ఖమ్మం

తెలుగుజాతి ఖ్యాతిని చాటిన ఘనత టిడిపిదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 29: తెలుగువాడి గౌరవాన్ని కాపాడి, జాతి ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య పేర్కొన్నారు. మంగళవారం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా వందనం చేసి, కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో తుళ్ళూరి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నాడు తెలుగు ప్రజలు పడుతున్న బాదలను గుర్తించి వారి మనోభావాలను కాపాడడానికి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఎవరు ఊహించని విధంగా పార్టీ ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. పార్టీ ఏర్పాటు తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసేందుకు అనేక మంది నేతలు కుట్రలకు పాల్పడి వారే కాలగర్భంలో కలిసిపోయారన్నారు. తెలుగుదేశానికి కార్యకర్తల బలం ఉందని, పార్టీని దెబ్బతీయాలని చూస్తే వారికి పార్టీ అభిమానులే తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ సందర్భంగా నగరంలోని 4,5,6 డివిజన్‌లలో ఆ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు పార్టీ జెండాను ఆవిష్కరించి అనాథ పిల్లలకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేబి స్వర్ణకుమారి, తోటకూరి శివయ్య, హన్మంత్‌రెడ్డి, మందపాటి వెంకటేశ్వర్లు, రంగారావు, ఇక్బాల్ పాషా, బెల్లం వేణుగోపాల్, తాళ్ళూరి జీవన్‌కుమార్, గొల్లపూడి హరికృష్ణ, సత్యనారాయణ, మజీద్, ఉండేటి భిక్షం, గొడ్డేటి మాధవరావు, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
* సింగరేణి విరాళంతో రామరథం
* శోభాకవచం నవమినాటికి కష్టమే
* దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి
భద్రాచలం, మార్చి 29: ఏప్రిల్ 15న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆశతో నిరీక్షించే ఘడియలు సీతారాముల కల్యాణం. శ్రీరామనవమికి ప్రామాణికం భద్రాచల శ్రీసీతారాముల కల్యాణ ముహూర్తమే. స్వామి కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. అందుకే గంపెడు ఆశలతో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు, వారు మెచ్చే రీతిలో చేస్తున్నట్లు ఈఓ జ్యోతి వివరించారు. శ్రీరామనవమి ఏర్పాట్లు, ఇతర అంశాలపై ‘ఆంధ్రభూమి’ ఆమెను మంగళవారం కలిసినపుడు కార్యాచరణను తెలిపారు. ఆమె మాటల్లోనే చదవండి....
మొబైల్ లడ్డూ, మంచినీటి కౌంటర్లు
ఈసారి వినూత్నంగా భక్తుల వద్దకే లడ్డూలు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మొబైల్ కౌంటర్ల ద్వారా భక్తులకు అవసరమయ్యే ప్రసాదం లడ్డూలను అందిస్తాం. ప్రతీ రోజు 70వేల లడ్డూలు స్టాక్ తయారు చేసి పెడతాం. భక్తుల సంఖ్యను బట్టి అదనంగా తయారు చేపిస్తాం. ఇక వేసవి కావడంతో భక్తుల దాహార్తిని తీర్చడం మా లక్ష్యం. అందుకే మొబైల్ కౌంటర్ల ద్వారా వారికి మంచినీరు, దాతల ద్వారా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తాం. శ్రీరామనవమి, శ్రీరామపట్ట్భాషేకం రోజున కాదనకుండా భక్తులందరికీ ఉచితంగా అన్నదానం చేస్తాం. ముత్యాల తలంబ్రాల కోసం 100 కిలోల ముత్యాలు కొనుగోలుకు టెండర్లు పిలిచాం. కిలో రూ.8300లకు ఇవ్వడానికి గుత్తేదారు టెండర్ కోడ్ చేశారని, కానీ మేము రూ.6500లకే ఇవ్వాలని కోరుతున్నాం. పోస్టల్ ద్వారా రెండు ముత్యాలు, సీతారామచంద్రస్వామి చిన్న ఫోటో ఒకటి ఇవ్వడానికి పోస్టల్ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. భక్తులు సేదతీరేందుకు 1.50లక్షల అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నాము. మొత్తం మీద భక్తులకు ఏర్పాట్లు చేసేందుకు రూ.40లక్షలు వెచ్చిస్తున్నాము.
సింగరేణి నిధులతో...
