శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ముందడుగు! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కూలు బస్సు దిగి ఇంటికి వస్తున్న నాకు ఇంట్లో ఏదో సందడిగా అనిపించింది. పిల్లలిద్దరు స్కూళ్ల నుండి ఇంటికి వచ్చి ఉంటారు. కాని వేరే వాళ్ల గొంతులు కూడా వినపడుతున్నాయి. ఎవరయి ఉంటారబ్బా అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన నాకు ముగ్గురన్నదమ్ములను చూడగానే ఎంతో సంతోషం కలిగింది. ఎప్పుడు రానివారు ముగ్గురూ కల్సి మా యింటికి రావడం విచిత్రంగాను తోచింది. వాళ్లను పలుకరించి వంటింట్లోకి పోయి కాఫీ తయారుచేసి, తెచ్చి వారికందించాను.
కబుర్లయ్యాక పెద్దన్నయ్య అసలు విషయం కదిలించాడు. ‘‘నేనేమో రిటైరయినాను కదటమ్మా! మన ఇల్లు చాలా పాతబడింది. మేము ముగ్గురం ఆ యిల్లు అమ్మి వచ్చే మొత్తంతో వేరువేరుగా ఇండ్లు కట్టించుకోవాలని నిర్ణయానికి వచ్చాము. ఆడపిల్లల సంతకం కూడా ఉంటేనే గృహ విక్రయాలు చేయమని ప్రభుత్వం వారు పాతిక సంవత్సరాల క్రితమే ఆర్డరు పంపారని చెప్పారు. ఎల్లుండి మంచిరోజు. మాతోపాటు నీవు కూడా కారులో వచ్చి రిజిస్ట్రారాఫీసులో సంతకాలు పెట్టి వెళ్లమ్మా!’’ అంటూ తాము వచ్చిన సంగతి తిన్నగా వెల్లడించాడు.
విషయం పూర్తిగా అర్థమయింది. మా తల్లిదండ్రులకు ముగ్గురు మగ సంతానం. నేనొక్కత్తెనే ఆడ సంతానం. మగ పిల్లలకేమో దూరప్రాంతాల్లో మంచి ఉద్యోగాలొచ్చాయి. మా తల్లిదండ్రులు విద్యావంతులు కాబట్టి ఎవరు చెప్పినా వినకుండా నన్ను కూడా చదివించారు. టీచరు ట్రైనింగ్ అయిన పిమ్మట టౌనులో టీచరుగా పనిచేస్తూ నా భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ వృద్ధులయిన తల్లిదండ్రులకు కూడా అన్నివిధాల సహాయపడ్డాను. మా వారు కూడా నా అభిప్రాయానికి విలువిచ్చారు. అమ్మానాన్నలు స్వర్గస్థులయిన పిమ్మట నేను టౌన్‌లోనే వేరే ఇల్లు చూసుకొని బాడుగకు కాపురముంటున్నాము.
మా అమ్మానాన్నలు ఆడపిల్లనయిన నా సంగతి ఏమనుకున్నారో కాని వారు కట్టించిన ఇంటిని మరమ్మతులు చేయించడానికి కూడా ఆర్థిక స్థోమత లేదు. కొడుకులు అలాగే అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. నేనే ఇంటికి మరమ్మతు చేయించాను. వారు ముగ్గురు ఆ యింట్లో కాపురముండుటకు వీలుకాదు. ముగ్గురు కలిసి ఆ ఇల్లు అమ్మి, నూతన గృహాలు కట్టించుకోవాలని వాళ్లు ప్లాను వేశారు. ఇందుకు రెడీగా ఇంటి స్థలాలు కూడా కొన్నారని నాకు తెలిసింది.
‘‘అలాగే అన్నయ్యా! నాకు మాత్రం ఆ యింటిపై ఎలాంటి వ్యామోహమూ లేదు. అమ్మానాన్నల పుణ్యాన అందరికి ఏదో ఉద్యోగాలొచ్చాయి. అందరం బాగున్నాము. ఆ ఇంటిని మీ ఇష్టప్రకారం చేసుకోండి. వాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో నిర్మించిన ఆ ఇంటిని అమ్మడం అంటే మనస్సు అదోలా ఉంది. దాన్ని అమ్మితే అమ్మనాన్నలకు మరిచినట్లే అనిపిస్తుంది. కాకపోతే మీరేమీ అనుకోవద్దు. నేను మాత్రం రిజిస్ట్రారాఫీసుకు వచ్చి సంతకాలు చేసే ప్రశే్నలేదు’’ అంటూ దృఢచిత్తంతో అన్న నా మాటలకు వారు ముగ్గురు బిత్తరపోయారు.
‘‘అలాగంటే ఎలాగమ్మా! సంతానమంతా వచ్చి సంతకాలు పెట్టితేనే అమ్మకానికి వీలవుతుంది. నీవు చదువుకొన్నదానివి. ఇలా మాట్లాడడం బాగోలేదు’’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు పెద్దన్నయ్య. తమ్ముళ్లు కూడా ఆయనకు వంత పాడేరు.
లాయరు దగ్గరకు పోయి ఇంకేదైనా మార్గం చూద్దామంటూ మాటమాత్రమయినా చెప్పకుండా అన్నదమ్ములు పోవడం ఎంతో బాధ కలిగించింది. ఈజీ ఛైర్లో కూర్చుని కళ్లు మూసికొని పాత ఆలోచనల్లో పడ్డాను. పిల్లలు ఆరుబయట ఆటల్లో మునిగి ఉన్నారు.
రెండు సంవత్సరముల క్రితం హాస్పిటల్‌లో ప్రాణాపాయస్థితిలో ఉన్న తనను చూడ్డానికి అమ్మానాన్న, స్నేహితులు తప్పితే అన్నదమ్ములెవరైనా వచ్చారా? అప్పుడు తనెంత బాధపడింది. ఆ తరువాత బంధువుల పెళ్లిలో కనబడి ఉద్యోగ బాధ్యతల్లో పడి తీరిక లేక రాలేదని ఏవో సాకులు చెప్పారు. నేను హాస్పిటల్‌లో ఉన్నరోజుల్లో పెళ్లిళ్లకు సపరివారంగా పోయేటందుకు మాత్రం తీరిక దొరికింది.
పెద్దన్నయ్య తన అల్లుడికి సలహా ఇచ్చి, అతని అక్కాచెల్లెళ్లచే రిజిస్ట్రారాఫీసులో సంతకాలు తీసుకొని, వారికి వాటా కాదు సరికాదా కనీసం కొంత మొత్తమైనా యివ్వకుండా అల్లుడికి మాత్రం లక్షలాది రూపాయల తండ్రి ఆస్తి వచ్చేటట్లు చేశారు. చదువుకు నోచుకొని ఆ తోబుట్టువులు సోదరుని నమ్మి చూడకుండానే పేపర్లలో సంతకాలు చేశారు. ఆ తర్వాత తమకు కూడా పిత్రార్జితంలో వాటా ఉందని తెలుసుకొని అన్న చేసిన మోసానికి కుమిలిపోయారు. పాపం! ఆడపడుచులు పెద్ద ఆస్తిపరులు కాదు. మధ్యతరగతి కుటుంబీకులు. విషయం నా తోటి టీచరు ద్వారా తెలిసి బాధపడ్డాను.
తల్లిదండ్రుల పుణ్యమాని కొంత చదువుకొని టీచరుగా చేస్తున్న తనను కూడా మోసం చేద్దామని కాబోలు. పైగా అమ్మానాన్నల కోసం తను కూడా ఎంతో కొంత సహాయం చేసింది. దాన్ని మరచిపోయారు. పెద్దన్న అల్లుడి కోసం అక్కాచెల్లెల్ని మోసం చేయంచాడు. వారికి ఏనాటికైనా ఆడపడుచుల ఘోష కొట్టకపోదు.
తనను సంతకాల కోసం రిజిస్ట్ఫ్రాసుకు రమ్మన్న అన్నదమ్ములు తన వాటా సంగతి అసలు చెప్పలేదే! ఎంత దగా? తనకు పిత్రార్జితంలో వాటా ఉందని తెలియదని కాబోలు! మానవతారీత్యా అనారోగ్యంగా, చావుబ్రతుకుల్లో ఉన్న తనను చూడ్డానికి రాలేని స్వంత రక్తసంబంధీకులకు ఆస్తి విషయంలో మాత్రం తను కావాల్సి వచ్చింది. స్ర్తిలు ఇంకా అమాయకంగా మోసపోతారని అనుకొంటున్నారేమో! నిజానికి తన కుటుంబానికి తన సంపాదన, భర్త సంపాదన సరిపోతుంది. అయినా వాళ్లకు లక్షలాది సంపాదన ఉందే! తనకు తెలిసి బంధువులలో తన వలె సంతకాలు పెట్టనని ఎవ్వరూ అనలేదు. తర్వాత అన్నదమ్ములు తేరగా యిచ్చినట్లు తృణమో ఫణమో ఇచ్చి ఉంటారు. స్ర్తి హక్కుల విషయంలో తొలుత తను తీసుకొన్న దృఢ నిర్ణయమిది.
