ఖమ్మం

లెక్క పక్కా ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 1: ఖమ్మం నగరంతో పాటు పట్టణాల్లో ఆదాయ మార్గాలకు గండి కొడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. నగర, పట్టణ ప్రాంతాల పరిధిలో ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీసి తదనునుగుణంగా లెక్కను కట్టనున్నారు. భవన నిర్మాణాలు పూర్తయినా ఆస్థి పన్నుల పరిధిలోకి రాకుండా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న తీరుపై పురపాలక శాఖాధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అక్రమాలను సక్రమం చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన బిఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ల గడువు మార్చి 1వ తేదీ వరకు పొడిగించారు. అయితే అప్పటి వరకు క్రమబద్దీకరించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, రెండు నగర పంచాయతీలున్నాయి. ఖమ్మం నగర జనాభా 4లక్షలపైగా ఉండగా, మిగిలిన పట్టణాల్లో దాదాపు 5లక్షల వరకు జనాభా ఉంది. వీటిలో భవన నిర్మాణాలు ఖమ్మం నగరంలో కాకుండా దాదాపు 55వేల భవనాలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుత లెక్కల ప్రకారం అది ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణాలు రికార్డుల్లో నమోదు కాకపోవటంతో లక్షల ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఉపగ్రహ ఛాయచిత్రాలు తీసి నగర, పురపాలకాల్లో ఇళ్ళను లెక్కకట్టారు. అయితే క్షేత్రస్థాయి అధికారులు ఖాళీ స్థలాలను కూడా కలిపి లెక్క చూపిస్తుండటంతో స్పష్టత కొరవడుతోంది. జిల్లాలో 1/70చట్టం అమల్లో ఉన్న ప్రాంతాలలో నిర్మాణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు ఇల్లెందు మున్సిపాలిటీలో దాదాపు 10వేల ఇళ్ళు ఉన్నట్లు అంచనా. అయితే రికార్డుల్లో మాత్రం 70శాతమే నమోదై ఉన్నాయి. మిగిలిన 30శాతం ఇళ్ళ నిర్మాణాలు గల్లంతయ్యాయి. గతంలో ఉపగ్రహ చాయచిత్రాలు అందించిన వివరాల్లో అందులో 23శాతం వరకు ఖాళీ స్థలాలు ఉన్నట్లు సమాచారం. నగర, మున్సిపాలిటీలకు ఆస్థిపన్నులే ప్రధాన ఆదాయ వనరు కావటం, ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ పథకాన్ని అమలు చేయటం కూడా పూర్తికావటంతో ఇక అక్రమ నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. గత నెల 31వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ కింద జిల్లాలో సుమారు 22వేల దరఖాస్తులు మాత్రమే రాగా, మరో 12వేల వరకు ఆగిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంతా మార్చి 1వ తేదీలోగా క్రమబద్దీకరించుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు. అప్పటికీ క్రమబద్దీకరించుకోకపోతే ఉపగ్రహ ఛాయచిత్రాల ద్వారా గుర్తించి రెట్టింపు జరిమానా విధించటంతో పాటు అవసరమైతే కట్టడాలను జప్తు చేసేందుకు కూడా వెనుకాడేది లేదని ఓ అధికారి తెలిపారు.

ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ గడువు పెంపు
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 1: అనుమతులను అతిక్రమించి నిర్మించిన కట్టాడాలు, లేఅవుట్‌లేని స్థలాలు క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజుల గడువు పెరిగింది. ఈ మేరకు సోమావారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొదటగా నవంబర్, డిసెంబర్ రెండు నెలలు ఇచ్చిన గడువును జనవరి 31వరకు పొడిగించింది. చివరి రోజుల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం, కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు మొరాయిండంతో అనేక మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోలేక పోయారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం మార్చి 1వ తేది వరకు క్రమబద్దికరణ గడువు పెంచుతూ 33, 34 జివోను జారిచేసింది. పెంచిన గడువుతో ఖమ్మం కార్పొరేషన్‌కు వంద కోట్ల వరకు ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మార్గాల్ని మూసేసిన పొగమంచు
* రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 1: శీతాకాలం ముగుస్తున్న తరుణంలో ఖమ్మం, దాని పరిసర ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో సోమవారం కప్పబడ్డాయి. అర్ధరాత్రి నుండి మొదలుకొని సూర్యోదయం వరకు విపరీతమైన మంచుకురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పండింది. తెరలు తెరలుగా, అలలు అలలుగా పడుతున్న మంచులో నడిచివెళ్ళె వారికైనా, వాహనదారులకైనా మీటర్ దూరం కంటే ముందున్నవి కనిపించక అవస్థలు పడ్డారు. వాహనదారులైతే అడుగడుక్కి ఆపుకొని అద్దాలను శుభ్రం చేసుకుంటూ ప్రయాణాన్ని సాగించారు. భారీ వాహనదారులు మాత్రం రోడ్ల పక్కన వాహనాలను నిలిపివేశారు. అమావాస్య చీకట్లోనైనా ప్రయాణం చేయవచ్చుగానీ మంచుకురిసే వేళ జర... జాగ్రత్తగా ఉంటే మంచిదని అనుభవజ్ఞులు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల్లో
సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి
* కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశం
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 1: పదో తరగతి పరీక్షలకు ఏర్పాటు చేసిన ప్రైవేటు పాఠశాలల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ సూచించారు. సోమవారం ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోలేని వారు కనీసం వెబ్ కెమెరాలనైనా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొత్తం 38,058మంది విద్యార్థులకు గాను 173పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 35,532, ప్రైవేటు విద్యార్థులకు 12పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు విద్యార్థులు 2,232మంది విద్యార్థులు ఉన్నట్లు వెల్లడించారు. సమావేశంలో డిఈఓ రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

21శాతం వృద్ధిరేటుతో దేశంలోనే
అగ్రస్థానంలో సింగరేణి
కొత్తగూడెం, ఫిబ్రవరి 1: సింగరేణి సంస్థ జనవరి నెలతో ముగిసిన 10నెలల కాలంలో రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధిస్తూ గత ఏడాది కంటే 21శాతం వృద్ధిరేటుతో దేశంలోని బొగ్గు సంస్థలన్నింటిలోనూ అగ్రభాగన నిలిచింది. గడచిన 10నెలల కాలానికి ప్రభుత్వం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యం ప్రకారం 450లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యం కాగా 490లక్షల టన్నులు సాధించిన 109శాతం ఉత్పాదకరేటుతో గత దశాబ్ధకాలపు రికార్డును తిరగరాసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలానికి 405లక్షల టన్నులు సాధించగా ఈఏడాది దానిపై 21శాతం అదనంగా ఉత్పత్తి సాధించడం విశేషం. అదేవిధంగా జనవరి మాసంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 53లక్షల టన్నులు కాగా 57లక్షల టన్నులు ఉత్పత్తి సాధించి 108శాతం నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7శాతం అభివృద్ధి సాధించడం విశేషం. బొగ్గురవాణా విషయంలో కూడా గడచిన 10మాసాల్లో 488లక్షల టన్నులు రవాణా చేసి గత ఏడాది కంటే 14శాతం వృద్ధిని సాధించింది. ఓవర్‌బర్డెన్‌ను కూడా 243.5మిలియన్ క్యూబిక్ మీటర్లు తొలగించాలని నిర్ణయించి 251.8మిలియన్ క్యూబిక్‌మీటర్ల ఓవర్‌బర్డెన్‌ను తొలగించి రికార్డు సృష్టించింది. భూగర్భగనుల చరిత్రలో ఒక్కనెలలో 2లక్షల 11వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి ఆడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు మరో రికార్డు నెలకొల్పింది. దేశభూగర్భగనుల చరిత్రలో ఒకగని నుండి ఒకమాసంలో ఇంతపెద్దమొత్తంలో బొగ్గు ఉత్పత్తి చేయడం ఇదే ప్రధమం. సింగరేణి సంస్థ లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్న సింగరేణీయులందరికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ సోమవారం సింగరేణి భవన్ నుండి శుభాకాంక్షలు తెలిపారు.