సింగరేణి ఇచ్చిన రూ.50లక్షల నిధులతో రామరథాన్ని తయారు చేయిస్తున్నాం. గతంలో ఉన్న రామరథం ప్రమాదానికి గురైన విషయం మీకు తెలుసు. సింగరేణి టెక్నికల్ కమిటీ, దేవస్థానం వైదిక కమిటీ, ఇంజనీర్ల బృందం పర్యవేక్షణలో ఈ రామరథం సిద్ధవౌతోంది. ఇటీవల నూతన స్వర్ణ కవచంతో సిద్ధమైన ఉత్సవమూర్తులకే ఈసారి మిథిలాస్టేడియంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నాం. స్వర్ణకవచం తొడిగే సమయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఉత్సవమూర్తులకు శోభాకవచం ఏర్పాటు చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని సంకల్పించినా ఇది సాధ్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే 3.50 కిలోల బంగారం అవసరం. జీయర్‌స్వామి పిలుపుతో 500 గ్రాముల బంగారం, రూ.4లక్షల నగదు వచ్చింది. ఇవి ఏ మాత్రం సరిపోవు. అందుకే భక్తులను మళ్లీ విరాళాలు అడుగుతున్నాం. మే 11 నాటికి ఉత్సవమూర్తులకు శోభాకవచం తయారు చేయిస్తామని, ఇదే విషయాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామితో చర్చించేందుకు ప్రత్యేక కమిటీని హైదరాబాదుకు పంపుతున్నాము.

మంచినీటి సమస్యపై సత్వర స్పందన
* కలెక్టర్ లోకేష్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, మార్చి 29: జిల్లాలో మంచినీటి సమస్యలపై సాధ్యమైనంత త్వరగా స్పందించి ప్రజల దాహార్తీని తీరుస్తున్నామని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో కలిసి వేసవి సమస్యలు - పరిష్కారం తీసుకుంటున్న చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌రి ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సత్యనారాయణ, డిఎం అండ్ హెచ్‌ఓ కొండల్‌రావులతో కలిసి విసిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధిక నీటి సమస్య ఎదుర్కొంటున్న 12ఆవాసాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా, 88 ఆవాసాల ప్రజలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అందుబాటులో ఉన్న నీటి వనరులను అద్దెకు తీసుకొని తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీటి అవసరాల కోసం ఎనె్నస్పీ జలాలు విడుదలకు ప్రభుత్వం అంగకారం తెలిపిందన్నారు. దీని ద్వారా 530ఆవాసాలకు ప్రజల దాహార్తీని తీర్చనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మధిర, మణుగూరు ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని, వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 5లక్షల ఓఆర్‌ఎస్ ఆర్టీసి బస్టాండ్స్, మైన్స్ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామన్నారు. సింగరేణి సంస్థ ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టిందన్నారు. అంగన్‌వాడి కేద్రం, పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈజిఎస్ కూలీలు వడదెబ్బ బారీన పడకుండా ఉండేందుకు ఉదయం 6-30గంటల 11-30గంటలకు పనులు జరిగేలా చూస్తున్నామన్నారు. సిఆర్‌ఎఫ్ నిధులు 49లక్షలు విడుదలయ్యాయన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాజీవ్‌శర్మ మాట్లాడుతూ తాగునీటి సమస్యలపై సత్వరమే జిల్లా అధికారులు స్పందించేలా చూడాలన్నారు. విద్యార్థులకు తాగునీటి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విసిలో డిఆర్వో శ్రీనివాస్, జడ్పీసిఈఓ నగేష్, శిక్షణ కలెక్టర్ ముషారఫ్ ఫారూక్ అలీ తదితరులు పాల్గొన్నారు.

రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
* గంటల తరబడి ట్రాఫిక్ జామ్
కల్లూరు, మార్చి 29: స్థానిక మండలపరిధిలోని రామకృష్ణాపురం గ్రామ సమీపాన మంగళవారం ఉదయం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషయమై స్థానిక కల్లూరు 2వ ఎస్సై ఫణి తెలిపిన వివరాల ప్రకారం ఎపి 16టిజి3297 నెంబరు గల ఉల్లిపాయల లోడ్ లారీ ఏలూరు నుండి ఖమ్మం వైపుగా రాజస్థాన్ వెళుతోంది. మిక్సలిన్ లిక్విడ్‌తో బరోడ నుండి సత్తుపల్లి మీదుగా విశాఖపట్నం వెళ్తున్న ట్యాంకర్ రామకృష్ణాపురం గ్రామ సమీపాన ఎదురుగా వస్తున్న ఉల్లిపాయల లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలోలారీ డ్రైవర్ సాయినాథ్ ఖాన్ (24) లారీలో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో ట్యాంకర్ రోడ్డు పక్కన బోల్తా పడటంతో ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న క్లీనర్ నసీర్ ఆలమ్ (22) కూడా ట్యాంకర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిద్రమత్తులో జరిగిన ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సరక్షితంగా బయట పడి ప్రమాద స్థలం నుండి పరారవ్వగా ఉల్లిపాయల లారీలో ప్రయాణిస్తున్న క్లీనర్ సబ్బీర సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కల్లూరు, పెనుబల్లి పోలీసులు సంఘటనా స్థలంలో ట్యాంకర్ నుండి కారి పోతున్న లిక్విడ్‌తో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సత్తుపల్లి ఫైర్ ఇంజన్ సిబ్బందిని సంఘటనా స్థలానికి పిలిపించారు. జెసిబి, క్రేన్‌ల సహాయంతో రోడ్డుపై లారీని, ట్యాంకర్‌ను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో రాష్ట్రీయ ప్రధాన రహదారిపై గంటల తరబడి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచి పోయాయి.

వాణిజ్య బ్యాంకుల కంటే మిన్నగా సహకార బ్యాంకులు
* డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు
దుమ్ముగూడెం, మార్చి 29: వాణిజ్యబ్యాంకుల కంటే మిన్నగా డీసీసీబీ బ్యాంకులు పని చేయనున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. డీసీసీబీ మహాజన సభ దుమ్ముగూడెం గ్రామం వద్ద గోదావరి లంకలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో సహకార రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని, రైతు సంక్షేమమే ధ్యేయంగా డీసీసీబీ పని చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతుల కోసం ఏజెన్సీలోని 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్మిస్తున్నామన్నారు. దుమ్ముగూడెం, వెంకటాపురంలో ఈ గోడౌన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 5 వేల గ్రూపులకు నిరుద్యోగ యువత వ్యాపారులకు రూ.లక్ష రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరో 5 వేల గ్రూపులకు రుణసౌకర్యం కల్పిస్తామన్నారు. సొసైటీలో అప్పు ఉన్న ప్రతి రైతుకు రూపీ కార్డు(ఏటీఎం) అందిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలోని సంఘాలన్నింటికీ సోలార్ సిస్టం ఏర్పాటు చేశామని, కంప్యూటర్ ప్రింటర్ ఉచితంగా అందించామన్నారు. ప్రతి సంఘానికి ఆన్‌లైన్ సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులకు పౌలీహౌస్ ద్వారా వ్యవసాయం చేసేందుకు అధిక మొత్తంలో రుణాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు రూ.లక్ష నుంచి రూ. 50 లక్షల వరకు రుణసౌకర్యం కల్పించే స్థాయికి జిల్లా సహకార సంఘం ఎదిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇండస్ట్రీయల్ రుణాలు ఇస్తున్నామని, ఇప్పటివరకు రూ.10 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డీసీసీబీలో 140 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇప్పటివరకు తాను పదవి అలంకరించిన నాటి నుంచి రూ.1700 కోట్లకు జిల్లా సహకార బ్యాంకు టర్నోవర్‌ను పెంచినట్లు ఆయన తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ ఛైర్మన్ ఎగ్గడి అంజయ్య, డైరక్టర్ గూడపాటి శ్రీనివాస్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ యలమంచి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్లీనంపై కసరత్తు
* సభా స్థలిని పరిశీలించిన మంత్రి
ఖానాపురం హవేలి, మార్చి 29: తెలంగాణ రాష్ట్ర సమితి తొలిసారిగా ఖమ్మంలో నిర్వహించే ప్లీనంపై ఆ పార్టీ నేతలు కసరత్తును ప్రారంభించారు. పార్టీ ఏర్పాటైన 13 సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఆదరణ అధికంగా లభించటంతో ఖమ్మంలో ప్లీనం నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ ప్లీనంలో జిల్లాలోని పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించటంతో పాటు పార్టీ అధినేత కెసిఆర్ తనకు జిల్లాపై ఉన్న నమ్మకాన్ని సభలో ప్రకటించనున్నారు. ఏప్రిల్ 27వ తేదీన నగరంలోని చెరుకూరి గార్డెన్స్‌లో టిఆర్‌ఎస్ ప్లీనంను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. స్వయంగా రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు, తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్‌తో మాట్లాడి పార్టీ ప్లీనంపై చర్చించి పలు సూచనలు చేశారు.