ఆ తర్వాత కొన్నాళ్లకు, సంతానమంతా రిజిస్ట్రారు ఆఫీసులో హాజరై సంతకాలు పెడితేనే అమ్ముటకు వీలుంటుందని, లేకపోతే లేదని, రిజిస్ట్రారు ఆఫీసు వారు పెండింగ్‌లో పెట్టారని, ఇంటి అమ్మకం ఆగిపోయిందని - నాకు తెలిసింది.
అనాదిగా స్ర్తి పురుషుని చేతిలో మోసపోతూనే ఉంది. స్వంత అన్నదమ్ములు సైతం రక్తసంబంధాన్ని మరచిపోయి, ఆడపడుచులను పట్టించుకోక భార్యా విధేయులై ఆర్థిక వలయంలో చిక్కుకొని, కన్న తల్లిదండ్రులను సైతం పట్టించుకోక స్వార్థంలో కూరుకుపోతున్నారు.
ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో తమకు ప్రభుత్వం ఇచ్చిన హక్కులు తెలియక, తర్వాత బాధపడడం మంచిదికాదు. స్ర్తిలలో సైతం మెలకువ రావాలి. తమ హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలి. నావలె అందరూ మందంజ వేస్తే...
- తిప్పావఝల సుబ్రహ్మణ్యం,
బుడంవారికండ్రిగ,
ఇందుకూరుపేట, నెల్లూరు
చరవాణి : 9177823804
మనోగీతికలు
ఆవేదన - ఆలోచన
ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది - నాకు మాత్రం అనేకపేర్లు
అనాథలని, వీధి బాలలని, బాలకార్మికులని అనేక రకాలుగా పిలుస్తారు
ఏవరేమి పిలిచిన అన్నిటికి ఊ కొడతా
కాని నేను అనాథను.
కోడికూతతో మొదలైన నా కూటి ప్రయాణం అర్ధరాత్రితో ముగుస్తుంది.
కాలంతో పరుగెడతా...
నా వయసు 10 సంవత్సరాలు
కాని 18 గంటలు పనిచేస్తా
పేపరు వేసేది, టీ అమ్మేది,
సినిమా హాలు గేటు దగ్గర,
చివరకు రెస్టారెంట్లలో తుడిచేది నేనే..
వాళ్లకు ఆగ్రహం వస్తే
తన్నులు తినేది నేనే.
కాసు విలువ నాకు తెలియదు.
కాని ఆకలి బాధ తెలుసు
బస్సుషెల్టర్లు, రైల్వేస్టేషన్లు నా ఆవాసాలు
నాకోసం ఎవ్వరు ఎదురుచూడరు
నాది ఒంటరి జీవితం
తల్లి ప్రేమ, తండ్రి అనురాగం, అన్నదమ్ముల అనుబంధం నాకు తెలియదు
నా తల్లి రూపం చూడాలని
నా మనసు ఆరాటపడుతుంది
అమ్మా... అని పిలవాలని ఉంటుంది
నేను ఎవరిని పిలవను
కాని నన్ను ఎవరైనా కొట్టినప్పుడు
అప్రయత్నంగా అమ్మా అని పిలుస్తా
ఆ పిలుపుతో మనశ్శాంతి పొందుతా..
ఆ తర్వాత నేను అనాథనని సర్దుకుపోతా
నాకు పేరు లేదు, ఊరులేదు,
ఇంటి పేరు అసలేలేదు.
అయినా నేను భారతీయుణ్ణి. అందుకే నా పేరు భరత్‌కుమార్ అని నేనే పెట్టుకున్నా.
నా వృత్తి నా యింటి పేరైంది, పూర్తిగా నా పేరు పేపర్ భరత్‌కుమారైంది.
అర్ధాకలితో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తులే నాకు ఆదర్శం
వారి బాటలో పయనిస్తా, అనాథలను అక్కున చేర్చుకుంటా
వారికి అన్ననై అండగా వుంటా...
అదే నా లక్ష్యం, ధ్యేయం.
- పెట్లూరి వెంకట నరసింహరావు
కందుకూరు, చరవాణి : 9948153013
అల్పజీవినైనా...
