ఖమ్మం

భవితవ్యం తేలేది నేడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 10: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. హోరాహోరీగా ప్రచారం నిర్వహించడంతో పాటు అధినేతల సభలతో ప్రజలకు తమ విధానాలను తెలియజెప్పారు. జిల్లా వ్యాప్తంగా 10,85,179 మంది ఓటర్లు ఉండగా అందులో 9,32,213 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 4,74,370 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 4,57,834 మంది పురుషులు ఓటు వేశారు. జిల్లా వ్యాప్తంగా 8,663 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో కౌటింగ్‌ను మంగళవారం విజయ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మంకు 22 రౌండ్లు, పాలేరుకు 19, మధిరకు 18, వైరాకు 17, సత్తుపల్లికి 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి 42 మంది చొప్పున 210 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక టేబుల్ ఏర్పాటు చేయడంతో పాటు పదిమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్ విధించడంతో పాటు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలుత సిఆర్‌పిఎఫ్ సిబ్బందితోను ఆ తర్వాత రాష్ట్ర ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌ను తర్వాత సివిల్ పోలీస్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు, సిబ్బందికి ప్రత్యేక పాస్‌లను మంజూరు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక పర్యవేక్షకుడు, ఒక సహయ పర్యవేక్షకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడుతో పాటు అభ్యర్థి తరుపున ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండనున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా ప్రకటించనున్నారు. బ్యాలెట్ యూనిట్లను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానం చేసి రిజల్ట్ మీట నొక్కగానే సంబందిత పోలింగ్ కేంద్రంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అందులో కన్పిస్తుంది. వాటి వివరాలను నమోదు చేసుకొని రిటర్నింగ్ అధికారి ధృవీకరణ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. కౌం టింగ్ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవిఎంలలో లెక్కింపు చేపడతారు. చివరగా ఏజెంట్ల సూచనల ఆధారంగా రిటర్నింగ్ అధికారి లాటరి ద్వారా ఒక ఈవిఎంను ఎంచుకొని అందులోని వివిప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఈవిఎం మిషన్ ద్వారా వచ్చిన ఓట్లకు వివిప్యాట్ స్లిప్పుల ద్వారా వచ్చిన ఓట్లను సరిచూసిన తర్వాతే విజేతను అధికారికంగా ప్రకటిస్తారు. ఇందుకు సంబందించి 5 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, నోడల్ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కౌంటింగ్‌కు ముందు ప్రిసైడింగ్ అధికారి సంతకంతో ఉన్న 17సి ఫారం వివరాలు ఏజెంట్లకు తెలియజేస్తారు. ఇందులో ఈవిఎంల వారిగా పోలైన ఓట్లు వివరాలు ఉంటాయి. పోలైన ఓట్లు ఈవిఎంలలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సరిచూసుకునే అవకాశం ఉంటుంది. వాటన్నింటిని ఏజెంట్లకు చూపించి అధికారులు సంతకాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క రౌండ్ వారిగా ఫలితాలను లెక్కించి విడుదల చేస్తుంటారు. ప్రతి ఫలితాన్ని ఏజెంట్లు సంతృప్తి చెందిన తర్వాతనే ప్రకటిస్తారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

* మూడంచెల భద్రత * నియోజకవర్గానికి 14 టేబుల్స్ * కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 10: ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,85,179 ఓటర్లకు గాను 9,32,213 ఓట్లు పోలయ్యాయన్నారు. 85.90 పోలింగ్ శాతం నమోదయ్యిందన్నారు. అత్యధికంగా మధిర మండలంలో 91.64శాతం పోలై రాష్ట్రంలోని అత్యధికంగా పోలింగ్ కేంద్రంగా గుర్తింపు వచ్చిందన్నారు. కొణిజర్ల మండలం తనికెళ్ళ వద్ద విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మూడంచెల పద్ధతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నామన్నారు. కేంద్ర పారామిలటరీ, రాష్ట్ర పారామిలటరీ, స్థానిక పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంతవరకు డ్రైడే పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపుకేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వాటర్ బాటిల్స్, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతిలేదని అందుకోసం క్లాక్‌రూం ఏర్పాటు చేశామని అక్కడ వాటిని డిపాజిట్ చేసుకోవాలన్నారు. గేట్ వద్ద లాగ్ బుక్ ఉంటుందని పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. పోలింగ్ కేంద్రంలో ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపుకోసం 70 టేబుల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అందుకోసం 210 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోకెల్లా మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 97.64 ఓటింగ్ శాతం నమోదయ్యింది. ఇక్కడ మొత్తం 251 పోలింగ్ కేంద్రాలలో 2,03,132 ఓటర్లకు 1,86,158 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో పురుషులు 99,824, స్ర్తిలు 1,03,300లకు గాను 92,028 మంది పురుషులు 94,128మంది స్ర్తిల ఓట్లు పోలయ్యాయి. పురుషులు 92.19 శాతం కాగా స్ర్తిలు 91.12 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానంలో పాలేరు నియోజకవర్గం అత్యధిక ఓటింగ్ శాతాన్ని సాధించింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 266 పోలింగ్ కేంద్రాలలో 2,08,544 ఓటర్లకు 1,90,470 ఓట్లు పోలై, 91.33 ఓటింగ్ శాతం సాధించింది. ఈ నియోజకవర్గంలో పురుషులు 1,02,105 ఓటర్లకు గాను 93,476 ఓట్లు పోల్ కాగా 91.55 ఓటింగ్ శాతాన్ని సాధించారు. స్ర్తిలు 1,06,423 ఓటర్లకు గాను 96,991 ఓట్లు పోలై 91.14 ఓటింగ్‌శాతం సాధించారని తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలోని 295పోలింగ్ స్టేషన్లలో మొత్తం 2,73,967 ఓటర్లు ఉండగా 2,02,712 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో 73.99 ఓటింగ్ శాతం నమోదయ్యింది. 