మీ వ్యూస్

టైం కలిసిరావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా పరిశ్రమలో కష్టం ఒక్కటే కాదు, టైం కూడా కలిసి రావాలి. రెండూ కలిసొచ్చిన వాళ్ల రేంజ్ టాప్‌కు చేరిపోవడం చూస్తూనే ఉంటాం. నారా రోహిత్‌కు టైం కలిసి రావడం లేదు. తనస్థాయి హీరోలతో పోలిస్తే -లెక్కకు మించి సినిమాలు చేస్తున్నా, వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నా, నటనలోనూ మిగిలిన వాళ్లకంటే మెరుగ్గానే ఉన్నా -కెరీర్‌ను ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఉన్నట్టు ఉండిపోయాడు. సినిమా ఎంపిక నుంచీ, తన క్యారెక్టర్ ప్రజెంటేషన్ వరకూ అన్నీ ఇమిడినా.. స్టార్ రేంజ్‌కు మాత్రం చేరలేకపోతున్నాడు. పైగా, హీరోకి ఉండాల్సిన ఫిజికల్ అట్రాక్షన్ రోహిత్‌కు పెద్ద లోపంగా మారుతోంది. బరువైన పాత్రలే చేస్తున్నా, శరీరం బరువు పెరిగిపోతుండటం పెద్ద మైనస్. ఇటీవల వచ్చిన రాజా చెయ్యివేస్తే చిత్రం కూడా నారా రోహిత్‌కు నిరాశనే మిగిల్చింది. శరీరాన్ని చాలా తగ్గిస్తేతప్ప -ఇంకొంత కాలం హీరో వేషాలు వేసే
అవకాశం ఉండదేమో.
జి పల్లవి, రాజమండ్రి

హీరోలు బాగలేదు!
‘ఈడోరకం- ఆడోరకం’ చిత్రానికి ఫ్లాపు మార్కులేసింది వెనె్నల. కానీ దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఎమ్మిగనూరు, కర్నూలు థియేటర్లకు వచ్చి చిత్రం హిట్టంటూ చెప్పుకొస్తుంటే నవ్వొచ్చింది. ఇద్దరు హీరోల్లో -ఒకరు అప్పుడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టుంటే, ఇంకో హీరో చింపిరి జుత్తు, గడ్డంతో వెకిలిచేష్టలు చేస్తున్నట్టు అనిపించాడు. హీరోల్లో అట్రాక్షన్ లేనపుడు -సినిమా ఏం ఆడుతుంది? ఢీ సినిమాలో మంచు విష్ణు బాగానేవున్నాడు. కానీ ఈమధ్య పీక్కుపోయిన ముఖంతో డీగ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. నాగేశ్వరరెడ్డికి సరైన హీరో అల్లరి నరేషేనేమో. హాస్యచిత్రాలు తీస్తానంటూ వెగటు హాస్యం చూపించడం మానేసి, కనీసం ఆధునిక హాస్యానికి ట్రాప్ వేసి వెళ్లిపోయిన జంధ్యాలగారిని అనుకరించినా బావుంటుందేమో.
-ఎం.పురుషోత్తం, ఎమ్మిగనూరు

ఊపిరి బావుందా?
పత్రికల్లో సమీక్షలు చదివి ‘ఊపిరి’ చూడటం జరిగింది. మూలం తీసిన ఫ్రెంచివారు ఈ చిత్రం చూస్తే ‘అయ్యో మనంకూడా సీరియస్ సినిమాలా కాకుండా, ఐటమ్‌సాంగ్సు గట్రా పెట్టివుంటే ఎంత బాగుండేదో’ అనుకుంటారేమో. అందరూ గొప్ప సినిమా అంటున్నారు కనుక, గొప్ప సినిమా మూలాన్ని ఇతివృత్తంగా తీసుకుని తీశారు కనుక ‘బావుంది’ అనాలని అన్నారేమోగానీ, ఒరిజినల్ చూసిన కళ్లతో ‘ఊపిరి’ చూస్తే మాత్రం నిజమైన సినిమా ప్రేక్షకుడు ఒకింత బాధపడటం ఖాయం. గొప్ప కథను మరో భాషలోకి అన్వయించేటపుడు మూలంలోని గాఢతను మరింత పెంచాతేనే బావుంటుంది.
-డిఎస్‌ఎస్, వక్కలంక

