మెయిన్ ఫీచర్

జాతికి జవసత్వాలు.. సంస్కృతీ సంప్రదాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో భారతదేశమంతటా పలు వేదికలపై మతము భారతీయ సంస్కృతిని గురించి విస్తృతంగా చర్చించబడుతున్నది. వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కొందరైతే ‘మతం ప్రసక్తిలేకుండా సంస్కృతిని సముద్ధరిద్దాం’ అంటూ వేదికలపై ఉపన్యాసాలిస్తున్నారు. సాధ్యంకాని పనికి సమాయత్తమవుతున్నారు.
ఇతర మతాలవలె భారతదేశంలో ‘మతం’ అన్న మాటకు ఉనికి లేదు. ఇతర మతాల్లో ఆయా మతాలు ఒక వ్యక్తి పేరున వ్యవస్థాగతమయ్యాయి. భారతదేశంలో హిందూ మతంగా చెలామణి అవుతున్న మతం అలాటిది కాదు. ఈ దేశంలో యుగాలుగా కొనసాగుతున్నది సనాతన ధర్మం. నాడు ఉంది నేడు ఉన్నది. మున్ముందు కూడా ఉంటుంది. ఈ ధర్మం వేదాలనుండి పరంపరాగతంగా ఈనాటికీ నిలచి ఉంది. ఆ ధర్మంనుంచి ఉద్భవించినదే సంస్కృతి. ఈ ధర్మం గట్టి పునాదులపై నిర్మింపబడింది.
సనాతన ధర్మాన్ని పట్టించుకోకుండా ‘మతాతీతంగా’ సంస్కృతిని గురించి మాట్లాడడం వితండవాదమే అవుతుంది. ఈ వితండవాదులు చెప్పే మతంలోనే మన సంస్కృతి సమ్మిళితమై ఉంది. పరంపరాగతమైన వేదిక సంపద. ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, అపారమైన వాఙ్మయం, సంగీత సాహిత్య నాట్యాది కళలు. రమణీయమైన శిల్పసంపదలకు నెలవైన ఆలయాలు, గోపురాలు అన్నీ సంస్కృతికి ప్రతీకలే. ఆస్తికమైన, దైవిక సంబంధమైన, మత (సనాతనధర్మ) పరమైన విశ్వాసాలపై ప్రాణసమానంగా నిలిచున్నవే!
సంస్కృతి నుండి వచ్చినదే సంస్కారం. ఆచార విహారాదులు సంస్కృతీ చిహ్నాలు. ఈ సంస్కృతికి గల విశిష్ట లక్షణం విస్మృతి. విభిన్న ముఖాలతో అనంత రూపం ధరించి ఉంది. తత్త్వచింతన, ఉపాసన, యోగం, కర్మనిష్ఠ- ఇవన్నీ సంస్కృతీ భావధారలు. మంగళ తోరణాలు, పసుపు గడపలు, ముంగిట్లో ముగ్గులు, ఆయా సందర్భాల్లో ప్రతి ఇంటిలో నోములు, వ్రతాలు, సీమంతాలు, బారసాలలు వంటివన్నీ సంస్కృతిలోని భాగాలే. భారతీయ మహిళలు ధరించే ఆహార్యాలన్నీ ఏనాడు అలంకారాలుగా భావించలేదు. ముఖ్యంగా భారతీయ మహిళ మాంగల్యాన్ని పరమ పవిత్రంగా భావిస్తుంది. ఒక మహిమాన్వితమైన సంప్రదాయానికి, విశ్వాసానికి సంకేతం మాంగల్యం. వీటి వెనుక ఎన్నో ఇతిహాసాలున్నాయి.
ఇక సంగీత, సాహిత్య, నాట్యాది కళలను పరిశీలిస్తే ఎందరో వాగ్గేయకారులు, భక్తులు తమ జీవితాలను ఆయా కళలకు అంకితమై భగవంతునిలో ఐక్యమయ్యారు. త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య, తుకారాం, సూరదాసు, మీరాబాయి ఇలా ఎందరి పేర్లను ఉటంకించగలం. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినీ అట్టం, ఒడిస్సీ మొదలైన నాట్య రూపాలన్నీ భగవదారాధనలే! పల్లెసీమల్లో ప్రదర్శితమయ్యే జానపద కళారూపాలు- తోలుబొమ్మలాటలు, భామాకలాపాలు, వీధి నాటకాలు, చెక్క్భజనలు వంటి కళారూపాలు భగవంతుని లీలావైభవాన్ని చాటిచెప్పేవే! ఇవన్నీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. భగవత్ స్పృహలేకుండా ఏ ఒక్క కళా లేదు. భారతీయ ధర్మం (మతం) సంస్కృతితో ముడివేసుకుని ఉన్నదనడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు.
రామాయణ, భారత, భాగవత, పురాణాది గ్రంథాలన్నీ భారతీయుల ఆత్మ. ఈ దేశస్థులు ఆయా గ్రంథాల్లోని వ్యక్తులను, ఘట్టాలను గుండెల్లో పదిలంగా ప్రతిష్ఠితం చేసుకున్నారు. వాటిలోని ఆధ్యాత్మికతను తమ రక్తంలో కణకణంలోను నింపుకున్నారు. ఆసేతు శీతాచలం నిర్మించబడిన గుడులు, గోపురాలపై ఆ గాథలను అపూర్వ శిల్పకళానైపుణ్యంతో మలచుకున్నారు. ప్రపంచానికి భారతీయ వాఙ్మయ, చారిత్రక, ఆధ్యాత్మికతలను ఆశ్చర్యపడేలా అందించారు.
