హైదరాబాద్

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, నవంబర్ 25: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందించాలన్నదే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో డ్వాక్రా మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి రూ.14కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పల్స్ సర్వే ద్వారా సంక్షేమ పధకాలకు అర్హులను గుర్తించి వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పల్స్‌సర్వేల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి చంద్రన్న బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కేవలం రూ.15 లబ్ధిదారుడు కడితే దానికి ప్రభుత్వం రూ.132 కలిపి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తుందన్నారు. ఇప్పటి వరకూ కోట్ల మంది చంద్రన్న భీమాలో చేరారని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు నుండి 70సంవత్సరాల మధ్య వారు ఈ భీమాలో చేరవచ్చని అన్నారు. ఈ భీమా పధకం ద్వారా ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తొందన్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వంతో రూ.2లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రమాదాల్లో మృతి చెందితే గతంలో ఆపద్బంధు పథకం ద్వారా కేవలం రూ.50వేలు చెల్లించే వారని అన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేది నేడు గ్రామాల్లో, పట్టణాల్లో కరెంటు కోత అనేది లేకుండా 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని అన్నారు. గ్యాస్ కనెక్షన్ లేని తెల్లరేషన్ కార్డుదారులందరికీ త్వరలో గ్యాస్ కనెక్షన్‌లను అందజేయడం జరుగుతుందన్నారు. ఐదు రెట్లు ఫించన్‌లు పెంచి రూ.1000ల చొప్పున అందిస్తుండటంతో వృద్ధులు, వితంతువులు ధీమాగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితీ ఫించన్ డబ్బులను మందుల కోసం అనవసరంగా ఖర్చు చేయవద్దని, ఆరోగ్య కార్యకర్తలు, చంద్రన్న సంచార వైద్యశాల ద్వారా బిపి, షుగర్ తదితర సమస్యలకు ఉచితంగా మందులు పొందాలని సూచించారు. గర్భిణీలను భర్త, అత్తమామలకంటే ఆరోగ్య కార్యకర్తలే బాగా చూసుకుంటున్నారని, మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని అన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో మద్యం బెల్ట్‌షాపులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎక్సైజ్, పోలీసు అధికారులపై ఉందన్నారు. వీటిని నిరోధించకుంటే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 16500కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలతో సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నామన్నారు.
అనంతరం యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్, పట్టణంలోని రహదారులను, రైతుబజారులో షాపులను మంత్రి ఉమా ప్రారంభించారు. అదే విధంగా హనుమంతుపాలెం మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

