ఖమ్మం

కర్షకులకు కొత్త కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 9: ఆరుగాలం శ్రమించి పంటను పండించే రైతన్న పంట చేతికొచ్చిన తర్వాత కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమయ్యే సీజన్‌లో కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో రైతులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వాణిజ్య పంటలను వేసిన రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 2,87, 663మంది రైతులు 1,47,373హెక్టార్లలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,37,078మంది రైతులు 1,39, 036హెక్టార్లలో వ్యవసాయం చేశారు. ఇందులో ప్రధానంగా 1,18,472 హెక్టార్లలో పత్తిని సాగుచేశారు. పత్తితీసి మార్కెట్‌కు పంపిన రైతులు డబ్బుల రద్దుతో కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. పత్తి తీసిన కూలీలకు కిలోకు 7రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండగా పత్తి అమ్మిన వెంటనే ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. కానీ మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు అమ్మగానే వ్యాపారులు చెక్కులు ఇస్తుండటం, వాటిని బ్యాంకులో వేస్తే బ్యాంకులు నగదు ఇవ్వకపోవడంతో కూలీలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. దీంతో మరోసారి పత్తి తీసేందుకు కూలీలు రావడం లేదు. సాధారణంగా పత్తిని నాలుగైదు సార్లు తీస్తుంటారు. మొదటి దఫాకే ఈ ఇబ్బంది రావడంతో రెండవ దఫా తియ్యక పత్తి చేలోనే పడిపోతుంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. మరోవైపు పంటను అమ్మగానే ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాదారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు. వీటన్నింటికి తోడు అప్పులు పుట్టక మరిన్ని కష్టాలు పడుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్న పత్తి, మిరప రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటే ధాన్యం రైతుల పరిస్థితి మరోరకంగా ఉంది. ధాన్యాన్ని చేలోనే అమ్మేసే ఆనవాయితీ ఉన్న రైతులు వ్యాపారులు ఇచ్చే చెక్కులను ఏమి చేయాలో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో బ్యాంక్ అకౌంట్లు లేని రైతులే అధికంగా ఉండటంతో చెక్కులు పట్టుకొని తెలిసిన వారి వద్దకు వెళ్తున్నారు. మరోవైపు కోపరేటివ్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మార్చిలో చెల్లించేందుకు రైతులు ప్రయత్నిస్తారు. ఇప్పుడు అమ్మిన పంటలకు చెక్కుల రూపంలో డబ్బులను తీసుకున్న రైతులు ఆ బ్యాంకులో వేస్తే తమకివ్వాల్సిన రుణాల కింద జమ చేసుకుంటున్నారు. దీంతో ఇంటిదగ్గర కూలీలు, బయటకు వెళ్తే వ్యాపారులు, చేనుకి వెళ్తే పంట నష్టపోతున్న విధానాలను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల తక్ పట్టీలను చూసి నగదు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలపై ఆందోళన నిర్వహించే రైతుసంఘాలు కూడా ఈ సమస్యను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.

