మెయిన్ ఫీచర్

శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మద్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.
అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. తల్లిదండ్రులు వెంకటనాధునిగా నామకరణం చేసారు.
వెంకటనాథుడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏకసంథాగ్రాహి. గురువుల అనుగ్రహాన్ని పొందినవాడు. వెంకటనాధుని తెలివితేటలు గురించి అందరూ పొగిడేవారే. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వెంకటనాధుడు మధురలోని బావ లక్ష్మీనరసింహాచార్యులవద్ద వేదమంత్రాలు చదవటంలో మెలకువలు నేర్చుకున్నారు. తమ వంశపార్యపరంగా వచ్చే వీణావాయిద్యాయిని కూడ వేంకటనాధుడు నేర్చుకున్నారు. వెంకటనాధుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూల రాముల పూజలు చేయటానికే మనస్సు తహతహలాడుతూ వుండేది. శ్రీ సుదీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా, తాత్పర్యాలు వ్రాసి పరిమళచార్యునిగా గురువుచేత బిరుదు పొందాడు. అమరకోశం కంఠస్తంగా వుండేది. సంస్కృతం, నిఘంటువులు వెంకటనాథుని నోట్లోనే వుండేవి. చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో వున్న వెంకటనాథునికి సరస్వతీ అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది. ఒక పుత్రుడు జన్మించాడు. వెంకటనాథుని జీవితంలో కడు దారిద్య్రం దాపురించింది. చివరికి భార్య అనుమతి తీసుకొని గురువుతోపాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు. గురుసుదీంద్ర తీర్థులు వెంకటనాధునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు. సాటిలేని పండితునిగా వేంకటనాథుడు గురువు సన్నిధిలో పెరిగాడు.
తన తరువాత మఠంకు వారసుడు వెంకటనాథుడని గురువు సుదీంద్రులు భావించారు. అంతేకాకుండా ఒక రోజు కలలో శ్రీ మూలారాములు సుదీంద్రులకు వచ్చి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే వుందని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుదీంద్రులు వివరించారు. సన్యాసం స్వీకరించే విషయం మీమాసంలో వున్న వెంకట నాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మద్వా సిద్ధాంతాన్ని లోకాన్ని విస్త్తరింపచేయాలని సెలవిచ్చింది. సరస్వతీదేవి కోరిక కూడా ఇదే కావటంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించటానికి సిద్ధమై గురువు సుదీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తంజావూరు పాలకుడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీ.శ.1621, ఫాల్గుణశుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్ట్భాషేకంగావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుదీంద్రతీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసారు. గురు సుదీంద్రతీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుని విగ్రహం, దిగ్విజయరాముల విగ్రహం, జయరాముని విగ్రహం, వేదాంత గ్రంథాలు, శే్వతఛత్రం, వింజామరలు, స్వర్ణపల్లకి, మఠం కార్యక్రమాలు అన్ని కూడ శ్రీ రాఘవేంద్రతీర్థులకు అప్పగించారు. 1623లో గురువు సుదీంద్రతీర్థులు హంపీవద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్థులైనారు.
శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మద్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక’ అనే గ్రంథానికి ‘ప్రకాశం’ అనే వివరణ వ్రాసారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక’ సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు.
స్వామిని పర్యవేక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డకప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లులతో చల్లగా మాంసం పూవ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల’ గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు.
స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు.
‘‘పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతేయచ!
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేననే’’
అంటూ భక్తులు శ్రీ రాఘవేంద్రస్వామిని పూజిస్తారు.
శ్రీ రాఘవేంద్రస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రాలయ మఠంలో మార్చి 9నుంచి 15వ తేదీ వరకు గురుభక్తి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి మూర్తులను బంగారు, వెండి రథాలపై ఊరేగింపు చేస్తారు. నిత్యం భక్తుల పూజలు అందుకుంటూ భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు శ్రీ రాఘవేంద్రులు.

- తెలుగు ఈరన్న