చెరువులను సాగర్‌నీటితో నింపాలి
* ఎంపి పొంగులేటి
కల్లూరు, ఫిబ్రవరి 1: ఎండిపోయిన చెరువులను వెంటనే సాగర్ జలాలతో నింపాలని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం కల్లూరులోని ఫ్లోరైడ్ రహిత రక్షిత తాగునీటి కేంద్రాన్ని ఆ పార్టీ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ అధికారులు సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితంగా ఉంటుందని పలువురు ప్రజలు ఆరోపించినట్లు తెలిపారు. చెరువులలో తగిన సామర్థ్యంలో తాగు నీరు లేక పోవటంతో ఫిల్టర్ బెడ్‌లలో ఈ నీరు సరిగా ఫిల్టర్ కాక కలుషితంగా దుర్వాసనతో సరఫరా అవుతున్నట్లు తెలిపారు. ఈ కలుషిత నీటి వలన ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వెంటనే సాగర్ జలాలతో చెరువులను నింపి స్వచ్ఛమైన తాగునీటిన సరఫరా చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా తాగు నీరు కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని వాటర్ గ్రిడ్ దేవుడెరుగు ముందు ప్రజల దాహాన్ని తీర్చాలని ఎంపి అన్నారు. ప్రస్తుతం తాగు నీటి కోసం అవస్థలు పడుతున్న వారికి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని అన్నారు. గ్రామాలలో బొర్లు పని చేయటం లేదని వెంటనే మరమ్మత్తులు జరిపించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సాగర్ కాల్వ ద్వారా కల్లూరు పెద్ద చెరువులోకి నేరుగా నీరు వచ్చేందుకు తూమును ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం ఎంపి మండలపరిధిలోని ఎర్రబంజర గ్రామానికి వెళ్లి ఎంపి కోటా కింద మంజూరైన 41 మంది లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసిపి ఫ్రధాన కార్యదర్శి మట్టా దయానంద్, జిల్లా వైసిపి కార్యదర్శి కీసర వెంకటేశ్వరరెడ్డి, ఎనె్నస్పీ డిఇ రాంప్రసాద్, ఎఇ శ్రీనివాసరెడ్డి, స్థానిక సర్పంచ్ భరోతు సుజాత, భరోతు రాము, వైసిపి నాయకులు ఏనుగు సత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతరకు 450 ప్రత్యేక బస్సులు
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 1: వరంగల్ జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర సందర్భంగా ఖమ్మం జిల్లాలోని వివిధ డిపోల నుంచి సుమారు 450ప్రత్యేక బస్సులను ఈ నెల 14నుంచి 21వ తేదీ వరకు నడపనున్నట్లు ఆర్టీసి రీజినల్ మేనేజర్ శివకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్ సర్వీస్‌లు నడిపేందుకు కూడా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. బస్సులు, చార్జీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
బస్సు బయల్దేరే బస్సుల పెద్దలకు పిల్లలకు
ప్రదేశం సంఖ్య చార్జి చార్జి
భద్రాచలం 50 190 100
చర్ల 30 140 80
వెంకటాపురం 10 90 50
వాజేడు 10 80 50
ఖమ్మం 20 300 160
ఇల్లెందు 120 250 130
కొత్తగూడెం 120 210 110
పాల్వంచ 30 200 110
టేకులపల్లి 10 240 130
మణుగూరు 30 130 70
ఏటూరు నాగారం 10 50 30
మంగపేట 10 70 40
మొత్తం 450 బస్సులు