మరి బూతు సినిమాలు?
ఉత్తమ చిత్రం నిర్వచనంపై అటు ఆస్కార్ నుంచి ఇటు జాతీయ, రాష్ట్రీయ పురస్కార నిర్ణేతల వరకూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరూ చూడని వాటికి పురస్కారాలా? అని తేలికగా అడిగేశారు రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన ఉద్దేశంలో అత్యధికులు చూశారు కాబట్టి ‘బాహుబలి’ ఉత్తమ చిత్రమే! ఆ లెక్కన అందరూ ఎగబడి చూసే పచ్చిబూతు చిత్రాలూ ఉత్తమ చిత్రాలే అవ్వాలి. ఇక అవార్డు కమిటీలు ఎందుకు? ఎక్కువ డబ్బు వసూలుచేసిన చిత్రానికే ఉత్తమ చిత్రం, నటుడు, నటి, ఇలా అన్ని అవార్డులూ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటే పోలా. బాహుబలి హిట్ కాబట్టి ఆయన అలా అన్నారు. అదే ఫ్లాప్ అయివుంటే, మరో మాట వచ్చేదా?
-మరుదకాశి, కరప

ఏది ఉత్తమం..
ఎక్కువమంది చూసి మెచ్చుకున్నదే ఉత్తమ చిత్రం అని సూత్రీకరించారు కథకుడు విజయేంద్రప్రసాద్. దశాబ్దాల క్రితం తెలుగువారిని ఊపేసిన సీరియల్ రాశాడు ప్రముఖ రచయిత. దాన్ని క్షుద్ర సాహిత్యంగా తీసి పారేశారు విమర్శకులు. ఆ రచయిత కూడా అదేం గొప్ప నవలకాదు అనేశాడు. అత్యధికులు చదివినది ఉత్తమ నవల కాలేకపోయింది. బాహుబలి ప్రపంచవ్యాప్త కలక్షన్లు ఆరువందల కోట్లు(ట!) దానికంటే జేమ్స్‌బాండ్, జాకీచాన్ చిత్రాలు ఎక్కువ వసూలుచేసినా ఆ చిత్రాల నిర్మాతలే వాటిని బ్లాక్‌బస్టర్లు అన్నారుగానీ ఉత్తమ చిత్రాలు అనలేదు. ఇంతకూ ఉత్తమ చిత్రానికి నిర్వచనం ఏమిటట?!
-ప్రవీణ్, కాకినాడ

శరత్కాలం
గజల్ గంధర్వుడు పిబి శ్రీనివాస్ ముచ్చట్లు కొన్ని శరత్కాలంలో చదివి ఆనందించాం. బహుభాషాకోవిదుడు, మధుర గాయకుడికి చిత్ర పరిశ్రమ గుర్తింపు ఇవ్వలేదు. ఇది మాత్రం బాధాకరం. అనర్హులు, భాషొచ్చారణ కూడా చాతగాని ఎందరికో అవార్డులిస్తూ, పిబిని విస్మరించటం శోచనీయం. అయినా.. పిబిలాంటి మహానుభావులు మనకు అందించిపోయిన ఆణిముత్యాలను పదే పదే గుర్తు చేసుకోవడం కంటే గొప్ప అవార్డులు, రివార్డులు మాత్రం ఏముంటాయి. ఏమంటారు?
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

నిజంగా భాగ్యరేఖే
ఫ్లాష్‌బ్యాక్ శీర్షికన భాగ్యరేఖ సినిమా విశేషాలు అలరించాయి. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు బియన్ రెడ్డి, పాలగుమ్మి, పెండ్యాల, దేవులపల్లి వంటి మహోన్నత వ్యక్తుల సమష్టికృషి భాగ్యరేఖ. ఎన్టీఆర్, జమున, గుమ్మడి, నాగయ్య వంటి కళాకారుల నటన ఈ సినిమాకు ప్రాణప్రతిష్ట చేసింది. ప్రతీ పాట అద్భుతమైన సాహిత్యం, స్వరకల్పనతో అజరామరంగా నిలిచింది.
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్టప్రతి అవార్డుపొందిన సినిమా నేటితరం టెక్నీషియన్లకు రిఫరెన్స్ బుక్‌వంటిది. సినిమా 50ఏళ్ల క్రిందట రూపొందినా నేటికీ అన్ని వర్గాలవారినీ అలరిస్తూనే ఉండటం, ఆ సినిమా కథాబలంలోని గొప్పతనం. చెప్పుకోవడానికి, కనీసం పోల్చుకోవడానికి అలాంటి సినిమా ఒక్కటీ రావడం లేదు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం