మెయిన్ ఫీచర్

మమతను పంచే పెద్దాపురం మరిడమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండిత లోకమంతా ఆదిపరాశక్తి, లోకమాత జగ్గన్మాత అంటూ వివిధానామాలతో స్తుతిస్తూ సృష్టిలయవిన్యాసాలకు కారణభూతురాలివి నీవే నంటూ పెక్కువిధాలుగా పూజించడం అనవాయతినే. ఆ అమ్మనే సాధారణ మానవులు ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ రేణుకమ్మ అంటూ అనేకానేక నామాలతో పూజిస్తారు. ఆ అమ్మను మమ్ములను, మాతోటి ఉండే మూగ జీవాలను చల్లగా చూడమ్మా ఊరి పొలిమేరలో నెలకొల్పి మా ఊరి దేవతవు నీవేననీ, గ్రామశక్తివినీవే నంటూ వేడుకొంటారు. అమ్మా అన్నా, యమ్మాఅన్నా, మాతా అన్నా అందరూఆ తల్లి సంతానమే కనుక ఆ తల్లి అందరినీ తన చల్లని చూపులతో కరుణించడానికి ఎల్లవేళలా దయార్ధ్ర హృదియై ఉంటుందని శాస్తవ్రాక్యం. ఆ తల్లినే మా వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటూ, తమ బిడ్డ, పాపలు పశువులు బాగుండి, అంటువ్యాధులు, దీర్ఘరోగాలు వంటివి ప్రబలకుండా చేయ తల్లీ అంటూ అమ్మవారికి పూజలు, మొక్కుబడులు, ముడుపులు చెల్లిస్తుండటం అనాదిగా వస్తున్నదే. గ్రామాలలో దేవతలను కొలిచే సందర్భాలలో ప్రత్యేకంగా భక్తులు నిర్వహించే సంబరాలు, జాతరలు, జాగరణలు కనువిందు చేస్తూ అమ్మ మహిమలు సత్యాలు గురించి ఆ నోట ఈనోట ప్రాకి అమ్మవార్ల దర్శనాని కి జిల్లాలు, రాష్ట్రాలు దాటి జనం తరలివస్తూ అమ్మవార్ల ఆశీస్సులు పొందడమూ సర్వసాధారణమే.
దేశంలో గ్రామదేవతలుగా వెలసిన 108 మంది సోదరీమణులలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వెలసిన శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవాలయం సుప్రసిద్ధమైనదిగా పేరుపొందింది.
అమ్మవారి క్షేత్ర మహత్యం
17వ శతాబ్ది చివరిలో పెద్దాపురంలోని మానోజీ చెరువు సమీపంలో మరిడమ్మవారు గ్రామదేవతగా వెలిసింది. ఆ కాలంలో ఈ చెరువు చుట్టుప్రక్కల ప్రదేశం చిట్టడివిగా ఉండేది. ఒకసారి మన్యంనుంచి పశువులను తోలుకొని వచ్చు పశువుల కాపరులతో కాలి నడకన వచ్చిన పదహారేళ్ల యువతి మానోజీ చెరువు ప్రాంతానికి రాగానే వారితో నేను చింతపల్లివారి ఆడపడుచును, నేను ఇక్కడ ఉన్నానని మావారికి చెప్పండి అని పలికి అంతర్ధానమయ్యింది. ఈ వింత సంఘటనను కాపరులు చింతపల్లి వారి ఇంటికి వెళ్లి చెప్పారు. ఆ రాత్రి వారి ఇంట్లో గాజుల గలగల శబ్దం వినిపించింది. మరునాడు వారు కాపరులతో కలసి వచ్చి మానోజీ చెరువు ప్రాంతంలో వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్ర కనిపించింది. దానిని తీసుకుని అక్కడే ఒక తాటాకు పాకవేసి, ప్రతిష్టచేసి, ధూప, దీప, నైవేద్యాలు పెడుతూ పూజించసాగారు. మహమ్మారి కలరా జాఢ్యంనుంచి రక్షించు దేవతగా ఈ అమ్మవారిని మారమ్మగా పిలిచేవారు. కాలక్రమంలో మరిడమ్మగా పిలవబడుతూ భక్తుల పూజలందుకుంటున్నది.
కలరావ్యాధి నుంచి ప్రజలు రక్షించిందని ప్రజలు ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు, జాతరలు, తిరునాళ్లు చేసే ఆచారం వచ్చింది. ఇటీవల ఆధునీకరించబడిన అమ్మవారి ఆలయం నిత్య వేద పఠనాలతో, సశాస్ర్తియమైన పూజాది కార్యక్రమాలతో అలరారుతూ నిత్య యాత్రా స్థలంగా, భక్తులకు కొంగుబంగారంగా మారింది. 1952లో ఈ ఆలయాన్ని దేవాదాయ, ధర్మాదాయశాఖ స్వాధీనం చేసుకుంది. నేటికి అమ్మవారి ప్రభ పెద్దాపురానికే గాక, ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వ్యాపించి అశేషప్రజానీక ఆరాధ్యదేవతగా పూజలందుకుంటోంది.
జాతర
ప్రతి ఏటా జ్యేష్ట బహుళ అమావాస్యనుంచి అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. జాతరకు ముందు అమ్మవారికి ప్రతిరూపమైన గరగలను తీసి పట్టణంలోను గ్రామాలలోను ఊరేగుతారు. జాతరకు 15 రోజులు ముందు పౌర్ణమినాడు, ఉయ్యాల తాళ్ల ఉత్సవం జరుగుతుంది. ఇందులో తాటిచెట్టు కొట్టడం దగ్గరనుంచి గరగలను ఊపడంవరకు వివిధ పనులు కులమతభేదంలేకుండా ఊరిజనులంతా ఆనందోత్సవాలతో పాల్గొంటారు. జాతరకు ముందురోజు రాత్రి జాగరణ పేరుతో గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. గరగ నృత్యాలతో, మేళతాళాలతో, హంస వాహనంపై అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ఊరేగిస్తారు. అమ్మవారిని సామర్లకోటలోని చింతపల్లివారి ఇంటికి పంపి పాన్పువేస్తారు. జాతర మొదలైన రెండవ గురువారం రాత్రి కుంభం వేసి శనివారం తెరుస్తారు. ఆ మరునాడు బుక్కా ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా 37రోజులపాటు అమ్మవారి జాతర జరుగుతుంది. ఈరోజులలలో ముఖ్యంగా ఆది, గురువారాలలో భక్తజనం అసంఖ్యాకంగా తరలివస్తారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ, కలకత్తాలోని కాళిమాత, లోవ కొత్తూరులోని తలుపులమ్మ, వరంగల్‌లోని సమ్మక్కసారక్క మొదలైనవారు మరిడమ్మవారి తోబుట్టువులుగా చెబుతారు.
అంబరాన్నంటే సంబరాలు
అమ్మవారి జాతరలో అమ్మవారికి చెల్లించే మొక్కులలో భాగంగా పట్టణంలోని దాదాపు అన్ని వీధులనుంచి సంబరాలు జరిపి అమ్మవారి మొక్కు తీర్చుకోవడమే పెద్ద విశేషం. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరిని ఆకట్టుకునే విద్యుత్ దీపకాంతులతో, బాణాసంచాలతో, నృత్యాలు, పాటలు పదా లతో సంబరాలు అంబరాన్నంటుతాయ. అమ్మవారి ఊరే గింపు వర్ణించడానికి మాటలు చాలవంటారు అనుభవ జ్ఞులు. రాత్రిపూట జరిగే ఈ సంబరాలను చూడటానికి ఇతర ప్రాంతాలనుంచి కూడా పెద్దఎత్తున జనం తరలివస్తారు. ఈ సంబరాల్లో వివిధ రకాల కళాప్రదర్శనలు కూడా జరుపు తుంటారు. వీటిల్లో చారిత్రక పౌరాణిక, దేశ నాయకుల పాత్రలను మనుషులచే వేయించి ప్రదర్శించడం ప్రత్యేకంగా కనువిందు చేస్తుంది. అమ్మవారి వాహనాలకు ముందు గరగ నృత్యాలు, కర్రసాములు, తప్పెటగుళ్లు, కోయ డాన్సులు, పులి వేషాలు, బ్యాండు మేళాలు మొదలైనవి చూడటానికి భక్తులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తారు.