అసలు ననె్నందుకు కుట్టావంటే
అన్నావు పుట్టలో వేలెడితే కుట్టనా - అని
ఎన్‌కౌంటర్‌లో ఆత్మసంరక్షణార్థ
ప్రతిచర్య కాబోలు
ఎందుకో తెలిసేలోగానే నీకు
కుట్టీ కుట్టంగానే పోతావని
శివుని ఆజ్ఞ పాటించి శివైక్యం చెందుతావు!
సైనిక పటాల విన్యాస వరుస కదలిక లాంటి
మీ గమనంతో
అర్ధమైంది మీ ఆనుశాసనిక జీవన క్రమశిక్షణ
మీ తీరు తీరుబడిలేని సమష్టి జీవన శ్రమగమనం,
గమనశ్రమం!
కార్యాలయ అధికారగణ అవిశ్రాంత కదలిక చందాన
సహచర గణంతో కలుస్తారు మీరు
సంభాషణారహితంగా విడిపోతారు!
శీతాకాల సుఖప్రద నిశ్చింత జీవితానికి
వేసవి శ్రమైక జీవనంలో విదితవౌతుంది
మీ ముందుచూపు
అన్నట్లు
‘ప్రకృతి పిలుస్తోంద’ని ప్రక్కపొలాల్లోకి వెళ్లే
బుద్ధి జీవులమనుకొనే
బుద్ధిహీన జీవులింకా ఉన్నప్పుడు
కాళం కబ్జా చేస్తుందని తెలియక కట్టుకునే
నీ పుట్టలో అటాచ్డ్ టాయిలెట్లు కట్టుకుంటావని
‘‘ఆ వ్యర్థాలను నిర్మాణ వనరుగా
వాడుకుంటా’’వని విన్నా!
వినదగునెవ్వరు చెప్పిన
కనదగు సత్ప్రవర్తన స్వల్ప జీవిలోన
అదే, అల్పజీవిలోనైనా!!
- వేదం సూర్యప్రకాశం, నెల్లూరు
చరవాణి : 9866142006
ఓదార్పు
కోల్పోయిన వాళ్లకే తెలుసు
కన్నీటి చుక్కల బరువు
జీవితం ఎదుర్కొంటున్న కరువు
ఇంటి దీపం ఆరిపోయిన
చీకట్లు చుట్టూ అలుముకున్నాక
ఒక ఆశాకిరణం కోసం
కంటి పాప భూగోళమంత
విశాలమైపోతుంది!
బియ్యపుగింజ ఆకలంత
దుర్భరమైపోతుంది!
ఆకాశం చినుకు కురిస్తే
భూదేవంత ఆనందం
వెచ్చని స్పర్శ వీపు తాకితే
బతుకంత విశ్వాసం!
- గుర్రాల రమణయ్య,
నెల్లూరు
చరవాణి : 9963921943
స్పందన
ఇప్పటికీ కథ రిపీట్
అవుతూనే ఉంది
గత వారం మెరుపులో ప్రచురితమైన డామిట్! కథ రిపీట్ అయ్యింది! అదుర్స్. అచ్చంగా జరుగుతున్న తంతును కళ్లకు కట్టినట్లు రచయిత గంగిశెట్టి శివకుమార్ గారు చూపిన తీరు బాగుంది. నేటి సినిమాల్లో ఎక్కువభాగం జరుగుతుంది ఇది. ఇలా ఇప్పటికీ కథ రిపీట్ అవుతూనే ఉంది.
ఇప్పటి హీరోలు బాగున్నా లేకపోయినా చూసీ చూసీ మనకు అలవాటైపోయ్యింది. అలాగే ఇలాంటి నిర్మాతలు, దర్శకులు, హీరోల వారసులు నేటి సినిమా ప్రపంచంలో రాణిస్తూనే ఉన్నారు. వారి దర్పం, డబ్బు పనిచేస్తూనే ఉన్నాయి. మనకు గత్యంతరం లేక బాగున్నా, లేకున్నా చూసేస్తున్నాం. గతలో నిడివి చాలా బాగుంది. చివరిలో కథాను సుఖాంతం చేసిన తీరు మెచ్చుకోదగినది. కథకు అనగుణంగా వేసిన కార్టునూ చాలా బాగుంది. అలాగే కవితలకు వేసిన బొమ్మలు కూడా సరిగ్గా కుదిరాయ. చక్కని కథలను, కవితలను అందిస్తున్న మెరుపు సంపాదకుల వారి నా ధన్యవాదములు.
- కోన శ్రీనివాస్,నెల్లూరు,
కాసు జయలక్ష్మి, నాయుడుపేట
ఇతను రచయిత కానే కాదు అచ్చమైన రైతు!