ఇవన్నీ మతపరంగా ఆలోచించినా, సంస్కృతిపరంగా విశే్లషించినా ఈ దేశపు ధార్మిక నిష్ఠకు, ఆధ్యాత్మిక పుష్ఠికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ వారసత్వ సంపదను సంకుచిత దృష్టితో కాదనడం కుత్సిత బుద్ధితో చూసేవారికి అవగాహన కాదు.
స్వామి వివేకానంద పుణ్యభూమి అయిన భారతదేశ సంస్కృతిని నిర్వచిస్తూ ‘‘సౌకుమార్యం, ఉదారత, పవిత్రత, తాత్త్విక ప్రవృత్తి, కర్మనిష్ఠ’’ ప్రధాన లక్షణాలన్నారు. అంతేకాదు, మతంనుంచి సంస్కృతి విడదీయరానిదంటూ ‘‘ఈ పుణ్యభూమిలో మతమే పునాది. మతమే వెనె్నముక. మతమే జీవనాడి. సర్వస్వం మతమే. జాతి జీవనమనే సంస్కృతి ఈ మహాసౌధం మతమనే పునాదిపైన నిర్మితమై విలసిల్లుతోంది’’ అన్నారు.
వివాహ వ్యవస్థ, ఆదర్శ దాంపత్యం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొదలైనవన్నీ భారతీయ స్వాభావిక జీవన విధానంలో భాగమై ఉన్నాయి. సంస్కృతీపరమైన సనాతనధర్మ సంప్రదాయాలు ఊపిరిగా స్వతఃసిద్ధమై ఉన్నాయి.
మరోమారు వివేకానందుని మాటలు స్మరిద్దాం. ‘‘ఈ దేశానికి మతం ఉంది. మతం మాత్రమే ఉంది. ఆ మతంలో అన్నీ ఉన్నాయి.’’ మహోన్నతమైన భారతీయ సనాతన ధర్మాన్నీ, సంస్కృతినీ దెబ్బతీయాలనీ కంకణం కట్టుకున్న వారిలో ఆంగ్లేయులు అగ్రగణ్యులు. ఈ దేశంపై అధికారం పొందిన బ్రిటిష్ ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడానికి ‘మేధావుల’ను పంపి ప్రణాళికలు రచించింది.
ఆ మేథావుల దృష్టికి ప్రధానంగా కనిపించినవి- విద్య దానికి అనుబంధంగా ఉన్న వారసత్వ సంపద. వీటిని రూపుమాపితే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని తలపోశారు.
‘‘ఒక్క సనాతన ధర్మాన్ని, దాని ఆధారంగా నిర్మించిన వేద వాఙ్మయాన్ని దెబ్బతీస్తే... భారతీయతయొక్క ఆధ్యాత్మిక, సంస్కృతీ సంప్రదాయాల వారసత్వ పునాదులు నేలమట్టమవుతాయని, ఆ లక్ష్యసాధనలో వారు అడుగులు ముందుకువేసాడు. ఈ కుతంత్రాన్ని పసిగట్టలేనందునే భారతదేశపు ప్రాణశక్తి ప్రమాదంలో పడింది.
నాగర లిపితో కాని, సంస్కృత భాషతోకాని ఏమాత్రం పరిచయం లేని విదేశీయులు ముఖ్యంగా ఆంగ్లేయులు ధనాన్నీ, పురస్కారాలను ఎరజూపి మిడిమిడి సంస్కృత భాషాపరిచయమున్న వారిని చేరదీసి భారతీయ వాఙ్మయాన్ని వారిచే అనువదింపజేసి, తమకు తెలిసినంతవరకు, విపరీతార్థాలను రచించి ప్రకటింపజేశారని అరవింద యోగులంతటివారే అన్నారు. వారి మాటలకు నిలువెత్తుసాక్ష్యం మాక్స్‌ముల్లర్ మహానీయుడు.
ఇంతటి దౌర్జన్యాలు జరిగినా, నాటినుంచి నేటివరకు భారతీయ సనాతన ధర్మం ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్నా,నేటికీ తట్టుకుని నిలిచి ఉంది. అంటే ఇదంతా మన సనాతన ధర్మ గొప్పతనమే. కర్మసిద్ధాంతాన్ని నమ్మే పుణ్యభూమి భరతభూమి. కర్మభూమి.
ఈ దేశమతం (హిందూ) భారతీయ సనాతన ధర్మం పునాదులపై పటిష్టంగా నిలచి ఉంది. ఈ దేశస్థుల ఆత్మ, జీవితం ఋషిపరంపరలందించిన ఆధ్యాత్మికతతోనే ముడిపడి ఉంది. భౌతిక విజ్ఞానానికీ, ఆధ్యాత్మిక చింతనకీ వారధిలా ఉంటూనే, మారుతున్న కాలంతోపాటు సంప్రదాయాలకు క్రొత్త చిగుళ్ళు తొడుగుతున్నది. వసుదైక కుటుంబం ఆకాంక్షించే విధానమే భారతీయ పరంపర. ఇదే మన మతం. మన సంస్కృతి తద్భిన్నంకాదు.
ఈ పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు తాము ప్రాణప్రదంగా భావిస్తున్న సనాతన ధర్మం (మతం), సంస్కృతులను పరిరక్షించుకోడానికి కంకణబద్ధులు కావాలి.

- ఏ.సీతారామారావు