నాడు నలుగురు....
పార్టీ ఆవిర్భవించిన సమయంలో నలుగురితో ఏర్పాటైన పార్టీ ప్రస్తుతం 4లక్షల మంది వరకు చేరటంతో ఉద్యమాల గడ్డ కమ్యూనిస్టుల ఖిల్లా అయిన ఖమ్మంలో ప్లీనం నిర్వహించాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 50డివిజన్లకు 34డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అదే క్రమంలో పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఖమ్మం జిల్లాలో పార్టీకి బలమైన కార్యకర్తలు, నాయకులు ఏర్పడిన నేపథ్యంలో ప్లీనరీని ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టార్గెట్ ‘పాలేరు’
కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందటంతో ఆ నియోజకవర్గంలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఖమ్మంలో ప్లీనం నిర్వహిస్తే పార్టీ అధినేత ఖమ్మంపై దృష్టి సారిస్తున్నారనే భావనతో పాలేరు నియోజకవర్గాన్ని సునాయసంగా గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత ఖమ్మంలో ప్లీనంను నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
అవినీతే ఎజెండాగా టిఆర్‌ఎస్ పాలన
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కూనంనేని విమర్శ
ఖమ్మం(జమ్మిబండ), మార్చి 29: బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ అవినీతికి పాల్పడటమే ఎజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంచుకున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంగళవారం గిరిప్రసాద్ భవన్‌లో శింగ్ నర్సింహరావు అధ్యక్షతన జరిగిన సిపిఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇదేమిటని అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కడంతో పాటు ఎదురు దాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరధ పథకాన్ని ముఖ్యమంత్రి తన కుమారుడైన కెటిఆర్‌కు, మిషన్ కాకతీయ మేనల్లుడు హరీష్‌రావుకు దారాదత్తం చేసి కోట్లు గడిస్తున్నారని కూనంనేని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికి డబుల్‌బెడ్‌రూమ్‌తో పాటు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కెసిఆర్ ఒక్క గ్రామంలో కూడా అమలు చేయలేదన్నారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించి పేదలపై భారం మోపుతుందన్నారు. మోడీ ప్రభుత్వం వారానికి ఒక మారు క్రూడాయిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచేందుకు యత్నిస్తుందని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిరి సరఫరా చేయకపోవటం శోచనీయమన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, సాగర్ జలాలు రాకపోవడంతో లక్షలాది ఎకరాలు బీడు భూములుగా మారాయని, కరువుతో అల్లాడుతున్నా కనీసం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరువు జిల్లాగా ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం రోడ్లను వేసి తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజా సంక్షేమానికి పాటు పడాలన్నారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, ఎస్‌కె సాబీర్‌పాషా, నగర కార్యదర్శి ఎస్‌కె జానీమియా తదితరులు పాల్గొన్నారు.

సత్ప్రవర్తన కలిగిన 8 మంది ఖైదీల విడుదల
ఖమ్మం రూరల్, మార్చి 29: సత్ప్రవర్తన కలిగిన ఎనిమిది మంది ఖైదీలు మంగళవారం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ నేరాలపై జిల్లా కారాగారానికి వచ్చిన ఆమడాల సీతారాములు (సిటి నెం.488), మార్కపుడి జయరాజు (సిటి నెం.489), బెజవాడ శ్రీనివాసరావు (సిటి నెం.690), నారపోగు వెంకటి (సిటి నెం.691), నారపోగు రవి (సిటి నెం.692), మడవి జోగయ్య (సిటి నెం.1277), విన్నపాల అనిల్‌కుమార్ (సిటి నెం.1455), శీలం పిచ్చయ్య (సిటి నెం.324) ఎంతో సత్ప్రవర్తనతో మసలుకున్నారని జిల్లా జైలు సూపరింటిండెంట్ కళాసాగర్ తెలిపారు. వీరిని జీవోఎంఎస్ నెం.38 హోమ్ (లీగల్) డిపార్ట్‌మెంట్, హెడ్ ఆఫీస్ మెమో నెం.ఆర్‌సి-3/331/2016 ప్రకారం జైలు నుంచి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా వివిధ కారణాలతో జిల్లా కారాగారంలో శిక్షను అనుభవించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విడుదలైన వారిని వారి బంధులు అక్కున చేర్చుకొని ఆప్యాయతను పంచుకున్నారు. సత్ప్రవర్తనతో జైలు నుంచి విడుదలైన వారందరూ భవిష్యత్ జీవితంలో కూడా మంచి జీవితాన్ని గడపాలని సూపరింటిండెంట్ కళాసాగర్ సూచించారు.