తెలంగాణ ఇచ్చిన ఘనత
సోనియాగాంధీదే
* జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం
ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 9: తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం పేర్కొన్నారు. సోనియాగాంధీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం సత్యం మాట్లాడుతూ సోనియాగాంధీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని, దేశాభివృద్ధికి ఆమె ఎంతో కృషి చేశారన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా తిరస్కరించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్డెబోయిన నర్సింహారావు, దీపక్‌చౌదరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బండి మణి, నాయకులు ఎండి ఫజల్, జహీర్, మిక్కిలినేని నరేందర్, బాలాజీరాంనాయక్, రాధాకృష్ణ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మైనార్టీసెల్ ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ మైనార్టీసెల్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్‌చేసి చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కన్వీనర్ ఎండి ఫజల్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీల అభివృద్ధికి సోనియాగాంధీ చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తమ నాయకురాలు కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ నగర అధ్యక్షులు వెంకట్రావ్, జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్ జహీర్, నాయకులు చంద్రశేఖర్, సర్వర్‌పాషా, రమేష్, పీటర్, సుశీల్‌కుమార్, రాణా ప్రతాప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించాలి
* కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 9: జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించే దిశగా అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పూర్తి స్థాయిలో కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ జిల్లా అధికారులను అదేశించారు. శుక్రవారం కలెక్టరేటులోని ప్రజ్ఞామందిరంలో జిల్లా అధికారులతో ఆయా శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనున్న జిల్లా కలెక్టర్ల సదస్సుకు జిల్లాకు సంబందించిన సమగ్ర కార్యచరణ ప్రణాళిక నివేదికను సమర్పించాలన్నారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాకనుగుణంగా జిల్లాకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక వనరులు, బలాలు, బలహీనతలు, భౌతిక మానవ వనరులు వాటిని సద్వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు ఆయా శాఖల ద్వారా చేపట్టే కార్యక్రమాలపై రాబోయే 5సంవత్సరాలకు సంబందించిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయలన్నారు. మిషన్‌కాకతీయ కార్యక్రమం కింద మిగిలిన చేరువు పునరుద్దరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు. మూడవ విడత కింద 250 చెరువుల పునరుద్దరణ పనులకు అవసరమగు అంచనా వ్యయాలను రూపొందించాలన్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న త్రాగునీరు, సానికేషన్, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ కార్యక్రమాలకు సంబందించి పూర్తి వివరాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో జెసి వినయ్‌కృష్ణరెడ్డి, జడ్పి సిఇవో మారపాక నాగేష్, డిఎంఅండ్‌హెచ్‌వో కొండలరావు, అధికారులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి, ఎల్‌డిఎం శర్మ, మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన 10వ వేతన ఒప్పందంకోసం బిఎంఎస్ కృషి
* ఎబికెఎంఎస్ జాతీయ కార్యదర్శి లట్టి జగన్మోహన్
కొత్తగూడెం, డిసెంబర్ 9: బొగ్గుగని కార్మికులకు మెరుగైన 10వ వేతన ఒప్పందం కోసం బిఎంఎస్ కృషి చేస్తుందని ఎబికెఎంఎస్ జాతీయ కార్యదర్శి, జెబిసిసిఐ సభ్యులు లట్టి జగన్మోహన్ అన్నారు. స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైపూర్‌లో జరిగిన తొలి జెబిసిసిఐ సమావేశంలో అనేక డిమాండ్లను జాతీయ కార్మికసంఘాలు కోలిండియా యాజమాన్యానికి వివరించాయని తెలిపారు. గ్రాట్యుటీని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచాలని, సిక్ లీవులను 15 నుండి 20 చేయాలని, క్యాజువల్ లీవులను 11 నుండి 15కు పెంచాలని, పెర్క్స్ అలవెన్సులను 50 శాతానికి పెంచాలని, విశ్వకర్మ, అంబేద్కర్ జయంతిలను, క్రిస్మస్, రంజాన్ పండుగలను పెయిడ్ హాలీడేలుగా ప్రకటించాలని బిఎంఎస్ డిమాండ్ చేసినట్లు తెలిపారు. జెబిసిసిఐ సమావేశంలో కోలిండియా, సింగరేణి ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, లాభాలు, నష్టాలపై యాజమాన్య ప్రతినిధులు వివరించాలని తెలిపారు. 9వ వేతనం ఒప్పందంలో పొందుపరచిన డిమాండ్లను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించామని చెప్పారు. ప్రధానంగా పెన్షన్, పోస్ట్ రిటైర్‌మెంట్ మెడికల్‌స్కీంను పరిష్కరించాలని డిమాండ్ చేయగా రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారని వివరించారు. తిరిగి జనవరి 20, 21 తేదీలలో కేరళలో జరిగే రెండవ జెబిసిసిఐ సమావేశంనాటికి కమిటీలు తమ తుది నివేదికలను అందజేసేందుకు సిద్ధమవుతాయని తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌సికెఎంఎస్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి మాధవనాయక్, నాయకులు టివి సూరి, జి ప్రకాశరావు, ఎం మనోహర్, జి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.