1,32,471 పురుష ఓటర్లకు గాను 1,05,343 ఓట్లు పోలై 73.50శాతాన్ని సాధించామన్నారు. 1,41,456 స్ర్తిలకు గాను 1,05,343 ఓట్లు పోలై 74.47 ఓటింగ్ శాతం నమోదయ్యిందన్నారు. వైరా నియోజకవర్గంలో 229 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 1,76,825 ఓటర్లకు గాను 1,56,970 ఓట్లు పోలై 88.77 ఓటింగ్ శాతం నమోదైందన్నారు. 87,625 మంది పురుషులకు గాను 77,906 ఓట్లు పోలై 88.91 ఓటింగ్ శాతం నమోదైందన్నారు. 89,194 మంది స్ర్తిలకు గాను 79,064 ఓట్లు పోలై 88.64శాతం ఓటింగ్ శాతం నమోదైందన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 264 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 2,22,711 ఓటర్లకు గాను 1,95,903 ఓట్లు పోలై 87.96 ఓటింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించారు. 1,10,469 పురుషులకు గాను 97,059 ఓట్లు పోలై 87.86శాతం నమోదుకాగా 1,12,236 స్ర్తిలకు గాను 98,844 ఓట్లు పోలై 88.07శాతం నమోదైందన్నారు. 5 నియోజకవర్గాల్లో 76మంది ఇతర ఓటర్లుండగా 9 మంది మాత్రమే ఓటు వేశారన్నారు. ఖమ్మం ఓట్ల లెక్కింపులో 22రౌండ్స్, పాలేరులో 19, మధిరలో 18, వైరాలో 17, సత్తుపల్లి లెక్కింపు కేంద్రంలో 19రౌండ్ల వారిగా లెక్కించనున్నామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు సహాకరించాలని కోరారు.
రూ.2.98 కోట్ల నగదు స్వాధీనం
ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో భాగంగా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 2.98 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. 24,456.24లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 5 నియోజకవర్గాల్లో ప్రజలనుండి 104 సివిజిల్ ద్వారా ఫిర్యాదులు అందాయని 1115 సువిధ, 170 సమాధాన్ ఫిర్యాదులు అందాయన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 45 సివిజిల్, 318 సువిధ, 90 సమాధాన్ ఫిర్యాదులు అందగా, పాలేరు నియోజకవర్గంలో 15 సివిజిల్, 181 సువిధ, 37 సమాధాన్ ఫిర్యాదులు అందగా, మధిరలో 15 సివిజిల్, 383 సువిధ, 10 సమాధాన్, వైరా నియోజకవర్గంలో 19 సివిజిల్, 102 సువిధ, 10 సమాధాన్, సత్తుపల్లి నియోజకవర్గంలో 10 సివిజిల్, 131 సువిధ, 23 సమాధాన్ ఫిర్యాదులందాయన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనపై 211 కేసులు నమోదు చేశామని, 851 క్రిమినల్ కేసులు, 8415 మంది వ్యక్తులపై బైండోవర్ కేసులు, 210 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామన్నారు. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు, అన్ని రాజకీయ పక్షాలు, మీడియా సహకారంతో సమర్థవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఎన్నికల్లో సహకరించిన వారికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
కౌంటింగ్ అధికారులు నిబంధనలు పాటించాలి
కొత్తగూడెం, డిసెంబర్ 10: శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కోసం నియమితులైన అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు నియమించిన సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు, మైక్రో పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నిర్దేశించిన నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని అన్నారు. కౌంటిండ్ నిర్వాహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్‌కు సూపర్‌వైజర్, సహాయ సూపర్‌వైజర్, మైక్రో పరిశీలకులు విధుల్లో ఉంటారని తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. ఇవిఎం కౌంటింగ్ ప్రక్రియకు ముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమేరాల ద్వారా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమీక్షిస్తారని తెలిపారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు సెల్‌ఫోన్లు తీసుకు రాకూడదని అన్నారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగే పోలింగ్ ప్రక్రియలో సిబ్బంది, ఏజెంట్లు నిశ్శబ్దం పాటించాలని కోరారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా సిబ్బంది కౌంటింగ్ హాలును విడిచి వెళ్లకూడదని, కేటాయించిన టేబుల్ కాకుండా మరో టేబుల్ వద్దకు వెళ్లకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారుల ద్వారా ఫారం 18 పొందాలని, ఫారం లేకపోతే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత లాటరీ పద్ధతి ద్వారా నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేసి ప్రత్యేక కౌంటర్‌లో ఇవి ప్యాట్‌ల స్లిప్పులు లెక్కించన్నుట్లు తెలిపారు. లెక్కింపు సమయంలో రౌండ్ నంబరు, టేబుల్ నంబరు, పోలింగ్ కేంద్రం నంబరు నమోదు చేస్తామన్నారు. అనంతరం కౌంటర్ ప్రక్రియ జరిగే విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి వివరించారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట రిటర్నింగ్ అధికారి కె వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.