మీ వ్యూస్

అవీ బయోపిక్‌లంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడంతా బయోపిక్‌లు అంటున్నారు, తీస్తున్నారు కానీ, ఒకప్పటి టంగుటూరి విజయచందరే బయోపిక్‌లను రక్తికట్టించాడని చెప్పాలి. ఆయన నటించిన చిత్రాలు తక్కువే కావచ్చు, కాని ప్రతి సినిమా ఆణిముత్యమే. ‘ఆంధ్రకేసరి’ సినిమాలో టంగుటూరి ప్రకాశం పంతులు పాత్రలో విజయచందర్ జీవించేశాడు. ఇక సాయిబాబా సినిమా సంగతి చెప్పనక్కర్లేదు. కరుణామయుడు సినిమాని స్వయంగా నిర్మించి, నటించి, జీసెస్ క్రైస్ట్ నిజంగా ఇలానే ఉంటాడన్నంతగా జీవించారు. కొందరు నటులుకోసం కొన్ని పాత్రలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. తెలుగు నాట కరుణామయుడు అన్నా, సాయిబాబా అన్నా, ఆంధ్రకేసరి అన్నా మనకు టంగుటూరి విజయచందరే గుర్తుకొస్తాడు. ‘కళామతల్లి’ నుదుటి తిలకం ‘విజయ్‌చందర్’. ఆ బయోపిక్‌ల ముందు ఇప్పుడొచ్చే చిత్రాలను ఎంత రేటింగ్ కట్టాలి?

-ఎంకే కుమార్, గుంటూరుజిల్లా

తస్మాత్ జాగ్రత్త

కొన్ని చిత్రాల్లో మంచి పేరుతెచ్చుకున్న అంజలి తర్వాత కనుమరుగైంది. అందుకు ఆమె బొద్దుగా తయారవడమే కారణమని చెప్పి సన్నబడితే చాన్స్ ఇస్తానన్నాడట ఒక నిర్మాత. దాంతో ఆమె ఘోరంగా వర్కవుట్లు చేసి సన్నబడింది కాని ముఖం పీక్కుపోయి కళా కాంతి లేకుండాపోయంది. అలా కళ లేకపోవడంతో సినిమా చాన్స్‌లు పోయాయ. సన్నబడాలని ఎన్టీఆర్, సునీల్, ఇలియానా తదితరులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి వారి ముఖాల్లో కాంతిపోయాయి. వర్కవుట్లువల్ల ముందుగా ముఖంలోని కొవ్వు కరిగిపోయి ముఖం వాడిపోతుంది. నటులు ఈ విషయంలో జాగ్రత్తపడాలి.

-మరుదకాశి, కరప

టైటిల్ చాలెంజే

‘పాటలోనేముంది?’ వ్యాసం చాలా బావుంది. మంచిగా ఆరంభించిన పని విజయం సాధిస్తుందని నమ్మకం. అలాగే సినిమాకు మంచి పేరు కుదిరితే సగం విజయం సాధించినట్టే. అందుకే పాటల పల్లవులు సినిమా పేర్లు అవుతున్నాయి. టీవీ సీరియల్స్‌కూడా పాటల పల్లవులతోనే వచ్చేస్తున్నాయ. మంచి టైటిల్ విజయ సాధనం అని నమ్ముతున్నారు. అయితే పేరు గొప్ప ఊరుదిబ్బ అనే సామెత కూడా ఉంది! ఘనమైన పేరుతో వచ్చిన సినిమాలో ప్రేక్షకులు ఊహించుకున్న ఘనత లేకపోతే సినిమా ఢమాల్. మనసే మందిరం పేరు ఎంతో క్లాసిక్‌గాఉన్నా అది విషాదాంత చిత్రం కావడంతో ప్రేక్షకులకు రుచించలేదు. మంచి పేరుపెట్టడం కత్తిమీద సామే!

-చైతన్య, వాకలపూడి

వీళ్లంతే..

సినిమావైపు ప్రేక్షకుల్ని నడిపించే ఆకర్షణీయం అయిన పేరుపెట్టడం నిజంగా కష్టమే. దొంగరాముడు సినిమా హిట్ అవగానే భలేరాముడు, బండరాముడు, శభాష్‌రాముడు వచ్చేశాయ. గుణసుందరి సినిమా వచ్చాక సుగుణసుందరి వచ్చింది. అలాంటి కొద్దిపాటి మార్పుకూడా ఎందుకని పాత సినిమా పేర్లు యథాతథంగా కొత్త సినిమాలకు చేరాయి. దేవదాసు పేరుతో మూడు సినిమాలు, శంకరాభరణం పేరుతో మరొక చిత్రం జేమ్స్‌బాండ్ పేరుతో తెలుగు చిత్రం.. ఇలా ఎన్నోవచ్చాయి. అలాగని పాత పేర్లతో వచ్చిన కొత్త సినిమాలన్నీ హిట్ అవలేదు. ఒక దేవదాసు, కొత్త శంకరాభరణం, తెలుగు జేమ్స్‌బాండ్ తుస్సుమన్నాయి. మంచి పేరు పెట్టడం కష్టమే.

