మెయిన్ ఫీచర్

యాదాద్రిలో నిత్య వేదఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభ్యుదయ నిశ్రే్శయన సిద్ధికి హేతుభూతమైనది ధర్మం. ఈ ధర్మానికి మూలం వేదం . వేదములు భారతీయ విజ్ఞాన నిధులు. అతీంద్రియ ద్రష్టులగు ఋషులు తమ జ్ఞాన చక్షువులతో దర్శించిన అనేక తాత్త్వికాంశములను వేదరూపంలో మనకు అందించారు. అనుభవజన్యమైన విషయములు, తాత్త్విక జ్ఞానమునకు వేదములు సంగమస్థానములు. ఋషులందరూ సర్వజనులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలన్న కోరికతో ఈ వేదవిజ్ఞానాన్ని అందించారు. కాని ఆధునిక విజ్ఞానసముపార్జనకై అర్రులుచాస్తున్న మానవుడు సొంత గడ్డపై అజరామరమైన ఖ్యాతిని అందించు వేదవిజ్ఞానాన్ని విస్మరిస్తున్నాడు. కాని కొందరు వేదాధ్యయన పరులు సామాన్యులకు సైతం వేదవిజ్ఞానం అందాలని అందు సూచించిన సూత్రాలను సంపూర్తిగా తెలుసుకొంటే మరింత విజ్ఞానాన్ని సముపార్జించుకొంటారని అనుకొన్నారు. అందుకే సామాన్యులకు అర్థమయ్యే భాషలో వేదవిజ్ఞానాన్ని అనేక విధాలుగా అందిస్తున్నారు.
వేదభాగాల్లో ఉన్నయజ్ఞయాగాదులను కొందరు సకల సృష్టి అభ్యుదయాన్ని పొందాలని వాంఛించి వాటిని నిర్వర్తిస్తున్నారు.
దేశంలో అనేక ధార్మిక సంస్థలు, ఆశ్రమాలు, మఠాలు, మందిరాలు ఇంకా ఎన్నో సంస్థలు ఎందరో మహానుభావులు వేదవిద్యను పరిక్షించుకోవాలని, వేదమాత అనుగ్రహాన్ని యజ్ఞయాగా అనుష్ఠానం సమాజంలోని పదిమందికి అందించాలని దాని ద్వారా సుఖశాంతులతో విలసిల్లే సమాజాన్ని దర్శించాలని నిరంతరం కృషి చేస్తున్నారు . అటువంటివారిలో కేసాప్రగడ హరిహరనాథలు అగ్రగణ్యులు ఖర్చుకు వెనకాడకుండా ఆయన ఆధ్వర్యంలో సాంగోపాంగంగా శ్రీపంచాయతన సహిత అయుత శ్రీమహావిష్ణు మహాయాగాన్ని యాదాద్రిలో నిర్వర్తించడానికి సకల సన్నాహాలు చేశారు. చేస్తున్నారు. యాగం నిర్విఘ్నంగా జరుగుతున్నది. యజ్ఞాన్ని చూడాలన్న ఆపేక్ష ఉన్నవారంతా దగ్గరలోని యాద్రాదికి వెళ్లి యజ్ఞాన్ని సందర్శనం చేసుకొని ఆ యజ్ఞప్రసాదాన్ని తీసుకొని వస్తున్నారు. సర్వులు సుఖ సంతోషాలతో ఉండాలనే కాంక్షతో చేసే ఈ యజ్ఞం వల్ల ఋత్విజులు, యజ్ఞకర్తలు కోరుకు న్న విధంగా సర్వతో ముఖాభివృద్ధి జరగాలని అందరం ఆశిద్దాం.