కరెన్సీ క్యూలలో అగచాట్లు
* ఎస్‌బిహెచ్ ముందు చాంతాడంత బారులు
జూలూరుపాడు, డిసెంబర్ 9: పెద్దనోట్లను ప్రభుత్వం రద్దుచేసి నెల రోజులు దాటినా డబ్బుల కోసం ప్రజలకు కష్టాలు తప్పటంలేదు. బ్యాంకుల ద్వారా ఖతాదారులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవటంలేదు. దీంతో మండల ప్రజలకు రోజురోజుకీ కరెన్సీ కష్టాలు పెరుగుతున్నాయే కానీ తగ్గటంలేదు. స్థానిక ఎస్‌బిహెచ్ ముందు శుక్రవారం తెల్లవారిందే మొదలు ప్రజలు ఖాతాపుస్తకాలు చేతపట్టి డబ్బుల కోసం వరుసకట్టారు. బ్యాంకుల్లో డబ్బులున్నా కనీస అవసరాల కోసం చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటిఎంలలో రు.2వేల నోట్లు వస్తుండటంతో దుకాణాల వద్ద వ్యాపారులు చిల్లర ఇవ్వకపోవటం మరింత సమస్యగా మారిందని జనం వాపోతున్నారు. రోజువారీ కూలీ పనులకెళ్లే నిరుపేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రోజంతా పనిచేస్తేనే కుటుంబ జీవనం అంతంతమాత్రం. ఇప్పుడు రోజుల తరబడి పనులు మానుకుని బ్యాంకు ముందు పడిగాపులు కాయాల్సి వస్తుండటంతో పెద్ద సమస్యగా మారిందని పేదలు తమ బాధన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు బ్యాంకు ముందు రద్దీ ఉండటంతో మండల కేంద్రం నుంచి పాపకొల్లు రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌తోపాటు బ్యాంకు ముందు గొడవలు జరుగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి వచ్చింది.

పద్యశతక అవధానంలో
అబ్బురపరుస్తున్న యామినిశ్రీ ప్రతిభ
సత్తుపల్లి, డిసెంబర్ 9: సత్తుపల్లి మండలం పరిధిలోని సిద్ధారం మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న గద్దల యామినిశ్రీ పద్యపఠనంలో, పద్యశతక అవధానంలోతన ప్రతిభతో అబ్బుర పరుస్తుంది. శుక్రవారం పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల ముందు వేమన శతకంపై అష్టావధానాన్ని ప్రదర్శించింది. 8మంది ఉపాధ్యాయులు 8 అంశాలలో ప్రశ్నలు సంధిస్తుంటే అలవోకగా సమాధానాలు చెప్పింది. పద్యం మొదటి పదం అడిగితే పద్యం నెంబరు చెప్పడం, పద్యం నెంబరు చెబితే పద్యాన్నిపూర్తిగా ధారణం చేయడం, పద్యంలోని ఏదో ఒక పదాన్ని చదివితే ఆ పద్యం నెంబరుచెప్పి, పద్యం చదివి వినిపించడం, వేమన శతకంలోని 100 పద్యాలు ఏ అక్షరంతోప్రారంభమయ్యాయి,ఎన్ని ఉన్నాయి. అడిగిన అక్షరాన్నిబట్టి వరుసగా 8 అంశాలలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. యామినిశ్రీ ప్రత్యేకత ఏమిటంటే, అడిగిన నెంబరు పద్యాన్ని కింది నుంచి పైకి చదువుతూ అప్పగించగలదు. ఏడేళ్ళ వయసుగల యామినిశ్రీ ఇప్పటి వరకు పద్యధారణ అవధానం చేసిన సిద్ధారం విద్యార్థులలో పిన్నవయస్కురాలు. ఈ బాలికలోని ధారణశక్తిని గుర్తించిన ఉపాధ్యాయిని మాదిరాజు మాలతి తొలుత వేమనశతకంలోని 100 పద్యాలను ధారణ చేయడంలోప్రోత్సహించారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం మధుసూదనరాజు పర్యవేక్షణలో మాలతి పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో అవధాన శిక్షణ ఇచ్చారు. యామిని తల్లిదండ్రులు బసవయ్య, నాగమణి సిద్ధారంలో కూలిపని చేసుకొని జీవిస్తున్నారు.పాఠశాల వారు యామినిశ్రీని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల మండల పరిషత్ సత్తుపల్లి కార్యాలయంలో ఈ విద్యార్థిని ప్రదర్శన చూసి ఎంపిపి అప్పారావు, ఎండిఓ రవి, ఎంఈఓ రాములు, కాంప్లెక్స్ హెచ్‌ఎం రాజేశ్వరరావు అభినందించారు.