-సూర్యం, కందుకూరు

విధి పరిణామం!

ఎన్టీఆర్ సీతారామకల్యాణం (1961)లో పరశురామునిగా ముక్కామల కృష్ణమూర్తిని తొలుత నిర్ణయించుకున్నారు. ఏ పరిస్థితి ప్రభావంవలనో కెవియస్ శర్మకి ఆ పాత్ర దక్కింది. ఆ పాత్రను సమర్ధవంతంగా పోషించారు శర్మ! అయితే ముక్కామల ఆ పాత్రను పోషించి వుంటే ఆ ఉనికి ఏవిధంగా వుండేదో ఊహించుకోక తప్పదు. అందుకే జీవితంలోగాని నటనలో గాని జరిగే పరిణామాలు విధి మాత్రమే!
ఇక 1958లో విడుదలైన బిఎ సుబ్బారావు నిర్మించిన ‘చెంచులక్ష్మి’ పౌరాణిక చిత్రాల్లో అఖండ విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా మాస్టర్ బాబ్జీ మహోన్నతంగా నటించాడు. నరసింహ అవతారంగా పహిల్వాన్ విస్సాకోడేరు గ్రామానికి చెందిన వస్తాదు రాజు నటించారు. ఈ చిత్రంలో మొదట పిబి శ్రీనివాస్ గాయకునిగా కొన్ని రికార్డు అయ్యాయ. చిత్రంలో ఘంటసాల గానం వినిపిస్తుంది. విడ్డూరమే.

-కెవి ప్రసాదరావు, కందుకూరు

పోటీపడాలిగానీ..

ఈమధ్య ఓ చానల్ ‘తెలుగు సినిమాలపై డబ్బింగ్ సినిమాల దందా’ అంటూ హోరెత్తించింది. రెండు తెలుగు చిత్రాలు విడుదలవుతున్నరోజే కన్నడంనుంచి కెజిఫ్, హిందీనుంచి జీరో చిత్రాల డబ్బింగులూ విడుదలవుతున్నాయట. అందుకు చానెల్ అలా ప్రసారం చేయడం విడ్డూరంగా లేదూ. ఏడాదికి వందకుపైగా సినిమాలు వస్తాయ. అందరికీ శుక్రవారం సెంటిమెంట్. అందువల్ల ఒక్కోసారి ఒకేరోజున నాలుగైదు సినిమాలు రాకతప్పదు. దాన్ని పోటీ అనాలేగానీ పెత్తనమంటే ఎలా? డబ్బింగైనా, రీమేకైనా, ఒరిజినలైనా.. సత్తాఉన్నదే సక్సెస్‌కు అర్హం. అంతేగాని, డబ్బింగ్ చిత్రాల్ని నిషేధించాలంటే ఎలా?
-మదీనా, వరంగల్
సెంటిమెంట్ బలం
కొన్ని అభిప్రాయాలు స్థిరపడితే సెంటిమెంట్ అవుతుంది. సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా సినిమాతీస్తే ఫ్లాపే అవుతుంది. ఉమ్మడి కుటుంబం గొప్పదనం గురించి తీసిన ఉమ్మడి కుటుంబం, కలసి ఉంటే కలదుసుఖం లాంటి చిత్రాలు హిట్ అవగా, విడిపోతేనే మంచిదని చెప్పిన ఆదర్శకుటుంబం సరిగా ఆడలేదు. అయితే అరుదుగా కథాబలంతో, దర్శకత్వ ప్రతిభతో సెంటిమెంట్‌కి వ్యతిరేకంగా తీసిన సినిమాలు హిట్టయ్యాయి. సావిత్రి ఎన్టీఆర్ జంటను ప్రేక్షకులు మెచ్చారు. ఎన్టీఆర్ చెల్లిగా సావిత్రి నటించిన చిత్రం రక్తసంబంధం హిట్ అవడం దర్శకత్వ ప్రతిభే. అంజలి నెగెటివ్ పాత్రల్లో కనిపించిన చంద్రహారం, ఆదర్శకుటుంబం సరిగా ఆడలేదు.

-శాంతిసమీర, వాకలపూడి