ఇట్లాంటి యాగనిర్వహణకు కర్మానుష్ఠానపరులు కావాలి. అట్లాంటి వారిలో ‘‘శ్రీపంచాయతన సహిత ఆయుత శ్రీ మహావిష్ణువుమహాయాగము’’ చేయాలని కె.హెచ్. ఎస్. సేవా ట్రస్ట్ వారు దేశవిదేశాల్లో అశేష భక్తజనావళి , నాయకులు, అధికారులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మితృల సహాయ -సహకార ప్రోత్సాహములతో ఈ సకల విశ్వశాంతి సర్వమానవాళి మధ్యన సుహృద్భావన, పరస్పర వృష్ఠి, వసంతాది సకాల సక్రమ ఋతు ప్రవేశములు, భూకంపములు , వరదలు, తుఫానులు, అతివృష్ఠి, అనావృష్ఠి , విషజ్వరాదులు, అంటువ్యాధులు, మానవుల ఆటవిక ప్రవృత్తి ఇత్యాదుల నివారణ కోసం సర్వజగత్తు శాంతిగా సాగాలన్న ఏకైక లక్ష్యంతో శ్రీపంచాయతన సహిత ఆయుత శ్రీమహావిష్ణు మహాయాగమును శ్రీకారం చుట్టారు.
ఇంతకు ముందు కాలంలో భద్రాచలం (ఏటపాక)లోకేరళకు చెందిన సాంప్రదాయ నంబూద్రి బృందముచే ‘‘అతిరాత్రం’’ మహోత్కృష్ట సోమయాగమునూ 2013 ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామమున ఆంధ్ర , తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్టల్రకు చెందిన వేద స్మార్త పండితులచే ‘‘అతిరుద్రం’’ మహోత్కృష్ట స్మార్థయాగమును , 2015 జనవరి లో కర్నూలు పట్టణ సమీపంలో ‘‘గార్గేయపురం’’ గ్రామంలో కర్ణాటక మత్తూరు అగ్రసారమునకు చెందిన వేద సంస్కృత పండితులచే ‘‘అప్తోర్యామం ’’ మహోత్కృష్ట సోమయాగమును ‘‘మహారౌరం’’ మహోన్నత స్మార్త యాగములను ఏకకాలంలో ఒకే ప్రాంగణంలో రెండు విడివిడి బృందాలతో నిర్వర్తించారు.
వివిధ ప్రదేశాల్లో గల వివిధ దేవాలయములకు అనుసంధానం చేస 16 మహాక్రతువులను నిర్వహించిన అనుభవంతో ఘన చరిత్ర గల 69ఏళ్ల వయోవృద్ధులు బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాథశర్మ గారి నేతృత్వముననే అత్యంత వ్యయ ప్రయాసలతో కోట్లాది రూపాయల ఖర్చుతో ఈ మహాక్రతువును నిర్వర్తించడం సర్వజనుల పుణ్యఫలంగా భావించాలి.
ఇపుడు జరుగుతున్న శ్రీ పంచాయతన సహిత ఆయుత శ్రీ మహావిష్ణు మహాయాగాన్ని 3 విభాగములుగా చేసశారు. ప్రథమ ఘట్టంలో పంచనారసింహక్షేత్రమైన యాదాద్రిలో ఈ యాగశాలలో 5రోజుల పాటు నారసింహ ఉపాసన చేశారు. ద్వితీయ ఘట్టంలో 108 రోజుల పాటు 12మంది ఋత్విజులచే ప్రతినిత్యం 1,08,000 లక్షా ఎనిమిదివేలు చొప్పున 108 రోజులలో 1,08,00,000 శ్రీనారాయణాష్టాక్షరీ జపం నిర్వహిస్తున్నారు. అంతేకాక ఈ 108 రోజుల్లో వచ్చిన తొలి ఏకాదశి తిథి నుండి 8ఏకాదశీ పర్వదినాల్లో అహోరాత్రంగా విష్ణుసహస్రనామ స్తోత్రపారాయణ, నామ సంకీర్తన, భక్తికీర్తనలు, భక్తిపాటలు , భజనాదులు గురుపూర్ణిమాదిగా ప్రతి మాస శివరాత్రి, వరలక్ష్మీవ్రతం, కృష్ణాష్టమి, వినాయక చవితి , నిన్నమొన్న ముగిసిన దసరాల్లాంటి ప్రతి పర్వదినంలోను విశేష