జగన్ పర్యటనను విజయవంతం చేయండి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 25: రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చే నెల ఒకటవ తేదీన మచిలీపట్నం వస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) కోరారు. బుద్ధాలపాలెం, కోన గ్రామాల్లో జరిగే బహిరంగ సభలకు పెద్ద ఎత్తున రైతులను సమీకరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ పర్యటనను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక టౌన్‌హాలులో బందరు నియోజకవర్గ వైఎస్‌ఆర్ సిపి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పర్యటన వివరాలను పేర్ని వివరించారు. పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను కాజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను నిరసిస్తూ జగన్ పర్యటన ఉంటుందన్నారు. అలాగే సాగునీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంట పొలాలను కూడా జగన్ పరిశీలించే అవకాశం ఉందన్నారు. కానూరు, జన్నలవారిమోడి గ్రామాల్లో ఎండిపోయిన పొలాలను జగన్ పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జగన్ రూట్ మ్యాప్‌ను శనివారం నాటికి పూర్తి చేస్తామన్నారు. జగన్ పర్యటనకు వైఎస్‌ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు షేక్ సలార్ దాదా, మోకా భాస్కరరావు, బొర్రా విఠల్, షేక్ అచ్చాబా తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు నాయకత్వం దేశానికే ఆదర్శం
నాగాయలంక, నవంబర్ 25: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధికి చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద శుక్రవారం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో భాగంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తీరును జీర్ణించుకోలేకే తనవంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఎన్నికలలో పరిపాలనా దక్షునికి, అనుభవ శూన్యునికి మధ్య ప్రధాన పోటీ జరిగిందని, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానే్న బలపర్చటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.16వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్న పరిస్థితిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న నాయకునిగా చంద్రబాబు నాయుడు ప్రజలలో గుర్తింపు పొందగలిగారన్నారు. ముఖ్యంగా ఎన్డీఎ హయాంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దేశంలో నదుల అనుసంధానం ద్వారా మాత్రమే ఆహార ఉత్పత్తులు తెచ్చుకోవటం సాధ్యమవుతుందన్న ప్రతిపాదనను తొలి సారిగా మన ముఖ్యమంత్రి అమల్లోకి తెచ్చారన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసిన ఘనతను సాధించారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉత్పాదన తిరోగమనంలో ఉందన్నారు. దేశంలో పిపి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో డ్వాక్రా సంఘాలు ఏర్పడినప్పటికీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తమ నేత నేతృత్వంలో అది ఆర్థిక స్వావలంబన సాధించటం ద్వారా ప్రపంచం దృష్టికి వెళ్ళాయని బుద్ధప్రసాద్ గుర్తు చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల మనిషి కాదని, చేతలలో రాష్ట్భ్రావృద్ధికి నిరంతరం పాటుపడుతున్న శ్రామికుడన్నారు. బందరు పోర్టు నిర్మాణంతో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. తొలుత మండల వైస్ ఎంపిపి డా. మోకా బుచ్చిబాబు సభికులకు స్వాగతం పలికారు. తొలుత బుద్ధప్రసాద్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో మండల టిడిపి అధ్యక్షులు వర్రే రాంబాబు, సజ్జా గోపాలకృష్ణ, ఎఎంసి చైర్మన్ మండవ బాలవర్ధనరావు, జెడ్పీటిసి కన్నా నాగరాజు, దివిసీమ గ్రామీణ వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం (రాజా), జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి తలసిల స్వర్ణలత, జిల్లా తెలుగు యువత కార్యదర్శి తలసిల రామకృష్ణ చౌదరి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తుంగల కోటేశ్వరరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లీలావతి, కె కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుండే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 25: విద్యార్థి దశ నుండే చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజీవ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పలు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది చీలి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.
బంటుమిల్లిలో....
బంటుమిల్లి : విద్యార్థులు విద్యతో పాటు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి పిఆర్ రాజీవ్ అన్నారు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయమూర్తి రాజీవ్ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యాలు, పలు రకాల చట్టాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అర్హులైన వారికి ఉచితంగా న్యాయ సలహాలను అందించటం జరుగుతుందన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మోటారు వెహికల్ చట్టం, సైబర్ నేరాలు, సమాచార హక్కు, విద్యా హక్కు చట్టం తదితర చట్టాలు గురించి అవగాహన కల్పించారు. బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్‌ఎల్ శ్రీనివాసరావు పలు చట్టాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ ప్రతినిధులు కైలాసపతి, ఐ శ్రీనివాసరావు, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ సాల్మాన్‌రాజు పాల్గొన్నారు.
భార్యను వేధిస్తే కటకటాలే!
కృత్తివెన్ను, నవంబర్ 25: కట్టుకున్న భార్యను వేధిస్తే జైలుకు వెళతావని డిఎంఅండ్‌హెచ్‌ఓ నాగమల్లేశ్వరి లక్ష్మీపురం పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ సునీల్ కుమార్‌ను హెచ్చరించారు. ఆసుపత్రిలో పని చేసే స్ట్ఫా నర్సుతో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని డాక్టర్ సునీల్ కుమార్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం డిఎంఅండ్‌హెచ్‌ఓ నాగమల్లేశ్వరి లక్ష్మీపురం పిహెచ్‌సిలో విచారణ చేపట్టారు. డాక్టర్, నర్సుకు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గ్రామస్థులు కూడా డిఎంఅండ్‌హెచ్‌ఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిఎంఅండ్‌హచ్‌ఓ విలేఖర్లతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు ఆసుపత్రిలో జరగటం వల్లే ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పోతోందన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఓ అమృతం, పిహెచ్‌సి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ తాతాజీ, పులగం నాగభూషణం, గ్రామస్థులు పాల్గొన్నారు

రాష్ట్రంలోనే తొలి తెలుగు రైతు బజారు
కూచిపూడి, నవంబర్ 25: స్థానిక పసుమర్తి వారి ధర్మచెరువులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజారు దుకాణ సముదాయం తెలుగుదనాన్ని ప్రతిబింబింప చేస్తోంది. రూ.42లక్షలతో నిర్మిస్తున్న ఈ రైతు బజారు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా పాకల మూలల్లో నాలుగు భవనాలు, ఎగ్జిబిషన్ భవనం, ఆఫీసు భవనం, టాయిలెట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. డిసెంబరు నెలలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖాధికారులు పేర్కొంటున్నారు.
సుబాబుల్ రైతు బకాయిలు వడ్డీ సహా చెల్లింపు

నందిగామ, నవంబర్ 25: అవసరమైతే ఎస్‌పిఎం కంపెనీ ఆస్తులను జప్తు చేసి అయినా సుబాబుల్ రైతు బకాయిలను వడ్డీతో సహా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు విచ్చేసిన మంత్రి ఉమామహేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండ్, మెయిన్ రోడ్డు, గాంధీ సెంటర్, సిఎం రోడ్డు మీదుగా రైతుపేటకు ర్యాలీగా సాగారు. గాంధీ సెంటర్, ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద, నగర పంచాయతీ కార్యాలయం వద్ద, రైతుపేటలలో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరైన దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కాంస్య విగ్రహాన్ని ఈ సెంటర్‌లో ఏర్పాటు చేయాలని, ఆయన్ను ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎస్‌పిఎం కంపెనీ బకాయిల వల్ల ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖమంత్రి పత్తిపాటి పుల్లారావుతో మాట్లాడటం జరిగిందన్నారు. సుబాబుల్ బోర్డు కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో సాగు, త్రాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ముక్త్యాల వద్ద భారీ ఎత్తిపోతల పధకం నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో పలువురు నేతలు మంత్రి ఉమాను దుశ్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి, వైస్ చైర్‌పర్సన్ వడ్డెల్లి అశోక్‌కుమారి, కమీషనర్ మాథ్యూ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, ఎఎంసి చైర్మన్ కెవి సాంబశివరావు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కొండూరు వెంకట్రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ రాటకొండ కోటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్‌లు, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.