కీలుడు అనే మహర్షి అమ్మకోసం నిరంతరం తపించేవాడు. అమ్మను తన హృదయం లోనే నివసించమని కోరుతూ తపస్సు ప్రారంభించాడు. అమ్మ కీలుణ్ణి కరుణించింది. నీకోరిక త్వరలో తీరుతుంది. నీవు పర్వతరూపాన్ని ధరించమని చెప్పింది. మహిషా సుర సంహారం తర్వాత అమ్మ కీలుని కోరిక తీర్చడానికి కనకవర్ణియై కనకదుర్గగా కీలప ర్వతంపై కాలూ న్చింది. అమ్మను దర్శించు కోవాడానికి ఇంద్రాది దేవతలు రావడంతో ఆ కీలాద్రినే ఇంద్రకీలాద్రిగా మారింది. అక్కడ వెల సిన అమ్మనే విజయవాడ కనకదుర్గగా కీర్తనలందుకొంటోంది.

తలిచినంతనే అక్కున చేర్చుకునే తల్లినే తలుపలమ్మ. తూర్పుగోదావరి జిల్లా లోని తుని, అన్నవరం మధ్య లోవ అనే ప్రాంతంలో తలుపులమ్మ స్వయంభూగా వెలసింది. ఆ తల్లినే తలుచుకొంటే చాలు కష్టాలను కన్నీళ్లను దూరం చేస్తుంది. ఈతి బాధలు తీర్చి ఇలలో స్వర్గ సౌఖ్యాలు కలిగే ట్టుగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడి వారంతా అమ్మ ను దర్శించుకోవడమే కాదు వారి వాహనాలు సైతం సరిగ్గా పనిచేయడానికి కూడా అమ్మ అనుగ్రహాన్ని కోరుతుంటారు. అమ్మను ఒక్కసారి దర్శించుకొంటే చాలు వారి కోరికలు ఇట్టే ఈడేరుతాయనే భక్తుల విశ్వాసం.

- గంజి కృష్ణ