అర్చనలు, అభిషేకాలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇక తృతీయ ఘట్టంలో 12 రోజులు విశేషంగా 108రోజుల పాటు సాగిన 1,08,00,000 నారాయణాక్షరీ జప దశాంశమన 10,80,000 నారాయణాష్టాక్షరీ హోమములు ఇవి కాక పదవేల పురుషసూక్తహోమాలు, దానికి పదిరెట్లు నియత పారాయణలు జరుపుతున్నారు. ఇవి కాక మహావిష్ణు వక్షస్థల వాసిని అయిన అమ్మ వారి అనుగ్రహం కోసం పదివేల ఎనిమిదివందలు శ్రీసూక్త పారాయణలు, దశాంశమైన 1,080 శ్రీసూక్త హోమాలు, 1,080 భూసూక్త పారాయణలు, దశాంశమైన 108 భూసూక్త హోమాలు చేయడానికి సంకల్పించారు. వీటి అన్నింటితోపాటుగా అమ్మవారికి, స్వామివారికి కూడా విశేష అభిషేకాదులు, అర్చనలు, అలంకరణాదులతో పాటుగా స్తోత్రపారాయణలు, నామసంకీర్తనాదులను ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు.
ప్రతినిత్యం పంచాయతన దేవతలైన గణపతికి అభిషేకం, అర్చన, అలంకారం, శీర్షోపనిషత్ చతురావృత తర్పణాలు, గణపతి హోమం, నమస్కార ప్రియుడైన సూర్యునికి నమస్కారాలు, అభిషేకాదులు, త్రిదార్చన మహాసౌర, అరుణ పారాయణలూ మహాసౌర అరుణహోమములు రుద్రుని ప్రీతికరంగా 121 నమక చమక పారాయణలు రుద్రాభిషేకాలు, 11రోజుల్లో మహారుద్రాభిషేకం, త్రిదార్చన రుద్ర క్రమార్చన, రుద్రహోమం, ఇట్లాంటివన్నీ అనుభవజ్ఞానులైన ఋత్విజులచే నిర్వహించబడుతున్నాయి.
శ్రీచక్ర నవావరణార్చన, చండీ పారాయణ, హోమాలు, చతుర్వేద పారాయణలు, పెద్దలచేత ప్రవచనాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ అనుషంగికంగా కొనసాగుతున్నాయి. వీటిఅన్నింటినీ సక్రమంగా నిర్వహించడానికి సర్వశక్తులను ఒడ్టిన ఆచార్యులు మంత్రద్రష్టలు, ఉపాసకులు దీక్ష వహించారు.
ప్రధానంగా నవంబరు ఒకటిన అనగా కార్తీక శుక్ల ద్వాదశీ నాడు అన్నసమారాధన, యాగ పరిసమాపన దినం కనుక ఆ రోజు అర్చనాదులు, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, అవబృంధ, వేదోక్త మహాదాశీర్వచనం జరుగుతాయి. తరువాత మహాన్నసమారాధన ఘనంగా జరుగుతుంది. కనుక మానవులుగా పుట్టిన అందరూ ఈ యాగాన్ని పురస్కరించుకొని యాగంలో పాల్గొని వారి చేతనైంతగా వారి వారి శక్తి మేరకు ధన, వస్తు, సేవారూపాల్లో సహకరించాలని, ఆ దేవదేవుని ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని జాతికులమతవర్ణవర్గ భేదాలు లేకుండా, దేశవిదేశాల్లోని వారంతా పొందాలని ప్రతివారికీ పేరుపేరునా సాదర ఆహ్వానం పలుకుతున్నామంటూ యజ్ఞపర్యవేక్షకులు బ్రహ్మశ్రీ కేసా ప్రగడ హరిహరనాథ శర్మగారు చెప్పారు. కనుక మనమంతా ఈ యాగంలో పాల్గొని శ్రీమన్నారాయణ, శ్రీమహాలక్ష్మీ అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందడానికి సంకల్పించుకొందాం.

- చివుకుల రామమోహన్