అన్నను చంపిన తమ్ముడు
కామేపల్లి, డిసెంబర్ 9: ఆర్థిక లావాదేవీల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో అన్నను తమ్ముడు గొడ్డలితో నరికిన హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం కామేపల్లి పంచాయతీ పరిధిలోని గోపాలపురం కాలనీకి చెందిన భూక్య వాగ్య(42), సోదరుడు భూక్య ముని మధ్య మూడు రోజులుగా ఆర్థిక లావాదేవీలపై ఘర్షణ పడుతున్నారు. ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న వీరు శుక్రవారం సాయంత్రం సైతం ఘర్షణ పడటంతో అన్న వాగ్యాను తమ్ముడు ముని గొడ్డలితో నరికాడు. దీంతో తీవ్ర గాయాలైన వాగ్యాను స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య అచ్చమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా గాయపరచిన ముని మతిస్థిమితం సరిగ్గా లేనట్లు తెలిసింది.
అందుబాటులో లేని 108 :స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే 108 అంబులెన్స్ గత వారం రోజులుగా మరమ్మతులకు తీసుకువెళ్ళడంతో ప్రమాదానికి గురైన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు కొందరు తమ ప్రాణాలను సైతం పోగుట్టుకుంటున్నారు.

మార్కెట్‌ను అభివృద్ధిచేసి చూపిస్తా
* చైర్మన్ ఆర్జెసి కృష్ణ
ఖమ్మం(గాంధీచౌక్), డిసెంబర్ 9: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మార్కెట్ చైర్మన్ ఆర్జెసి కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మార్కెట్ కమిటీ హలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్య తరగతి నుండి వచ్చిన తాను దశలవారిగా అభివృద్ధి చెందానన్నారు. మార్కెట్ అనేది రైతులకు సంబంధించిందని, విద్యా సంస్థను నడిపిన తాను మార్కెట్‌ను అభివృద్ధి చేయలేనని వస్తున్న వ్యాఖ్యలకు మార్కెట్‌ను అభివృద్ధి చేసి సరైన సమాధం చెబుతానన్నారు. తనకు మార్కెట్ కూడ స్కూల్ లాంటిదేనని విద్యా సంస్థను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నానో అదే విధంగా మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ బాధ్యత అప్పగించారని దీనికి సరైన న్యాయం చేస్తానని వెల్లడించారు. మార్కెట్ తనకు కొత్త అయినప్పటికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టానన్నారు. వీటిలో భాగంగానే డ్రస్‌కోడ్, ఐడికార్డు, మార్కెట్ పరిశుభ్రత వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మార్కెట్‌లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కమీషన్‌దారులకు లైసెన్స్ మంజూరు చేయించేందుకు మంత్రులతో చర్చించి వారి సమస్యను పరిష్కరించటం జరిగిందన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు అన్యాయం జరగనివ్వనని, రైతులకు ఇబ్బంది కల్గించే వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. మార్కెట్ చూట్టు ఉన్న రహదారులను 70లక్షల వ్యయంతో రోడ్ల వెడల్పు, మార్కెట్, చూట్టు రహదారుల్లో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. ఇది కూడ వచ్చే మిర్చి సీజన్‌లోపు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
నోట్ల రద్దు దృష్ట్య రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల 12వ తేది నుండి మార్కెట్‌లో మోబైల్ ఎటిఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రైతు బజార్‌లో కూడ కాయిన్స్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రైతుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు స్పష్టం చేశారు.

రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి
* సింగరేణి మేనేజర్ వెంకటాచారి
సత్తుపల్లి, డిసెంబర్ 9 : బొగ్గు ఉత్పత్తిలో భాగంగా పనిచేసే సింగరేణి కార్మికులు రక్షణకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ సింగరేణి బొగ్గుగని మేనేజర్ ఎస్ వెంకటాచారి తెలిపారు. స్థానిక జెవిఆర్ ఓసి నందు శుక్రవారం జరిగిన రక్షణ వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పనిచేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత రక్షణకు ఇవ్వాలని తెలిపారు.రక్షణ సూత్రాలను పాటించి పనిచేయడం వలన ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. హెల్మెట్ మరియు రక్షణకు సంబందించిన ఇతర కవచాలను ప్రతి ఒక్కరు విధిగా ధరించాలని కోరారు. పనిలో నిమగ్నమ ఉన్నప్పుడు రక్షణను విస్మరించకూడదని చెప్పారు. పనిచేస్తున్నప్పుడు మొబైల్ పోన్‌లను వినియోగించరాదని పేర్కొన్నారు. 2017వ జనవరి 16 నుంచి రక్షణ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈ కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఇంజనీర్ దామోదర్‌రావు, అడిషనల్ మేనేజర్ నర్సింహాస్వామి, రక్షణ అధికారి ఎ. కృష్ణమోహన్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రజల్లో దైవభక్తిని పెంచటమే టిటిడి సంకల్పం
కల్లూరు, డిసెంబర్ 9: ప్రజల్లో దైవభక్తి, ఆధ్యాత్మికతను పెంచేందుకు టిటిడి నిధులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు మందిరాలను నిర్మించనున్నట్లు టిడిపి పోలిట్ బ్యూరో, టిటిడి పాలక మండలి సభ్యులు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం రూ. 8లక్షలతో మండలపరిధిలో నూతనంగా నిర్మించనున్న రామమందిరానికి వేద మంత్రాలతో శంకుస్థాపన చేసారు. అనంతరం మందిర ఆవరణలో విలేఖరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిటిడి నిధులతో నిర్మించబోయే పలు మందిరాలలో భాగంగా తొలి మందిరానికి ఈ గ్రామం నుండే శంకుస్థాపనను ప్రారంభించినట్లు తెలిపారు. టిటిడికి భక్తులే ముఖ్యమని రాష్ట్రాలు ఏదన్నది కాదని, ఈ సంకల్పంతోనే ఖమ్మం జిల్లాలో రూ.2కోట్ల టిటిడి నిధులతో 25 భజన మందిరాలను నిర్మించేందుకు టెండర్లు ప్రకటించినట్లు తెలిపారు. భద్రాచలంలోని రాముల వారి మందిర సముదాయంలో భక్తుల సౌకర్యార్థం యాత్రికులకు రూ. 4.65 కోట్లతో అభివృద్ధి పనుల జరపనున్నట్లు తెలిపారు. దీంతో పాటు జిల్లాలోని పలు నియోజక వర్గాల పరిధిలోని గ్రామాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన పురాతన, నూతన మందిరాల వద్ద టిటిడి నిధులతో అభివృద్ధి పనులు జరపనున్నట్లు తెలిపారు. టిటిడి కళ్యాణ మండపాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఎసి కళ్యాణ మండపాలుగా రూపకల్పన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ పనులన్నింటిని నిర్వహించేందుకు టెండర్లు పిలిచామన్నారు. టిటిడి నిధుల నుండి నిరుపేదలకు మోకాళ్ల నొప్పులకు జరిగే ఆపరేషన్లకు 160 మందికి పైగా రోగులను గుర్తించి వైద్య చికిత్సలు జరిపించినట్లు తెలిపారు. నేరుగా టిటిడిలో జరిగే భక్తి సేవలు చూడలేని భక్తుల సౌకర్యార్థం త్వరలో ఖమ్మంలో శ్రీనివాస వైభవం జరిపేందుకు నిర్ణయించామని దీనికి భక్తుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రాధయ్య, బోబోలు లక్ష్మణరావు, ప్రసాదు, చందర్‌రావు, కమలాకర్ రావు, కిరణ్, కొండలరావు, ఆలయ కమిటి నాయకులు శ్రీనివాసరావు, రాఘవులు, బ్రహ్మయ్య, పుల్లారావు, వెంకటేశ్వర్లు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.