అనుమతి లేని లేఅవుట్‌లో గ్రామ పంచాయతీ బోర్డు
ముదిగొండ, ఫిబ్రవరి 1: మండల పరిధిలోని న్యూలక్ష్మీపురంలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు చేసి అమ్ముతున్న స్థలంలో గ్రామ పంచాయతీ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి ప్రభుత్వం నుండి లే అవుట్ తీసుకోలేదని, ఈ ప్లాట్లు ఎవ్వరూ కొనుగోలు చేయరాదని బోర్డు ఏర్పాటు చేసి సంబంధిత స్థలంలో గేటుకు తగిలించారు. గతంలో గ్రామ పంచాయతీ అధికారులు, పాలకవర్గం ఎన్నిసార్లు అనుమతి తీసుకోమని చెప్పిన వినకుండా సంబంధిత రియల్ ఏస్టేట్ వ్యాపారి తన వ్యాపారాన్ని కొనసాగించడంతో పనులు చేస్తున్న డోజర్ ను పోలీస్‌స్టేషన్ లో అప్పగించారు. అయినప్పటికి తనలో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో సోమవారం గ్రామ సర్పంచ్ పాల్వంచ స్వరూపారాణి, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి నెల్లూరి మణి అక్రమ లేవుట్ స్థలంలో ఏర్పాటు చేసిన గేటుకు గ్రామ పంచాయతీ బోర్డు తగిలించారు. అక్రమంగా వెంచర్లు వేసి గ్రామ పంచాయతీకి చెల్లించే కనీస మొత్తం చెల్లించకుండా, ప్రభుత్వానికి కేటాయించాల్సిన భూమిని కేటాయించకుండా ప్రజలకు అమ్మే స్థలాలకు గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి సౌకర్యాలు కల్పించబడవని ఇవోపీఆర్డీ శ్రీనివాసరావు తెలిపారు. అక్రమ లేఅవుట్, వెంచర్లలో ప్రజలు స్థలాలు కొనుగోలు చేసి నష్టపోవద్దని తెలిపారు.

నిర్మాణరంగ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 1: భవన, ఇతర నిర్మాణ కార్మికుల 2016 క్యాలెండర్‌ను తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె నరసింహారావులు ఆవిష్కరించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సోమవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముదాం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన క్యాలండర్ ఆవిష్కరణ సభలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణరంగాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వం తక్షణమే స్పదించి ఇసుక పాలసీని, నిర్మాణ సామాగ్రి ధరలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనుల్లో యంత్రాలను నిరోదించి స్ధినిక వర్కర్లకు పని కల్పించాలన్నారు. నిర్మాణ కార్మిక వెల్పేర్ బోర్డుకు ప్రభుత్వ బడ్జెట్ నుండి నిధులు కేటాయించాలన్నారు. అట్టి నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చుచేయాలి తప్ప ప్రభుత్వ ఆర్భాటాలకు ఎట్టి పరిస్ధితుల్లోను ఖర్చు చేయవద్దన్నారు. నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యల పరిష్కారానికై నిర్మాణ రంగంలోని అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ జమాల్, తుశాకుల లింగయ్య, దోణోజ్ లక్ష్మయ్య, శీలం సత్యనారాయణ, మేడికొండ నాగేశ్వరరావు, అమరబోయిన లింగయ్య, యర్రా రమేష్, నాయకులు గంధం వెంకటేశ్వర్లు, హుస్సేన్, సీతారాములు, లక్ష్మీనర్సారెడ్డి, రాడ్ బెండింగ్ నాయకులు శీలం వెంకన్న, టి వెంకటరమణ, బచ్చోడు పుల్లయ్య, ఎ శ్రీనివాసాచారి, ఎన్ బ్రహ్మం, వీరాచారి, పద్మకోటేశ్వరాచారి, రామాచారి, డి రామాచారి, బి వెంకన్న, కె నాగరాజు, మహేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

అనుమానంతో
భార్యను చంపిన భర్త
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 1: భార్యను అనుమానించిన ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని ఇస్లావత్‌తండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇస్లావత్‌తండాకు చెందిన ఇస్లావత్ బాలాజీ భార్య సేలా(36) అనే వివాహితను భర్త దాడి చేసి హతమార్చాడు. 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న బాలాజీ తరుచూ భార్యను అనుమానిస్తుండే వాడు. ఈ క్రమంలో బాలాజీ సేలాతో ఘర్షణ పడి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన విషయాన్ని గమనించిన బాలాజీ మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. సంఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కూసుమంచి సిఐ ముద్దుసాని కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు.

కాంగ్రెస్ కిసాన్‌ఖేత్ జిల్లా చైర్మన్‌గా శీలం
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 1: కాంగ్రెస్ కిసాన్‌ఖేత్ జిల్లా చైర్మన్‌గా శీలం వెంకటరెడ్డిని నియమిస్తూ సోమవారం కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా వెంకటనర్శిరెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యున్నితికి తన వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.