సాహితి

కొవ్వలి నవలలపై అపార్థాలూ అపోహలూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యంలో 1935-1965 మధ్యకాలం కొవ్వలి నవలా యుగం. అయితే చరిత్రకారులు గానీ, విమర్శకులు గానీ దీనిని గుర్తించలేదు. తెలిసినా పట్టించుకోలేదు. కొన్ని పుస్తకాలలో ‘కొవ్వలి - జంపన’ అనేవారుండే వారన్నట్టు రెండు వాక్యాలలో స్పృశించటం చూస్తాం. కొవ్వలి విషయానికి వస్తే గురజాడ అన్న ‘మనవాళ్ళొట్టి వెధవాలయలోయ్’ అన్నది గుర్తుకు వస్తుంది. మన తెలుగువాడే! వెయ్యి నవలలు (నవలికలు) రాసిన ఏకైక తెలుగువాడే! (్భరతీయుడే!) తెలుగువాళ్ళని ఆ రోజుల్లోనే పాఠకులుగా తీర్చిదిద్దినవాడే!.. అని మెచ్చుకోకపోయినా ఫరవాలేదు గానీ, అనాలోచితంగా, అవగాహనా రాహిత్యంతో ఎవరో ఏదో అంటే దానిని ‘సిద్ధాంతం’గా గ్రహించి ప్రచారం చేసినవారు కొందరు. అలవోకగా, ఈర్ష్యతో చులకన చేసినవారు కొందరు. ఈ అపవాదులు ఎలా ఉన్నాయంటే... కాలక్షేపపు నవలలనీ, పుంఖానుపుంఖంగా రోజుకో నవల రాసి పారేశారనీ, రైళ్ళల్లో బస్సుల్లో తక్కువ ధరకి అమ్మేవారనీ, సామాజిక స్పృహ మృగ్యమనీ, శృంగార వర్ణనలు చౌకబారుగా ఉన్నా అంత హానికరమైనవి కావనీ, ఈ నవలలన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోయాయనీ, పాఠకులపై బలమైన ముద్ర వేయలేకపోయాయనేది ఈ అపవాదుల సారాంశం. కానీ, ఇవన్నీ అసమంజసాలే! అనుచితాలే!
‘కాలక్షేపపు నవలలు’ అంటే ‘టైమ్‌పాస్’ నవలలని అర్థం. అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్న కాలంలో సాహిత్యాన్ని చదివించేలా, ఆకట్టుకొనేలా, ఆ నవలల కోసం ఎదురుచూసేలా రాస్తే అవి ‘కాలక్షేప నవలలు’ అని తీసిపారెయ్యడం అసహనం కాదా! 1970 తర్వాత వారపత్రికలో వచ్చిన చాలా నవలలు మధ్య తరగతివారి కాలక్షేప నవలలే! యద్దనపూడి, కౌసల్యాదేవి, లల్లాదేవి వంటివారి నవలల్ని కాలక్షేప నవలలు అనకుండా, వాటిని ప్రశంసించి కొవ్వలి నవలల్ని తేలికగా అంచనా వెయ్యటంలోని ఔచిత్యం ఏమిటి అన్నదే ప్రశ్న? యండమూరి ‘తులసిదళం’ కంటే కొవ్వలి నవలలు గొప్పవి అన్న సదవగాహన లేకపోవటం సాహిత్యపరంగా అనుచితమే మరి!
‘పుంఖానుపుంఖంగా రాయడం’ లోపమా? అసమంజసమా? తెలుగులో ఎంతమంది శతాధిక రచయితలు లేరు? అది వారి బలహీనతగా, అవాంఛనీయంగా పేర్కొనటం దుర్విమర్శ అవుతుంది. అందరూ పుంఖానుపుంఖంగా రాయగలరా? దానికి ఒక లక్ష్యం, ఒక తపన వుండాలి. అందుకు విలువైన కాలాన్ని వెచ్చించాలి. డిటిపి, కంప్యూటర్ లేని రోజుల్లో చేతిరాతతో రాయాలి. ఎంత శక్తి, దీక్ష వుంటే అది సాధ్యమవుతుంది. ఈ ఆలోచన విమర్శకాలకి ఉండాలి కదా!
కొవ్వలి వారి నవలలు రైల్వే స్టేషన్లలో, బస్‌స్టాండుల్లో అమ్మేవారు. ప్రయాణీకులు వాటిని కొనుక్కొని చదివి అక్కడే వదిలేసేవారు. ఆ తర్వాతి ప్రయాణీకుడు చదివి అలాగే చేసేవాడు. అంటే సీరియల్ పాఠకుల్ని కొవ్వలి సృష్టించారు. ఇది గొప్ప కాదా? తక్కువ ధరలకి ఇవ్వడం పెద్ద లోపమా? కొవ్వలి ఒక నవల రాసినందుకు రెండు అణాలు లేదా ఒక బేడ (అర్థరూపాయిలో సగం పావలా- పావలాలో సగం బేడ) తీసుకొన్నారంటే ధన వ్యామోహం, వ్యాపార దృక్పథం లేదనే గదా! నేటి కాలంలో వేలకి వేలు, లక్షలు సంపాదిస్తున్నవారికంటే కొవ్వలి ఎంత గొప్పవాడు.
ఇరవై ఐదు సంవత్సరాలకే 400 నవలలు రాయడం ‘ప్రపంచ రికార్డు’! ఎందరో అభిమానులు ఉత్తరాలు రాసేవారు. స్ర్తిలు కూడా ప్రేమతో రాస్తే మందలించిన అభ్యుదయ నవలా రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు. కొవ్వలివారికి ఆధునిక నవలా రచయితలలో చాలామందికి గల డబ్బు పిచ్చి లేదు. ఎక్కువ డబ్బులిస్తామని ప్రచురణకర్తలు వస్తే- ‘‘కొండపల్లి వీరవెంకయ్యగారికి మాట ఇచ్చాను. ఆయన తక్కువ ధరలకే అమ్ముతున్నారు. ఇపుడు నేను మాట మార్చను’’ అన్న నిక్కచ్చి, నిజాయితీ రచయిత కొవ్వలి. ప్రగతిశీలురు, అభ్యుదయవాదులు, సంప్రదాయవాదులు అనబడే సాహిత్య రచయితలు డబ్బుకోసం, సౌకర్యాల కోసం, హోదా కోసం వెంపరలాడటం కనులారా వీక్షిస్తున్నాం. మరి వీళ్ళతో పోలిస్తే కొవ్వలి వ్యక్తిత్వం, ఆదర్శాలు ప్రస్తుతించదగినవి కావా?
‘కొవ్వలి నవలల్లో సామాజిక స్పృహ లేదు- పాఠకుల మనసులపై బలమైన ముద్ర వేయలేదు’ అని గొప్ప విమర్శకుడుగా పేరొందినవారు అనటం గతానుగతికం లేదా అంధానుకరణం! ఇటీవల ‘విశాలాంధ్ర’, ‘ఎమెస్కో’ ప్రచురణ సంస్థలు కొవ్వలివారి కొన్ని నవలల్ని ప్రచురించారు. ఇప్పుడవి అందుబాటులోకి వచ్చాయి. వాటిని చదివి పునర్విమర్శ చెయ్యాలి తప్ప ఎప్పుడో ఎవరో అన్న వాటిని ఉదహరించి ‘కాలక్షేప నవలా రచయిత’ అనటం అన్యాయం. కొవ్వలివారి నవలల్ని పరిశీలిస్తే ఈ క్రింది అంశాలు వెల్లడి అవుతాయి.
- స్ర్తి స్వేచ్ఛ, వివాహాలు, స్ర్తి విద్య, స్ర్తిల సౌఖ్యం వంటి వాటిని వస్తువుగా స్వీకరించి చలం కంటే ముందే నవలలు రాసిన వారు కొవ్వలి.
- వేశ్యావృత్తి, వేశ్యల వ్యామోహం, నిరసనలపై అప్పుడే ఇతివృత్తాలుగా స్వీకరించారు.
- ప్రేమ, శృంగారాల గురించి ఉన్నా చలం కంటే సభ్యంగా వుండటం.
- గ్రాంథికం ఏలుతున్న రోజుల్లో వాడుక భాషలో రాయడం
- కథాకథనంలో, సంభాషణలో కొసమెరుపుల్లో కొవ్వలిది ఒక ప్రత్యేకత.
కొవ్వలి రాసిన బృహత్ నవల ‘జగజ్జాణ’ తెలుగులో అపూర్వమైన సస్పెన్స్ థ్రిల్లర్. బి.ఎస్.రాములు దీనిని హారీపోటర్ నవలతో పోల్చారు. మనం చదవకుండానే విమర్శించగల నిపుణులం!
‘‘రైళ్ళల్లోనూ బస్సుల్లోనూ వారి నవలలు చదువుతూ ప్రయాణం చేసేవారు. దిగాల్సిన స్టేషన్ మర్చిపోయేవారు’’ అన్నవారు భానుమతీ రామకృష్ణ. ఇది గొప్ప కాదా?
‘‘ఆ రోజుల్లో కొవ్వలి తమ కౌగిలిలో లేని ఆడపిల్లలుండేవారు కారు. ఆ అదృష్టం అందరికీ పడుతుందా?’’ అన్నది ఎవరో కాదు- గుడిపాటి వెంకటచలం. మరి సినీ నిర్మాత చక్రపాణి ఇలా అంటారు- ‘‘తెలుగుదేశంలో మొట్టమొదటగా జనబాహుళ్యం కోసం అందులోనూ మధ్య తరగతి స్ర్తిలకు ఆమోదకరంగా ఉండే విధంగా రచనలు చేసినవారు కొవ్వలి’’. ‘‘నా చిన్ననాడు 1940 ప్రాంతంలో నేను చిన్న తరగతుల్లో చదువుకుంటున్నపుడు మా వూళ్ళో ప్రతి వారి చేతుల్లో కొవ్వలి నవల కనబడేది. కొవ్వలివారు లక్షలాది ఆంధ్ర ప్రజల హృదయాల్లో స్థిరమైన స్థానం సంపాదించుకొన్నారు’’ అని చెప్పిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య మాటలు అక్షర సత్యాలు కాదా?!

- ద్వా.నా.శాస్ర్తీ 9849293376