌస్, ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గరిడేపల్లి సత్యనారాయణ, యువజన సంఘాల సమితి జిల్లా నాయకులు బండారు లక్ష్మయ్య, కార్యదర్శి పుప్పాల కృష్ణారావు, ఉపాధ్యక్షులు కె ఉమాశంకర్, మునగాల వెంకటరత్నం, పాగి వెంకన్న, బీరెళ్ళి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అప్రమత్తంగా
ఉన్నాం: డిఎస్పీ
భద్రాచలం, డిసెంబర్ 3: మావోయిస్టుల పిఎల్‌జిఏ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని డిఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో శనివారం రాత్రి ఆయన మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో సమాచార మార్పిడి ద్వారా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామన్నారు. నిరంతర తనిఖీలు, అన్ని పోలీస్‌స్టేషన్లకు భద్రత ద్వారా మావోయిస్టుల వ్యూహాలను, ఎత్తులను నిలువరిస్తున్నామన్నారు. వారోత్సవాల ప్రభావం పెద్దగా ఏమీ లేదన్నారు. ఈయనతో పాటు సిఐ శ్రీనివాసులు, ఎస్సైలు కరుణాకర్, అబ్బయ్య, సంజీవరావు తదితరులు ఉన్నారు.

చౌక దుకాణాల్లో
నగదు రహిత లావాదేవీలు
* జెసి వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశం
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 3: చౌక దుకాణాల డీలర్లు నగదు రహిత లావాదేవీలు జరపాలని జెసి వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక టిటిడిసి సమావేశ మందిరంలో రేషన్‌డీలర్లు, పెట్రోల్‌బండ్ డీలర్లకు డిటిసిఎస్‌లు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలను సులభతరంగా ఉపయోగించుకునేందుకు వీలుగా పిఓఎస్, డెబిట్, క్రెడిట్ కార్డులు, యుఎస్‌ఎస్‌డి, యుపిఐల ద్వారా లావాదేవిలను జరిపించుకోవాలన్నారు. నగదు రహిత మిషన్లపై డీలర్లు అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి లావాదేవీలు జరిపినా అందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సూపర్‌వైజర్ సందీప్, అన్ని రకాల క్రెడిట్ కార్డులపై, వారి బ్యాంకులు నిర్వహిస్తున్న మిషన్లపై డీలర్లకు అవగాహన కల్పించారు. అనంతరం బ్యాంక్ మెనేజర్ మాట్లాడుతూ డీలర్లకు పిఓఎస్ మిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా మా సిబ్బందికి ఫోన్‌ద్వారా సమాచారం తెలిపిన వెంటనే దానిని నివృత్తి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారిని టిబి సంధ్యారాణి, లీడ్‌బ్యాంక్ మెనేజర్ శర్మ, బ్యాంక్ మెనేజర్లు, ఇడిఎం పి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచండి
నేలకొండపల్లి, డిసెంబర్ 3: డిజిటల్ చెల్లింపులకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని నేలకొండపల్లి ఎంపిడిఒ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి కోరారు. శనివారం నేలకొండపల్లిలోని సీతారామ ఫంక్షన్ హాల్ నందు వ్యాపారస్థులు, రేషన్ డీలర్, వివిధ శాఖల అధికారులతో నగదు రహిత చెల్లింపులపై ఆవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని రకాల వ్యాపార సంస్థలు నగదు రహిత చెల్లింపులు చేయాలని కోరారు. సమాజంలో వ్యాపారస్థులపై వ్యవస్థ ఆధారపడి ఉంటుందని అన్నారు.ప్రజలు డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపించాలని అన్నారు. వ్యాపారస్థులు తమ వద్దకు వచ్చేవారి నుండి నగదు చెల్లింపు ద్వార వ్యాపారం చేయాలని అన్నారు. వ్యాపారస్థులు, ప్రజలు మొబైల్ యాప్‌ల ద్వారా గాని, ఇంటర్‌నెట్ ద్వారా గాని, ఆండ్రాయిడ్‌ఫోన్ ద్వారా, పిఒఎస్ ద్వార, స్వైప్ మిషన్ల ద్వారా తమ డబ్బులను చెల్లించాలని కోరారు. అలాగే వ్యాపారస్థులు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వార తమ లావాదేవీలు చేయాలని అన్నారు. ప్రజలకు డిజిటల్ చెల్లింపులకు అవగాహన అధికారులు కల్పించాలని అన్నారు. డిజిటల్ చెల్లింపులలో అధికారులు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం పెటిఎం ద్వార సినిమా టికెట్ల్, విద్యుత్ బిల్లులు చెల్లింపులు,ట్రైన్, బస్సులు తదితర వాటికి డిజిటల్ రంగం అందుబాటులో ఉందని అన్నారు. ఎంఆర్‌ఒ సైదులు మాట్లాడుతు మార్కెట్, నిత్యావసర దుకాణాలలోప్రజలు నగదు రహిత లావాదేవీలను చేయాలని అన్నారు. ప్రతి దుకాణాలలో డిజిటల్ లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బిహెచ్ ఫీల్డ్ ఆఫీసర్ , ఇఒఆర్‌డి ప్రభాకర్‌రావు, ఏఇలు నల్లానిమోహన్, ఓంప్రకాశ్, శ్రీనివాసరావు, వసంత, విఆర్‌ఒలు జానిమియా, విఎఒలు, గ్రామ పంచాయితీ కార్యదర్శులు, రేషన్ డీలార్స్, కిరాణం సంఘం, వస్త్ర సంఘం, ఐరన్ మార్కెట్ తదితరులు పాల్గొన్నారు.

మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం
కొత్తగూడెం, డిసెంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొబైల్ బ్యాంకింగ్ సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలకు, ఉద్యోగస్థులకు కొంత ఊరట లభించింది. మొబైల్ ఎటి ఎం లద్వారా రూ 2వేలు డ్రాచేసుకునే అవకాశాన్ని బ్యాంక్ అధికారులు కల్పించారు. నగదు డ్రాను పెంచాలని ప్రజలనుండి డిమాండ్ పెరుగుతోంది. సింగరేణి ప్రధానకార్యాలయంలో సింగరేణి డైరెక్టర్ (పాఅండ్‌ఫైనాన్స్) జె పవిత్రన్‌కుమార్, మరో డైరెక్టర్ (ఆపరేషన్స్) బిక్కి రమేష్‌కుమారులు మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. అవసరమైన మేరకే నగదును తీసుకొని మిగిలిన వారికి అవకాశం కల్పించాలని ఈసందర్భంగా డైరెక్టర్లు కోరారు. ఈకార్యక్రమంలో అధికారులు జి మురళీసాగర్‌కుమార్, చిట్టిబాబు, ప్రసాద్, వెంకటేశ్వరావు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఎమ్మెల్యే జలగం వెంకటరావులు మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు.

నకిలీ విత్తనాలతో మోసపోయిన మిర్చి రైతులు
బోనకల్లు, డిసెంబర్ 3: మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో అంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఏర్పాటు చేసిన మిర్చి నర్సరిలో కొనుగోలు చేసిన మిర్చి నారు పూత, కాత లేకుండా పొయింది. బాధిత రైతులు, టిఅర్‌ఎస్ మండలాధ్యక్షులు బంధం శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా వత్సవాయి మండలానికి చెందిన గింజుపల్లి పుల్లారావు మోటమర్రి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి అళ్ళపాడు, మోటమర్రి తదితర గ్రామాల్లో రైతులకు దామిని, ట్యాక్సన్ రకాలకు చెందిన మిరపనారుగా చెప్పి అందజేశాడు. మోటమర్రిలో 10మంది రైతులు 1.60లక్షలతో నారు కొనుగోలు చేయగా, అళ్ళపాడులో 6గురు రైతులు 9ఎకరాల్లో 1.35లక్షలతో మిరపనారు నర్సరిలో కొనుగోలు చేశారు. అంతేకాక కలకోట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పిఇటిగా పనిచేస్తున్న మందా మాధవరావు కూడా నర్సరి ఏర్పాటు చేసి దామిని రకం నారును రైతులకు సరఫరా చేశాడు. ఈ నర్సరీ నందు 4గురు రైతులు 1.50లక్షలతో మిరపనారును కొనుగోలు చేశారు. ఈ నర్సరీలలో కొనుగోలు చేసి తమ పంట పొలాల్లో మిర్చి పంట సాగు చేసిన రైతులు ఎటువంటి పూత, కాత లేకపోవడంతో నర్సరి వారిని అడుగగా తమకు ఏమీ సంబంధం లేదన్నారని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బంధం శ్రీను మాట్లాడుతూ నకిలి మిరపనారు అమ్మిన నర్సరి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేలా వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడుతామన్నారు. మోటమర్రిలోమిర్చి నర్సరీలు ఏర్పాటు చేసిన వారంతా సిపియంకు చెందిన వారని అందుకే వారు రైతులకు అన్యాయం జరిగినా నోరు మెదపడం లేదన్నారు. గతంలో తూటికుంట్లలో ఓ షాపు యజమాని అమ్మితే కేసునమోదు చేసేదాక ఊరుకోని సిపియం నేతలు ఇప్పుడు ఎందుకు వౌనంగా ఉన్నారో రైతులకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలొ బాధిత రైతులు , టిఅర్‌ఎస్ నాయకులు పారా ప్రసాద్, కొమ్మినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.