ఖమ్మం

పంచాయతీ ఎన్నికలపై ‘సోషల్ మీడియా’ ఎఫెక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 19: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీలపై ఆధిక్యత సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ముందుగా ధీటైన అభ్యర్థుల కోసం వేట సాగించి నామినేషన్ల పర్వాన్ని ముగించారు. మూడు విడతలుగా పోలింగ్ జరుగనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల కంటే అభ్యర్థుల వ్యక్తిగత విషయాలను పరిగణనలోకి తీసుకునేందుకు జనం మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయం కోసం ప్రచారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. దాదాపు ప్రతి వ్యక్తి వద్ద, ప్రతి కుటుంబంలో స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండటంతో ప్రచారానికి ప్రధాన ఆస్త్రాలుగా ఫోన్లను వినియోగిస్తున్నారు. తేలికగా, వీలైనంత త్వరగా, చేతిలోనే సమచారాన్ని అందించేందుకు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై సోషల్ మీడియా ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసి ప్రచార సరళిని ముమ్మరం చేశారు. వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి అప్లికేషన్లను స్మార్ట్ ఫోన్లలో వినియోగించుకుంటూ క్షణాల్లో సమాచారాన్ని వారికి అవసరమైన వ్యక్తులకు పంపిణీ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లలో గ్రూపులో చేర్చిన వ్యక్తులు అందరికీ ఎన్నికల ప్రచార సమాచారం ఒక్కసారిగా వెళుతుండటంతో ఆయా అభ్యర్థుల గెలుపు, ఓటములపై తీవ్ర ప్రభావం చూపే విధంగా మారింది. మారుమూల పల్లెల్లో ఇప్పటికే సెల్‌ఫోన్ సాంకేతికత పరుగులు పెడుతుండటంతో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రచారాల్లో నాయకులు, కార్యకర్తలు ఫోన్లను సులభంగా వినియోగిస్తున్నారు. కొందరు స్మార్ట్ఫోన్ల ద్వారా పంపుతున్న ఒక్క షేర్ సమాచారం అవతలి వ్యక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరి కొందరు పంపించే గ్రూపులలో సమాచారం ప్రత్యర్థి వ్యక్తులను ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయనే ప్రచారం సాగుతోంది. నామినేషన్ల పర్వం ముగిసిన కొద్ది సమయంలోనే తమతమ అభ్యర్థుల విజయం కోసం పలు గ్రామాల్లో వారికి సంబంధించిన కార్యకర్తలు, సమీప యువకులు, విద్యావంతులైన యువకులు సోషల్ మీడియాలో నూతన ఒరవడులతో ప్రచారం సాగించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని పోటీకి నామినేషన్ వేసిన అభ్యర్థులు గెలుపు కోసం ఉవ్విళ్లూరుతూ సోషల్ మీడియాలో ప్రచారం కోసమై ఎంపిక చేసుకున్న యువకులకు ఖరీదైన అత్యంత సాంకేతికత కలిగి ఉన్న స్మార్ట్ఫోన్లను అందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని సెల్‌ఫోన్ దుకాణాల్లో ఇటీవలే మార్కెట్‌లోకి ప్రవేశించిన ఫోన్ల వివరాలు తెలుసుకుంటూ యువకులు కొనుగోళ్లు చేయడం గమనార్హం. అంటే ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలకు రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారనేది అర్థమవుతోంది.

పథకాల అమలులో సర్పంచే కీలకం
* గ్రామసభ ద్వారా అమలు

ఖమ్మం, జనవరి 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రధాన పథకం ప్రవేశపెట్టిన దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లదే. ఆ గ్రామస్థులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటమే కాకుండా ఆ పథకాల అమలును గ్రామసభల ద్వారా తెలియజేయడం ప్రధాన బాధ్యత. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా చెక్‌పవర్ ఉండటంతో ఆ పదవికి కూడా ప్రాధాన్యత దక్కింది. ఉప సర్పంచ్‌ను ఆ గ్రామంలో గెలిచిన వార్డు సభ్యులే ఎన్నుకోనుండటంతో ఆ గ్రామంలోని ప్రధాన నేతలు వార్డుకు పోటీచేసి ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ పదవులకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ సభకు ఉన్న విశేషమైన అధికారాలను వినియోగించుకునేందుకు కొత్త పాలకవర్గాలు సిద్ధమవుతున్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామ సర్పంచ్‌కు విశేషమైన అధికారాలు రావడంతో ఈ పదవిపై ఆయా పార్టీల ప్రధాన నేతలు కనే్నశారు. రిజర్వేషన్ల పరంగా ఇతరులకు సర్పంచ్ పదవి కేటాయించాల్సి వస్తే ఏ రిజర్వేషన్ లేని ఉప సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ పదవిని దక్కించుకునేందుకు నిన్నటి వరకు స్నేహితులు, బంధువులుగా ఉన్నవారు పోటీ పడుతుండటం విశేషం. తమ అధికారాలను గ్రామ సభ ద్వారా ప్రజలకు తెలియజేసి వాటిని అమలు చేసేందుకు తమకున్న అధికారాలను వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పథకాలను గ్రామ సభల ద్వారా ప్రజలకు తెలియజేయడం, వారి మద్దతుతోనే అమలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రామసభ ఏర్పాటుకు ఓటర్లు 500లోపు ఉంటే 50మంది, వెయ్యిలోపు ఉంటే 75మంది, 3వేల లోపు ఉంటే 150మంది, 5వేల లోపు ఉంటే 200మంది, 10వేల లోపు ఉంటే 300మంది, 10వేలకు పైగా ఉంటే 400మంది ఓటర్లు హాజరైతే కోరం పూర్తయినట్లు. ఆ సభ తీసుకున్న తీర్మానం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. గ్రామ సభకు హాజరైన సభ్యులంతా రిజిస్టర్‌లో సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. నిర్ణిత గడువులోగా గ్రామ సభలు నిర్వహించకపోతే ప్రత్యేకాధికారి ఈ సమావేశం నిర్వహించి గ్రామ బడ్జెట్‌ను కూడా ఆమోదిస్తారు. ఏడాదికి నాలుగుసార్లు తప్పనిసరిగా ఈ గ్రామసభలు జరగాల్సి ఉంది. ఇందుకు రెండురోజుల ముందుగానే గ్రామంలో దండోరా వేయించి గ్రామసభ నిర్వహించే తేదీ, సమయం, స్థలం తెలుపుతో నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామ పరిపాలన కార్యక్రమాలపై సమీక్ష ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో జరిగే చర్చ మాదిరిగానే గ్రామస్థాయిలో గ్రామ సభలో కూడా చర్చ జరుగుతోంది. తమ గ్రామంలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై వార్డు సభ్యులు చర్చలో పాల్గొంటారు. దీనిపై అనేక చోట్ల వాదోపవాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సభకు గ్రామస్థాయి అధికారులు అందరూ హాజరయ్యేలా చూస్తారు. అవసరాన్ని బట్టి అత్యవసర సమావేశాలు కూడా సర్పంచ్ సూచన మేరకు గ్రామ కార్యదర్శి ఏర్పాటు చేస్తారు.