కార్బైడ్‌ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు
ఖమ్మం(ఖిల్లా), మార్చి 29: కాన్సర్‌కు కారకమైన కాల్షియం కార్బైడ్‌ను పండ్లుగా మారేందుకు వినియోగిస్తే చట్టపరమైనా చర్యలు తీసుకుంటామని వరంగల్ జోనల్ ఫుడ్‌సేఫ్టీ అధికారి ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నగరంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమాన్‌బజార్‌లోని పండ్ల దుఖాణాలు, వైరా రోడ్డులోని పండ్ల కేంద్రాల్లో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా ఫుడ్‌సేప్టీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కి పంపించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పండ్ల వ్యాపారులు మామిడి, అరటి, తదితర కాయలను పండ్లుగా మార్చేందుకు కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం మేరకే దాడులు నిర్వహిస్తున్నామన్నారు. పండ్లుగా మారేందుకు కార్బైడ్ వినియోగించడం నేరమన్నారు.ప్రజలు తమ ఆరోగ్యాలు కాపాడుకునేందుకు పండ్లను తీసుకుంటున్నా, అటువంటి ఫలాలకు కార్బైడ్‌ను వినియోగించడం వలన అనేక రోగాలు సంభవిస్తాయన్నారు. క్యాన్సర్‌తో పాటు గ్యాస్ట్రిక్, దురద, చర్మవ్యాధులు వంటి అనేక వ్యాధులు సంభవిస్తాయన్నారు. పండ్లను మాగపెట్టేందుకు హానికరమైన రసాయనాలను ఉపయోగించడం నేరమన్నారు. అటువంటి వారికి లక్ష రూపాయలు జరిమానాతో పాటు ఆరునెలల జైలుశిక్ష విధించడం జరుగుతుందన్నారు. ఈ దాడుల్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ఫుడ్‌సెఫ్టీ అధికారులు రాజేంద్రనాధ్, వి శ్రీనివాస్, కిరణ్‌కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పండితాపురం పశువుల సంత వేలం

కామేపల్లి, మార్చి 29: మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురం గ్రామంలోని శ్రీ కృష్ణప్రసాద్ పశువుల సంత వేలంపాట 1,58, 20,000లకు గుగులోత్ భద్రు అనే వ్యక్తి కైవసం చేసుకున్నాడు. మంగళవారం సంత ఆవరణలో డిఎల్‌పిఓ నారాయణ, ఎంపిడిఓ జివి రమణ, ఎంపిపి సరిరాంనాయక్, జడ్పిటిసి మల్లిబాబుయాదవ్‌ల సమక్షంలో నిర్వహించిన సంత వేలంపాట ఆధ్యంతం అత్యంత పోటాపోటీగా జరిగింది. పాట మద్దతు ధర 1,09, 54,749 రూపాయలకు మద్దతు ధర నిర్ణయించారు. దీంతో నలుగురు గుత్తేదారులు పాటలో పాల్గొన్నారు. మూడ్ కృష్ణప్రసాద్, జాటోత్ రామ, గుగులోత్ భద్రు, గుగులోత్ చాప్లా అనే గుత్తేదారులు పాటలో పాల్గొని పోటాపోటీగా ధర పెంచుతూ చివరకు అదే పంచాయతీ పరిధిలోని గుగులోత్ భద్రు అనే పాటదారు 1,58, 20, 000లకు అధికంగా పాడి పాటను కైవసం చేసుకున్నారు. గత ఏడాది 82,15,000లకు పోయిన పాట ఈ ఏడాది 76,05,000లకు అదనంగా పాడారు. దీంతో పశువుల సంత కోటిన్నరకు చేరుకుంది. ఈ పాటను టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య పోటాపోటీగా సాగిందని చెప్పవచ్చు. పోలీసులు 144సెక్షన్ విదించి విస్తృతంగా బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి ఉమాకుమారి, కార్యదర్శులు అరుణ, జోగారావుతో పాటు ఎంపిటిసి మాధవరావు పాల్గొన్నారు.