అతడో కష్టాల కాణాచి అంటూ గత వారం మెరుపులో రైతు జీవితాన్ని పరిచయం చేసిన రచయిత కె రవీంద్రబాబు అసలు రచయితు కాదేమో అతను రైతేమోనని నాకు ఈ కవిత చదివిన వెంటనే అనిపించింది. అంతా బాగా రైతు వ్యథలను కాచివడపోసిన తీరు అమోఘం. హెట్సాప్.
- ఈశ్వర్ రావినూతల, అద్దంకి, ప్రకాశం
ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా
కొన్ని ప్రశ్నలకు జవాబులేదు
గత వారం మెరుపులో ప్రచురితమైన కొన్ని ప్రశ్నలు కవితను పొద్దుపొద్దునే చదివితే నా మది నిండా అనేక ప్రశ్నలు దొర్లాయి. అసలు ఈ కవితలోని ప్రశ్నలకు జవాబులు ఇక దొరకవా, దొరుకుతాయా, దొరికితే ఎప్పుడే, ఇన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయా అనే ప్రశ్నలు నా బుర్రలో నృత్యం చేశాయి. సగటు మనిషి బతుకింతే. రచయిత కొండూరు వెంకటేశ్వరరాజు గారు మళ్లీ తనదైన కవిత అందించి ఆలోచింపచేశారు.
- ఒమ్మిన వాసుదేవ శ్రేష్ఠి, తిరుపతి
మెరుపు రంగుల హరివిల్లు
గత వారం మెరుపు చాలా బాగుంది. రంగుల కవితలు, చక్కనైన కథతో ఆకట్టుకుంది. ఆదివారం మాకు ఇష్టమైన సాహితీ లోకంలో విహరింపచేసినందుకు ధన్యవాదములు. అన్ని కవితలు కూడా బాగున్నాయి.
- దాము వీర్రాజు, మార్టూరు
మెరుపు అదుర్స్
గత వారం మెరుపు బాగుంది. రంగుల హరివిల్లులా చక్కగా వుంది. కథలు, కవితలు బాగున్నారు.
- రమ, చిత్తూరు
పుస్తక సమీక్ష
భావుకత నిండిన
జీవన రాగాలు
వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన సులోచన తన మనోభావాలకు అక్షరీకరణ చేసిన సంఘటనే జీవనరాగాలు. ఇది మూడో ప్రయత్నం అని రచయిత ముందుమాటలో చెప్పుకున్నారు. ఉపాధ్యాయురాలిగా, ఇల్లాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ వివిధ సందర్భాల్లో తన మదిలో మెదిలిన భావాలకు చక్కటి అక్షర రూపాన్నిచ్చి కవితలు అల్లారు. భావుకతతో నిండిన కవితలు కొన్నయితే, దేశంలో వివిధ సంఘటనలు ఆమెపై చూపిన ప్రభావం వల్ల పెలుబికిన కవిత్వం మరికొన్ని కలిపి జీవనరాగాలుగా అవతరించింది. వివిధ దినపత్రికల్లో ఆయా సందర్భాల్లో ప్రచురితమైన కవితలు క్రోడీకరించి కవితా సంపుటి అందుబాటులోకి తెచ్చారు. స్నేహం, చీకటి బ్రతుకులు, సందేశం, విలువలు, చిరుగాలి నెచ్చెలి, నారీమణి, బాపూజీ, ఉగాదిలక్ష్మి,బంధాలు అనుబంధాలు వంటి శీర్షికలతో కవితలు బాగున్నాయి. చిరుగాలి నెచ్చెలి శీర్షిక కింద కవితలో రచయిత్రి భావుకత సున్నితంగా ఉంది. చిరుగాలి నెచ్చెలితో పోల్చడం బాగుంది. కవికి మరణం లేదు కావ్యానికి అస్తమయం లేదు కవి హృదయం కావ్యం కవి జీవనం శాశ్వతం ఈ మాటలు అమూల్యాలు. మొత్తంమీద కవితా సంపుటి బాగున్నా అక్కడకక్కడ దొర్లిన ముద్రారాక్షసాలు పఠితలను ఇబ్బంది పెడుతుంటాయి.
- గౌతమి
చరవాణి 9347109377
ప్రతులకు
తోట సులోచన
24/1284, జెవిఆర్ కాలనీ, 7వ వీధి
పొదలకూరురోడ్డు, నెల్లూరు
రచనలకు ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ రండి..
మీ ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వండి...
కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు,
పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీర్రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
email: merupunlr@andhrabhoomi.net
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net